You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ముంబయి మహా నగరానికి 125 ఏళ్లుగా నిరంతరాయంగా భోజనం అందిస్తున్న డబ్బావాలా
కిరణ్ గవాండే.. వారానికి ఆరు రోజులు తన సైకిల్‌పై ముంబయి మహానగారానికి ఆనుకొని ఉన్న లోయర్ పరేల్ వెళ్లి కస్టమర్ల దగ్గర నుంచి లంచ్‌బాక్సులను (వాటినే డబ్బాలు అని కూడా అంటారు) తీసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత కొన్ని గంటల పాటు గవండేతో పాటు అతని సహచరులైన మిగిలిన డబ్బావాలాలు అత్యంత రద్దీగా ఉండే రోడ్లపై తిరుగుతూ లక్షలాది మందికి వారి వారి భోజనాన్ని సరిగ్గా సమయానికి అందిస్తుంటారు.
గత కొన్నేళ్లుగా జొమాటో, స్విగ్గీ వంటి ఆన్ లైన్ మొబైల్ అప్లికేషన్ బేస్డ్ కంపెనీలు మన ఆర్డరుపై ప్రత్యేకంగా తయారు చేసిన ఆహారాన్ని మన డెస్క్ దగ్గరకే వేడి వేడిగా అందిస్తున్నాయి. అయితే డబ్బావాలాలు ఈ పనిని గత 125 ఏళ్లుగా చేస్తున్నారు. అలాగని ఆ కంపెనీల్లా రెస్టారెంట్లనుంచి ఆహారాన్ని తీసుకొని రారు. చక్కగా మన ఇంటి భోజనాన్నే తీసుకొస్తారు. అందుకే కొత్తగా ఈ రంగంలోకి అడుగు పెట్టేవాళ్లు వాళ్ల దగ్గర నుంచి నేర్చుకునేందుకు ఎంతో ఉంది.
డబ్బావాలాలుగా పని చేసే వాళ్లకు ఎలాంటి ప్రత్యేక ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉండదు. ఓ రకంగా చెప్పాలంటే సైకిల్ తొక్కడం వచ్చి, అడ్రస్‌లను గుర్తు పెట్టుకోగల్గేంత నైపుణ్యం,ముంబయి నగరంలో తాము పని చేసే ప్రాంతంపై కాస్త పట్టు ఉంటే చాలు అంతకు మించి వారికి ఏ అర్హతలు అవసరం లేదు. రెండంచెల వ్యవస్థలో పని చేసే వాళ్లు వినియోగించే హైటెక్ టెక్నాలజీ ఏదైనా ఉందంటే అది ముంబయి రైల్వే నెట్ వర్క్ మాత్రమే. సుమారు 5 వేల మంది ఉండే ఆ సహకార సంస్థ ప్రపంచంలోనే అత్యంత సమర్థమైన వ్యవస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
స్విగ్గీ, జొమాటో తదితర ఫుడ్ డెలివరీ కంపెనీల్లా డబ్బావాలాలు హోటళ్ల నుంచి, రెస్టారెంట్ల నుంచి ఆహార పదర్ధాలను తీసుకొని రారు. వీళ్లు పూర్తిగా ఇంట్లో తయారు చేసిన భోజనాన్ని అది కూడా కస్టమర్ల స్వగృహాల నుంచే వారు పని చేసే చోటుకు తీసుకెళ్లి అందిస్తారు.
“మాకు ఈ యాప్స్ అస్సలు నచ్చవు” అంటారు ఈవెంట్ ఆర్గనైజర్‌గా పని చేస్తున్న రష్మిక షా. ముంబయి స్టాక్ ఎక్సేంజ్‌లో పని చేస్తున్న తన భర్తకు క్యారేజ్ ఇచ్చే బాధ్యతను శివాజీ సావంత్ అనే డబ్బావాలాకు అప్పగించారు. ఆయన కొన్నేళ్లుగా తమకు తెలుసని సరిగ్గా సమయానికి తన భర్తకు భోజనాన్ని అందిస్తారని ఆమె చెప్పారు.
డబ్బావాలాలు నమ్మకంగా సేవలందించడమే కాదు, అందుకు వారు వసూలు చేసే మొత్తం కూడా కేవలం నెలకు 800 రూపాయలు మాత్రమే. “ఆఫీసుకు భోజనం తెప్పించుకోవడం అంటే జనం అదో విలాసం అనుకోవచ్చు. కానీ, సెక్యూరిటీ గార్డుల నుంచి సీఈఓల వరకు అందరికీ మేం మా సేవల్ని అందిస్తాం”అన్నారు డబ్బావాలాల సమన్వయకర్తగా పని చేస్తున్న సుబోధ్ సంగ్లే.
కొత్తగా వచ్చిన డెలివరీ యాప్స్ ఏవీ తమకు పోటీయే కాదంటారు చాలా మంది డబ్బావాలాలు. తాము అందించేంత సక్రమంగా వారు సేవలందించలేరని గవండే అన్నారు. ముంబై డబ్బావాలాలకు మాత్రమే అది సాధ్యమని గర్వంగా చెప్పారు.
ఆయన చెప్పిన మాటల్ని కాదని వాదించడం కష్టమే. ఎందుకంటే, ఈ సంస్థ అతి తక్కువ నిర్వహణ ఖర్చులతో అత్యుత్తమ సేవల్ని అందిస్తోంది. 2010లో హార్వార్డ్ బిజినెస్ స్కూల్ వీరి నెట్‌వర్క్‌కు “సిక్స్ సిగ్మా” గ్రేడ్ ఇచ్చింది. అంటే డబ్బావాలాలు నిర్వహించే ప్రతి పది లక్షల లావాదేవీల్లో కేవలం 3.4 తప్పులు మాత్రమే జరుగుతున్నాయి. ఇది ఒక్కటి చాలు ముంబయిలో డబ్బావాలాల వ్యవస్థ ఎంత సక్రమంగా పని చేస్తోందో చెప్పడానికి. రోజూ సుమారు 2 లక్షల మంది కస్టమర్లకు సేవలందిస్తుంటారు. కానీ, ఏటా కేవలం 400 సార్లు మాత్రమే కస్టమర్‌కు సమయానికి భోజనాన్ని అందించలేకపోవడం లేదా వారి డబ్బా అందకపోవడం జరుగుతోంది.
తిరుగులేని సమయపాలన
ప్రతి రోజూ వినియోగదారులకు సరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు డబ్బాని అందించాలి. అందుకోసం వారికి కనీసం 3 గంటల సమయం పడుతుంది. వాళ్ల డెలివరీ ఆలస్యమైతే ఆ ప్రభావం మొత్తం ముంబయి నగరంపై పడుతుందంటారు సంగ్లే. సాధారణంగా డబ్బావాలాలను అటు సాధారణ ప్రజలు, ఇటు ట్రాఫిక్ పోలీసులు కూడా ఒకేలా చూస్తారు. అందుకే డబ్బావాలా వీధిలో కనిపించగానే చాలు వారికే ముందు దారి విడిచిపెడతారని ఆయన చెప్పారు.
నిర్దేశిత సమయం కన్నా ముందుగానే కస్టమర్లకు డబ్బాలను చేర్చాలని లక్ష్యంగా పెట్టుకుంటారు డబ్బావాలాలు. అందుకే మధ్యాహ్నం ఒంటిగంటకు డబ్బాను అనుకున్న ప్రాంతానికి చేర్చాలనుకుంటే వాళ్లు 12 గంటలకే ఇవ్వాలని నిర్దేశించుకుంటారు. అది కేవలం పావుగంట సమయంలో చేరుకోదగ్గ దూరమైనా సరే వాళ్ల నిర్ణయం మారదు. అప్పుడు ఏమైనా ఇబ్బందులు ఎదురైనా అనుకున్న సమయానికి వినియోగదారునికి భోజనాన్ని అందించగల్గుతారు. అలాగే ప్రతి 15 నుంచి 20 మంది డబ్బావాలాలకు ఒక వ్యక్తి అదనంగా కూడా ఉంటారు. ఎవరైనా ఒకరు ఆలస్యమైతే ఆ పనిని వీరు సమయానికి పూర్తి చేస్తారు.
క్షణం తీరిక లేని పని మధ్య కూడా డబ్బావాలాలు చాలా ప్రశాంతంగా, జోకులేసుకుంటూ, మాట్లాడుకుంటూ డబ్బాలను క్రమంలో అమర్చుతూ ఉంటారు. కానీ సమయం దగ్గర పడే సరికి వారి దృష్టి ఒక్కసారిగా పని మీదకు వెళ్లిపోతుంది. ఐదు నిమిషాల్లో అక్కడ పరిస్థితి మొత్తం మారిపోతుంది.
సరిగ్గా సమయం మధ్యాహ్నం 12.45 అయితే చాలు. వారు చేరుకోవాల్సిన ఆఫీస్ పరిసరాల్లో వారి సైకిల్ స్పీడందుకుంటుంది. పరిసరాలన్నీ వారి అరుపులతో నిండిపోతాయి. కంగారుపడుతున్న డబ్బావాలాల్ని చూడాలంటే ఆ సమయంలో ఏ ఆఫీసు ముందుకి వెళ్లినా చాలు అంటారు సంగ్లే. నిజానికి కస్టమర్‌కు వారి భోజనాన్ని అందించడంలో ఎటువంటి ఆలస్యం ఉండదు. కానీ వాళ్లు నిర్దేశించుకున్న సమయానికి అక్కడకు వారు చేరుకోలేకపోవడమే వారి హడావిడికి కారణం.
ఆ భాష వారికి మాత్రమే అర్థమవుతుంది
రోజంతా వారితో కలిసి ప్రయాణించడమంటే కష్టమైన పనే అంటారు డబ్బావాలాలతో కలసి ఒక రోజుంతా తిరిగిన బీబీసీ ప్రతినిధి రిచర్డ్ బ్రాన్సన్. కొన్ని సార్లు నేను ఏదో ఆలోచిస్తూ వెనక్కి తిరిగేసరికి ఒక్కరూ కూడా కనిపించరు. వాళ్ల సమయపాలన వినియోగదారుల విషయంలో కూడా అలాగే ఉంటుంది. ఒక వేళ ఎవరైనా వరుసగా రెండు, మూడు సార్లు లంచ్ బాక్స్ ఇవ్వడంలో ఆలస్యమైతే వాళ్లకి ఇక తమ సేవల్ని అందించలేమని నిర్మొహమాటంగా చెప్పేస్తారు.
ప్రతి ఒక్కరూ ఒక్కో ప్రాంతానికి పరిమితమవుతారు. సరిగ్గా ఉదయం 10-11 గంటల సమయంలో నడుచుకొని లేదా సైకిల్‌పై తమకు నిర్ధేశించిన ప్రాంతంలో తిరిగి ఒక్కొక్కరు సూమారు 30 డబ్బాలను సేకరిస్తారు. స్థానిక కార్యాలయంలో లేదా, రైల్వే స్టేషన్లో వాటిని వేరు చేసి ప్రతి ఒక్కరూ తమ డబ్బాలను తీసుకొని తాము వెళ్లాల్సిన ప్రాంతానికి వెళ్లే రైలు ఎక్కుతారు. తిరిగి వాటికి వినియోగదారుల ఇంటికి చేర్చేసమయంలో కూడా అలాగే వేరు చేసి సైకిల్‌పై లేదా బళ్లపై తీసుకెళ్లి వారి వారి ఇళ్లకు చేరుస్తారు.
ఇక ఒకరి డబ్బాలు మరొకరికి మారిపోకుండా వారికి మాత్రమే అర్థమయ్యే రీతిలో లంచ్ బాక్సులపై ఏవో కొక్కిరి గీతలతో కోడ్ నెంబర్లుంటాయి. తెలియని వారికి అవి అస్సలు అర్థం కావు. వాళ్లు మాత్రం చాలా సులభంగా గుర్తుపడతారు.
డబ్బావాలాలు తమ పని విషయంలో చాలా నిబద్ధతతో ఉంటారు. ఎందుకంటే వారికి ఇచ్చే జీతం కూడా బాగానే ఉంటుంది. ఒక్కొక్కరికీ నెలకు సుమారు రూ.12 వేల వరకు ఉంటుంది. మన దేశంలో నైపుణ్యం లేని కార్మికులకు ఈ వేతనం కొంతవరకు ఫర్వాలేదని చెప్పవచ్చు. అలాగే ముంబైలో డబ్బావాలా ఉద్యోగం అంటే అంతో ఇంతో మంచి పేరే ఉంది. అంతేకాదు వారి కోసం ప్రత్యేకంగా మొబైల్ ఫోన్ రాయతీలుంటాయి. అలాగే కొన్ని స్వచ్ఛంద సంస్థలు డబ్బావాలాల పిల్లలకు స్కాలర్‌షిప్‌లు కూడా ఇస్తూ ఉంటాయి.
అందరూ సమానం
ఇక ఈ డబ్బావాలాల సహకార సంఘంలో అందరికీ సమాన గౌరవం ఉంటుంది. తమ పర్యవేక్షకుల్ని తామే ఎన్నుకుంటారు. అంతే కాదు, ఇక్కడ ఎవరు ఎవర్నీ సర్ అని పిలుచుకోరు. నమస్కారాలు, ప్రతి నమస్కారాలు కూడా ఉండవు అని డబ్బావాలాగా పని చేస్తున్న అనిల్ భగవత్ చెప్పారు.
వాటికి తోడు డబ్బావాలాలంతా నిబద్ధతతో పని చేయడానికి మరిన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి. దాదాపు డబ్బావాలాలు అందరూ ‘వకరి’ వర్గానికి చెందినవారు. వాళ్లంతా విఠలనాథుణ్ణి తమ దైవంగా కొలుస్తారు. ఇతరుల ఆకలి తీర్చడం అన్ని ధర్మాలకన్నా గొప్పదైన ధర్మమన్నది విఠలనాథుని బోధనల్లో ముఖ్యమైనది. “మేం మా పొట్ట నింపుకుంటూనే ఆధ్యాత్మిక మార్గంవైపు నడిచేందుకు వచ్చిన సువర్ణ అవకాశం ఇది” అని అన్నారు సంగ్లే.
అయితే మొబైల్ అప్లికేషన్‌తో కూడిన ఫుడ్ డెలివరీ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా డబ్బావాలాలు సేవలు మనుగడసాగిస్తాయా? ప్రస్తుతం ప్రస్తుతం దేశంలో సాంకేతిక వాణిజ్యవేత్తల దృష్టంతా ఈ ఫుడ్ డెలివరిపైనే ఉందని అమెరికాకు చెందిన స్టార్టప్ యాక్సిలేటర్ 500 స్టార్ట్ అప్స్ భాగస్వామి పంకజ్ జైన్ అన్నారు.
అయితే, వాటి వల్ల డబ్బావాలాలకు ముప్పుందని తాను భావించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ రంగం ఇంకా చాలా ముందుకెళ్లాల్సి ఉంది. ఈ తరహా కంపెనీలన్ని తమ వ్యాపార ఆలోచనల్ని సిలికాన్ వ్యాలీ నుంచి మోసుకొచ్చి ఇక్కడ యథాతథంగా అమలు చేయాలనుకుంటున్నాయి. అదే ఇందులో ప్రధాన సమస్య. అని ఆయన అన్నారు.
ఈ విషయంలో నమ్మకమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం, సమర్థమైన వ్యాపార ప్రణాళికల్ని నిర్మించడంపై దృష్టి పెట్టకుండా పెట్టుబడిదారులంతా ఎంత సేపు మార్కెట్ వాటాపైనా, వినియోగదారులకు డిస్కౌంట్లు అందించడంపైనా, డబ్బు సంపాదించడంపై మాత్రమే దృష్టి పెడుతున్నారని జైన్ అభిప్రాయపడ్డారు.
డబ్బావాలాల వ్యవస్థకు ఉన్న పటిష్ఠమైన పునాదుల నుంచి ఫుడ్ టెక్నాలజీ సంస్థలన్నీ ఎంతో కొంత నేర్చుకోవాల్సి ఉందన్నది జైన్ మాట. “నాకు తెలిసి ఇండియాలో ఫుడ్ డెలివరీ 2.O అంటే డబ్బావాలాలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడమే” అని అన్నారు జైన్.
డబ్బావాలాలవైపు చూస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థలు
కేవలం ఆయన మాత్రమే అలా ఆలోచించడం లేదు. ప్రస్తుతం ఇండియాలో పుడ్ డెలివరీ దిగ్గజాలైన స్విగ్గీ, రన్నర్ వంటి సంస్థలు కూడా డబ్బావాలాల నైపుణ్యాన్ని అందిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న ఫుడ్ డెలివరీ సంస్థ రన్నర్ డబ్బావాలాలు ఉపయోగించే క్రౌడ్ సోర్సింగ్ మోడల్‌నే ఉబర్ వంటి రైడింగ్ సంస్థలతో కలిసి వినియోగిస్తోంది.
ఏడాది క్రితం రన్నర్ సంస్థ ముంబయిలో కూడా తన సేవలందించే సమయంలో డబ్బావాలాలను సంప్రదించిందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు మోహిత్ కుమార్ చెప్పారు. అంతే కాదు మధ్యాహ్నం తమ సేవల్ని ముగించుకున్న తర్వాత తమ సంస్థలో పని చేసేందుకు సుమారు 200 మంది డబ్బావాలాలతో ఒప్పందాన్ని కూడా కుదుర్చుకున్నామని ఆయన తెలిపారు.
ముంబయిలో ఎలా ప్రయాణించాలన్నది రన్నర్ సంస్థ డబ్బావాలాల నుంచి నేర్చుకున్న ప్రధాన పాఠాల్లో ఒకటి. గూగుల్ మ్యాప్‌లు నగరాన్ని విభజించే సమయంలో ఎక్కడ ట్రాఫిక్ ఎలా ఉంటుందన్న విషయాన్ని అన్ని సార్లు కచ్చితంగా చూపించలేవు. కానీ ఏళ్ల తరబడి ముంబై రోడ్లపై అనుభవం ఉన్న డబ్బావాలాలకు ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది? ఏ సమయంలో ఎటునుంచి వెళితే, తొందతరగా గమ్యం చేరుకోవచ్చు వంటి విషయాలన్నీ బాగా తెలుసు. “ముంబయిలో ప్రతి వీధికి సంబంధించిన సమాచారం ఇంత పక్కాగా ఎవ్వరి దగ్గరా ఉండదు. మేం డెలివరీ చేసే సమయాన్ని వీలైనంతగా తగ్గించుకునేందుకు ఇది చాలా బాగా ఉపయోగపడింది”అని కుమార్ చెప్పారు.
సరిగ్గా అలాంటి సేవల్ని ఆన్ డిమాండ్ సేవల పేరుతో రన్నర్ సంస్థ బెంగళూరులోని పెద్ద పెద్ద కార్యాలయాలకు ప్రతి రోజూ మధ్యాహ్నం భోజనాన్ని ప్రయోగాత్మకంగా అందించే ప్రయత్నం చేస్తోంది.
“డబ్బావాలాల లాగే మేం కూడా డెలివరీ విషయంలో ఏ మాత్రం ఆలస్యం కాని వ్యవస్థను రూపొందించే ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా డ్రైవింగ్ విషయంలో సరైన శిక్షణ, సమయపాలన,ఎక్కువ డెలివరీలను చెయ్యడం కన్నా సరైన సమయానికి డెలివరీ అందించే వాళ్లకు ప్రోత్సాహకాలను అందించడం వంటి ప్రయత్నాలను చేస్తున్నాం” అని కుమార్ చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటే డబ్బావాలాలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందని కుమార్ అన్నారు. స్థానిక పరిస్థితులపై పూర్తిగా అవగాహన ఉన్న వారికి మ్యాపింగ్ టెక్నాలజీ కూడా తోడైతే మరింత మంది కస్టమర్లకు మరింత నాణ్యమైన సేవలను వాళ్లు అందించవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ముంబయిలో నిర్దేశించిన సమయానికి మధ్యాహ్న భోజనాన్ని అందించే సేవల్ని తమ రన్నర్ సంస్థ ప్రారంభించాలని నిర్ణయిస్తే తాము డబ్బావాలాలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకునే అంశాన్ని తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకుంటామని కూమార్ స్పష్టం చేశారు.
అయితే, డబ్బావాలాలు అంత వేగంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటారని తాను అనుకోవడం లేదని పవన్ అగర్వాల్ అన్నారు. మోటివేషనల్ స్పీకర్‌గా పని చేస్తున్న ఆయన డబ్బావాలాల నెట్ వర్క్ పై పీహెచ్‌డీ చేశారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ వ్యాప్తంగా వివిధ వ్యాపార సంస్థలకు వ్యవస్థీకృత విధానాల అమలుపై సూచనలు సలహాలు ఇస్తూ ఉంటారు. “డబ్బావాలాల్లో చాలా మంది వయసు 50 ఏళ్ల పైబడే ఉంటుంది. అదీగాక వారికి రిటైర్మెంట్ వయసు కూడా లేదు.ఈ పరిస్థితుల్లో వాళ్లు సాంకేతిక పరిజ్ఞాన్ని అందిపుచ్చుకోవాలంటే కొంత సమయం పడుతుంది” అని పవన్ అన్నారు.
టెక్నాలజీ పరిజ్ఞానం లేకపోవడమే వారికి వరమా?
నిజానికి ముంబయి వంటి నగరాల్లో వారికి సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడమే ఓ రకంగా బలం. మరో ముఖ్యమైన విషయం వాళ్లు కేవలం ఇంటి భోజనాన్ని మాత్రమే అందిస్తారు. ఇంటి భోజనాన్ని ఎవ్వరూ ఆన్ లైన్లో ఆర్డర్ ఇవ్వలేరు. అంటే డిజిటల్ ఫుడ్ డెలివరీ స్టార్ట్ అప్ సంస్థలు అందిస్తున్న సేవలకు ఇది పూర్తి భిన్నం. అదీగాక రద్దీ ఎక్కువగా ఉన్న నగరాల్లో మోటార్ బైకులు, కార్లతో పోల్చితే సైకిల్ లేదా రైళ్లపై ప్రయాణం ద్వారానే వేగంగా గమ్యస్థానాన్ని చేరుకోగలం. “మోటార్ బైక్‌పై వెళ్తే కచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ పాటించాలి. పార్కింగ్ ప్లేస్ కూడా మరో ప్రధానమైన సమస్య. అదే సైకిల్, రైళ్లపై ఆ సమస్య ఉండదు. అందుకే ఎంత ట్రాఫిక్ ఉన్నా సమయానికి మేం వెళ్లగల్గుతున్నాం” అని డబ్బావాలాగా ఉద్యోగం చేస్తున్న గంగారాం చెప్పారు.
అలాగని కొత్త కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడంలో డబ్బావాలాలు ఏం వెనకబడి లేరు. చిట్ట చివరి ప్రాంతాలకు డెలివరీ చేసే విషయంలో ఇప్పటికే ఫ్లిప్ కార్ట్ సంస్థతో చర్చలు జరుపుతున్నారు. అలాగే, మరి కొందరు ఆరోగ్య పానీయాలను అందించే రా ప్రెసరీ సంస్థతో కలిసి ఆన్ డిమాండ్ సేవల్ని అందిస్తున్నారు.
ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలన్న వ్యామోహం జనంలో పెరుగుతూ ఉండటం డబ్బావాలాలకు వరంగా మారుతోంది. అందువల్ల ఫుడ్ కంపెనీలన్నీ డెలివరీ సేవల కోసం వారి వైపు చూస్తున్నాయి. ఆయా సంస్థలకు వస్తున్న లాభాలు డబ్బావాలాల జీతాలు రూ.12 వేల నుంచి రు.20 వేల వరకు పెరగడానికి కూడా కారణమవుతున్నాయి.
అయినప్పటికీ, తమ ప్రధాన వ్యాపారం మారిపోతుందని భావించడం లేదంటారు సంగ్లే. డబ్బావాలాలకు తాము చేస్తున్న పనితో ఉన్న ఆధ్మాత్మిక అనుబంధం వారిని అలాగే ఎల్లప్పుడూ ఉంచుంతుందని చెబుతారు. కొత్త కొత్త కంపెనీలు కస్టమర్లకు మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు ఇవ్వగలవు. కానీ, అందులో మార్కెట్‌ను ఎలాగైనా ఒడిసిపట్టాలన్న ఆలోచన మాత్రమే వారికి ఉంటుంది.
కానీ, డబ్బావాలాలు అలా కాదు. తమ కస్టమర్లకు సేవ చేయడమంటే వారు దేవుడికి సేవ చేస్తున్నట్టేనని వారు భావిస్తారని సంగ్లే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: లాక్డౌన్ వారికి కొత్త కాదు... ఆ అందమైన దేశంలో అదొక చిరకాల సంప్రదాయం
- వందల ఏళ్ల క్రితమే క్వారంటైన్ విధానాన్ని అనుసరించిన పురాతన నగరం ఇది
- కోవిడ్-19: ‘నేను వెంటిలేటర్ తొలగించి రోగి మరణించడానికి సహాయపడతాను’
- లాక్డౌన్ 4.0.. స్టేడియంలను తెరవొచ్చు, ప్రేక్షకులు వెళ్ల కూడదు.. విమానాలు, మెట్రో రైళ్ల సేవలు రద్దు
- కరోనావైరస్: ఒంటరి వ్యక్తులు ‘సెక్స్ స్నేహితుల’ను వెదుక్కోండి – ప్రభుత్వ మార్గదర్శకాలు
- 800 మీటర్ల ఎత్తున్న శిఖరాల మీద నివసించే ప్రజలను పట్టణ ప్రాంతాలకు తరలిస్తున్న చైనా
- ప్రపంచం మెరుగవుతోంది... ఇవిగో రుజువులు
- వంద రోజుల్లో ఎనిమిది లక్షల మందిని చంపేసిన నరమేధం
- కరోనావైరస్: మీరు మీ పిల్లల్ని వేరే పిల్లలతో ఆడుకోడానికి పంపించవచ్చా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)