భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌లో 10 ముఖ్యాంశాలు ఏమిటి? ట్రంప్ ఏమన్నారు, భారత్ ఏం చెప్పింది?

ఫొటో సోర్స్, AFP via Getty Images
భారత్, అమెరికా అధికారికంగా మధ్యంతర వాణిజ్య ఒప్పందాన్ని ప్రకటించాయి. దీనిపై రెండు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి.
అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఫిబ్రవరి 2న భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ప్రకటన చేశారు. భారత్‌పై విధించిన 50 శాతం సుంకాన్ని 18 శాతానికి తగ్గిస్తున్నట్టు ప్రకటించారు. అప్పట్లో ఈ ఒప్పందంలోని పూర్తివివరాలు తెలియలేదు.
ఇప్పుడు ఉమ్మడి ప్రకటన విడుదల తర్వాత అనేక విషయాలపై స్పష్టత వచ్చింది.
భారత వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఈ ఒప్పందంపై ఒక ప్రకటన విడుదల చేశారు.
ఒప్పందం భారతీయ ఎగుమతిదారులకు, ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, రైతులు, మత్స్యకారులకు 30 ట్రిలియన్ డాలర్ల విలువైన మార్కెట్‌ను అందుబాటులోకి తెస్తుందని ఆ ప్రకటనలో పీయూష్ గోయల్ పేర్కొన్నారు


ఫొటో సోర్స్, AFP via Getty Images
ట్రంప్ ఏం చెప్పారంటే...
"రష్యా నుంచి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా చమురు దిగుమతిని నిలిపివేయడానికి భారతదేశం కట్టుబడి ఉంది. అమెరికా నుంచి ఇంధన ఉత్పత్తులను కొనుగోలు చేస్తామని భారత్ తెలిపింది. దీంతో పాటు, రాబోయే పదేళ్లలో రక్షణరంగంలో సహకారాన్ని పెంచుకోడానికి అమెరికాతో ఒక ఒప్పందానికి అంగీకరించింది" అని వైట్ హౌస్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులో ట్రంప్ చెప్పారు.
భారత్ నుంచి దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు అమెరికా ప్రకటించింది. ఇది 18శాతానికి తగ్గనుంది.
భారత కాలమానం ప్రకారం ఈ ఉదయం(ఫిబ్రవరి 7)10.30గంటల నుంచి ఇది అమల్లోకి వచ్చింది.
మధ్యంతర వాణిజ్య ఒప్పందం కోసం కొన్ని షరతులతో ఒక ఫ్రేమ్‌వర్క్ ఖరారయిందైని వైట్‌హౌస్ తెలిపింది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
మధ్యంతర ఒప్పందంలో కీలకవిషయాలు
- అమెరికా అన్ని టెక్ ఉత్పత్తులు, అనేక వ్యవసాయ ఉత్పత్తులపై భారత్ సుంకాలను తొలగిస్తుంది లేదా తగ్గిస్తుంది. వీటిలో మద్యం తయారీ తర్వాత ఎండబెట్టిన ధాన్యం మిగులుపదార్థాలు, పశుగ్రాసానికి ఉపయోగించే ఎర్ర జొన్న, కొన్ని రకాల విత్తనాలు, తాజా,ప్రాసెస్ చేసిన పండ్లు, సోయాబీన్ నూనె, వైన్, స్పిరిట్స్, ఇతర ఉత్పత్తులు ఉన్నాయి.
- భారత్ కొనుగోళ్లలో అమెరికా ఇంధన ఉత్పత్తులు, విమానాలు, విమాన విడి భాగాలు, విలువైన లోహాలు, సాంకేతిక ఉత్పత్తులు, బొగ్గు ఉంటాయి. డేటా సెంటర్ల కోసం అధునాతన చిప్‌లతో సహా రెండు దేశాల మధ్య సాంకేతిక ఉత్పత్తుల్లో కూడా వాణిజ్యం పెరుగుతుందని భావిస్తున్నారు.
- అయితే, భారత్ పెట్టుబడి ఒప్పందంపై స్పష్టత లేదు. ఐదేళ్లలో 500 బిలియన్ డాలర్ల కొనుగోళ్లు జరుగుతాయి. డేటా సెంటర్లు, ఎనర్జీ వంటి రంగాలతో పాటు ఇప్పటికే ఉన్న ప్రాజెక్టుల్లో ఈ కొనుగోళ్లు ఉంటాయి.
- భారత్ వస్త్రాలు, తోలు, చెప్పులు, ప్లాస్టిక్, రబ్బరు, సేంద్రీయ రసాయనాలు, గృహాలంకరణ, చేతివృత్తుల ఉత్పత్తులపై అమెరికా సుంకాలు 18 శాతం లోపు ఉంటాయి.
- జనరిక్ మందులు, రత్నాలు, వజ్రాలు, విమాన భాగాలు సహా అనేక వస్తువులపై అమెరికా సుంకాలను తొలగిస్తుంది.
- ఫార్మా, దాని ముడి పదార్థాలపై సెక్షన్ 232 దర్యాప్తు ఫలితాల ఆధారంగా, జనరిక్ ఔషధాల విషయంలో భారత్‌కు నిర్దిష్ట షరతులతో ప్రయోజనం అందుతుంది.
- భారత్, అమెరికా తమ ప్రయోజనాలకు సంబంధించిన రంగాల్లో ఒకదానికొకటి శాశ్వత ప్రాతిపదికన ప్రాధాన్యతా మార్కెట్ ప్రవేశం కల్పించేందుకు కట్టుబడి ఉన్నాయి.
- ఒప్పందం ప్రయోజనాలు ప్రధానంగా అమెరికా, భారత్‌కు అందేలా రెండు దేశాలు 'రూల్స్ ఆఫ్ ఆరిజన్'(మూల నిబంధనలు)నిర్ణయిస్తాయి.
- ద్వైపాక్షిక వాణిజ్యాన్ని ప్రభావితం చేసే సుంకేతర అడ్డంకులను అమెరికా, భారత్ తొలగిస్తాయి. అమెరికా వైద్య పరికరాల వాణిజ్యంపై దీర్ఘకాలికంగా ఉన్న అడ్డంకులను తొలగించడానికి భారత్ అంగీకరించింది. సమాచారం, కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించిన అమెరికా ఉత్పత్తుల మార్కెట్ ప్రవేశాన్ని ఆలస్యం చేసే లేదా పరిమితం చేసే దిగుమతి లైసెన్సింగ్ విధానాలను భారతదేశం తొలగిస్తుంది.
- మార్కెట్ ప్రవేశాన్ని మరింత విస్తరించడానికి అమెరికా, భారతదేశం చర్చల ద్వారా కృషి చేస్తాయని కూడా ఆ ప్రకటన పేర్కొంది.

ఫొటో సోర్స్, AFP via Getty Images
‘‘ రైతులకు వ్యతిరేకం’’
భారతీయ ఉత్పత్తులపై సుంకాలను తగ్గించాలనే డిమాండ్‌ను చర్చల సమయంలో పరిశీలిస్తామని అమెరికా తెలిపింది.
సరఫరా గొలుసును బలోపేతం చేయడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, ఆర్థిక భద్రతా సమన్వయాన్ని పెంచడానికి రెండు దేశాలు అంగీకరించాయి.
ఇందులో మూడో పక్షం నాన్-మార్కెట్ విధానాలను ఎదుర్కొనే చర్యలు, పెట్టుబడుల సమీక్షలో సహకారం, ఎగుమతి నియంత్రణలపై సమన్వయం కూడా ఉంటాయి.
బలమైన, ఆశావహమైన, పరస్పరం ప్రయోజనకరమైన డిజిటల్ వాణిజ్య నియమాలకు రెండు దేశాలు స్పష్టమైన మార్గాన్ని నిర్దేశిస్తాయి.
భారత్, అమెరికా ఈ ఫ్రేమ్‌వర్క్‌ను త్వరితగతిన అమలు చేస్తాయి. రోడ్ మ్యాప్ ప్రకారం పరస్పరం ప్రయోజనకరమైన ద్వైపాక్షిక ఒప్పందాన్ని పూర్తిచేసేలా ఒక మధ్యంతర ఒప్పందాన్ని ఖరారు చేయడానికి కృషి చేస్తాయి.
ఈ ఒప్పందం భారతదేశం, యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన చారిత్రక ఎఫ్‌టీఏ తర్వాత ఖరారయింది. దీని కింద రెండుపక్షాలూ దిగుమతులపై సుంకాలను కొన్నేళ్ల వ్యవధిలో దాదాపు సున్నాకి తగ్గించడానికి అంగీకరించాయి.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం భారత రైతులకు వ్యతిరేకమని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.
"ఈ ఒప్పందం రైతుల ప్రయోజనాలను కాపాడటానికి, గ్రామీణ జీవనోపాధిని నిలబెట్టడానికి భారత్ సంకల్పాన్ని కూడా తెలియజేస్తుంది. కీలక వ్యవసాయ, పాల ఉత్పత్తులకు ఈ ఒప్పందం కింద పూర్తిగా రక్షణ లభించింది. వీటిలో మొక్కజొన్న, గోధుమ, బియ్యం, సోయా, పౌల్ట్రీ, పాలు, జున్ను, ఇథనాల్ ఇంధనం, పొగాకు, కొన్ని కూరగాయలు, మాంసం వంటి ఉత్పత్తులు ఉన్నాయి" అని పీయూష్ గోయల్ చెప్పారు.
మరోవైపు 'వ్యవసాయ ఉత్పత్తులపై సుంకాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి భారత్ కట్టుబడి ఉందని, దీర్ఘకాలంగా ఉన్న నాన్-టారిఫ్ అడ్డంకులను తొలగిస్తామని హామీ ఇచ్చింది' అని అమెరికా ట్రేడ్ రిప్రజెంటేటివ్ 'ఎక్స్'లో విడుదల చేసిన ప్రకటన పేర్కొంది.
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














