#CWG2018: నాడు 'షూటింగ్' క్లబ్ నుంచి సస్పెన్షన్.. నేడు కామన్వెల్త్‌లో రజతం

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, వందన
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్‌లో కామన్వెల్త్ క్రీడల్లో సోమవారం రజత పతకం సాధించిన టీనేజీ షూటర్ మేహులీ ఘోష్.. ఒకప్పుడు తాను షూటింగ్ సాధన చేసే క్లబ్ నుంచి సస్పెండ్ అయ్యింది. ఈ పరిణామంతో తీవ్రమైన మనోవేదనకు గురైన ఆమె, తర్వాత క్రమంగా సాధారణ స్థితికి చేరుకుంది.
కామన్వెల్త్ క్రీడాపోటీల్లో తొలిసారిగా పాల్గొంటున్న 17 ఏళ్ల మేహులీ.. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగం ఫైనల్‌లో రెండో స్థానంలో నిలిచింది.
టీవీ సిరీస్ సీఐడీ, అందులో ఇన్‌స్పెక్టర్ దయాకు ఆమె పెద్ద అభిమాని. ఈ సిరీస్.. పిస్టళ్లు, రైఫిళ్లు, షూటింగ్‌పై ఆమెలో ఆసక్తిని బాగా పెంచింది.
2017 జాతీయ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో తొలిసారిగా ఎనిమిది పతకాలు సాధించినప్పుడు ఆమె దేశంలో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ ఏడాది మెక్సికోలో జరిగిన ప్రపంచ కప్‌లో రెండు పతకాలు సాధించి, జూనియర్ ప్రపంచ కప్‌లో రికార్డు నెలకొల్పి అంతర్జాతీయంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఫొటో సోర్స్, Getty Images
క్లబ్ నుంచి సస్పెండైన మేహులీ
పశ్చిమ బెంగాల్‌లోని సీరంపూర్‌కు చెందిన మేహులీది మధ్యతరగతి కుటుంబం. కుమార్తె కలలను నిజం చేసేందుకు మేహులీ తండ్రి చేయగలిగినదంతా చేశారు.
మేహులీకి 14 ఏళ్లున్నప్పుడు ఓ క్లబ్‌లో షూటింగ్ సాధన చేస్తుండగా, ఒక ఊహించని ఘటన జరిగింది. ఆమె ఫైర్ చేసిన పెల్లెట్ ఒక వ్యక్తిని తాకింది. మేహులీని క్లబ్ నుంచి నిర్వాహకులు సస్పెండ్ చేశారు.
ఈ పరిణామం మేహులీపై మానసికంగా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. ఆమె ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయింది. ఉత్సాహం తగ్గిపోయింది. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆమె కౌన్సెలింగ్ తీసుకోవాల్సి వచ్చింది.

2015లో మేహులీ తల్లిదండ్రులు ఆమెను మాజీ ఒలింపియన్ జయదీప్ కర్మకార్ అకాడమీకి తీసుకెళ్లారు. ఆత్మవిశ్వాసం కోల్పోయి, నిరుత్సాహంగా ఉన్న మేహులీకి శిక్షణ ఇచ్చి, పూర్వస్థితిలోకి తీసుకురావాలనే లక్ష్యాన్ని ఆయన ఒక సవాలుగా స్వీకరించారు.
2012 లండన్ ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో జయదీప్ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కాంస్య పతకం తృటిలో చేజారింది.
తల్లిదండ్రులు మేహులీని ఈ అకాడమీకి తీసుకెళ్లడం ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది. శిక్షణ కోసం అకాడమీకి వచ్చి వెళ్లేందుకు ఆమె రోజూ మూడు, నాలుగు గంటలు నడవాల్సి వచ్చేది. అకాడమీ నుంచి ఇంటికి చేరుకొనే సరికి కొన్నిసార్లు రాత్రి అయ్యేది.
మేహులీ శ్రమ, పట్టుదల, కోచ్ జయదీప్ శిక్షణ క్రమంగా ఫలితాలు ఇవ్వసాగాయి. 2016, 2017లో జాతీయస్థాయిలో మేహులీ అనేక పతకాలు సాధించారు.
షూటింగ్ మెలకువలతోపాటు మనోస్థైర్యం ప్రాధాన్యం, మానసికంగా బలంగా ఉండాలంటే ఏం చేయాలి అనే అంశాలపైనా మేహులీకి జయదీప్ శిక్షణ ఇచ్చారు.

మేహులీ పొందిన శిక్షణ ఫలితం ఈ ఏడాది సీనియర్ ప్రపంచ కప్ పోటీల్లో స్పష్టంగా కనిపించింది. మేహులీ రెండు పతకాలు గెలుచుకొంది.
మేహులీ అందరి టీనేజర్లలాగే నడుచుకుంటుంది. మొబైల్ ఫోన్ ఉంది. అయితే సోషల్ మీడియాపై ఎక్కువ సమయం గడిపేందుకు కుటుంబ సభ్యులు, కోచ్ ఆమెను అనుమతించరు. కామన్వెల్త్ గేమ్స్ తర్వాత ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే మేహులీ లక్ష్యం.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








