భారత్-అమెరికా ట్రేడ్ డీల్: రైతుల ప్రయోజనాలు కాపాడామంటున్న ప్రభుత్వం, అభ్యంతరం చెబుతున్న రైతు సంఘాలు... ఎవరి వాదనేంటి?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సందీప్ రాయ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
- చదివే సమయం: 7 నిమిషాలు
భారత్- అమెరికా ట్రేడ్ డీల్‌లో భారత్ ఆహార, వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలు తొలగిస్తున్నట్లు కథనాలు రావడంతో రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి.
ఈ ట్రేడ్ డీల్ ద్వారా భారత్ 'పూర్తిగా లొంగిపోయిందని' రైతు సంఘాల వేదిక సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది.
"సున్నితమైన వ్యవసాయ, పాల ఉత్పత్తుల విషయంలో" భారత రైతుల ప్రయోజనాలు కాపాడినట్లు కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఎక్స్‌లో ఒక మెసేజ్ చేశారు. ఇందులో ఆయన ట్రేడ్‌డీల్‌కు సంబంధించిన ఉమ్మడి ప్రకటనను కూడా ప్రస్తావించారు.
"రైతులే మాకు ముఖ్యం. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్- అమెరికా వాణిజ్య ఒప్పందంలో రైతుల ప్రయోజనాలను రక్షించాం" అని కేంద్ర వ్యవసాయ శాఖమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా శనివారంనాడు చెప్పారు.
ఈ వాణిజ్య ఒప్పందం ద్వారా ప్రజలకు ఎన్డీయే ప్రభుత్వం 'ద్రోహం' చేస్తోందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.


‘‘వాణిజ్య ఒప్పందం వల్ల అమెరికా, తన చెత్తను పారవేసేందుకు భారత్ కేంద్రంగా మారింది’’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి పవన్ ఖేరా అన్నారు.
వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటనలు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నాయిని ఆయన ఆరోపించారు. అమెరికా నుంచి మనం ఏ వస్తువుల్ని కొనుగోలు చేస్తామనేది అసలు ప్రశ్న అని, దీనికి సమాధానం దొరకడం లేదని ఖేరా అన్నారు.

ప్రతిపక్షాల ఆరోపణలపై కేంద్ర వ్యవసాయమంత్రి ఏం చెప్పారు?
కీలకమైన రంగాలలో భారత రైతుల ప్రయోజనాలు కాపాడేలా నిర్ణయాలు తీసుకున్నామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ అన్నారు.
మరోవైపు ట్రేడ్ డీల్ నుంచి రక్షణ ఉన్న వ్యవసాయ, పాల ఉత్పత్తుల గురించి కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పెద్ద జాబితాను ప్రకటించారు.
"దేశం తల దించుకునే పరిస్థితి రాదు. రైతుల ప్రయోజనాలకు ఎలాంటి హాని జరగదని ప్రధాని చెప్పారు. అమెరికాతో వాణిజ్య ఒప్పందంలో రెండు విషయాల పట్ల జాగ్రత్త తీసుకున్నారు. వ్యవసాయ రంగం, వ్యవసాయ ఉత్పత్తులను తీసుకుంటే, భారతీయ రైతులకు హాని కలిగించే ఏ ఉత్పత్తి కూడా ఈ ఒప్పందంలో చేర్చలేదు. అటువంటి వాటన్నింటినీ వాణిజ్య ఒప్పందానికి దూరంగా ఉంచారు" అని ఆయన వివరించారు.

ఫొటో సోర్స్, Getty Images
"అమెరికా నుంచి దిగుమతి అయ్యే సోయాబీన్, మొక్కజొన్న, బియ్యం, గోధుమ, చక్కెర, తృణధాన్యాలు, కోడి, పాల ఉత్పత్తులు, అరటిపండ్లు, స్ట్రాబెర్రీలు, చెర్రీలు, సిట్రస్ పండ్లు, పచ్చి బఠానీలు, చిక్‌పీస్, పచ్చి సెనగలు, నూనెగింజలు, ఇథనాల్, పొగాకు వంటి ఉత్పత్తులపై సుంకాలకు ఎటువంటి మినహాయింపు లేదు. మన ప్రధాన పంటలు, పండ్లు, పాల ఉత్పత్తుల విషయంలో అమెరికాకు తలుపులు బార్లా తెరవలేదు" అని కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ చెప్పారు.
"పాలు, పాల పొడి, క్రీమ్, పెరుగు, మజ్జిగ, వెన్న, నెయ్యి, పన్నీర్ లేదా జున్ను లాంటి వాటిని భారత్ దిగుమతి చేసుకోదు. మన సుగంధ ద్రవ్యాలు సురక్షితమైనవి. భారత్ నుంచి అనేక వ్యవసాయ ఉత్పత్తులు ఎలాంటి సుంకం లేకుండా అమెరికాకు ఎగుమతి అవుతాయి. కానీ అమెరికన్ ఉత్పత్తులకు ఇలాంటి మినహాయింపులేమీ లేవు" అని ఆయన తెలిపారు.
"అమెరికా అనేక వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాన్ని 50శాతం నుంచి సున్నాకు తగ్గించింది. ఇందులో సుగంధ ద్రవ్యాలు, టీ, కాఫీ, కొబ్బరి, తమలపాకు, జీడిపప్పు, అవకాడో, అరటి, మామిడి, కివి, బొప్పాయి, పైనాపిల్ వంటి ఉత్పత్తులు ఉన్నాయి" అని చౌహాన్ చెప్పారు.

ఫొటో సోర్స్, Getty Images
నిపుణులు ఏమన్నారు?
అమెరికా-భారత్ వాణిజ్య ఒప్పందం నిబంధనలపై వ్యవసాయ నిపుణుడు దేవేంద్ర శర్మ స్పందించారు.
అమెరికన్ ఉత్పత్తులు తొలిసారిగా భారత్ మార్కెట్‌లో ఇప్పటి వరకుపొందని స్థానాన్ని పొందుతాయని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు.
"జగ్జీవన్ రామ్ వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు తమ ఉత్పత్తుల కోసం భారత మార్కెట్లను తెరవాలని అమెరికా వ్యవసాయ లాబీ నుండి ఒత్తిడి ఉండేది. దశాబ్దాలుగా భారత్ తన వ్యవసాయ మార్కెట్‌ను తెరవాలని ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి కూడా ఒత్తిడిని ఎదుర్కొంటోంది" అని దేవేంద్ర శర్మ బీబీసీతో చెప్పారు.
"భారత ప్రభుత్వం ఇప్పటివరకు రైతుల ప్రయోజనాలను కాపాడిందన్నది నిజమే. కానీ ఈ ఒప్పందం ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్‌ను తెరిచిందని, ఇది అమెరికన్ గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో డబ్బు సరఫరా పెంచుతుందని అమెరికా వ్యవసాయ మంత్రి ఎందుకు చెప్పారో అర్థం కావడం లేదు" అని ఆయన అన్నారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య చర్చలు జరిగినప్పుడు అమెరికాకు భారత్ కొన్ని రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందని అందరూ భావించారు. ప్రభుత్వం కొన్ని నెలలుగా పత్తి దిగుమతులపై సుంకాలు తగ్గించడం వంటి నిర్ణయాలు తీసుకుంది.
"మధ్యంతర ఒప్పందంలో రెండు పక్షాలు అంగీకరించినట్లు భారత్ రాబోయే అమెరికా నుంచి 5 ఏళ్లలో 500 బిలియన్ డాలర్ల విలువైన దిగుమతులు చేసుకుంటుంది. ఎందుకంటే రెండు దేశాల మధ్య వాణిజ్య లోటు ఎక్కువగా ఉంది. ఇందులో భారత్ తప్పు ఏముంది?" అని దేవేంద్ర శర్మ ప్రశ్నించారు.
భారత్- అమెరికా మధ్య వ్యవసాయ వాణిజ్యం విలువ 8 బిలియన్ డాలర్లు. భారత్ బియ్యం, రొయ్యలు, సుగంధ ద్రవ్యాలను ఎగుమతి చేస్తుంది. గింజలు, యాపిల్స్, పప్పుధాన్యాల వంటివాటిని అమెరికా భారత్‌కు పంపిస్తుంది.
భారత్‌తో అమెరికా వ్యవసాయ వాణిజ్య 1.3 బిలియన్ డాలర్లు ఉంది. ఈ వాణిజ్య ఒప్పందం ఆ లోటును తగ్గిస్తుందని అమెరికా వ్యవసాయ కార్యదర్శి బ్రూక్ రోలిన్స్ చెప్పారు.
భారత్‌తో 45 బిలియన్ డాలర్ల వాణిజ్య లోటును తగ్గించుకోవడానికి, మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి ప్రధాన వ్యవసాయ ఎగుమతులకు భారత మార్కెట్లను అనుమతించాలని అమెరికా ఇప్పటికే డిమాండ్ చేస్తోంది.
దేవేంద్ర శర్మ దీన్ని తప్పుబడుతున్నారు.
"ఇది పరస్పర సుంకాలు విధించడం ఎలా అవుతుంది? ఒక వైపు సున్నా శాతం సుంకం ఉంటే మరో వైపు 18శాతం విధిస్తున్నారు. అమెరికా ప్రభుత్వం ప్రతి రైతుకు ఏడాదికి సగటున సుమారు రూ. 60 లక్షల విలువైన రాయితీలు ఇస్తుంది. భారత్‌లో ఈ రాయితీ రూ. 5,760. ఇదెలా న్యాయం" అని ఆయన ప్రశ్నించారు.

ఫొటో సోర్స్, Getty Images
పత్తి విషయంలో రెండు దేశాల తీరు ఎలా ఉంది?
పత్తిని ఉదాహరణగా తీసుకుంటే రెండు దేశాల రైతుల మధ్య పోటీలో సమాన స్థాయి ఎలా ఉండదో దేవేంద్ర శర్మ వివరించారు.
"అమెరికాలో పత్తిని పండించే రైతులు 8వేల మంది ఉన్నారు. భారత్‌లో 98 లక్షల మంది ఉన్నారు. అమెరికాలో పత్తి పండించే సగటు కమతం విస్తీర్ణం1500 ఎకరాలు. భారత్‌లో అది ఒకటి నుంచి 3 ఎకరాలు" అని ఆయన వివరించారు.
"అమెరికా ఏటా తన పత్తి రైతులకు సుమారు రూ. 90 లక్షలు సబ్సిడీ ఇస్తుంది. భారత్‌లో రైతులకు రూ.2500 సబ్సిడీ లభిస్తుంది. గతేడాది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలల్లో, అమెరికా నుంచి దిగుమతి అయ్యే పత్తిపై సుంకాన్ని భారత్ 11శాతం నుంచి సున్నా శాతానికి తగ్గించింది. ఈ 3 నెలల్లో 30 లక్షల బేళ్ల పత్తి దిగుమతి అయ్యింది. ఇది మనకు అవసరమైన దాని కంటే చాలా ఎక్కువ" అని దేవేంద్ర శర్మ చెప్పారు.
"అమెరికా నుంచి పత్తి భారీగా దిగుమతి కావడంతో మన దేశంలో పత్తి ధర వెయ్యి నుంచి రూ.1500 తగ్గింది. ఇది కేవలం 3నెలలకు సంబంధించిన వ్యవహారం. ఇదిలాగే కొనసాగితే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం కాదు" అని ఆయన విశ్లేషించారు.

ఫొటో సోర్స్, Getty Images
రైతు సంఘాల వాదనేంటి?
తాత్కాలిక వాణిజ్య ఒప్పందం విషయంలో వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వాదనను సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) తోసిపుచ్చింది. ఈ మేరకు శనివారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
''యూకే, న్యూజీలాండ్, యూరోపియన్ యూనియన్‌తో చేసుకున్న ఒప్పందాలలో పాల ఉత్పత్తులు ఇప్పటికే భాగం. ఇప్పుడు బయటకు వచ్చిన ఈ ఒప్పందం వాణిజ్య మంత్రి అబద్ధం చెబుతున్నారని నిరూపించింది'' అని ఎస్‌కేఎం ఆ ప్రకటనలో పేర్కొంది.
సంయుక్త కిసాన్ మోర్చా వాదన ప్రకారం...
- మొక్కజొన్నను డీడీజీ అంటే డిస్టిల్లర్స్ డ్రైడ్ గ్రెయిన్ గా జొన్నతోపాటు పశుగ్రాసంగా అమ్ముతారు. దీనివల్ల అమెరికన్ కంపెనీలకు పశుగ్రాసంపై మార్కెట్ గుత్తాధిపత్యం లభిస్తుంది.
- అమెరికా ఇప్పటికే మొక్కజొన్న, సోయాబీన్, పత్తి వంటి పంటలను భారతదేశానికి ఎగుమతి చేస్తోంది.
- అమెరికన్ గోధుమలను కిలోకు రూ.18.50 చొప్పున ఎగుమతి చేస్తున్నారు. దీనిని భారత మార్కెట్లలోకి రానిస్తే ఇక్కడి రైతులు నాశనమవుతారు.
- జన్యు మార్పిడి ఆహారం, జన్యు మార్పిడి విత్తనాలను ఉచితంగా దిగుమతి చేసుకోవానికి అనుమతించడం వల్ల సహజ సంతానోత్పత్తి దెబ్బతింటుంది. తృణధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజలకు కూడా హాని కలుగుతుంది.
- సోయాబీన్ నూనె దిగుమతికి లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇథనాల్ కూడా ఉచితంగా దిగుమతి అవుతుంది.
- అమెరికా 18% సుంకం విధించడం, భారతదేశం సుంకాలే లేకుండా చేయడం స్వేచ్ఛా వాణిజ్యం కాదు. 2023-24లో భారతదేశంపై సుంకాలను సున్నా నుండి 3%కి, ఆ తర్వాత 18%కి చేర్చారు. అయితే అమెరికా వ్యవసాయ ఉత్పత్తులపై 30% నుండి 150% వరకు ఉన్న మన సుంకాలను ఇప్పుడు సున్నాకి తగ్గించారు. ఇది భారత వ్యవసాయ మార్కెట్‌ను అమెరికా బహుళజాతి కంపెనీల ఉచ్చులో బంధిస్తుంది.
అమెరికాతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేయవద్దని సంయుక్త కిసాన్ మోర్చా ప్రధానమంత్రిని డిమాండ్ చేసింది. సంతకం చేస్తే దేశవ్యాప్తంగా నిరసనలు చేపడతామని హెచ్చరించింది.
ఫిబ్రవరి 12న కార్మిక సంఘాలు పిలుపునిచ్చిన సార్వత్రిక సమ్మెలో చేరాలని రైతులకు ఫోరం పిలుపునిచ్చింది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














