పనామా పేపర్లు: మనీ లాండరింగ్ ఆరోపణలున్న 28 మందిని నిర్దోషులుగా తేల్చిన కోర్టు

ఫొటో సోర్స్, MARTIN BERNETTI/AFP via Getty Images
- రచయిత, అనా లామ్చే
- హోదా, బీబీసీ న్యూస్
పనామా పేపర్ల కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలున్న మొత్తం 28 మందిని పనామాకు చెందిన ఒక కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. ఏప్రిల్‌లో మొదలైన ఈ కేసు విచారణను ముగించింది.
ఈ రహస్య ఆర్థిక పత్రాలు 2016లో లీకయ్యాయి. ప్రపంచంలోని కొందరు సంపన్నులు, అత్యంత శక్తిమంతమైనవారు తమ సంపదను దాచుకోవడానికి ట్యాక్స్ హావెన్ల (పన్ను ఎగవేతదారులకు అనుకూలమైన ప్రాంతాలు)ను ఎలా వాడుకున్నారో ఈ పత్రాలు వెల్లడించాయి.
నిర్దోషులుగా ప్రకటించిన వారిలో జుర్గెన్ మొసాక్, దివంగత రామోన్ ఫోన్సెకా ఉన్నారు. ఈ కుంభకోణంలో కేంద్రంగా ఉన్న న్యాయ సంస్థ మొసాక్ ఫోన్సెకా వ్యవస్థాపకుడు రామోన్ ఫోన్సెకా. ఇప్పుడు ఈ న్యాయ సంస్థ పనిచేయడం లేదు.
అయితే, కోర్టుకు సమర్పించిన సాక్ష్యాలు.. ముద్దాయిలు నేరం చేశారని చెప్పడానికి సరిపోవట్లేదని న్యాయమూర్తి బలోసా మార్కినెజ్ అన్నారు.


ఫొటో సోర్స్, Getty Images
మనీ లాండరింగ్‌కు సంబంధించి మొసాక్, ఫోన్సెకాలకు గరిష్టంగా 12 ఏళ్ల జైలు శిక్ష విధించాలని విచారణ సందర్భంగా ప్రాసిక్యూషన్ వాదించింది.
అయితే, తాముగానీ, తమ సంస్థగానీ, తమ ఉద్యోగులుగానీ ఎలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు చేయలేదంటూ మొసాక్, ఫోన్సెకా ఖండించారు. మే నెలలో రామన్ ఫోన్సెకా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.
పనామా నగరంలో జరిగిన ఈ విచారణ 85 గంటల పాటు సాగింది.
విచారణ సందర్భంగా 27 మంది సాక్షుల వాంగ్మూలాలను, 50కి పైగా డాక్యుమెంటరీ సాక్ష్యాలను పరిగణించినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి.

ఫొటో సోర్స్, AFP/ GETTY IMAGES
మొసాక్ ఫోన్సెకా సర్వర్ల నుంచి సేకరించిన సాక్ష్యాలను న్యాయప్రక్రియకు అనుగుణంగా సేకరించలేదని న్యాయమూర్తి అన్నారు.
ముద్దాయిలపై ఉన్న నేరాభియోగాలను ఎత్తివేస్తున్నట్లు న్యాయమూర్తి తీర్పునిచ్చారు.
చరిత్రలోనే అతిపెద్ద డేటా లీక్ వ్యవహారం ఈ పనామా పేపర్ల ఉదంతం. ఈ వ్యవహారంలో 11 మిలియన్ల రహస్య పత్రాలను జర్మన్ వార్తాపత్రిక సూడిష్ జిటాంగ్‌తో పాటు అంతర్జాతీయ జర్నలిస్టుల బృందానికి లీక్ చేశారు.
మొసాక్ ఫోన్సెకా సంస్థ కంప్యూటర్ హ్యాక్ అయిందని, లీక్ అయిన సమాచారాన్ని తప్పుగా చిత్రీకరిస్తున్నారని 2017లో ఆ సంస్థ పేర్కొంది.
పనామా పేపర్ల లీక్ తరువాత బ్రిటన్ విదేశీ వ్యవహారాల మంత్రి డేవిడ్ కామెరాన్, యుక్రెయిన్ అధ్యక్షుడు జెలియన్‌స్కీ, అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ లయోనల్ మెస్సీ వ్యవహారాలు నిశిత పరిశీలనలోకి వచ్చాయి.
లీకయిన ఈ డేటా కొందరు నియంతలు సహా 12 మంది ప్రస్తుత/మాజీ దేశాధినేతల ఆర్థిక సంబంధాలను బయటపెట్టింది.
ఇవి కూడా చదవండి:
- లవ్ ట్యాక్స్: ప్రేమించి పెళ్లి చేసుకుంటే 'కుట్ర వరీ' కట్టాల్సిందే, లేదంటే గ్రామ బహిష్కరణ
- బ్రెయిన్: చనిపోతున్నప్పుడు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? ఆ చివరి క్షణాల గురించి న్యూరో సైంటిస్టులు ఏం చెబుతున్నారు?
- చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న స్కిల్ సెన్సస్ ఏంటి? ఇందులో ఏం చేస్తారు?
- రేవణ్ణ: కర్ణాటక రాజకీయాలను శాసించిన ఆ కుటుంబం 60 రోజుల్లో ఎలా పతనావస్థకు చేరిందంటే...
- మగ తోడు లేకుండానే 14 పిల్లలను కన్న పాము
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














