మాల్దీవుల ఎన్నికలను మోదీ ప్రభుత్వం ప్రభావితం చేయడానికి ప్రయత్నించిందన్న వాషింగ్టన్ పోస్ట్ కథనం, భారత్ స్పందన ఏంటంటే..

భారత్, మాల్దీవులు, మొహమ్మద్ మయిజ్జు, నరేంద్రమోదీ, వాషింగ్టన్ పోస్ట్, విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మహమ్మద్ మయిజ్జు చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మోదీ ప్రభుత్వం భారత్‌కు అనుకూలంగా ఉండే వ్యక్తిని మాల్దీవుల అధ్యక్షుడిగా చేసేందుకు ప్రయత్నించిందంటూ అమెరికన్ వార్తాపత్రిక వాషింగ్టన్ పోస్ట్‌ 2024 డిసెంబర్ 30న ఒక కథనాన్ని ప్రచురించింది.

దీంతో పాటు భారత నిఘా సంస్థ రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జును తొలగించేలా ఆ దేశ ప్రతిపక్షనేతలో సంప్రదింపులు జరిపినట్టు పేర్కొంది.

భారత ప్రభుత్వం 2023 మాల్దీవుల ఎన్నికలను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది.

భారత్‌కు అనుకూలంగా ఉండే ఇబ్రహిం సోలిహ్‌ను అధ్యక్షుడిగా ఎన్నికయ్యేలా మోదీప్రభుత్వం ప్రయత్నించిందని, సోలిహ్ ఓడిపోయాడని తెలిసిన తర్వాత మయిజ్జును పదవి నుంచి దించివేసే విషయంపై చర్చ కూడా జరిగినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది.

వాషింగ్టన్ పోస్ట్ కథనం గురించి భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధిర్ జైస్వాల్‌ను ప్రశ్నించినప్పుడు "వాషింగ్టన్ పోస్టులో ప్రచురించిన కథనాల్లో మాల్దీవులు, పాకిస్తాన్ గురించి ప్రస్తావించారు. ఆ కథనం రాసిన రిపోర్టర్, ఆ పత్రిక తీరు ప్రశ్నార్థకంగా ఉంది. భారత్ పట్ల వారి వ్యతిరేక వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. వారి కార్యకలాపాలు ఎలా ఉన్నాయో మీరూ చూడవచ్చు. వారి విశ్వసనీయత ఏంటో మీ నిర్ణయానికే వదిలేస్తున్నాం. ఇలాంటి కథనాల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు" అని చెప్పారు.

భారత్, మాల్దీవులు, మొహమ్మద్ మయిజ్జు, నరేంద్రమోదీ, వాషింగ్టన్ పోస్ట్, విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, @DrSJaishankar

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ భారత్‌లో మూడురోజులు పర్యటించారు.

మాజీ అధ్యక్షుడు ఏం చెప్పారు?

వాషింగ్టన్ పోస్ట్ కథనంపై మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మహమ్మద్ నషీద్ స్పందించారు.

"నేను ఆ కథనాన్ని చదివాను. అధ్యక్షుడికి వ్యతిరేకంగా కుట్ర జరిగినట్లు నాకు తెలియదు. అయితే కొంతమంది ఎప్పుడూ కుట్రల పట్ల ఆసక్తితో ఉంటారు. అలాంటి ఆలోచనలకు భారత్ ఎన్నడూ మద్దతివ్వదు. మాల్దీవులలో ప్రజాస్వామ్యానికి భారతదేశం అండగా నిలుస్తోంది. ఆ దేశం మాపై ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాలేదు" అని చెప్పారు.

మాల్దీవుల్లో అధ్యక్ష ఎన్నికలను భారత్ ప్రభావితం చేసిందని వాషింగ్టన్ పోస్ట్ కథనం వెలువడిన రెండు రోజుల తరువాత మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్ భారతదేశ పర్యటనకు వచ్చారు. ఆయన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌ను కలిశారు.

ద్వైపాక్షిక వాణిజ్యంలో స్థానిక కరెన్సీని ఉపయోగించడాన్ని ప్రోత్సహించడానికి భారత్, మాల్దీవులు ఒక కార్యాచరణను సిద్ధం చేసినట్లు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. మాల్దీవులకు భారత్ ఎప్పుడూ అండగా నిలుస్తుందని జైశంకర్ అన్నారు.

బీబీసీ న్యూస్ తెలుగు
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, మాల్దీవులు, మొహమ్మద్ మయిజ్జు, నరేంద్రమోదీ, వాషింగ్టన్ పోస్ట్, విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల విదేశాంగ మంత్రి అబ్దుల్లా ఖలీల్‌తో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్

వాషింగ్టన్ పోస్ట్ కథనంలో ఏముంది?

"ప్రజాస్వామ్య పునరుద్దరణ చర్య" పేరుతో తమకు ఒక రహస్య పత్రం అందిందని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో రాసింది. మాల్దీవుల ప్రతిపక్ష నేతలు లంచాలు ఇవ్వజూపారని, అందులో 40 మంది ఎంపీలు ఉన్నారని, వారిలో మయిజ్జు పార్టీకి చెందిన వారు కూడా ఉన్నారని అందులో పేర్కొంది.

"మయిజ్జుపై అభిశంసన తీర్మానం ప్రవేశ పెట్టాలని ఈ ఎంపీలను కోరారు. ముయిజ్జును తొలగించడంలో సాయం చేసేందుకు మాల్దీవుల సైన్యంలో 10మంది సీనియర్ అధికారులు, పోలీసు అధికారులు, ముగ్గురు శక్తిమంతమైన క్రిమినల్ గ్యాంగ్‌లకు చెల్లింపుల గురించి చర్చ జరిగినట్లు ఆ పత్రంలో ఉంది. వివిధ పార్టీలు, కుట్రదారులకు 8.7 కోట్ల మాల్దీవుల రుఫియాల చెల్లింపు గురించి చర్చ జరిగింది. ఇంత మొత్తం కావాలని భారత్‌ను కోరారు" అని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.

ఇంకా అందులో, "నెలల తరబడి రహస్య చర్చలు జరిగిన తర్వాత మయిజ్జు అభిశంసనకు అవసరమైన ఓట్ల సేకరణలో కుట్రదారులు విఫలమయ్యారు. భారత్ ఈ వ్యవహారాన్ని పట్టించుకోలేదు. మాల్దీవుల్లో తమ పట్టు పెంచుకునేందుకు భారత్, చైనా మధ్య పోటీ ఉంది" అని రాశారు.

''భారత ఉపఖండంలోని చిన్న దేశాల్లో ఇలాంటి పోటీ కనిపిస్తోంది. భారత్, చైనా రుణాలు ఇవ్వడం, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల నిర్మాణం, రాజకీయ మద్దతు ద్వారా తమ పట్టు పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ ప్రయత్నాలు బహిరంగంగా, రహస్యంగా జరుగుతున్నాయి"

'చైనా- భారత్ మధ్య శత్రుత్వం పెరుగుతోంది' అని వాషింగ్టన్ పోస్ట్ కథనం తెలిపింది. "కొన్ని దశాబ్దాలుగా, భారత్ దక్షిణాసియా అంతటా మానవతా దృక్పథంతో లౌకిక, ప్రజాస్వామ్య ఉద్యమాలకు మద్దతు ఇస్తోంది. అందుకు ప్రతిగా ఆయా దేశాలు తమకు మద్దతివ్వాలని భారత్ కోరుకుంటోంది. అయితే భారత్ సాయం పొందిన, పొందుతున్న దేశాలు పాకిస్తాన్ లేదా చైనాతో సన్నిహితంగా వ్యవహరిస్తూ ఉండటంతో, అలాంటి దేశాల పట్ల భారత్ ఇప్పుడు దూకుడు వైఖరి అవలంభిస్తోంది. " అని వాషింగ్టన్ పోస్ట్ రాసింది.

"భారత్‌కు సంబంధించినంత వరకు, చైనా లేదా మరే ఇతర దేశమైనా మాల్దీవులలో స్థిరపడటం హిందూ మహాసముద్రం, అరేబియా సముద్రంలో భారత్ ప్రాబల్యానికి పెద్ద ముప్పు. మాల్దీవులు వంటి పొరుగు దేశాలతో భారత్ స్థిరమైన సంబంధాలను కొనసాగించాలి" అని మాల్దీవులకు సంబంధించిన సమస్యలపై పనిచేసిన రీసర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ మాజీ అధిపతి హెర్మేస్ తారకన్ తమతో చెప్పినట్లు వాషింగ్టన్ పోస్ట్ కథనం వెల్లడించింది.అయితే ప్రస్తుతం జరుగుతున్న సంఘటనల గురించి తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పారు.అని అమెరికన్ వార్తాపత్రిక తెలిపింది.

భారత్, మాల్దీవులు, మహమ్మద్ మయిజ్జు, నరేంద్రమోదీ, వాషింగ్టన్ పోస్ట్, విదేశాంగ శాఖ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ముయిజు 2024 అక్టోబర్‌లో భారత్‌లో పర్యటించారు.

భారత్‌కు మాల్దీవులు ఎందుకంత కీలకం?

2024 జనవరిలో మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మహమ్మద్ ముయిజ్జు ఐదు రోజుల చైనా పర్యటనకు వెళ్లారు.

తిరిగి వచ్చిన తర్వాత "మాల్దీవులు చిన్న దేశం కావచ్చు. అయితే ఇది మమ్మల్ని బెదిరించేందుకు మరో దేశానికి లైసెన్స్ ఇచ్చినట్లు కాదు" అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు భారత్‌ను ఉద్దేశించి చేసినవేననే అభిప్రాయం వ్యక్తమైంది.

మయిజ్జు వ్యాఖ్యలకు భారత్ ప్రభుత్వం బహిరంగంగా స్పందించలేదు.

2024 మార్చిలో15లోగా భారత సైనికులు తమ దేశం విడిచి వెళ్లాలని మయిజ్జు ఆదేశించారు. ఈ విషయంలో కూడా భారత్ నిశ్శబ్దంగానే ఉంది.అయితే ఈ నిశబ్ధం ఎందుకనే ప్రశ్న ఉదయిస్తోంది.

మాల్దీవులు వ్యూహాత్మకంగా కీలక ప్రాంతంలో ఉంది. హిందూ మహా సముద్రంలోని ప్రధాన సముద్ర మార్గాలకు సమీపంలో ఉంది. ఈ మార్గాల ద్వారానే అంతర్జాతీయ వాణిజ్యం జరుగుతోంది. ఈ మార్గం ద్వారా గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు ఇంధనం సరఫరా అవుతోంది. ఈ పరిస్థితుల దృష్ట్యా మాల్దీవులతో భారత్ సంబంధాలు క్షీణించడం అంత మంచి పరిణామం కాదు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)