You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘నాన్నా! నన్ను కాపాడు అంటూ చివరి క్షణం వరకు అరుస్తూనే ఉన్నాడు’.. నోయిడాలో నీటితో నిండిన నిర్మాణ స్థలంలో కారుతో మునిగిపోయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తండ్రి ఆవేదన
- రచయిత, చెరిలాన్ మొల్లన్ముంబై
- హోదా, ముంబై
కారుతో నీటిగుంతలో పడి 27 ఏళ్ల ఐటీ ఉద్యోగి మరణించారు. ఈ ఘటన భారతదేశంలో పట్టణ ప్రణాళిక, రహదారి భద్రతపై ప్రశ్నలను లేవనెత్తింది.
గత శుక్రవారం అర్ధరాత్రి యువరాజ్ మెహతా అనే ఐటీ ఉద్యోగి దిల్లీ శివారు ప్రాంతమైన నోయిడాలోని తన ఇంటికి కారులో వెళ్తుండగా.. దట్టమైన పొగమంచు కారణంగా ఆయన కారు దిగువన ఉన్న సరిహద్దు గోడను ఢీకొట్టి నీటితో నిండిన లోతైన గుంతలోకి పడిపోయింది.
కొన్నేళ్ల కిందట ఆ స్థలాన్ని తవ్వి, పనులు మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది.
తన కారు మునిగిపోతూ ఉండడంతో.. ఈత కొట్టడంరాని యువరాజ్ మెహతా దాని పైకప్పుపైకి ఎక్కి తన తండ్రికి ఫోన్ చేశారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అత్యవసర సేవలకు సమాచారం అందించారు. మెహతా దాదాపు రెండు గంటల పాటు నీటిగుంతలోనే ఉండిపోయాడని, తన ఫోన్‌లో టార్చ్ వెలిగించి సాయం కోసం అరుస్తున్నాడని ఆయన తండ్రి విలేకరులకు తెలిపారు.
కానీ ఆ తర్వాత యువరాజ్ ఆర్తనాదాలు ఆగిపోయాయి.
అధికారులు యువరాజ్ మృతదేహాన్ని వెలికితీసే సమయానికి.. ప్రమాదం జరిగి అయిదు గంటలు గడిచిందని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది.
మెహతా మరణం జాతీయ స్థాయిలో వార్తల్లో నిలిచింది.
ప్రమాద స్థలంలో నిరసనలు జరిగాయి. అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దీనికి బాధ్యతవహించాలని డిమాండ్ చేస్తూ ప్రజలు నిరసన తెలిపారు.
యువరాజ్ మరణం భారతీయ రహదారులు, పట్టణ ప్రణాళిక స్థితి గురించి ప్రశ్నలు లేవనెత్తింది.
"నోయిడా టెక్కీ మెహతా మరణం నిజానికి ఒక హత్య. కలలు చెదిరిపోయాయి. తండ్రి ఆశలు సమాధి అయ్యాయి. ఇదంతా విఫలమైన వ్యవస్థ కారణంగానే" అని ఒక యూజర్ ‘ఎక్స్’లో రాశారు.
"ఈ విషాదం నోయిడా వంటి పెద్ద నగరాల్లో కూడా మౌలిక సదుపాయాల నాణ్యత గురించి లోతైన ప్రశ్నలను లేవనెత్తుతుంది" అని మరొకరు రాశారు.
కొంతమంది యూజర్లు.. గుంతలుపడిన రోడ్లు, తగిన సూచిన బోర్డ్‌లు లేకపోవడం, రాత్రి సమయంలో సరైన వెలుతురు లేకపోవడం వల్ల జరిగిన ప్రమాదాల అనుభవాలను పంచుకున్నారు.
మరికొందరు తమ ఇళ్ల దగ్గరున్నరోడ్లపై ఓపెన్ డ్రెయిన్లు, నిర్మాణ స్థలాలు.. పిల్లలు, వృద్ధులకు ప్రమాదకరంగా మారుతున్నాయని ఫిర్యాదు చేశారు.
మెహతా కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు నోయిడా పోలీసులు ఆ గొయ్యి ఉన్న నిర్మాణ స్థలం రియల్ ఎస్టేట్ డెవలపర్లపై రెండు కేసులు నమోదు చేశారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం టౌన్‌షిప్ పాలకసంస్థలో ఒక సీనియర్ అధికారిని తొలగించింది. రెస్క్యూ ఆపరేషన్, ప్రమాద స్థల భద్రతా పరిస్థితులను పరిశీలించేందుకు దర్యాప్తు జరపాలని అధికారులను ఆదేశించింది.
ఆ తర్వాత పోలీసులు నిర్మాణ స్థలం యజమానులలో ఒకరైన అభయ్ కుమార్‌ను అరెస్టు చేశారు. కుమార్ కస్టడీలో ఉన్నారు.
తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని, రాబోయే రోజుల్లో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే తన కొడుకు నుంచి తనకు ఫోన్ వచ్చిందని మెహతా తండ్రి రాజ్ కుమార్ మీడియా ఇంటర్వ్యూలలో తెలిపారు. ఆయన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు కానీ ఆ ప్రదేశం పూర్తిగా చీకటిగా, పొగమంచుతో నిండి ఉందని, బురదమయమైన ఆ నీటిలో తన కొడుకు కనిపించలేదని అన్నారు.
ఆయన పోలీసులకు, అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. కొద్దిసేపటికే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి వచ్చినప్పటికీ, తన కొడుకును బయటకు తీయడానికి అవసరమైన సదుపాయాలు వారి వద్ద లేకపోవడంతో గంటల తరబడి అందులోనే చిక్కుకుపోయాడని ఆయన చెప్పారు.
తన కొడుకును వెలికి తీయడానికి శిక్షణ పొందిన డైవర్లను పంపి బతికేవాడని, కానీ అలా పంపలేదని ఆయన అన్నారు.
తను చనిపోయేవరకు 'పాపా ముజే బచా లో' (నాన్నా నన్ను కాపాడు) అని అరుస్తూనే ఉన్నాడని అని రాజ్‌కుమార్ మెహతా ఎన్‌డీటీవీ న్యూస్ ఛానెల్‌తో అన్నారు.
ఒక ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లో డెలివరీ వర్కర్‌గా పనిచేసే మోనిందర్ అనే వ్యక్తి అటుగా వెళ్తూ మెహతాను కాపాడటానికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. నడుముకు తాడు కట్టుకుని, బురదనీటిలోకి దిగి యువరాజ్‌ను బయటకు తీయడానికి ప్రయత్నించానని హిందూస్తాన్ టైమ్స్ వార్తాపత్రికతో మోనిందర్ చెప్పారు.
యువరాజ్ కోసం 30-40 నిమిషాలు వెతికానని, కానీ ఆయన ఆచూకీ తెలియలేదని ఆయన అన్నారు. గుంతలోనీరు చాలా చల్లగా ఉండి, గొయ్యి లోపల ఇనుప రాడ్లు ఉండడంతో అత్యవసర సిబ్బంది నీటిలో దిగడానికి ఇష్టపడలేదని కూడా ఆయన ఆరోపించారు.
నోయిడా అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ నరైన్ మిశ్రా మీడియాతో మాట్లాడుతూ ఈ సంఘటన దురదృష్టకరం అని అన్నారు. కానీ, నిర్లక్ష్యం జరగలేదని పేర్కొన్నారు.
"పోలీసులు, అగ్నిమాపక బృందాలు యువకుడిని రక్షించడానికి ప్రయత్నాలు చేశాయి. అగ్నిమాపక శాఖ క్రేన్, నిచ్చెన, బోట్, సెర్చ్ లైట్లు ఉపయోగించారు. కానీ ఆ సమయంలో సరిగా కనిపించలేదు" అని ఆయన టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికతో అన్నారు, తదుపరి దర్యాప్తు జరుగుతోందని చెప్పారు.
నోయిడా అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ హేమంత్ ఉపాధ్యాయ ‘ది ఇండిపెండెంట్’ పత్రికతో మాట్లాడుతూ, శిక్షణ లేని సిబ్బందిని పంపితే మరింత ప్రాణనష్టం జరుగుతుందని అధికారులు ఆందోళన చెందుతున్నందున ఎవరినీ ఆ గుంతలోకి పంపలేదని అన్నారు.
"గుంత చాలా లోతుగా ఉంది, అసలేమీ కనిపించలేదు. నీటిలో బురద, ఇనుప రాడ్ల్‌లు ఉండడంతో ఆందోళనపడ్డారు" అని ఆయన చెప్పారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)