కరోనావైరస్: సౌదీ అరేబియా ఎప్పుడూ లేనంత కష్టాల్లో కూరుకుపోయిందా?

    • రచయిత, ఫ్రాంక్ గార్డనర్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కోరనావైరస్ వల్ల ఏర్పడిన సంక్షోభంతో చమురు ధరలు దారుణంగా పడిపోయాయి. దాంతో చమురుపైనే ఆదారపడిన దేశాల ఆర్థికవ్యవస్థపై ప్రభావం చాలా ఘోరంగా ఉంది.

ఒకప్పుడు ‘టాక్స్ ఫ్రీ’ దేశంగా పాపులర్ అయిన సౌదీ అరేబియా, ఇప్పుడు తమ దేశంలో వాల్యూ యాడెడ్ టాక్స్(వాట్)ను 5 శాతం నుంచి 15 శాతం వరకూ పెంచేసింది. ప్రతి నెలా ఉద్యోగులకు ఇచ్చే భత్యానికి కూడా ముగింపు పలికింది.

ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు ఏడాది క్రితంతో పోలిస్తే సగానికి పైగా తగ్గాయి. దీంతో సౌదీ అరేబియా ఆదాయం 22 శాతం తగ్గింది.

సౌదీ అరేబియా తమ దేశంలోని ముఖ్యమైన ప్రాజెక్టులనీ ప్రస్తుతానికి రద్దు చేసింది.

ముడి చమురు ధరల పతనంతో సౌదీ అరేబియా ప్రభుత్వ చమురు కంపెనీ ఆరాంకో మొదటి త్రైమాసిక లాభాల్లో 25 శాతం తగ్గుదల నమోదైంది.

“ఖర్చులకు కళ్లెం వేయడం, తగ్గుతున్న చమురు ధరలను స్థిరీకరించడం ఎంత అవసరమో సౌదీ అరేబియా చేపట్టిన చర్యల ద్వారా తెలుస్తోంది. ఆ దేశ ఆర్థికవ్యవస్థ అధ్వాన్నంగా ఉంది, దానిని సాధారణ స్థితికి తీసుకురావడానికి ఇంకా సమయం పడుతుంది” అని గల్ఫ్ దేశాల విశ్లేషకులు మైకల్ స్టీఫెన్స్ చెప్పారు.

తన దేశంలో సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్‌కు చాలా ప్రజాదరణ ఉంది. కానీ సౌదీ జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్యలో ఆయన హస్తం ఉండచ్చని పశ్చిమ దేశాలు సందేహాలు వ్యక్తం చేశాయి.

టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లోని సౌదీ రాయబార కార్యాలయంలో 2018లో జరిగిన జమాల్ హత్య తర్వాత, ఆ దేశం అంతర్జాతీయ పెట్టుబడుల మార్కెట్‌లో తన ఖ్యాతిని తిరిగి నిలబెట్టుకోలేకపోయింది.

యెమెన్‌లో జరిగిన యుద్ధంలో ఏ లాభం లేకపోయినా, సౌదీ దాని ఫలితం అనుభవించాల్సి వచ్చంది. కతార్‌తో తలెత్తిన వివాదం ఆరు దేశాల గల్ఫ్-అరబ్ కోఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ) ఐక్యతలో చీలికలు సృష్టించింది.

ఇప్పుడు సౌదీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకుపోయుందా?

కరోనావైరస్ వల్ల ప్రపంచంలో అన్ని ఆర్థికవ్యవస్థలూ సంక్షోభంలో పడ్డాయి. సౌదీ అరేబియా కూడా దీనికి అతీతం కాదు. సౌదీ అరేబియా దగ్గర ‘ప్రజా పెట్టుబడి నిధి(పబ్లిక్ ఇన్వెస్టిమెంట్ ఫండ్)’ ఉంది. అందులో సుమారు 320 బిలియన్ డాలర్లు ఉన్నాయి.

సౌదీ ప్రభుత్వ చమరు కంపెనీ ఆరాంకో దగ్గర గత ఏడాది వరకూ 17 ట్రిలియన్ డాలర్ల సంపద ఉంది. అది గూగుల్, అమెజాన్ రెండూ కలిస్తే.. ఆ రెండింటి సంపదకు సమానం.

సౌదీ అరేబియా ఆరాంకోలో ఒక చిన్న భాగం, అంటే సుమారు ఒకటిన్నర శాతం వాటాను అమ్మి 25 బిలియన్ డాలర్లు ఆర్జించింది. ఇది చరిత్రలోనే అతిపెద్ద విక్రయంగా నిలిచింది.

“సౌదీ అరేబియా చాలా సంపదను వెనకేసింది. దాని దగ్గర నిల్వలు ఏ స్థాయిలో ఉన్నాయంటే, అది ఈ సంక్షోభ స్థితిలో కూడా నిలదొక్కుకోగలదు. ఇప్పటికీ మార్కెట్లో తన వాటాను స్థిరంగా ఉంచుకుంటూ, పతనం అవుతున్న చమురు ధరల కష్టాల నుంచి గట్టెక్కగలదు” అని సౌదీలో 2007 నుంచి 2010 వరకూ బ్రిటన్‌ రాయబారిగా ఉన్న విలియమ్ పాటీ చెప్పారు.

ఇరాన్ నుంచి సౌదీకి ఇంకా వ్యూహాత్మక ముప్పు ఉన్నట్టు కచ్చితంగా అనిపిస్తోంది. గత సెప్టెంబరులో సౌదీ అరేబియా రీఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. తర్వాత జనవరిలో అమెరికా వైమానిక దాడిలో ఇరాన్ కడ్స్ ఫోర్స్ చీఫ్ జనరల్ ఖాసిం సులేమానీ చనిపోయారు.

సౌదీ అరేబియాకు పంపిన పేట్రియాట్ మిసైల్ బ్యాటరీలను అమెరికా ఈ నెలలో వెనక్కు తీసేసుకుంది. అయితే ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా నుంచి ఈ దేశానికి మిలిటెంట్ దాడుల ప్రమాదం పూర్తిగా తప్పిపోకున్నా, అవి కచ్చితంగా తగ్గాయనే చెప్పాలి.

అయినప్పటికీ, సౌదీ అరేబియా ముందు కొన్ని తీవ్రమైన సవాళ్లు ఇప్పటికీ అలాగే ఉన్నాయి.

సౌదీ అరేబియా ఆర్థికవ్యవస్థ

ఈ వారంలో సౌదీ తీసుకున్న కొన్ని కఠిన నిర్ణయాల్లో ఆ దేశ ప్రజలకు ఎలాంటి శుభవార్తా అందలేదు. ముఖ్యంగా రాబోవు సమయంలో తమ ఆర్థికవ్యవస్థ చమురు మీదే ఆధారపడకుండా, మిగతా రంగాలపై కూడా ఉండేలా సౌదీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

సౌదీ ఆర్థికమంత్రి స్వయంగా ఈ నిర్ణయాలను ‘సమస్యాత్మకమైనవి’గా చెప్పారు. ఒక అంచనా ప్రకారం ఈ నిర్ణయాల వల్ల 26 బిలియన్ డాలర్లు ఆదా అవుతాయని చెబుతున్నారు.

కానీ పైన ఆదా అవుతుందని చెబుతున్నంత మొత్తం మేర నష్టాలు.. కరోనా, చమురు ధరల పతనం వల్ల సౌదీకి ఒక్క మార్చి నెలలోనే వచ్చాయని అంటున్నారు.

ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో 9 బిలియన్ డాలర్ల బడ్జెట్ లోటు ఉంది. సౌదీ అరేబియా ఈ కోతల సాయం తీసుకోవడం మొదటిసారి జరగలేదు.

1998 మేలో జీసీసీ సమావేశంలో పాల్గొంది. అప్పుడు క్రౌన్ ప్రిన్స్ అబ్దుల్లా “ఇప్పుడు ఒక బ్యారెల్ ధర 9 డాలర్లు ఉంది. మంచి కాలం ముగిసింది. అది తిరిగొచ్చేలా లేదు. ఇది మనమంతా నడుం బిగించాల్సిన సమయం” అని స్పష్టం చేశారు.

తర్వాత చమురు ధర ఒక బ్యారెల్‌కు వంద డాలర్లకు పైనే చేరింది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం ఆపివేసినపుడు, తయారీ రంగం దేశవ్యాప్తందా నెమ్మదించినపుడు అలా జరిగింది.

ప్రస్తుతం పరిస్థితి కాస్త తీవ్రంగా ఉంది

కరోనావైరస్, చమరు ధరల్లో పతనం వల్ల ఇప్పుడు క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ ‘విజన్ 2030’ పూర్తి అవుతుందా ప్రశ్నలు వస్తున్నాయి.

సౌదీ అరేబియా ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రధానంగా చమురు వల్ల లభించే ఆదాయంపై, వలస కార్మికులపై ఆధారపడడాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దానితోపాటు 500 బిలియన్ డాలర్ల వ్యయంతో ఎడారిలో ఒక అత్యాధునిక నగరం నిర్మించాలని కూడా భావిస్తోంది.

ఈ ప్రాజెక్టుపై ఇప్పటికీ పనులు జరుగుతున్నాయని ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో దాని వ్యయంలో కోతలను, ఆలస్యాన్ని ఆపలేమని చాలామంది విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.

“ప్రభుత్వం తన వ్యయంలో కోతలు పెట్టాలనే నిర్ణయం వల్ల ప్రైవేటు రంగంపై చాలా ప్రభావం పడింది. దానివల్ల ఉద్యోగాలపై దారుణ ప్రభావం పడుతుంది. చాలాకాలం వరకూ ఆ స్థితి నుంచి బయటపడ్డం కష్టం అవుతుంది” అని మైకెల్ స్టీఫెన్స్ అన్నారు.

సౌదీ అరేబియా అంతర్జాతీయ స్థితి

జర్నలిస్ట్ జమాల్ ఖషోగ్జీ హత్య తర్వాత సౌదీ అరేబియా ప్రతిష్ఠ మసకబారింది. లండన్‌లోని సౌదీ రాయబారి కూడా దానిని తమ ప్రతిష్టపై పడిన మచ్చగా చెప్పారు.

ఆ తర్వాత ఆ కేసు విచారణ, తీర్పుపై కూడా మానవ హక్కుల సంఘాలు, ఐక్యరాజ్యసమితి నుంచి విమర్శలు వచ్చాయి. నిందితులను కొందరిని సులభంగా వదిలేశారనే ఆరోపణలు వచ్చాయి.

కానీ, సౌదీ అరేబియా ఒక పెద్ద ఆర్థికవ్యవస్థ. దానిని ప్రపంచం విస్మరించడం అంత సులభం కాదు. సౌదీ అరేబియా ఇటీవల హై-ప్రొఫైల్ పెట్టుబడుల అవకాశాలను వెతికే పనిలో పడింది. అంటే అది ఇటీవల న్యూకాజిల్ యునైటెడ్ ఫుట్‌బాల్ టీమ్‌లో 80 శాతం వాటా సొంతం చేసుకుంది. జమాల్ ఖషోగ్జీ భార్య నైతికత ప్రాతిపదికన ఈ ఒప్పందాన్ని వ్యతిరేకించారు.

అమెరికా, బ్రిటన్ ఇచ్చిన యుద్ధవిమానాల సాయంతో, యుద్ధ సమయంలో సౌదీ చేసిన దాడులపై చాలా విమర్శలు వచ్చాయి. దానిని యుద్ధనేరాలుగా చూశారు.

ఆ దాడుల్లో పౌరులు చనిపోయారు. దాంతో అమెరికాలో, మిగతా చాలా ప్రాంతాల్లో కూడా విమర్శలు వచ్చాయి.

ఈ యుద్ధం వల్ల దానికి పెద్దగా ఏం లభించలేదు. బదులుగా అమెరికాకు అందే మద్దతు తగ్గింది.

అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్, వ్లాదిమిర్ పుతిన్ ఇద్దరూ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ సహచర దేశాలతో బాగానే ఉన్నారు.

కానీ, ఈ ఏడాది చమురు నిల్వలు తెరిచి, తమ ఆర్థికవ్యవస్థకు నష్టం తెచ్చిన సౌదీ ఆ ఇద్దరి ఆగ్రహానికి గురైంది.

ప్రజాదరణ-సమస్యలు

ఇరాన్‌, సౌదీ అరేబియా మధ్య బంధం కూడా ఉద్రిక్తంగా ఉంది. రెండూ ఒక విధంగా కోల్డ్ వార్‌లో ఉన్నాయి. అయితే కతార్‌తో ఇరాన్ బంధం కాస్త మెరుగ్గానే ఉంది.

సౌదీ అరేబియాలో ఎన్నో సామాజిక సంస్కరణలు చేపట్టిన మొహమ్మద్ బిన్ సల్మాన్, తన దేశంలో చాలా ప్రజాదరణ సంపాదించారు. వాటిలో మహిళలకు డ్రైవింగ్ అనుమతి, మహిళలు, పురుషులు పాల్గొనే కార్యక్రమాలు, సినిమాలు, కార్ ర్యాలీలు లాంటివి ఉన్నాయి.

కానీ రాజకీయంగా అణచివేత కూడా పెరిగింది. క్రౌన్ ప్రిన్స్ విధానాలను ఎవరైనా ప్రశ్నిస్తే వారిని దేశ భద్రతకు ముప్పుగా భావించి జైల్లో పెడుతున్నారు. మానవహక్కుల సంఘాలు ఇప్పటికీ సౌదీ అరేబియాను మానవ హక్కులను అత్యంత ఘోరంగా అణచివేసే దేశంగా భావిస్తున్నాయి.

ప్రస్తుతం సౌదీ అరేబియా ఎలాంటి స్థితిలో ఉందంటే, అలాంటి స్థితిలో అది ఇంతకు ముందు ఎప్పుడూ లేదు.

అన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, సౌదీ అరేబియా అంతర్జాతీయ స్థాయిలో కీలక స్థానంలో కొనసాగుతోంది. ఇదే ఏడాది నవంబర్‌లో అక్కడ జీ-20 సదస్సు జరగబోతోంది. మిత్రదేశాలు సౌదీని ఎలాంటి భాగస్వామిగా భావిస్తున్నారంటే, దాని ఉనికి వారికి కలవరం కలిగించేదే అయినా, వారు ఆ దేశాన్ని విస్మరించలేరు.

బలమైన పాలకుడు

34 ఏళ్ల మొహమ్మద్ బిన్ సల్మాన్ అధికారానికి ఎదురే లేకుండా పోయింది. ఆయనకు తన తండ్రి, 84 ఏళ్ల కింగ్ సల్మాన్ మద్దతు ఉంది. ప్రత్యర్థి ఎవరైనా సరే, సులభంగా పక్కకు నెట్టేయగల సామర్థ్యం ఆయన సొంతం.

ఒకప్పుడు క్రౌన్ ప్రిన్స్ అవుతాడని భావించిన ఆయన సవతి సోదరుడిని 2017లో జరిగిన తిరుగుబాటుతో జైల్లో పెట్టారు. అతడికి ఉన్న అన్ని శక్తులూ లాక్కున్నారు.

మొహమ్మద్ బిన్ సల్మాన్ సవరణలు, సంప్రదాయేతర చర్యలు దేశాన్ని ప్రమాదకర మార్గంలోకి నెట్టేస్తున్నాయని, కానీ ఆయనంటే భయంతో దేశంలో ఎవరూ నోరు తెరిచే సాహసం చేయడం లేదని సౌదీలోని పురాతన సంప్రదాయ వాదులు చెబుతున్నారు.

విదేశాల్లో క్రౌన్ ప్రిన్స్ ఇమేజ్ మాత్రమే కాదు, ఆయనకు యువతలో కూడా చాలా పాపులారిటీ ఉంది. “తన ఉదారవాద చర్యల వల్ల ఆయనకు చాలా ప్రయోజనం లభించింది” అని విలియం పాంటీ అంటారు.

ఈ ఉదారవాద చర్యలతో వచ్చిన ప్రజాదరణతోపాటు దేశంలోని ఒక పెద్ద భాగం ప్రజలు మొహమ్మద్ బిన్ సల్మాన్ సౌదీ అరేబియా ఆర్థికవ్యవస్థకు బంగారం లాంటి ఒక కొత్త భవిష్యత్తును ఇవ్వగలరని భావిస్తున్నారు.

వారి ఆశలు ముక్కలైతే, తర్వాత సౌదీ రాజ సుల్తనేట్ అజేయ శక్తికి షాక్ తగిలే అవకాశం ఉంది.

కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104. మానసిక సమస్యల, ఆందోళనల పరిష్కారానికి హెల్ప్‌లైన్ నంబర్ 08046110007

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)