కర్నాటకలో ఆపరేషన్ లోటస్ 3.0: కాంగ్రెస్-జేడీఎస్ కొనసాగుతుందా.. బీజేపీ అధికారంలోకి వస్తుందా?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
కర్ణాటకలో జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు తమ మద్దతు ఉపసంహరించడంతో మరింత మంది ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అలా తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని భావిస్తున్నారు.
ఇటు బీజేపీ కూడా కాంగ్రెస్, జేడీఎస్ వలలో చిక్కకుండా తమ ఎమ్మెల్యేలను కాపాడుకునే పనిలో పడింది. అందరినీ హరియాణాలోని ప్రముఖ రిసార్టుకి తరలించింది.
మరోవైపు కాంగ్రెస్, జేడీఎస్ నుంచి 14 మంది ఎమ్మెల్యేలు ముంబయి హోటెల్లో ఉన్న అయిదుగురు ఎమ్మెల్యేలతో కలుస్తారని అందరూ ఎదురు చూస్తున్నారు.
ఈ ఎమ్మెల్యేలందరూ తమ పదవులకు రాజీనామా చేస్తే.. ఏం జరగొచ్చు.
కర్ణాటకలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయో చూద్దాం.

ఫొటో సోర్స్, Reuters
224 మంది సభ్యులున్న అసెంబ్లీలో ప్రస్తుతం పార్టీల బలాబలాలు చూద్దాం.
- జేడీఎస్+ 1 బీఎస్పీ - 38
- కాంగ్రెస్ - 80
- బీజేపీ-104
- ఖాళీ-02
- మ్యాజిక్ నంబర్ 112

ఫొటో సోర్స్, Getty Images
మొదటి పరిణామం
ముంబయి హోటల్లో ఉన్న ఐదుగురితోపాటు 14 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, కర్ణాటక అసెంబ్లీలో 222 సభ్యుల సంఖ్య 203కు తగ్గుతుంది. అప్పుడు, ఇద్దరు ఇండిపెండెంట్ల మద్దతుతో తాము ప్రభుత్వం ఏర్పాటు చేయగలమని బీజేపీ గవర్నర్ దగ్గరకు వెళ్లవచ్చు.
గవర్నర్ బలపరీక్ష కోరితే, బీజేపీ గెలుస్తుంది. ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది.

ఫొటో సోర్స్, Getty Images
రెండో పరిణామం
బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పగానే, నంబర్ గేమ్‌లో స్పష్టత కోసం గవర్నర్ బలపరీక్షకు ఆదేశించవచ్చు.
ఇటు విప్ ఉల్లంఘించినవారిని స్పీకర్ అనర్హులుగా ప్రకటించవచ్చు. అలాంటప్పుడు గవర్నర్ అసెంబ్లీని సుప్త చేతనావస్థలో ఉంచవచ్చు.

ఫొటో సోర్స్, AFP
మూడో పరిమాణం
ఒకవేళ 18 లేదా 19 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, స్పీకర్ తన నిర్ధారణ హక్కులకు లోబడి ఆ ఎమ్మెల్యేలు తగిన కారణాలతోనే రాజీనామా చేశారా లేక దాని వెనుక ఏవైనా ప్రలోభాలు ఉన్నాయా అనేది పరిశీలించవచ్చు.
ఎమ్మెల్యేల రాజీనామా లేఖలపై నిర్ణయం తీసుకోకుండా ఈ ప్రతిష్టంభన కొనసాగేలా చేయవచ్చు.
ఒకవేళ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే, అప్పుడు అందరి దృష్టి స్పీకర్ రమేష్ కుమార్ పైనే ఉంటుంది.
ప్రత్యర్థుల ఎత్తులు ఫలించకుండా న్యాయపరమైన ప్రత్యామ్నాయాలు అన్వేషిస్తున్నట్టు బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఇద్దరూ అంగీకరించారు.

ఫొటో సోర్స్, Getty Images
జేడీఎస్-కాంగ్రెస్, బీజేపీ క్యాంపులో మూడ్ ఎలా ఉంది.
సీఎం కుమార స్వామి సహా కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ప్రభుత్వానికి ఎలాంటి ముప్పూ రాదనే భావిస్తున్నాయి. అందరినీ ఒక్కటిగా కలిపి ఉంచడానికి చర్యలు ప్రారంభించాయి. రేపు బెంగళూరు రావాలని పార్టీ ఎమ్మెల్యేలు అందరికీ ఆదేశాలు కూడా వెళ్లాయి.
కుమార స్వామి తన శాఖల రివ్యూ మీటింగ్‌కు ముందు బీబీసీతో మాట్లాడారు. "ప్రభుత్వాన్ని కూలదోయాలన్న బీజేపీ నేతల ప్రయత్నం విఫలమమైంది. అయినా, మా ఎమ్మెల్యేలకు ఇప్పటికీ డబ్బు ఎర వేస్తున్నట్లు నాకు సమాచారం అందింది. బీజేపీయేతర ప్రభుత్వాలను అస్థిరపరిచేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు బట్టబయలయ్యాయి. ఇది జాతీయ స్థాయిలో ఆ పార్టీ పతనం" అన్నారు.
"బీజేపీ నేతలు స్థానిక మీడియాకు తప్పుడు సమాచారం కూడా ఇస్తున్నారు. అవి తెలివితక్కువగా వ్యవహరిస్తున్నాయి. ఇప్పటివరకూ సీరియళ్ల కోసం మనం ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లే చూసేవాళ్లం. ఇప్పుడు మనం న్యూస్ చానళ్లలో పొలిటికల్ సీరియళ్లు కూడా చూస్తున్నాం" అన్నారు.
ఇటు కాంగ్రెస్ వైపు చూస్తే, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ శాసన సభా పక్ష నేత సిద్ధరామయ్య కూడా చిక్కమగళూరు పర్యటనలో ఉన్నారు. ఆయన కూడా తన పార్టీ నేతలతో సమావేశం అవుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జనవరి 18న ఆయన పార్టీ శాసనసభా పక్ష సమావేశం ఏర్పాటు చేశారు.
అయితే, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, జల వనరుల శాఖ మంత్రి డీకే శివ కుమార్ మాత్రం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆధ్వర్యంలో ఔరంగాబాద్‌లో జరిగే సదస్సుకు హాజరు కావాలనే అనుకుంటున్నారు.
శివకుమార్ తమ ఎమ్మెల్యేలు బీజేపీ చేతికి చిక్కకుండా రిసార్టులకు తరలించడం, తీర్థయాత్రలకు తీసుకళ్లడం లాంటివి చేస్తుంటారు. బెంగళూరు శివార్లలో గుజరాత్ ఎమ్మెల్యేలకు ఆతిథ్యం ఇచ్చింది ఈయనే. తర్వాతే ఆదాయపన్ను శాఖ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయంలో తనిఖీలు చేశారు. మేలో కర్ణాటక అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని భావించినపుడు రెండు పార్టీల ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లో ఉంచింది కూడా శివకుమారే.
ఇటు బీజేపీ తరఫున దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటనా రాకపోవడం కూడా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. "మా నేతలందరూ గురుగ్రామ్‌లో ఉన్నారు. ఎవరు మాట్లాడాలనేది వారే నిర్ణయిస్తారు. మీడియాతో అధికారికంగా ఎవరు మాట్లాడాలనేదానిపై ఇప్పటివరకూ ఎవరి పేరునూ ప్రకటించలేదు" అని పార్టీ మాజీ నేత ఒకరు చెప్పారు.
రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్ప గురుగ్రామ్ రిసార్టులో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలతో "త్వరలో శుభవార్త వినబోతున్నాం "అని చెప్పినట్లు మీడియాలో వార్తలు వస్తున్నట్లు మరికొందరు బీజేపీ నేతలు చెబుతున్నారు.
పేరు బయటపెట్టకూడదనే షరతుతో కొందరు బీజేపీ నేతలు.. "కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయిస్తారనే తాజా వ్యూహాలు చూస్తుంటే కేంద్ర నాయకత్వం నుంచి బలమైన సంకేతాలు వచ్చినట్టు అనిపిస్తోంది, లేదంటే ఇప్పుడు ఇలా జరిగుండదు" అంటూ సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
జేడీఎస్-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చాలనుకోవడం వెనుక కారణం
జేడీఎస్, కాంగ్రెస్ మధ్య ఈ పొత్తు కొనసాగితే అది కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తుందనే, ఆపరేషన్ లోటస్ 3.0 ద్వారా ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ వ్యూహం పన్నినట్టు భావిస్తున్నారు.
పేరు వెల్లడించకూడదనే షరతుతో ఒక బీజేపీ నేత "కర్ణాటకలోని 28 లోక్‌సభ స్థానాల్లో ఇప్పటికే మా దగ్గర 17 ఉన్నాయి. ఈ పొత్తు ఇలాగే కొనసాగితే, బీజేపీ స్థానాలు 11కు తగ్గవచ్చు. కర్ణాటకలో 28లో 20 స్థానాలు గెలుచుకోవాలని అమిత్ షా లక్ష్యంగా పెట్టుకున్నారు. అని తెలిపారు.
ముఖ్యంగా దక్షిణ కర్ణాటకలో ఉన్న కొన్ని స్థానాల్లో జేడీఎస్‌కు బలమైన పట్టుంది. మధ్య కర్ణాటకలో ఉన్న పొరుగు జిల్లాల్లో కూడా జేడీఎస్‌కు కాస్త మద్దతు ఉంది.
కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ఓట్లు చీలుతుండడంతో ఇప్పటివరకూ బీజేపీ ఈ స్థానాలు గెలుస్తూ వచ్చింది. ఇది ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ గెలుపు వ్యూహం లాగే జరిగింది. ఎందుకంటే అక్కడ కూడా ఎస్పీ, బీఎస్పీ మధ్య ఓట్లు చీలిపోవడం వల్లే ఆ పార్టీ విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి
- ఫేస్‌బుక్ ఫ్రెండ్ కోసం పాక్ వెళ్లి అరెస్టైన ముంబయి యువకుడి విడుదల
- తుపాను వచ్చినపుడు ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు?
- ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన పిల్లులు, పేడ పురుగుల మమ్మీలు
- శ్రీనగర్ దాల్ సరస్సులో హౌస్ బోట్లు: మున్ముందు కనుమరుగైపోతాయా?
- ‘గాంధీ మహాత్ముడు కాదు, ఆయనకు ఆ అర్హత లేదు’: బీబీసీ ఇంటర్వ్యూలో బీఆర్ అంబేడ్కర్
- వీవీఎస్ లక్ష్మణ్: నంబర్ త్రీగా ఆడడం వెనుక అసలు చరిత్ర
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








