‘హమాస్ లీడర్ యాహ్యా సిన్వార్‌ను చంపేశాం’ - ప్రకటించిన ఇజ్రాయెల్

Yahya Sinwar

ఫొటో సోర్స్, Getty Images

హమాస్ నేత యాహ్యా సిన్వార్‌ను హతమార్చినట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి ఇజ్రాయెల్ కట్జ్ కొన్ని దేశాల విదేశీ వ్యవహారాల మంత్రులకు సమాచారం అందించారు.

ఇజ్రాయెల్ సైనికులు సిన్వార్‌ను హతమార్చారని ఆయన తెలిపారు.

ఇజ్రాయెల్‌పై 2023 అక్టోబర్ నాటి హమాస్ భీకర దాడుల వెనుక ఉన్న మాస్టర్ మైండ్ సిన్వార్ అని.. ఆయన్ను హతమార్చడం ఇజ్రాయెల్‌కు నైతిక, సైనిక విజయం అని అన్నారు.

మరోవైపు సిన్వార్‌ను చంపినందుకు ఇజ్రాయెల్ సైనికులను ఆ దేశ అధ్యక్షుడు ఇసాక్ హెర్జాగ్ ప్రశంసించారు.

ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) కూడా దీనిపై ఒక ప్రకటన విడుదల చేసింది. గాజా దక్షిణ ప్రాంతంలో బుధవారం ఇజ్రాయెల్ బలగాలు జరిపిన ఒక ఆపరేషన్‌లో సిన్వార్ చనిపోయారని ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఐడీఎఫ్‌లోని 828 బ్రిగేడ్‌కు చెందిన సైనికులు దక్షిణ గాజాలో ముగ్గురు ‘టెర్రరిస్ట్’లను హతమార్చారని.. అందులో సిన్వార్ కూడా ఉన్నారని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

డెంటల్ రికార్డ్స్, వేలిముద్రల ఆధారంగా చనిపోయింది సిన్వారే అని ధ్రువీకరించుకున్నట్లు ఇజ్రాయెల్ పోలీసులు చెప్పారు.

‘మా శత్రువులు ఎక్కడా దాక్కోలేరు, వెతికి చంపుతాం’

గాజాలో జరిగిన దాడిలో హమాస్ లీడర్ యాహ్యా సిన్వార్ మరణించారని ఇజ్రాయెల్ ప్రకటించడానికి ముందే ఆ దేశ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు.

"మా శత్రువులు ఎక్కడా దాక్కోలేరు, మేం వారిని చంపుతాం" అని ఆయన ఆ పోస్ట్‌లో రాశారు.

అప్పటికే సిన్వార్ మృతి చెందారన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇజ్రాయెల్ అధికారులు, ఐడీఎఫ్‌కు చెందినవారు కూడా తాము హతమార్చిన ముగ్గురిలో సిన్వార్ ఉన్నారని అనుమానిస్తున్నట్లు చెప్పారు. ధ్రువీకరించుకునే ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

యాహ్యా సిన్వార్ 'బహుశా చనిపోయి ఉండవచ్చు' అని ఇజ్రాయెల్ అధికారులు పేర్కొన్నట్లు రాయిటర్స్ తెలిపింది.

సిన్వార్ చనిపోయి ఉండొచ్చని ఇజ్రాయెల్ సెక్యూరిటీ క్యాబినెట్ సభ్యులకు తెలియజేసినట్లు రాయిటర్స్‌తో ఇద్దరు ఇజ్రాయెల్ అధికారులు కూడా తెలిపారు. అనంతరం ఇజ్రాయెల్ నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

తొలుత అధికారులు ఏం చెప్పారంటే..

సిన్వార్ హత్యకు గురైనట్లు కొందరు ఇజ్రాయెల్ అధికారులు అక్కడి మీడియా 'చానల్ 12'కి తెలిపారు.

దాడిలో మరణించిన వారిలో ఒకరు యాహ్యా సిన్వార్ అవునా? కాదా అని నిర్ధరించడానికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఇజ్రాయెల్ భద్రతా అధికారిని ఉటంకిస్తూ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ తెలిపింది.

సిన్వార్ డీఎన్ఏ, ఇతర బయోమెట్రిక్ డేటాను ఇజ్రాయెల్ పరిశీలిస్తోంది, ఇది ఆయన జైలులో ఉన్న సమయంలో రికార్డ్ చేసి ఉంది.

హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, హమాస్ నాయకుడు యాహ్యా సిన్వార్ (ఫైల్)

రెండు నెలల ముందే పదవిలోకి..

హమాస్ అగ్రనేత ఇస్మాయిల్ హనియే హత్య తర్వాత ఆ గ్రూప్ తన పొలిటికల్ చీఫ్‌గా యాహ్యా సిన్వార్‌ను 2024 ఆగస్టులో ఎంచుకుంది.

సిన్వార్ ఎంపిక చాలామందిని ఆశ్చర్యపరిచింది. 2011లో ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ కోసం ఖైదీల మార్పిడిలో భాగంగా ఆయనను విడుదల చేశారు.

సిన్వార్ గురించి తెలిసిన వాళ్లు ఆయన ఏదో ఒక రోజు హమాస్‌కు నాయకత్వం వహిస్తారని భావించారు.

హమాస్ సాయుధ విభాగానికి సిన్వార్ అత్యంత సన్నిహితుడు. సిన్వార్ సోదరుడు మొహమ్మద్ హమాస్ అతిపెద్ద సైనిక బెటాలియన్‌కు నాయకత్వం వహిస్తున్నారు.

గత రెండు దశాబ్దాలుగా సాయుధ విభాగానికి నాయకత్వం వహించిన మొహమ్మద్ డేఫ్ ఇటీవల ఇజ్రాయెల్ చేతిలో హతమయ్యారు. సిన్వార్, డేఫ్‌లు స్నేహితులు, సహవిద్యార్థులు, పొరుగింటివారు.

ఇద్దరూ గాజాలోని ఖాన్ యూనిస్ శరణార్థి శిబిరంలోనే పెరిగారు.

( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)