You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
టీ20 ప్రపంచ కప్: భారత్‌లో క్రికెట్ ఆడబోం.. ప్రకటించిన బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్
భారతదేశంలో క్రికెట్ ఆడరాదని బంగ్లాదేశ్ నిర్ణయించింది. టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనేందుకు తమ జట్టు వెళ్లబోవడం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్(బీసీబీ) అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం ప్రకటించారు.
అంతకుముందు ఆయన బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ క్రీడా సలహాదారు ఆసిఫ్ నజ్రుల్‌తో సమావేశమయ్యారు. వారిద్దరి సమావేశం తరువాత ఈ నిర్ణయం వెలువడింది.
ఆసిఫ్ నజ్రుల్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘భారత్‌లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌లో ఆడకూడదన్నది మా ప్రభుత్వ నిర్ణయం’ అని స్పష్టం చేశారు.
"ఐసీసీలో మాకు న్యాయం జరగలేదు. ఐసీసీ మా ఆటగాళ్ల భద్రత సమస్యలను పరిగణనలోకి తీసుకుంటుందని, శ్రీలంకలో ఆడాలనే మా అభ్యర్థనను అంగీకరిస్తుందని మేం ఆశిస్తున్నాం" అని అన్నారు.
కాగా, బీసీబీ అధ్యక్షుడు అమీనుల్ ఇస్లాం మాట్లాడుతూ.. ‘మేం మళ్లీ ఐసీసీని సంప్రదిస్తాం. భారత్‌లో కాకుండా శ్రీలంకలో మేం మ్యాచ్‌లు ఆడాలనుకుంటున్నాం’ అని చెప్పారు.
అంతకుముందు, అమీనుల్ ఇస్లాం టీ20 వరల్డ్ కప్‌లో పాల్గొనే విషయంలో ఏదైనా అద్భుతం జరగొచ్చని అన్నారు. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నుంచి అల్టిమేటం వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు.
భారత్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతల మధ్య, భద్రతా కారణాలను చూపిస్తూ తమ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్ నుంచి శ్రీలంకకు మార్చాలని మొదట బంగ్లాదేశ్ అభ్యర్థించింది.
దానికి ఐసీసీ స్పందిస్తూ.. భద్రతపరమైన అన్ని విషయాలూ సమీక్షించామని, ఇంత తక్కువ సమయంలో మార్పులు చేయడం సాధ్యం కాదని తెలిపింది.
ఈ పరిణామలన్నిటి నేపథ్యంలో బుధవారం(21.01.2026) ఐసీసీ బోర్డు సమావేశం జరిగినట్టు క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.
ఈ సమావేశంలో.. బంగ్లాదేశ్ జట్టు భారతదేశానికి వెళ్లకపోతే ఆ స్థానంలో వేరొక జట్టును ఎంపిక చేస్తామని బంగ్లదేశ్ క్రికెట్ బోర్డ్‌కు ఐసీసీ స్పష్టం చేయగా.. బంగ్లాదేశ్ ప్రభుత్వంతో ఈ విషయాన్ని చర్చించడానికి అమీనుల్ ఇస్లాం ఐసీసీ నుంచి సమయం కోరినట్లు కూడా క్రిక్ ఇన్ఫో పేర్కొంది.
"నేను చివరిసారి మా ప్రభుత్వంతో మాట్లాడేందుకు ఐసీసీ బోర్డు నుంచి సమయం కోరాను. దాంతో స్పందించడానికి నాకు 24 నుంచి 48 గంటల సమయం ఇచ్చారు. నేను ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని అనుకోవడం లేదు. భారతదేశం మాకు సురక్షితం కాదని మాకు తెలుసు. శ్రీలంకలోనే ఆడాలనే నిర్ణయానికి మేం కట్టుబడి ఉన్నాం. ఐసీసీ మా అభ్యర్థనను తిరస్కరించిందని నాకు తెలుసు, అయినా మా ప్రభుత్వంతో మరోసారి మాట్లాడుతాం. ప్రభుత్వ స్పందనను ఐసీసీకి తెలియజేస్తాను" అని అమీనుల్ ఇస్లాం చెప్పినట్టు క్రిక్ ఇన్ఫో పేర్కొంది.
ఒక్క రోజులో ఏం సాధించగలరని ఆయనను విలేకరులు అడిగినప్పుడు, "నేను ఐసీసీ నుంచి ఒక అద్భుతం జరుగుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచ కప్‌లో ఆడటానికి ఇష్టపడని వారెవరు? బంగ్లాదేశ్ ఆటగాళ్లు కూడా ప్రపంచ కప్ ఆడాలని కోరుకుంటారు. కానీ భారతదేశం మా ఆటగాళ్లకు సురక్షితమని మేం భావించడం లేదు. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకునేటప్పుడు కేవలం ఆటగాళ్లనే కాదు, అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుంది" అని అమీనుల్ ఇస్లాం చెప్పినట్టుగా క్రిక్ ఇన్ఫో వెబ్‌సైట్ పేర్కొంది.
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభమయ్యే ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ 'గ్రూప్-సి'లో ఉంది.
'గ్రూప్-సి'లో బంగ్లాదేశ్‌తో పాటు ఇంగ్లండ్, ఇటలీ, వెస్టిండీస్, నేపాల్ ఉన్నాయి.
ఈ టోర్నీలో బంగ్లాదేశ్, వెస్టిండీస్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. బంగ్లాదేశ్ కోల్‌కతాలో మూడు గ్రూప్ దశ మ్యాచ్‌లు, ముంబయిలో ఒక మ్యాచ్ ఆడాల్సి ఉంది.
ఈ ప్రపంచ కప్‌ను భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.
ఐపీఎల్ జట్టు నుంచి..
కొద్దికాలంగా భారత్, బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు క్షీణిస్తూ వచ్చాయి.
ఇటీవల భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఐపీఎల్ ఫ్రాంచైజీ కోల్‌కతా నైట్ రైడర్స్‌ను బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను విడుదల చేయాలని ఆదేశించింది.
ఐపీఎల్ 2026 కోసం కోల్‌కతా నైట్ రైడర్స్(కేకేఆర్) ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9 కోట్లకు పైగా చెల్లించి వేలంలో కొనుగోలు చేసింది.
ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేకేఆర్ నుంచి తొలగించడంపై బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వానికి చెందిన యువజన, క్రీడా వ్యవహారాల సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ మాట్లాడుతూ.. "బంగ్లాదేశ్ క్రికెటర్లను, తమ దేశాన్ని అవమానించడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం" అన్నారు.
మరోవైపు బంగ్లాదేశ్ తమ దేశంలో ఐపీఎల్ ప్రసారాన్ని నిషేధించింది.
ప్రభుత్వంతో సంప్రదించిన తర్వాత, భద్రతా కారణాల దృష్ట్యా టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌ల కోసం బంగ్లాదేశ్ జట్టు భారతదేశానికి వెళ్లదని పేర్కొంటూ జనవరి 4న, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఐసీసీకి లేఖ రాసింది.
అయితే బీసీబీ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది.
మరోవైపు బంగ్లాదేశ్ నిర్ణయానికి ఐసీసీ వద్ద పీసీబీ మద్దతు పలికిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డులోని ఒక సోర్స్‌ని ఉటంకిస్తూ వార్తా సంస్థ పీటీఐ కూడా తెలిపింది. అయితే, ఈ విషయంపై పీసీబీ నుంచి ఎటువంటి బహిరంగ ప్రకటన వెలువడలేదు.
బీసీసీఐ, ఐసీసీతో ఉన్న హైబ్రిడ్ మోడల్ ఒప్పందం ప్రకారం పాకిస్తాన్ తన అన్ని టీ20 ప్రపంచ కప్ మ్యాచ్‌లను శ్రీలంకలో ఆడనుంది.
2026 టీ20 ప్రపంచ కప్ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని, బంగ్లాదేశ్ మ్యాచ్‌లు భారతదేశంలో మాత్రమే జరుగుతాయని ఐసీసీ తన ప్రకటనలో ధృవీకరించింది .
"జనవరి 21 బుధవారం వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన ఐసీసీ బోర్డు సమావేశం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. శ్రీలంకలో తన మ్యాచ్‌లను నిర్వహించాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు చేసిన అభ్యర్థన మేరకు భవిష్యత్తు కార్యాచరణను చర్చించడానికి ఈ సమావేశం జరిగింది" అని ఐసీసీ తెలిపింది.
"దేశంలోని ఏ టోర్నమెంట్ వేదిక వద్దనైనా బంగ్లాదేశ్ ఆటగాళ్లు, మీడియా సిబ్బంది, అధికారులు, అభిమానులకు ఎటువంటి ప్రమాదం లేదని సూచించిన స్వతంత్ర సమీక్షతో సహా అన్ని భద్రతా అంచనాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నాం" అని ఐసీసీ ఒక ప్రకటనలో తెలిపింది.
"టోర్నమెంట్ ప్రారంభానికి ముందు మార్పులు చేయడం సాధ్యం కాదని, అలాగే ఎటువంటి భద్రతా ముప్పు లేనప్పుడు షెడ్యూల్‌ను మార్చితే భవిష్యత్తులో ఐసీసీ ఈవెంట్‌లకు సమస్యలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతుంది" అని ఆ సమావేశం తేల్చింది.
"ఐసీసీ వేదిక, షెడ్యూల్ నిర్ణయాలు భద్రతా అంచనాలు, హోస్ట్ హామీలు, టోర్నమెంట్‌లో పాల్గొనడానికి ఒప్పందాల ద్వారా తీసుకుంటారు. ఈ నియమాలు పాల్గొనే 20 దేశాలకు సమానంగా వర్తిస్తాయి. బంగ్లాదేశ్ జట్టు భద్రతను ప్రభావితం చేసే ఎటువంటి స్వతంత్ర భద్రతా నివేదికలు లేనందున, ఐసీసీ మ్యాచ్‌లను మార్చలేకపోయింది" అని ఐసీసీ ప్రతినిధి అన్నారు.
( బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్‌రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్‌బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)