పిల్లల ఆయుష్షు పండుగ రోజే 37 మంది చిన్నారులు మృతి, ఏం జరిగింది?

బిహార్ జితియా పర్వ్ పిల్లల మృతి

ఫొటో సోర్స్, Vibhash Jha

ఫొటో క్యాప్షన్, బిహార్‌లో జితియా పర్వ్ రోజున 37 మంది పిల్లలు సహా 46 మంది మరణించారు
    • రచయిత, విభాష్ ఝా
    • హోదా, బీబీసీ కోసం

బిహార్, ఝార్ఖండ్, తూర్పు యూపీలోని అనేక ప్రాంతాలలో ప్రతి యేటా జితియా పర్వ్‌ను జరుపుకుంటారు. ఈ పండుగ పిల్లలకు దీర్ఘాయువును ఇస్తుందని విశ్వసిస్తారు.

అయితే ఈ సంవత్సరం ఈ పండుగను జరుపుకునే క్రమంలో, బిహార్‌లోని అనేక కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

సెప్టెంబరు 25న జితియా పర్వ్ సందర్భంగా, రాష్ట్రంలోని పలుచోట్ల 37 మంది పిల్లలు నీళ్లలో మునిగి మరణించారు.

బిహార్ ప్రభుత్వం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటన ‘‘జితియా పర్వ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా 46 మంది నీళ్లలో మునిగి మరణించారు. వీరిలో 37 మంది పిల్లలు, ఏడుగురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు" అని పేర్కొంది.

ఈ ఘటనలపై బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.4 లక్షల సాయం ప్రకటించారు.

అయితే ఒకేరోజు ఇంతమంది చిన్నారులు ఎలా చనిపోయారు, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రభుత్వం ఏం చేస్తోందన్నదే ప్రశ్న.

బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్
ఫొటో క్యాప్షన్, బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి
బిహార్

ఫొటో సోర్స్, Vibhash Jha

ఫొటో క్యాప్షన్, సెల్ ఫోన్‌లో కూతురు సోనాలి ఫోటోను చూసుకుంటున్న తండ్రి వీరేంద్ర యాదవ్

ఈ మరణాలు ఎలా జరిగాయి?

చనిపోయిన వారిలో బాలికల సంఖ్య ఎక్కువగా ఉంది. ఔరంగాబాద్‌లో 9 మంది బాలికలతో సహా 10 మంది మరణించారు.

ఔరంగాబాద్‌తో పాటు, పశ్చిమ చంపారన్, నలంద, కైమూర్, బక్సర్, సివాన్, రోహతాస్, సరన్, వైశాలి, ముజఫర్‌పూర్, సమస్తిపూర్, గోపాల్‌గంజ్, అర్వల్‌లలో ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి.

ఔరంగాబాద్‌లోని కుషహా గ్రామంలో దుకాణం నడుపుకునే వీరేంద్ర యాదవ్ ఎప్పటిలాగే సెప్టెంబర్ 25న మార్కెట్ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా, తమ గ్రామంలోని డ్యామ్‌లో మునిగి చాలామంది పిల్లలు చనిపోయారని ఎవరో చెప్పారు.

అయితే చనిపోయిన వాళ్లలో తన కూతురు కూడా ఉన్నట్టు ఆయనకు తెలియదు.

ఆయన ఇంటికి చేరాక తన కుమార్తె సోనాలి ఇక లేదని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం సదర్ ఆసుపత్రికి తరలించారని తెలిసింది.

అదే గ్రామానికి చెందిన అంకజ్ కుమార్, నీలం కుమారి, రాఖీకుమారి కూడా నీళ్లలో మునిగి మృతి చెందారు. వీళ్లంతా 15 ఏళ్ల లోపు పిల్లలే.

అంకజ్ తండ్రి ఉపేంద్ర యాదవ్ తన ఇంటికి దగ్గర్లోనే ఉన్న ఒక ఇంట్లో కూలీగా పని చేస్తున్నారు. చాలామంది చిన్నారులు నీళ్లలో చనిపోయారని తెలియడంతో ఆయన నది దగ్గరకు పరుగులు తీశారు. తన కొడుకు అంకజ్ కూడా నీటిలో మునిగి మృతి చెందినట్లు ఆయన గుర్తించారు.

బిహార్ చిన్నారులు

ఫొటో సోర్స్, Vibhash Jha

ఈ ప్రమాదానికి గల కారణాలను వివరిస్తూ చిత్తరంజన్ అనే వ్యక్తి, ‘‘కొద్ది నెలల క్రితం ఈ డ్యామ్‌ను 5 అడుగుల లోతు తవ్వారు. కానీ కొద్ది రోజుల క్రితం డ్యామ్ మధ్యలో 10 అడుగుల మేర లోపలికి తవ్వారు, ఈ విషయం ప్రజలకు తెలియదు’’ అని తెలిపారు.

అంటే డ్యామ్ ఒడ్డున ఐదు అడుగుల లోతు ఉంటే, అది ముందుకు వెళ్లేకొద్దీ అది 15 అడుగుల లోతుగా మారుతుందనీ, పిల్లలు ఈ లోతైన నీళ్లలో మునిగి చనిపోయారని చిత్తరంజన్ పేర్కొన్నారు.

ఈ మరణాలకు రాష్ట్ర చిన్న నీటి వనరుల శాఖే కారణమని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

‘‘దాని గేట్‌ను మూసేయమని ఇప్పటికే డిపార్ట్‌మెంట్ ఇంజనీర్‌ను అభ్యర్థించాం. కానీ ఎవరూ మా మాట వినలేదు’’ అన్నారు చిత్తరంజన్.

ఈ ఆరోపణలను చిన్న నీటి వనరుల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అశోక్ కుమార్ తోసిపుచ్చారు.

‘‘దీని లోతు కేవలం ఐదు నుంచి ఆరు అడుగుల వరకు మాత్రమే ఉంటుంది. లోతు ఎక్కువగా ఉందన్న స్థానికుల ఆరోపణ తప్పు. పెద్ద సంఖ్యలో పిల్లలు స్నానానికి వెళ్తుంటారు, దానిలో దూకుతుంటారు. తల్లిదండ్రులు తమ పిల్లలపై శ్రద్ధ పెట్టాలి’’ అని ఆయన అన్నారు.

బిహార్ ప్రమాదం

ఫొటో సోర్స్, Vibhash Jha

బిహార్ ప్రభుత్వంలో విపత్తు నిర్వహణ, చిన్న నీటి వనరుల మంత్రి సంతోష్ సుమన్ దీనిపై స్పందిస్తూ, "డ్యామ్‌లో లోతుగా తవ్వడం వల్లే పిల్లలు మునిగిపోయారని స్థానికులు అంటున్నారు. దీనిపై దర్యాప్తు చేయిస్తాం" అన్నారు.

తూర్పు చంపారన్‌లోని మోతిహారిలోని లక్ష్మీపూర్ గ్రామంలో ఇలా స్నానం చేస్తూ ముగ్గురు బాలికలు మరణించారు. ఈ ముగ్గురి వయస్సు 13 నుంచి 17 సంవత్సరాల మధ్య ఉంటుంది.

ఈ ముగ్గురు బాలికల్లో రీమా కూమారి ఒకరు. తన కూతురు జితియా పర్వ్ సందర్భంగా గ్రామంలోని మహిళలతో కలిసి చెరువులో స్నానానికి వెళ్లినట్లు ఆమె తండ్రి పరమానంద్ బైఠా తెలిపారు. లోతైన నీళ్లలోకి వెళ్లడంతో ఆమె మునిగిపోయిందని ఆయన అన్నారు.

వర్షం కారణంగా చెరువులో నీరు అధికంగా చేరడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బాధితుల కుటుంబ సభ్యులు భావిస్తున్నారు.

జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్

ఫొటో సోర్స్, ANI

ఫొటో క్యాప్షన్, జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్

మంత్రి ఏం చెప్పారు?

ఇన్ని ప్రమాదాలు వేర్వేరు చోట్ల, ఒకేసారి ఎలా జరిగాయి, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది?

దీనిపై రాష్ట్ర మంత్రి సంతోష్ సుమన్ స్పందించారు.

‘‘ఇలాంటి సంఘటనలు జరగకుండా బిహార్ ప్రభుత్వం ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రజలు తమ పిల్లలను కనీసం వర్షాలు లేదా వరద రోజుల్లోనైనా చెరువులు లేదా నదులకు దూరంగా ఉంచాలి. చెరువులన్నిటిలో స్నానాలకు సంబంధించి హెచ్చరికల బోర్డులు పెట్టాలనే నిబంధన ఉంది’’ అన్నారు.

"వరదలు వచ్చినప్పుడు నదులు, చెరువులు, వాగులలో నీటి మట్టం గణనీయంగా పెరుగుతుంది. దీనిని వార్తాపత్రికలలో ప్రకటిస్తాము. అలాగే, దీని కోసం అన్ని జిల్లాల ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు ఎలాంటి విపత్తునైనా ఎదుర్కోవడానికి డిపార్ట్‌మెంట్ మార్గదర్శకాలను అనుసరించాలి’’ అని బిహార్ ప్రభుత్వ విపత్తు నిర్వహణ విభాగంలో ఓఎస్‌డి‌గా పని చేస్తున్న అవినాష్ కుమార్ అన్నారు.

‘‘వరదలు, వర్షాల సమయంలో అధికారులు వివిధ ప్రాంతాల్లో బారికేడ్‌లు నిర్మించి, మైకుల ద్వారా ప్రజలను హెచ్చరిస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆదేశాలను పిల్లలు, పెద్దలు పాటించడం లేదు. అందుకే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తల్లిదండ్రులు తమ పిల్లలను ఒంటరిగా నదుల్లో, చెరువుల్లో స్నానానికి పంపవద్దు’’ అని జేడీయూ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ బీబీసీతో అన్నారు.

బిహార్‌లో ప్రతి సంవత్సరం వందలమంది ప్రజలు నీట మునిగి మరణిస్తున్నారని గణాంకాలు చెబుతున్నాయి. బిహార్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ డేటా ప్రకారం, జూన్-డిసెంబర్ 2018 మధ్య రాష్ట్రవ్యాప్తంగా 205 మంది నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు.

ఇలా మునిగిపోయి మరణించిన వాళ్ల సంఖ్య 2019లో 630కి, 2020లో 1060కి పెరిగింది. ఈ సంఖ్య 2021లో నవంబర్ 18 నాటికి 1206కి చేరింది.

అంటే 2018-2021 మధ్య మరణాల సంఖ్య దగ్గరదగ్గరగా ఆరు రెట్లు పెరిగింది.

(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్ రూమ్ ప్రచురణ)

(బీబీసీ తెలుగును వాట్సాప్‌,ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)