సీఏకు, సీఎస్‌కు ఉన్న తేడా ఏంటి? కంపెనీ సెక్రటరీలు ఏ బాధ్యతలు నిర్వర్తిస్తారు? జీతాలెలా ఉంటాయి?

సీఏ, సీఎస్ కోర్సు

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, ప్రియాంక ఝా
    • హోదా, బీబీసీ ప్రతినిధి
  • చదివే సమయం: 6 నిమిషాలు

ఇంటర్ రెండో సంవత్సరం కామర్స్ తీసుకున్న విద్యార్థుల్లో ఒక ప్రశ్న పదేపదే మెదులుతుంటుంది. అదేంటంటే.. చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) కావాలా? లేదంటే కంపెనీ సెక్రటరీ (సీఎస్) కావాలా అని.

అసలు ఈ రెండు ఫీల్డ్స్ ఏంటి..? వీటి మధ్యనున్న తేడాలేంటి..?

...ఈ రెండింటి మధ్య చాలా వ్యత్యాసం ఉంది.

చార్టర్డ్ అకౌంటెంట్లు వ్యాపార, ఆర్థిక రంగాల్లో పనిచేస్తుంటారు. ఆడిటింగ్, ట్యాక్సేషన్, ఫైనాన్సియల్, జనరల్ మేనేజ్‌మెంట్ వంటి పనులు వీరు చేస్తుంటారు.

ఆర్థికపరమైన అంశాలపై ఎక్స్‌పర్ట్ ఒపీనియన్ అందించగలిగే అర్హత కలిగిన వృత్తిపరమైన నిపుణులు వీరు.

మరోవైపు కంపెనీ సెక్రటరీ అనేది కార్పొరేట్ గవర్నెన్స్‌లో కీలక పాత్ర పోషించే సీనియర్ మేనేజ్‌మెంట్ పదవి.

బోర్డు, షేర్‌హోల్డర్లు, రెగ్యులేటర్ల మధ్య కీలక అనుసంధానంగా వీరు పనిచేయాల్సి ఉంటుంది.

చట్టపరమైన నిబంధనలు పాటించేలా చూడటం, చట్టబద్ధమైన రికార్డులను నిర్వర్తించడం, కంపెనీలు అత్యుత్తమ పద్ధతులను చేపట్టేలా సూచనలు ఇవ్వడం కంపెనీ సెక్రటరీ బాధ్యత.

ఈ కథనంలో ప్రధానంగా కంపెనీ సెక్రటరీలకు సంబంధించి తెలుసుకుందాం..

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

కంపెనీ సెక్రటరీలు కార్పొరేట్ ప్రపంచంలో చాలా ముఖ్యమైన వ్యక్తులు.

కంపెనీకి సంబంధించి న్యాయపరమైన, పరిపాలనపరమైన, పాలనకు సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో వీరిదే కీలక పాత్ర.

కార్పొరేట్ రంగం విస్తరిస్తుండటంతో, కంపెనీల చట్టపరమైన బాధ్యతలు పెరుగుతుండటంతో.. నిపుణులైన కంపెనీ సెక్రటరీలకు కూడా డిమాండ్ విపరీతంగా పెరుగుతోంది.

ఆశించిన వేతనాలు, కెరీర్ స్థిరత్వం, కంపెనీ ఉన్నతస్థాయి అధికారులతో పనిచేసే అవకాశం రావడం ఇవన్నీ ఈ వృత్తిని ప్రత్యేకంగా నిలుపుతున్నాయి.

అయితే, ఈ కెరీర్‌ను ఎంపిక చేసుకునేందుకు స్పష్టంగా నిర్దేశించిన ప్రక్రియ ఉంది. దీన్ని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) నిర్వహిస్తోంది.

కార్పొరేట్ ప్రపంచం

ఫొటో సోర్స్, Getty Images

కంపెనీ సెక్రటరీ ఏం చేస్తారు?

భారత్‌లో ఎన్నో నిబంధనలు, నియంత్రణలు ఉంటాయి. ఉదాహరణకు.. రోడ్డుపై కారు నడిపేటప్పుడు, సిగ్నల్స్‌లో రెడ్ లైట్ పడితే ఆగాలి. గ్రీన్ వచ్చాకనే కారును ముందుకు వెళ్లనివ్వాలి. ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే జరిమానాలు, శిక్షలు పడతాయి.

అలాగే, దేశంలో నడిచే కంపెనీలకు కూడా ఇదే వర్తిస్తుంది. వారు తమ కార్యకలాపాలను కొనసాగించాలంటే, నిర్దేశిత చట్టాలను తప్పనిసరిగా అనుసరించాలి.

వీటిల్లో కంపెనీల చట్టం 2013, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ 1999(ఫెమా), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ), ఇన్‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్ట్సీ కోడ్‌ ముఖ్యమైనవి.

శుభమ్ అబ్బాద్ గత పదేళ్లుగా సీఎస్ విద్యార్థులకు బోధిస్తున్నారు.

'' భారత్‌లో వ్యాపార కార్యకలాపాలను ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా, సక్రమంగా నిర్వర్తించేలా చేసేందుకు నియమ, నిబంధనలు, నియంత్రణలు రూపొందించింది ప్రభుత్వం. ప్రతి కంపెనీ కూడా ప్రధానంగా కంపెనీల చట్టం, 2013ను అనుసరించాలి. ఒకవేళ ఏదైనా కంపెనీ అలా చేయకపోతే, భారీ జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కంపెనీలు ఈ నిబంధనలను పాటించేలా చేసేందుకు, 1980లోనే కంపెనీ సెక్రటరీ చట్టాన్ని తీసుకొచ్చింది అప్పటి ప్రభుత్వం. ఈ చట్టం ప్రకారం, ఒక కోర్సును కూడా ఏర్పాటు చేశారు. అదే కంపెనీ సెక్రటరీ. రూ.10 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ మొత్తం పెయిడ్-అప్ షేర్ క్యాపిటల్‌గా ఉన్న ప్రతి కంపెనీ కూడా తప్పనిసరిగా కంపెనీ సెక్రటరీని నియమించుకోవాలి'' అని శుభమ్ అబ్బాద్ తెలిపారు.

పెయిడ్-అప్ క్యాపిటల్ అనేది కంపెనీ షేర్లను కొనుగోలు చేయడానికి బదులుగా, కంపెనీకి ఇన్వెస్టర్లు చెల్లించే వాస్తవ నగదు మొత్తం.

''చట్టపరమైన నిబంధనల అమలు, గవర్నెన్స్‌ బాధ్యత కంపెనీ సెక్రటరీలదే. చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా కంపెనీ నడుస్తోందని వారు నిర్ధరించాల్సి ఉంటుంది. కేవలం ఫైలింగ్ చేయడమే కంపెనీ సెక్రటరీ విధి కాదు. వారు చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది'' అని ఒక కంపెనీలో కంప్లయెన్స్ ఆఫీసర్‌గా పనిచేసే ముస్కాన్ సుహాగ్ చెప్పారు.

''కార్పొరేట్ రీస్ట్రక్చర్, విదేశీ సహకారం, జాయింట్ వెంచర్, మధ్యవర్తిత్వం, ఆర్థిక నిర్వహణ, ప్రాజెక్ట్ ప్లానింగ్, కార్పొరేట్ అడ్వయిజరీ సర్వీసెస్ వంటి కంపెనీలు చేపట్టే ప్రతి చిన్న, పెద్ద సందర్భాల్లోనూ కంపెనీ సెక్రటరీలు అవసరమవుతారు. సరళంగా చెప్పాలంటే.. కంపెనీ సక్రమంగా, చట్టబద్ధంగా, నైతికంగా, మార్గదర్శకాలకు అనుగుణంగా పనిచేస్తుందని నిర్ధరించడమే కంపెనీ సెక్రటరీ బాధ్యత'' అని ముస్కాన్ తెలిపారు.

కంపెనీ సెక్రటరీని తరచూ చార్టర్డ్ అకౌంటెంట్‌తో పోలుస్తుంటారు. సీఏ చేయలేని వారే, సీఎస్‌ను ఎంపిక చేసుకుంటారనే ఒక వాదన కూడా ఉంది. అయితే, ఈ వాదనను నిపుణులు పూర్తిగా కొట్టేస్తున్నారు.

చార్టర్డ్ అకౌంటెంట్‌తో పోలిస్తే ఎందుకు భిన్నమైంది?

చార్టర్డ్ అకౌంటెన్సీ అనేది దేశంలో అత్యంత కష్టమైన పరీక్షల్లో ఒకటిగా పరిగణిస్తారు. అయితే, కంపెనీ సెక్రటరీ పరీక్ష కూడా అంతే కష్టమైందని నిపుణులు చెబుతున్నారు.

''సీఏ పని, వారి ప్రధాన కర్తవ్యం అకౌంటింగ్, టాక్సేషన్, ఫైనాన్సియల్ రిపోర్టులు తయారు చేయడంపై ఉంటుంది. అయితే, కంపెనీ సెక్రటరీ ప్రధాన పని కంపెనీ చట్టం, పన్నుల చట్టం, బిజినెస్ లా, కంప్లియెన్స్ లా మొదలైన వాటికి సంబంధించింది. కార్పొరేట్ రంగంలో ఈ ఇద్దరి పని కూడా భిన్నమైంది. ఇరువురు నిపుణులు చూసుకునే పనులు కూడా పూర్తిగా భిన్నమైనవి'' అని ముస్కాన్ తెలిపారు.

''సీఏను, సీఎస్‌ను పోల్చడమంటే.. ఆర్థోపెడిక్ సర్జన్‌ను, కంటి వైద్యుడిని పోల్చడమన్నమాట. ఇద్దరూ డాక్టర్లే. కానీ, వారు చేసే ప్రాక్టీస్ పూర్తిగా భిన్నమైంది'' అని శుభమ్ చెప్పారు.

కంపెనీ సెక్రటరీ, సీఎస్

ఫొటో సోర్స్, Getty Images

కంపెనీ సెక్రటరీ కావడమెలా?

రమన్‌దీప్ సింగ్ ఒక కంపెనీ సెక్రటరీ, సైబర్ కేసులకు సంబంధించిన న్యాయవాది. కంపెనీ సెక్రటరీ అయ్యేందుకు భారత్‌లో ఎలాంటి కాలేజీలు లేవని ఆయన చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడిచే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఏ) ఈ కోర్సును ఆఫర్ చేస్తోందని తెలిపారు.

దీనికి ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి లేదు. ఇంటర్‌లో లేదా గ్రాడ్యుయేషన్‌లో 40 శాతం మార్కులు సంపాదించిన వారు ఈ పరీక్ష రాయొచ్చు.

ఐసీఎస్ఐ ప్రకారం.. పలు ప్రొగ్రామ్‌ల కోసం ప్రస్తుతం సుమారు 4 లక్షల మంది విద్యార్థులు ఎన్‌రోల్ చేసుకున్నారు. దిల్లీ ప్రధాన కార్యాలయంగా నడిచే ఐసీఎస్ఐకు చెన్నై, కోల్‌కతా, ముంబయిలలో ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి.

12వ తరగతి తర్వాత కంపెనీ సెక్రటరీ కావాలని ఎవరైనా విద్యార్థి అనుకుంటే, మూడు దశల్లో ఈ కోర్సును పూర్తి చేయాల్సి ఉంటుంది.

  • సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎంట్రన్స్ టెస్ట్ (సీఎస్ఈఈటీ) (అంతకుముందు దీన్ని ఫౌండేషన్ కోర్సు అని పిలిచేవారు)
  • ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్
  • ప్రొఫెషనల్ ప్రొగ్రామ్

సీఎస్‌ఈఈటీ ప్రతేడాది మూడు సార్లు అంటే ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో నిర్వహిస్తారు. దీనిలో నాలుగు పేపర్లు ఉంటాయి. వాటిలో మూడు సబ్జెక్టివ్, ఒకటి అబ్జెక్టివ్.

ఈ పరీక్ష పాసైన తర్వాత.. రెండు గ్రూప్‌లలో సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్‌కు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంటుంది. ఒక గ్రూప్‌లో నాలుగు పేపర్లు, మరోదానిలో మూడు పేపర్లు ఉంటాయి.

అదనంగా, ఎగ్జిక్యూటివ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (ఈడీఈపీ) అని పిలిచే నెల పాటు ట్రైనింగ్ ప్రొగ్రామ్‌ను చేపట్టాల్సి ఉంటుంది. ఈ ప్రొగ్రామ్‌ను ఐసీఎస్ఐ నిర్వహిస్తుంది.

ఒకేసారి రెండు గ్రూప్‌ల పరీక్షలను రాయాలా లేదా వేరువేరుగా రాయాలా అన్నది విద్యార్థులే నిర్ణయించుకోవచ్చు. సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్ పరీక్షను ఏడాదిలో రెండుసార్లు అంటే జూన్, డిసెంబర్‌లలో నిర్వహిస్తారు.

సీఎస్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్‌కు చెందిన రెండు గ్రూప్‌లను వేరువేరుగా రాయడం వల్ల ఉన్న ఒకే ఒక్క ఇబ్బంది ఏంటంటే.. భారత్‌లో టాప్ 50 ర్యాంక్‌ల జాబితాను సీఎస్ ఇన్‌స్టిట్యూట్లు విడుదల చేస్తాయి. ఈ ర్యాంక్‌లు కేవలం రెండు గ్రూప్‌లు కలిపి రాసిన వారికి మాత్రమే ఇస్తాయి.

'' సీఎస్ ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్‌ను పూర్తి చేసిన తర్వాత, విద్యార్థులు ఒక సీఎస్ సంస్థలో కానీ, ప్రాక్టీసింగ్ సీఎస్ వద్ద కానీ, ఏదైనా కంపెనీలో పనిచేస్తున్న సీఎస్ కింద కానీ, 21 నెలల పాటు ఆర్టికల్‌షిప్‌ను పూర్తి చేయాలి. ఇది పూర్తి చేయకపోతే, సీఎస్ క్వాలిఫైడ్ సర్టిఫికేట్ రాదు'' అని రమన్‌దీప్ సింగ్ చెప్పారు.

ఆర్టికల్‌షిప్‌ను పూర్తి చేసిన తర్వాత, సీఎస్ ప్రొఫెషనల్ ఎగ్జామ్‌లో అర్హత సాధించాక కూడా మీరు కార్పొరేట్ లెర్నింగ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్‌గా (సీఎల్‌డీపీ) పిలిచే ఒక నెల శిక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఈ శిక్షణను ఐసీఎస్ఐ ఇస్తుంది. ఈ గ్రూప్‌లలో ఏ ఒక్క పరీక్షను విద్యార్థులు ఫెయిల్ అయినా.. మళ్లీ మొత్తం గ్రూప్‌ను రాయాల్సి ఉంటుంది.

సీఎస్ కోర్సులో ఉండే సబ్జెక్ట్‌లు ఏంటి? ఫీజు ఎంత?

సీఎస్ఈఈటీలో నాలుగు పేపర్లు ఉంటాయని ముస్కాన్ వివరించారు. ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్‌లో ఏడు పేపర్లు ఉంటాయి. వీటిని రెండు గ్రూప్‌లుగా విభజించారు. ఇక ప్రొఫెషనల్ ప్రొగ్రామ్‌లో కూడా ఏడు గ్రూప్‌లు ఉంటాయి. వీటిని కూడా రెండు గ్రూప్‌లుగా విభజించారు.

కంపెనీ సెక్రటరీగా అర్హత సాధించాలంటే, మూడు ప్రొగ్రామ్‌లలో అంటే సీఎస్ఈఈటీ, ఎగ్జిక్యూటివ్, ప్రొఫెషనల్ ప్రొగ్రామ్‌లలో ప్రతి సబ్జెక్ట్‌లో కూడా కనీసం 40 శాతం మార్కులు రావాలి. మొత్తంగా 50 శాతాన్ని పొందాలి.

అంతేకాక, ఎగ్జిక్యూటివ్ ప్రొగ్రామ్ ఎడ్యుకేషన్ ఫీజు సుమారు రూ.17 వేలుగా ఉండగా.. ప్రొఫెషనల్ ప్రొగ్రామ్ ఫీజు సుమారు రూ.20 వేలు.

కంపెనీ సెక్రటరీ

ఫొటో సోర్స్, Getty Images

వీరి భవిష్యత్ ఎలా ఉంటుంది?

భవిష్యత్‌లో కంపెనీ సెక్రటరీలకు డిమాండ్ మరింత పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.

''ఈ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కొత్త నిబంధనలు వస్తున్నాయి, చట్టాలు మారుతున్నాయి, స్టార్టప్‌లు పుట్టుకొస్తున్నాయి. ట్రేడ్‌మార్క్ రిజిస్ట్రేషన్‌కు కంపెనీ సెక్రటరీలు కావాలి. కొత్త లేబర్ కోడ్‌లు ప్రవేశపెట్టారు. నేషనల్ కంపెనీ లా ట్రిబునల్, సెబీ వంటి పలు ప్లాట్‌ఫామ్‌ల వద్ద తమ క్లయింట్ల తరఫును కంపెనీ సెక్రటరీలు ప్రాతినిధ్యం వహించవచ్చు. కంపెనీ సెక్రటరీలకు డిమాండ్, రోజురోజుకు వారికి అందుబాటులోకి వస్తోన్న అవకాశాలు పెరుగుతున్నాయి'' అని శుభమ్ తెలిపారు.

అదేవిధంగా ఈ కోర్సు ద్వారా ఉజ్వలమైన భవిష్యత్‌ ఉంటుందని కూడా ముస్కాన్ తెలిపారు. ప్రారంభ వేతనమే వీరికి రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు ఉంటుందన్నారు.

అయితే, కంపెనీ సెక్రటరీ ఉద్యోగాలను ఏఐ ప్రభావితం చేస్తుందా? అని ప్రశ్నించగా.. చాలామంది నిపుణులు కొంతవరకు అంగీకరిస్తున్నారు.

''సీఎస్ విద్యార్థులకు ఏఐ ముప్పు కావొచ్చు, కాకపోవచ్చు. చాలామంది సీఎస్ విద్యార్థులు కేవలం ఫామ్‌లను పైల్ చేయడం, సమావేశ వివరాలు సిద్ధం చేయడం చేస్తుంటారు. ఈ పనులు భవిష్యత్‌లో ఏఐ చేస్తుంది. కానీ, డబ్బులు ఎక్కడ పెట్టుబడిగా పెట్టాలి, కంపెనీలు ఎలా విలీనం చేయాలి వంటి కన్సల్టెన్సీ టాస్కులను కేవలం సీఎస్ విద్యార్థులే చేయగలరు. ఇలాంటి విశ్లేషణాత్మక పనిని ఏఐ భర్తీచేయలేదు'' అని రమన్‌దీప్ సింగ్ తెలిపారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)