మాంటెరే పార్క్ షూటింగ్: 10మందిని కాల్చి చంపిన అనుమానిత వ్యక్తి మృతి

అమెరికా కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, సంఘటనా స్థలంలో పోలీసులు

కాలిఫోర్నియా నగరం సమీపంలోని మాంటెరే పార్క్‌లోని బాల్‌రూమ్ డ్యాన్స్ స్టూడియోలో జరిగిన కాల్పులలో 10 మంది ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు.

12 గంటల పాటు జరిగిన సెర్చ్ ఆపరేషన్ తర్వాత, అనుమానిత నిందితుడు కూడా మరణించినట్లు, అతని మృతదేహాన్ని ఒక వ్యాన్ లో గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు.

అనుమానిత వ్యక్తి 72 సంవత్సరాల వయసున్న ఆసియా సంతతి వ్యక్తి అని లాస్‌ఏంజెలిస్ కౌంటీ షెరీఫ్ రాబర్ట్ లూనా చెప్పారు. అతని ఒంటి మీద బుల్లెట్ గాయం ఉన్నట్లు వెల్లడించారు.

స్థానిక కాలమానం ప్రకారం శనివారం రాత్రి 10.20 గంటల సమయం (భారత కాలమానం ప్రకారం ఆదివారం మధ్యాహ్నం 11.50)లో ఈ కాల్పులు జరిగాయి.

మాంటెరే పార్క్‌లో నిర్వహించే లూనార్ న్యూఇయర్ ఫెస్టివల్ కోసం వేలాదిమంది అక్కడ చేరారు.

 ఘటన తరువాత అక్కడి నుంచి పారిపోయిన ఓ మగ వ్యక్తే ఈ కాల్పులకు పాల్పడినట్లు అనుమానిస్తున్నామని లాస్ ఏంజెలిస్ కౌంటీ పోలీసులు చెప్పారు.

ఘటనాస్థలానికి అత్యవసర సేవల సిబ్బంది చేరుకున్నారని.. ప్రజలు ప్రాణభయంతో అక్కడి నుంచి పారిపోవడం కనిపించిందని కెప్టెన్ ఆండ్రూ మెయెర్ చెప్పారు.

కాల్పులు

ఫొటో సోర్స్, Getty Images

కాగా ఈ ఘటనలో 10 మంది మృతిచెందగా మరో 10 మంది గాయపడినట్లు పోలీసులు చెప్పారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు.

ఆధునిక కాలిఫోర్నియా చరిత్రలో అత్యంత విషాదకర కాల్పుల ఘటనల్లో ఇదొకటి.

ఇంతకుముందు 1984లో శాన్ డియాగోలోని మెక్‌డోనల్డ్స్ రెస్టారెంట్‌లో సాయుధుడు ఒకరు కాల్పులు జరపడంతో 21 మంది మరణించారు.

తాజా కాల్పులకు కారణమేంటనేది ఇంకా తెలియదని అధికారులు చెప్పారు. విద్వేష నేరంగా దీనిని పరిగణించడం అప్పుడే తొందరపాటవుతుందని అధికారులు చెప్పారు.

మాంటెరే పార్క్‌లో 60 వేల మంది ఉంటారు. ఇందులో ఎక్కువ మంది ఆసియా సంతతివారు ఉంటారు. లాస్ ఏంజెలిస్ నుంచి ఇది 13 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.

కాల్పులు జరిగిన ప్రాంతం

మాంటెరే పార్క్‌లో పోలీసులు పెద్దసంఖ్యలో ఉన్నట్లుగా సోషల్ మీడియాలో వీడియోలు కనిపిస్తున్నాయి.

ముగ్గురు వ్యక్తులు తన రెస్టారెంట్‌లోకి పరుగెత్తుకుంటూ వచ్చారని, మెషీన్ గన్‌తో ఓ వ్యక్తి కాల్పులు జరుపుతున్నాడని, తలుపులు మూసేయాలని సూచించారని ప్రత్యక్ష సాక్షి ఒకరు ‘లాస్ ఏంజెలెస్ టైమ్స్’కు చెప్పారు.

‘డ్యాన్స్ స్టూడియో వద్ద ఈ కాల్పులు జరిగినట్లుగా అనిపిస్తోంది. మెషీన్ గన్‌తో కాల్పులు జరిపాడని ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఆటోమేటిక్ గన్‌తో అనేక రౌండ్లు కాల్పులు జరిపి ఉండొచ్చు. ఎక్కువగా ఆసియన్ అమెరికన్లను లక్ష్యంగా చేసుకున్నట్లుంది’ అని లాస్ ఏంజెలెస్ టైమ్స్ రిపోర్టర్ జియాంగ్ పార్క్ బీబీసీతో చెప్పారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: బయటి సైట్‌ల కంటెంట్‌కు బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of X ముగిసింది

కాల్పుల తరువాత కొందరు నిమిషాల్లో అక్కడి నుంచి కారులో వెళ్లిపోయారని మరో ప్రత్యక్ష సాక్షి చెప్పారు.

ఇది జరిగిన కొద్దిసేపటికే అక్కడికి సమీపంలోనే మరో కాల్పుల ఘటన కూడా జరిగిందని కెప్టెన్ ఆండ్రూ మెయెర్ చెప్పారు.

అయితే, ఈ రెండింటికీ సంబంధం ఉందా అనే కోణంలో అధికారులు విచారణ జరుపుతున్నట్లు చెప్తున్నారు.

రెండో ఘటన జరిగిన అలాంబ్రాలో ఎవరికీ ఏమీ కానప్పటికీ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ జరుపుతున్నారు.

కాగా ఈ ఘటన తరువాత ఆదివారం జరగాల్సిన లూనార్ న్యూఇయర్ ఈవెంట్లను రద్దు చేశారు.

వీడియో క్యాప్షన్, ఈశాన్య సిరియాలో ఆకలి చావుల అంచుల్లో జనం

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)