బీబీసీ ఇంటర్వ్యూ: భారత్ పాక్‌కి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి - డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏ

భారత్ తన విదేశాంగ విధానంలో పొరుగు దేశాలతో సంబంధాలకు మరింత ప్రాధాన్యాన్ని కల్పించాల్సి ఉందని జాతీయ భద్రత ఉపసలహాదారుగా నియమితమైన పంకజ్ శరణ్ చెప్పారు. రష్యాలో భారత రాయబారిగా ఉన్న ఆయన డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా నియమితమయ్యాక తొలి ఇంటర్వ్యూ బీబీసీకి ఇచ్చారు.
మూడు పెద్ద దేశాలైన అమెరికా, రష్యా, చైనాలతో వేర్వేరు సంబంధాలు నెరపగల స్థాయికి భారత్ చేరుకుందని పంకజ్ తెలిపారు.
ఇటీవల రష్యాలో చేసిన ఈ ఇంటర్వ్యూలో బీబీసీ ప్రతినిధి నితిన్ శ్రీవాస్తవ అడిగిన వివిధ ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇచ్చారు.

ఫొటో సోర్స్, AFP
బీబీసీ: భారత జాతీయ భద్రతకు వివిధ సవాళ్లు ఎదురవుతున్నాయి. కశ్మీర్‌లో, తూర్పు, పశ్చిమ, దక్షిణ ప్రాంతాల్లో అంతర్గత భద్రత సమస్య అతిపెద్ద సవాలు. దేశానికి భద్రతపరంగా ఏయే సవాళ్లు ఉన్నాయి? డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టాక మీ ప్రాథమ్యాలు ఏమిటి?
పంకజ్: ఇలాంటి సవాళ్ళను ఎదుర్కొంటున్న దేశం భారత్ ఒక్కటే కాదు. ఇతర దేశాలకూ ఈ సమస్యలు ఉన్నాయి. భారత్‌లో ఈ సమస్య కాస్త ఎక్కువ. ఎందుకంటే భారత్ సంక్లిష్టమైన దేశం. దేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. మన జనాభా చాలా ఎక్కువ. దేశ ప్రజల ఆకాంక్షలను, ఆశలను నెరవేర్చడం కూడా సవాలుతో కూడుకున్నదే. వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించడం మన లక్ష్యం. ఇవన్నీ సాధ్యం కావాలంటే మనం సరికొత్త ఆలోచనా తీరును అలవర్చుకోవాల్సి ఉంది.
రానున్న 10-20 ఏళ్లలో మనం ఎలాంటి భారతదేశాన్ని చూడాలనుకుంటున్నామో మనం నిర్ణయించుకోవాలి. అన్నింటికన్నా ముందు మనం ఈ నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుత పరిస్థితి నుంచి మెరుగైన స్థితికి భారత్ చేరుకోవాలంటే ఏమేం చేయాల్సి ఉందో మనం నిర్ణయించుకోవాల్సి ఉంది.
పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంకలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే, భారత విదేశాంగ విధానానికి ఉన్న సవాళ్లు ఏమిటి?
పాకిస్తాన్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, భారత్‌కు వేర్వేరు దేశాలతో వేర్వేరు సంబంధాలు ఉన్నాయి. పొరుగు దేశాలకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వడం ఏ దేశానికైనా అత్యంత ప్రధానమైనది. మన విదేశాంగ విధానంలో ఇది ప్రధానాంశం కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
కొన్నేళ్లుగా పొరుగు దేశాలతో భారత్ సంబంధాలు అంత బాగా లేవు. దీనిపై మీరేమంటారు?
పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరచుకోవడమనేది నిరంతర ప్రక్రియ.
సంబంధాల్లో ఒడిదొడుకులున్న మాట నిజమే. అయినప్పటికీ మన దేశంతోపాటు పొరుగు దేశాల భద్రతను, ఆర్థిక స్థితిని ఎలా మెరుగుపరచాలి, మన దేశం, పొరుగు దేశాల మధ్య అనుసంధానాన్ని, వాణిజ్యాన్ని ఎలా పెంచాలి అనే అంశాలకే ప్రాధాన్యం ఉంటుంది. వ్యూహాల్లోనూ దీనిపైనే దృష్టి కేంద్రీకరిస్తాం.
ఉమ్మడి విధానాలను పాటించడం అందరికీ ప్రయోజనకరమని ఇరుగుపొరుగు విశ్వసించేలా చేయాల్సి ఉంది.
చైనాతో సంబంధాల్లో ఒడిదుదొడుకులు చాలా ఉన్నాయి. ఒకవైపు ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలు జరుగుతున్నాయి, మరోవైపు డోక్లాం ప్రతిష్టంభన లాంటి వివాదాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో, భారత విదేశాంగ విధానం ఎలా ఉండాలని మీరు అనుకొంటున్నారు? చైనా లాంటి పొరుగు దేశాలు, అమెరికా లాంటి పెద్ద దేశాలతో భారత్ ఎలా వ్యవహరించాలి?
డిప్యూటీ ఎన్‌ఎస్‌ఏగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రశ్నకు వివరంగా సమాధానమిస్తాను.
వేర్వేరు దేశాలతో వేర్వేరుగా సంబంధాలు నెరపగల స్థాయికి భారత్ చేరుకుంది. చైనా, అమెరికా, రష్యా- ఈ మూడు దేశాలతో భారత్‌కు బలమైన సంబంధాలు ఉన్నాయి. ఈ మూడింటిలో ప్రతి దేశంతో సంబంధాల్లో భారత్‌కు కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. ఒక దేశాన్ని మరో దేశంతో పోల్చలేం. ఈ మూడు దేశాలతో సంబంధాలను ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం భారత్‌కు ఉంది.
ఇవి కూడా చదవండి:
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- మన కోసం ఆనాడు కార్ల్ మార్క్స్ చేసిన ఐదు పనులు!
- అంధత్వం: మేనరికాలు, దగ్గరి సంబంధాలు.. పుట్టబోయే పిల్లలకు శాపం
- దళితుడి హోటల్లో టీ తాగిన శివాజీ వారసుడు సాహూ మహరాజ్
- కృత్రిమ మేధ: చైనాతో పోటీపడాలంటే భారత్‌కు ఉన్న అనుకూలతలివే
- ఫుట్‌బాల్: మెస్సీని కలుసుకొనేందుకు రష్యాకు కేరళ యువకుడి సైకిల్ యాత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









