ప్రెస్ రివ్యూ: ఏపీలో మద్యం తాగే మహిళలు పెరిగారు!

ఫొటో సోర్స్, MANJUNATH KIRAN
దిల్లీలో మద్యం తాగే పురుషుల శాతం తగ్గితే.. మహిళల శాతం పెరిగిందంటూ నమస్తే తెలంగాణ ఓ కథనాన్ని ప్రచురించింది.
దశాబ్దం కిందట ఉన్న జనాభాతో పోలిస్తే దిల్లీలో మందు తాగే పురుషుల శాతం తగ్గిపోగా, మహిళల శాతం పెరిగిందని పలు సర్వేలు పేర్కొంటున్నాయి.
ఈ విషయంలో కొన్ని రాష్ట్రాలు దిల్లీని మించిపోయాయి.
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2005-06 నుంచి 2015-16 మధ్యలో దేశంలో మద్యం తీసుకొనే ఆడ, మగవారి వివరాలను శక్తి అనే సంస్థ సేకరించింది.
దిల్లీలోని పురుషుల్లో మందుతాగే వారి శాతం తగ్గింది. అదే మహిళల జనాభాలో 2005-06లో 0.4 శాతం మంది మద్యం తాగేవారుండగా, 2015-16 నాటికి అది 0.7 శాతానికి పెరిగింది.
ఛండీగఢ్.. గోవా.. కేరళ.. ఆంధ్రప్రదేశ్.. మణిపూర్.. మిజోరాం.. ఉత్తరాఖండ్.. హిమాచల్‌ప్రదేశ్ రాష్ట్రాల్లోనూ మందు తాగే మహిళల సంఖ్య అధికమైంది.
మణిపూర్, గోవా, కేరళ రాష్ట్రాల్లో మందు తీసుకొనే మహిళల నిష్పత్తి దిల్లీలో కంటే ఎక్కువగా ఉంది.

ఫొటో సోర్స్, Facebook/SSRajamouli
'బాహుబలి'తో తెలుగు సినీ జగత్తులో తనదైన ప్రత్యేకత చాటుకున్న ప్రముఖ సినీ దర్శకుడు రాజమౌళి.. ఉదారతను చాటుకోవడంలోనూ తనకు తానే సాటి అని నిరూపించుకున్నారు.
తన తల్లి పేరిట పాఠశాల భవనం నిర్మించి ప్రత్యేకతను చాటుకున్నారంటూ ఆంధ్రజ్యోతి ఓ కథనాన్ని ప్రచురించింది.
2014 హుద్‌హుద్ తుఫాన్ ధాటికి 154 ఏళ్ల చరిత్ర కలిగిన విశాఖ జిల్లా కశింకోటలోని దురిశేటి పెదనర్సింహమూర్తి(డీపీఎన్) జెడ్పీ ఉన్నత పాఠశాల భవనం కూలిపోయింది.
ఈ భవన నిర్మాణానికి తనవంతు సాయంగా రాజమౌళి రూ.40 లక్షలు అందజేశారు.
2015లో 4 గదులతో చేపట్టిన ఈ భవన నిర్మాణం ప్రారంభానికి సిద్ధమైంది. దీనికి తన తల్లి జననీ రాజనందిని పేరు పెట్టారు.

ఫొటో సోర్స్, AFP
ఏపీ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి తిమింగలం
అవినీతి నిరోధక శాఖకు భారీ తిమింగలం చిక్కింది. విజయవాడలో ఏకంగా రూ.23.20 లక్షల లంచం తీసుకుంటుండగా రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఏడుకొండలును ఏసీబీ పట్టుకుంది.
ఇంత భారీ మొత్తంలో లంచం తీసుకుంటూ పట్టుబడటం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆ శాఖ చరిత్రలోనే తొలిసారి అని ఈనాడు పేర్కొంది.
ఇన్నాళ్లూ కేవలం లంచం తీసుకున్న వ్యక్తినే నిందితుడిగా చూపి అదుపులోకి తీసుకునేవారు. ఈ ఘటనలో డబ్బు ఇవ్వజూపిన సంస్థ ప్రతినిధులనూ నిందితులుగా చేర్చి నలుగురిని ఏసీబీ అదుపులోకి తీసుకుంది.
మలేషియాకు చెందిన ఐటీడీ సిమెంటేషన్ ఇండియా లిమిటెడ్ కంపెనీ.. రాష్ట్రంలోని గంగవరం, విశాఖ ఉక్కు పరిశ్రమ, విశాఖపట్నం నౌకాశ్రయంలో బెర్త్‌ల నిర్మాణం చేపట్టింది.
2010 అక్టోబరు నుంచి 2014 మే వరకు చేపట్టిన పనులకు సంబంధించి రూ.4.67 కోట్లు ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ నుంచి రావాల్సి ఉంది.
దానికి సంబంధించి అదనపు కమిషనర్ ఏడుకొండలు వద్ద పెండింగ్‌లో ఉన్న దస్త్రాన్ని పరిష్కరించేందుకు రూ.25 లక్షలు చెల్లించేలా అంగీకరించారు.
శుక్రవారం సాయంత్రం విజయవాడ శివారు ఈడ్పుగల్లులోని రాష్ట్ర వాణిజ్య పన్నులశాఖ కమిషనర్ కార్యాలయంలోని ఏడుకొండలు ఛాంబర్‌లో లంచం ఇస్తుండగా.. ఏసీబీ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు.

ఫొటో సోర్స్, tdp.ncbn.official
రెక్కలు తెగిన పక్షి ఏపీ: చంద్రబాబు
అసంబద్ధమైన విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా రెక్కలు తెగిన పక్షిలా తయారైందని.. మిగిలిన రాష్ట్రాలతో సమానంగా నిలబడేంతవరకూ రాష్ట్రాన్ని ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారంటూ ఈనాడు పేర్కొంది.
కొత్త రాష్ట్రంపై విభజన సమయంలో రూ.33వేల కోట్ల అదనపు అప్పుల భారాన్ని రుద్దినట్లు చంద్రబాబు తెలిపారు. దీనివల్ల ద్రవ్య క్రమశిక్షణకు సంబంధించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల ప్రకారం వెళ్లడం రాష్ట్రానికి అసాధ్యంగా మారుతోందని ఆవేదన వ్యక్తంచేశారు.
యూపీయే ప్రభుత్వం చేసిన తీవ్ర అన్యాయాన్ని సరిదిద్ది నవ్యాంధ్రకు కొంతకాలంపాటు చేయూతనివ్వాలని కోరారు. ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.17వేల కోట్లను వెంటనే ఏదో ఒక రూపంలో ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
విభజన చట్టం ప్రకారం ఇప్పటివరకూ అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు.
దీనిపై 17పేజీల వినతిపత్రాన్ని ప్రధానికి సమర్పించి సుమారు 40 నిమిషాలపాటు ఆయనకు సమస్యలను ఏకరువుపెట్టారు. ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు చంద్రబాబు సమావేశానంతరం ప్రకటించారు.

ఫొటో సోర్స్, Getty Images
పాకిస్తాన్ బుల్లెట్లు మేడిన్ చైనా
భారత సైనికులే లక్ష్యంగా పాకిస్తాన్ జరుపుతున్న కాల్పుల్లో ఉపయోగిస్తున్న బుల్లెట్లు చైనాలో తయారవుతున్నాయంటూ ఇటీవల రక్షణ శాఖ కేంద్రానికి సమర్పించిన నివేదికలో పేర్కొన్నట్టు ఆంధ్రప్రభ ఓ కథనాన్ని ప్రచురించింది.
సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న జవాన్లకు ప్రత్యేకంగా బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లను సరఫరా చేయాలని ఆ నివేదిక కేంద్రానికి సిఫారసు చేసింది.
నియంత్రణ రేఖ వెంబడి పాక్ ఉగ్రవాదులు స్టీల్ బుల్లెట్లు వినియోగిస్తున్నారు. ఆ బుల్లెట్లను తట్టుకునే సామర్థ్యం భారత సైనికులు ప్రస్తుతం వాడుతున్న బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు లేదు.
ఆ బుల్లెట్లను సరఫరా చేస్తున్నది చైనానే కావడం గమనార్హం.
చైనా నుంచి పాకిస్తాన్‌కు 2496 లాంచర్లు వెళ్లాయని ఇంటలిజెన్స్ విభాగం తన నివేదికలో వెల్లడించింది.
ఈ నేపథ్యంలో తన బలగాల కోసం ప్రత్యేకమైన బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారు చేయించాలని భారత ప్రభుత్వం భావిస్తోందని ఆంధ్రప్రభ వివరించింది.
ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








