కొడుకు చనిపోయాడనుకుని అంత్యక్రియలు చేశారు.. కానీ ‘అమ్మా నే బతికా ఉన్నా’ అంటూ కొడుకు నుంచి ఫోనొచ్చింది

రష్యా, యుక్రెయిన్, యుద్ధం, ఖైదీల విడుదల
ఫొటో క్యాప్షన్, యుద్ధంలో చనిపోయాడని భావించిన తన కుమారుడు ఫోన్ చేయడంతో భావోద్వేగానికి గురైన నటాలియా
    • రచయిత, సారా రెయిన్స్‌ఫోర్డ్
    • హోదా, ఈస్ట్రన్ యూరోపియన్ కరస్పాండెంట్
    • నుంచి, కీయేవ్
  • చదివే సమయం: 5 నిమిషాలు

యుద్ధభూమిలో తమ కుమారుడు చనిపోయాడని నాజర్ కుటుంబం భావించింది. 2023లో ఆయన మృతదేహానికి పశ్చిమ యుక్రెయిన్‌లోని ఓ గ్రామ స్మశానవాటికలో అంత్యక్రియలు కూడా నిర్వహించింది.

కానీ ఇటీవలే నాజర్ తన తల్లికి ఫోన్ చేశారు. ఆయన చాలా బలహీనంగా ఉన్నారు. అలసిపోయారు. కానీ ప్రాణాలతో జీవించి ఉన్నారు.

కిందటిసారి జరిగిన ఖైదీల మార్పిడిలో భాగంగా రష్యా వద్ద బందీగా ఉన్న నాజర్ కూడా విడుదలయ్యారు.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
రష్యా, యుక్రెయిన్, యుద్ధం, ఖైదీల విడుదల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా ఆక్రమణ మొదలయిన వెంటనే నాజర్ యుద్దానికి వెళ్లారు.

‘ఆ తల్లి సంతోషాన్ని ఊహించగలరా?’

''నా భావోద్వేగాలు చాలా బలమైనవి’’అని నాజర్ తల్లి నటాలియా బీబీసీతో చెప్పారు. ఆమె ఇంకా ఆ షాక్ నుంచి బయటపడలేదు.

నాజర్‌ నుంచి మొదటి ఫోన్ కాల్ రాగానే ఆ కుటుంబం అంతులేని సంతోషాన్ని అనుభవించిన క్షణాలన్నీ వీడియోలో రికార్డయ్యాయి.

'ఎలా ఉన్నావు? క్షేమంగా ఉన్నావా' ''బంగారు కొండా, నీ కోసం ఎంతోకాలం నుంచీ ఎదురుచూస్తున్నా'' అని కొడుకుతో మాట్లాడుతూ నటాలియా భావోద్వేగానికి గురయ్యారు. తల్లి ఫోన్ కాల్‌లో మాట్లాడుతున్నప్పుడు నాజర్ సోదరి రోక్సోలోనా పట్టరాని సంతోషంతో అరవడం,గంతులేయడం ఆ వీడియోలో కనిపిస్తోంది.

''చాలా ఆశ్చర్యకరమైన విషయం. నా కొడుకు చనిపోయాడనుకున్నా. వాడిని ఖననం చేశాం. కానీ ఇప్పుడు వాడి గొంతు వినిపిస్తోంది. ఓ తల్లిగా ఆ భావోద్వేగం ఎలా ఉంటుందో మీరు ఊహించగలరా? ఇప్పుడు ఎంత సంతోషంగా ఉందో. కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా'' అని నటాలియా చెప్పారు.

రష్యా, యుక్రెయిన్, యుద్ధం, ఖైదీల విడుదల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజర్ రష్యా దగ్గర బందీగా ఉన్నారని మొదట చెప్పారు.

‘రష్యా దగ్గర బందీగా ఉన్నారు’

యుద్ధంలో ఉన్న దేశంలో శుభవార్తలే అరుదైపోయినవేళ చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగి రావడమనే నాజర్ ఉదంతం అసాధారణమైనదే.

రష్యా 2022లో పూర్తిస్థాయి ఆక్రమణ ప్రారంభించినప్పుడు 42ఏళ్ల వయసులో ఉన్న నాజర్ నేరుగా యుద్ధరంగంలోకి వెళ్లారు. 2014లో ఆయన యుద్ధంలో పాల్గొన్నారు. ఆయనకు పోరాట అనుభవం ఉంది.

''ఆయనకు ఎలాంటి సందేహాలు లేవు. తక్షణమే వెళ్లిపోయారు''అని నాజర్ సోదరి రోక్సోలోనా బీబీసీతో చెప్పారు. ఆ ఏడాది మేలో యుద్ధభూమిలో నాజర్ కనిపించకుండాపోయారు.

రష్యాభాషలో మాట్లాడుతున్న ఓ వ్యక్తి నుంచి నాజర్ తల్లికి ఫోన్ వచ్చింది. నాజర్‌ బందీగా ఉన్నారని చెప్పారు. ''అంతా బానే వుంటుంది''అని ఆ వ్యక్తి చెప్పారు. కానీ, నాజర్ ఎక్కడున్నారో, ఆయన్ను ఎవరు పట్టుకున్నారో ఫోన్ చేసిన ఆ రహస్య వ్యక్తి చెప్పలేదు.

నాజర్‌కు గాయాలేమైనా అయ్యాయా అనేదానిపైనా సమాచారం లేదు. ఆ వ్యక్తి చెప్పినమాటలు నమ్మాలో వద్దో నాజర్ కుటుంబానికి అర్ధం కాలేదు. వారికి అధికారిక సమాచారం లేదు.

రష్యా, యుక్రెయిన్, యుద్ధం, ఖైదీల విడుదల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బస్సులో గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహాన్ని నాజర్‌దిగా భావించి ఆయన తల్లికి అప్పగించారు.

గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన మృతదేహం

ఆ తర్వాత ఏడాదికి ఈశాన్య యుక్రెయిన్‌లోని మోర్గ్‌లో ఓ మృతదేహాన్ని గుర్తించామని నటాలియాకు సమాచారమందింది. నటాలియా ఇచ్చిన డీఎన్ఏ ఆధారంగా మృతదేహాన్ని గుర్తించామని తెలిపారు.

''శరీరం బాగా కాలిపోయింది. పూర్తిగా దగ్థమైన బస్సులో అలాంటి మృతదేహాలు చాలా ఉన్నాయి. కనిపించకుండాపోయిన సైనికుల జాబితాలను పరిశీలిస్తుండగా, ఆ సమాచారం సరిపోలింది'' అని రోక్సోలానా చెప్పారు.

''ఈ మృతదేహం నాజర్‌దిగా గుర్తించారు''. దీంతో మృతదేహాన్ని తీసుకున్న కుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది.

గత సెప్టెంబరులో వారందరికీ దిగ్భ్రాంతి కలిగించే వార్త తెలిసింది.

రష్యా విడుదల చేసిన ఓ సైనికుడు వారికి ఫోన్ చేసి నాజర్ బతికే ఉన్నాడని చెప్పారు. జైలులో ఆయన్ను చూశామన్నారు.

''మేం ఆశ్చర్యపోయాం. నమ్మలేకపోయాం. కానీ ఆయనెందుకు అబద్ధం చెబుతారు'' అని రోక్సోలానా అప్పటి తమ భావాలను గుర్తుతెచ్చుకున్నారు.

అయినప్పటికీ నాజర్‌తో మాట్లాడకుండా, ఆయన్ను చూడకుండా పూర్తిగా నమ్మలేం అనుకున్నారు.

రష్యా, యుక్రెయిన్, యుద్ధం, ఖైదీల విడుదల

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాజర్ రాక కోసం ఆయన కుటుంబం ఎదురుచూస్తోంది

‘అమ్మా నే బతికే ఉన్నా’

యుక్రెయిన్‌కు తిరిగొచ్చిన నాజర్ తన కుటుంబానికి ఫోన్ చేశారు. ఇప్పటికి ఆయన కనిపించకుండా పోయి మూడుసంవత్సరాల 9 నెలలైంది.

నాజర్‌ను కలిసేందుకు ఆయన కుటుంబం ఆతృతగా ఎదురుచూస్తోంది. నాజర్ బాధపడకుండా, ఆయన అంత్యక్రియలకు సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియా నుంచి తొలగించేందుకు ఆయన కుటుంబం ప్రయత్నిస్తోంది.

తమ గ్రామం నుంచి యుద్ధంలో పాల్గొని వీరమరణం పొందినవారి ఫోటోలతో పెట్టిన ప్రదర్శన నుంచి నాజర్ ఫోటోను తీసివేశారు.

ఇంత పెద్ద తప్పిదం ఎలా జరిగిందో గుర్తించేందుకు ఇప్పుడు దర్యాప్తు సాగుతోంది. కానీ నాజర్ కుటుంబానికి ఇప్పుడీ విషయంపై దృష్టి లేదు.

నటాలియా, నాజర్‌కు ఇష్టమైన వంటలు చేయడంలో మునిగిపోయారు. నాజర్ కొంచెం కోలుకుని ఇంటికి తిరిగి రావడం కోసం వారంతా ఎదురుచూస్తున్నారు.

''మాలాగే ఇలాంటి మంచి వార్తలు మరిన్ని కుటుంబాలకు అందాలని, వాళ్లు ఇళ్లకు తిరిగిరావాలని కోరుకుంటున్నా'' అని రోక్సోలానా చెప్పారు.

అధికారిక లెక్కల ప్రకారం ఈ ప్రాంతం నుంచి దాదాపు 70వేలమంది కనిపించకుండా పోయారు. వాళ్లల్లో ఎక్కువమంది సైనికులేనని భావిస్తారు. వారిలో కొందరు యుద్ధరంగంలో చనిపోయి ఉండొచ్చు. వారి మృతదేహాలను వెలికితీయడం సాధ్యం కాకపోవచ్చు.

చాలామందిని ఖైదీలుగా తీసుకెళ్లారు. వారి కుటుంబాలకు నాజర్ కథ కొంచెం ఆశ కలిగిస్తోంది.

‘‘తమవాళ్లు మిస్ అయి బాధపడుతున్నవారందరికీ ఇలాంటి ఫోన్ కాల్స్ రావాలని కోరుకుంటున్నా’’ అని నటాలియా చెప్పారు.

''నేనిప్పుడేమీ ఆలోచించడం లేదు. మా అబ్బాయిని గట్టిగా హత్తుకునేందుకు ఎదురుచూస్తున్నా. నాకు వాడంటే చాలా ఇష్టం''

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)