భారత్ - అమెరికా డీల్: సమాధానం దొరకని 3 కీలక ప్రశ్నలు ఇవే..

భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, IM WATSON/AFP via Getty Images

చదివే సమయం: 7 నిమిషాలు

కొంతకాలంగా రెండు దేశాల మధ్య సంబంధాలు అంతంతమాత్రంగానే ఉన్న నేపథ్యంలో, ఇకపై సంబంధాలు మెరుగుపడే అవకాశాలు ఉన్నాయన్న ఆశలను భారత్-అమెరికా ట్రేడ్ డీల్ ఒప్పందం ప్రకటన రేకెత్తించింది.

కానీ, ఒప్పందానికి సంబంధించిన నిబంధనలు, కాలపరిమితి గురించి పెద్దగా సమాచారం వెల్లడికాలేదు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందంపై చివరి రౌండ్ చర్చల్లో అన్ని విషయాలను ఖరారు చేస్తున్నామని భారత వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ మంగళవారం ( ఫిబ్రవరి 3) సాయంత్రం తెలిపారు.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఈ ఒప్పందంపై సోషల్ మీడియాలో పోస్టు చేసిన అనేక విషయాలపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ లేదా భారత ప్రభుత్వం నుంచి స్పష్టమైన స్పందన లేదు.

దీంతో, ఈ ఒప్పందం సమాధానాలు దొరకని కొన్ని కీలక ప్రశ్నలను మన ముందుంచుతోంది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రష్యా నుంచి చమురు కొనడం నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ చెబుతున్నారు.
భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

రష్యా నుంచి చమురు కొనడం ఆపేసి, అమెరికా నుంచి చమురు కొనుగోళ్లు పెంచేందుకు భారత్ అంగీకరించిందని అధ్యక్షుడు ట్రంప్ పేర్కొన్నారు. వెనెజ్వెలా నుంచి కూడా భారత్ చమురు కొనుగోలు చేయవచ్చని కూడా ఆయన సూచించారు.

అయితే, ట్రంప్ చేసిన ఈ ప్రకటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పష్టమైన సమాచారం రాలేదు. అంటే, ఇది కేవలం రాజకీయ వాక్చాతుర్యమేనా?

అమెరికా చాలా చెప్పినప్పటికీ, భారత ప్రభుత్వం ఈ విషయంలో మౌనం వహించిందని ప్రఖ్యాత ఆర్థికవేత్త, ప్రొఫెసర్ విశ్వజీత్ ధర్ అన్నారు.

"మా ఇంధన భద్రతను మేమే నిర్ణయించుకుంటామనేది మన ప్రభుత్వ అధికారిక వైఖరి. రష్యా నుంచి చౌకగా చమురు లభిస్తే, అక్కడి నుంచే కొనుగోలు చేస్తామని అది స్పష్టంగా చెబుతోంది. మన ప్రభుత్వం సార్వభౌమ దేశ దృక్పథాన్ని స్పష్టంగా పేర్కొంది. అయితే, ఇప్పుడు రష్యా నుంచి భారత్ చమురు కొనబోదని చెప్పడం భారత ప్రభుత్వం గతంలో అనుసరించిన వైఖరికి విరుద్ధంగా ఉంది. దీనర్థం ఇంధన భద్రతను ఎలా సాధించాలో అమెరికా మనకు నిర్దేశిస్తోంది. నా అభిప్రాయం ప్రకారం ఇది ఒక పెద్ద రాజీ."

"భారత్ నుంచి అధికారికంగా ఇంకా ఎలాంటి తిరస్కరణ రాలేదు. ట్రంప్ చెప్పినది సరైనది కాదని, ఈ విషయంలో మా అభిప్రాయం వేరని భారత ప్రభుత్వం చెప్పే వరకు ఇలాగే అనుకోవాలి. అది జరిగే వరకు, అధ్యక్షుడు ట్రంప్ చెప్పిన విషయం నిజమనే అభిప్రాయమే ఉంటుంది" అని ధర్ విశ్లేషించారు.

మోహన్ కుమార్ ఫ్రాన్స్‌లో భారత రాయబారిగా పనిచేశారు. ఆయన ఏమంటారంటే... "ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా బహిర్గతం కాలేదు. ఈ సమయంలో దానిపై వ్యాఖ్యానించడం కష్టం. ఏ నిర్ణయాలు తీసుకున్నారో డాక్యుమెంట్లు చూడకుండా చెప్పడం కష్టం. కొంత అధికారిక సమాచారం ఉండాలి. దాని ఆధారంగా తదుపరి చర్చలు జరగవచ్చు. నాకు తెలిసినంతవరకు భారత్ ఇప్పటికే రష్యా నుంచి చమురు కొనుగోలును గణనీయంగా తగ్గించింది" అని ఆయన అన్నారు.

మోహన్ కుమార్ అంతర్జాతీయ వాణిజ్య సంబంధాలు, బహుపాక్షిక చర్చల రంగంలో నిపుణులు.

భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా నుంచి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు కొంటుందని ట్రంప్ తెలిపారు.
భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ట్రంప్ పేర్కొన్న మరో విషయమేంటంటే.. అమెరికా నుంచి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన ఇంధనం, సాంకేతికత, వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయనుంది.

అసలు వాస్తవమేంటంటే.. ప్రస్తుతం అమెరికా నుంచి భారత్ ఏటా చేసుకునే మొత్తం దిగుమతులు 50 బిలియన్ డాలర్ల కంటే తక్కువ. 500 బిలియన్ డాలర్ల స్థాయికి చేరుకోవడానికి దశాబ్దాలు పట్టవచ్చు. అంటే, ట్రంప్ చేసిన ఈ ప్రకటన నిరాధారమేనా?

అమెరికా నుంచి వ్యవసాయ ఉత్పత్తులను భారత్ దిగుమతి చేసుకుంటుందని అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన చాలా కీలకమని ప్రొఫెసర్ విశ్వజీత్ ధర్ అన్నారు.

"మన రైతుల ప్రయోజనాల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని ఆగస్టు 15న ప్రధాన మంత్రి స్పష్టంగా చెప్పారు. అమెరికా కంపెనీలు వ్యవసాయ మార్కెట్‌పై ఆధిపత్యం చేయలేవని, దేశంలోని చిన్న రైతుల జీవనోపాధి సురక్షితంగా ఉంటుందని, ఇది దేశంలో అతిపెద్దదైన వ్యవసాయం రంగానికి ఉపశమనంగా భావించారు."

"ఇది మన దేశ ఆహార భద్రతకు సంబంధించి కూడా. 1960లలో మనం అమెరికా దిగుమతులపై ఆధారపడేవాళ్లం. దీంతో అమెరికా మనపై ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నించేది. ఆ పరిస్థితుల నుంచి ఇప్పుడు స్వావలంబన కలిగి ఉన్నామని గర్వంగా చెప్పుకునే స్థాయికి చేరుకున్నాం. ఇప్పుడు ఆ స్వావలంబనకు ముప్పు ఎదురుకానున్నట్లు కనిపిస్తోంది''

'' అమెరికా వ్యవసాయ కార్యదర్శి చెప్పిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. 'మేం భారత్‌కు ఎగుమతులు చేస్తాం. మా(అమెరికా) రైతులు వాటి నుంచి భారీ ప్రయోజనాలను పొందుతారు' అని ఆయన అన్నారు. ఇది ఆయన అధికారికంగా మాట్లాడారు.

దేశానికి కీలకమైన వ్యవసాయం, ఇంధన రంగాల్లో అమెరికా దిగుమతులపై మనం ఆధారపడడమంటూ జరిగితే.. గతంలో మనం తిరస్కరించిన, రాజీ పడబోమని చెప్పిన, అవి మన సార్వభౌమ నిర్ణయాలుగా ఉంటాయని చెప్పినప్పటికీ అలాంటి ఒప్పందం ఒక ద్రోహం కావొచ్చని ఆందోళన చెందుతున్నా" అని ధర్ విశ్లేషించారు.

"భారత్ - అమెరికా ఒప్పందంలో వ్యవసాయం, పాడి పరిశ్రమ వంటి సున్నితమైన రంగాలకు ఎలాంటి సమస్యలూ లేవు" అని పీయూష్ గోయల్ మంగళవారం(ఫిబ్రవరి 3) అన్నారు.

చివరిగా, ఏకాభిప్రాయం కుదిరిన వెంటనే అన్ని వివరాలను వెల్లడిస్తామని గోయల్ చెప్పారు.

భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Press Information Bureau (PIB)/Anadolu via Getty Images

ఫొటో క్యాప్షన్, ట్రంప్ ప్రకటనలోని కొన్ని అంశాలపై భారత్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

అమెరికా నుంచి భారత్ 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయా?

దీనికి సమాధానం అర్థం చేసుకోవాలంటే, ముందుగా ప్రపంచం మొత్తాన్ని పరిశీలించాలని మోహన్ కుమార్ అంటున్నారు.

"మనం ఇప్పటికే కొనుగోలు చేస్తున్న వస్తువులకు ఇది వర్తిస్తుందా? దాని కాలపరిమితి ఏంటి? అలా "ముందుకు వెళ్తాం" అనే పదాన్ని ఉపయోగించారని నేను అనుకుంటున్నాను. అంటే, ఇది చాలా కాలం పాటు సాగుతుంది. ఏ కాలపరిమితికి ఇరుపక్షాలు అంగీకరిస్తాయో చూడాలి" అని మోహన్ కుమార్ అభిప్రాయపడ్డారు.

తన ప్రకటనలు లేదా వ్యాఖ్యలపై ట్రంప్ వెనక్కి తగ్గిన సందర్భాలు గతంలో చాలా ఉన్నాయి. భారత్‌తో ఒప్పందంపై ఆయన మాటలు కూడా అలాగే అయ్యే అవకాశముందా?

ఇంధనం, వ్యవసాయం రెండూ అధ్యక్షుడు ట్రంప్‌కు కీలక అంశాలని ప్రొఫెసర్ ధర్ అంటున్నారు.

"రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం ద్వారా యుక్రెయిన్ యుద్ధానికి నిధులు సమకూర్చవద్దని భారత్‌కు అమెరికా చెబుతోంది. ఇది ట్రంప్‌కు రాజకీయంగా ముఖ్యమైనది. రెండోది వ్యవసాయం. 2024లో మొత్తం వ్యవసాయ లాబీ ట్రంప్‌కు అత్యధికంగా ఓటు వేసింది. అమెరికాలోని వ్యవసాయ రాష్ట్రాల్లో 70 శాతానికి పైగా ఓట్లు ట్రంప్‌కు పడ్డాయి. పెద్ద దేశాలైన భారత్, చైనాలతో పెద్ద వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటానని, మీరు నాకు ఓటు వేయాలని ట్రంప్ కోరడంతో అమెరికా ప్రజలు ఓట్లేశారు.''

''కాబట్టి, ట్రంప్‌కు రాజకీయ నిబద్ధత ఉంది. ఆయన ఇవన్నీ చెప్పి.. అవి జరగకపోతే ఆయనకు రాజకీయంగా మంచిది కాదు. చాలా నష్టం కలిగిస్తుంది. అందుకే నేను చెబుతున్నా.. 500 బిలియన్ డాలర్ల విలువైన వస్తువులను భారత్ దిగుమతి చేసుకుంటుందని ఆయన తేలిగ్గా అనలేరు. ఎందుకంటే, ఈ ప్రకటన తప్పని తేలితే రాజకీయ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి"అని ధర్ విశ్లేషించారు.

భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారత్, అమెరికా ట్రేడ్ డీల్‌పై పూర్తి సమాచారం బయటకు రాలేదు.
భారత్, రష్యా, అమెరికా, మోదీ, ట్రంప్, చమురు, వ్యవసాయ ఉత్పత్తులు

అమెరికా ఉత్పత్తులపై భారత్ అన్ని సుంకాలను 'సున్నా'కి తగ్గిస్తుందని కూడా ట్రంప్ అన్నారు.

కానీ, భారత్ ఇంకా ఏ అధికారిక ప్రకటనలోనూ దీని గురించి ప్రస్తావించలేదు. వ్యవసాయం, జన్యుమార్పిడి ఆహార ఉత్పత్తులు వంటివాటిలో విదేశీ దిగుమతులపై భారత్ సంప్రదాయకంగా జాగ్రత్తగా ఉంది. ఈ రంగాలలో మార్కెట్లను తెరిచే అవకాశాలు చాలా తక్కువ.

''అభివృద్ధి చెందిన దేశాలు అధిక సుంకాలు చెల్లించాలి, అభివృద్ధి చెందుతున్న దేశాలు తక్కువ సుంకాలు చెల్లించాలి అనేది గతంలో భారత్ వైఖరి" అని ప్రొఫెసర్ ధర్ అన్నారు. "ఇప్పుడు ఇది పూర్తిగా తారుమారైంది. బహిరంగ ప్రకటనల ప్రకారం, అమెరికా ఎలాంటి సుంకాలు చెల్లించదు.''

"ట్రంప్ అధికారంలోకి రాకముందు, భారత ఉత్పత్తులపై సగటు సుంకం కేవలం 2.5 శాతం ఉండేది. కానీ, ఇప్పుడు 18 శాతానికి పెరిగింది. అమెరికాపై భారత్ విధించే సుంకం సున్నా అయితే, అది పూర్తిగా తారుమారైనట్లే. దీనివల్ల భారత్‌కు భారీ నష్టం. ఎంఎస్ఎమ్ఈల సామర్థ్యం తక్కువగా ఉన్నందున వాటికి మద్దతు ఇవ్వాల్సి ఉంటుందని మన ఆర్థిక మంత్రి కూడా అన్నారు. ఇప్పుడు మన మార్కెట్‌ను పూర్తిగా తెరిస్తే, ఎంఎస్ఎంఈలకు భారీ నష్టం కలుగుతుంది" అని ధర్ విశ్లేషించారు.

మోహన్ కుమార్ మాట్లాడుతూ, "ఇక్కడ రెండు విషయాలున్నాయి. ముందుగా, వారు ఏ ఉత్పత్తుల గురించి మాట్లాడుతున్నారు? ఇందులో సేవలు కూడా ఉన్నాయా? లేవా? అనేది చూడాలి. రెండోది, సున్నాకి తగ్గించడం అంటే ఏంటి? అది ఆరు నెలల్లోనా, లేక ఏడాది? ఐదేళ్లా, లేక పదేళ్లలోనా? అనే ప్రశ్నలకు సమాధానం కోసం మనం ఒప్పందం డాక్యుమెంట్లను పరిశీలించాల్సి ఉంటుంది.''

''రెండు దేశాల మధ్య ఒప్పందంపై పెద్దగా సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ 'ఇది చాలా ముఖ్యమైన ఒప్పందం. ప్రత్యేకించి యూరోపియన్ యూనియన్‌తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం తర్వాత ఇది చాలా త్వరగా కుదిరింది కాబట్టి'' అని మోహన్ కుమార్ అన్నారు.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)