కారులో పులి పిల్ల.. అక్రమంగా తరలిస్తున్న జంటను పట్టుకున్న పోలీసులు

పులి పిల్ల

ఫొటో సోర్స్, THE MARQUIS POLICE

మెక్సికోలో ఓ జంట ప్రయాణిస్తున్న కారును ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కారణంగా పోలీసులు ఆపారు.. అప్పుడు వారికి కారు లగేజ్ స్పేస్‌లో పులి పిల్ల కనిపించింది.

కెరెటారో రాష్ట్రంలో వీరిని ఆపినప్పుడు ఈ జంట తమతో చాలా దురుసుగా వ్యవహరించిందని, దీంతో వారిపై అనుమానం వచ్చి తనిఖీ చేశామని అధికారులు చెప్పారు.

మెక్సికోలో పులిని సీజ్ చేయడం ఇదే తొలిసారి కాదు.

డ్రగ్ సరఫరాదారులు ఇతర దేశాల వన్యప్రాణులను ఇంట్లో పెంచుకుంటుంటారు.

పులులు, చిరుతలు వంటివాటిని స్మగ్లింగ్ చేయడం అక్కడ లాభాదాయక వ్యాపారం.

అధికారులు ఆపినప్పుడు ఈ జంట ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించిందో ఈఐ మార్కస్ పట్టణానికి చెందిన మున్సిపల్ పోలీసులు తెలిపారు.

‘‘అధికారులు వెంటనే స్పందించి పెట్రోలింగ్ కారుతో వారు వెళ్లే మార్గాన్ని అడ్డుకున్నారు. వెంటనే ఆ జంటను అదుపులోకి తీసుకున్నారు.’’ అని పత్రికా ప్రకటనలో తెలిపారు.

వాహనాన్ని తనిఖీ చేస్తున్న సమయంలో, కారు బూట్ స్పేస్‌లో సూట్‌కేసులకు, బ్యాగ్‌లకు మధ్యలో పులి పిల్ల ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

పులి పిల్ల

ఫొటో సోర్స్, THE MARQUIS POLICE

పులి పిల్లతో పాటు నాలుగు గన్‌లను, 100 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.

దాని అటవీ ప్రాంతంలో విడిచిపెట్టేంత వరకు ఈ పులి పిల్ల ప్రస్తుతం నిపుణుల సంరక్షణలో ఉంటుందని అధికారులు చెప్పారు. అయితే, ఆ ప్రాంతం ఎక్కడన్నది వారు చెప్పలేదు.

మెక్సికోలో ఇతర దేశాల జంతువులను పెంచుకోవడం తప్పేమీ కాదు. అయితే, గుర్తింపు పొందిన డీలర్ నుంచి దీన్ని తెప్పించుకున్నట్లు నిరూపించాల్సి ఉంటుంది.

ఇటీవల కాలంలో అక్రమంగా కొనుగోలు చేసిన లేదా స్మగ్లింగ్ చేసిన చాలా జంతువులను సీజ్ చేశారు.

అలాగే బహిరంగ ప్రదేశాల్లో పులులు తిరగడాన్ని కూడా మెక్సికన్ చట్టం రద్దు చేసింది.

2020లో ఒక వ్యక్తి ట్లాకేపాకే వీధుల్లో తాడుతో కట్టి తిప్పుతున్న బెంగాల్ టైగర్‌ను సీజ్ చేశారు.

ఆ బెంగాల్ టైగర్ యజమాని వద్ద దానికి సంబంధించిన అన్ని పత్రాలు ఉన్నప్పటికీ, అవసరమైన భద్రతా ప్రమాణాలను పాటించడంలో విఫలమైనట్లు పోలీసులు తెలిపారు.

అంతకుముందు పెంపుడు జంతువులుగా ఉన్న సింహాలను మెక్సికన్ వన్యప్రాణుల అధికారులు స్వాధీనం చేసుకుని వాటిని సంరక్షణ కేంద్రాలకు తరలించారు.

ఒక వ్యక్తి ఎన్నో ఏళ్లుగా మెక్సికో నగరంలో తన ఇంటి పైభాగంలో ఉంచిన మూడు సింహాలను 2019లో అధికారులు కిందకి దించారు.

వాటి అరుపుల వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ఆ ఇంటి పక్కన వారు ఫిర్యాదు చేయడంతో వాటిని అక్కడి నుంచి దింపేశారు.

ఇవి కూడా చూడండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)