అంతర్జాతీయ న్యాయస్థానం తలుపు తట్టిన నిర్భయ దోషులు: ప్రెస్‌రివ్యూ

నిర్భయ కేసులో నలుగురు దోషులు అంతర్జాతీయ కోర్టుకు వెళ్లినట్లు సాక్షి సహా ప్రధాన పత్రికలన్నీ కథనం ప్రచురించాయి.

నిర్భయ కేసు మరో మలుపు తిరిగింది. ఉరిశిక్ష అమలుపై స్టే ఇవ్వాలంటూ నలుగురు దోషుల్లో ముగ్గురు అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) తలుపు తట్టారు.

ఈ కేసు విచారణ తప్పులతడకగా సాగిందని, తమను బలిపశువులుగా చేసి, అన్యాయంగా శిక్ష విధించారని వారు తమ పిటిషన్‌లో ఆరోపించారని కథనంలో చెప్పారు.

'మాకు పాలీగ్రాఫ్, లై డిటెక్టర్, బ్రెయిన్‌ మ్యాపింగ్‌ వంటి పరీక్షలు కూడా చేయాలని కోరినా దర్యాప్తు అధికారులు పట్టించుకోలేదు.

'బాధితురాలి సన్నిహితులు చెప్పిన తప్పుడు సాక్ష్యం ఆధారంగా శిక్ష ఖరారు చేసి, మమ్మల్ని బలిపశువులుగా మార్చారు, దీనిపై ఐసీజే జోక్యం చేసుకుని తక్షణమే విచారణ జరపాలి' అని వారు చెప్పినట్లు పత్రిక రాసింది.

నలుగురు దోషులకు న్యాయపరమైన వెసులుబాటు మార్గాలు ఇంకా మిగిలి ఉండగానే తీహార్‌ జైలు అధికారులు ఈ నెల 20వ తేదీన ఉరిశిక్ష అమలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని దోషుల తరఫు లాయర్‌ ఏపీ సింగ్‌ వ్యాఖ్యానించారని చెప్పారు.

అంతకుముందు.. న్యాయపరమైన తన హక్కులను తిరిగి పునరుద్ధరించాలంటూ దోషి ముకేశ్‌ సింగ్‌ పెట్టుకున్న పిటిషన్‌ సమర్ధనీయం కాదంటూ సుప్రీంకోర్టు తిరస్కరించిందని కథనంలో వివరించారు.

ఉన్నతస్థాయి సంప్రదింపుల తర్వాతే...

అత్యున్నత స్థాయి సంప్రదింపుల తర్వాతే స్థానిక ఎన్నికలను వాయిదావేసినట్లు ఎన్నికల కమిషనర్ గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు వివరించినట్లు ఈనాడు కథనం ప్రచురించింది.

కరోనావైరస్‌ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చేసిన సూచనలు, అత్యున్నత స్థాయిలో జరిపిన సంప్రదింపుల తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నట్లు గవర్నర్ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఎన్నికల కమిషనర్‌ రమేశ్‌ కుమార్‌ వివరించారని రాశారు.

కరోనా నేపథ్యంలో స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తూ కమిషనర్ తీసుకున్న నిర్ణయంపై ముఖ్యమంత్రి జగన్‌ ఆదివారం గవర్నరును కలిసి ఫిర్యాదు చేశారు.

అనంతరం విలేకరుల సమావేశంలోనూ కమిషనర్ నిర్ణయంపై ముఖ్యమంత్రి అభ్యంతరాలు వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కమిషనర్ సోమవారం ఉదయం గవర్నరును కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. గంటకుపైగా వారి మధ్య జరిగిన చర్చలో... బ్యాలెట్‌ పత్రాల వినియోగం, వాటివల్ల కరోనా వైరస్‌ వ్యాప్తి అవకాశాలు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను ఎన్నికల కమిషనర్ ప్రస్తావించినట్లు తెలిసిందని ఈనాడు చెప్పింది.

వాయిదా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని యథావిధిగా ఎన్నికలను నిర్వహించాలని ఎన్నికల కమిషనర్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాసిన లేఖపైనా చర్చ జరిగిందనే సమాచారం అందినట్లు చెప్పింది.

ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో, హైకోర్టులో కేసులు వేసిన విషయం ప్రస్తావనకొచ్చినట్లు తెలుస్తోంది. గవర్నరుతో ఎన్నికల కమిషనర్ భేటీపై ఎన్నికల సంఘం ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదని ఈనాడు కథనంలో వివరించింది.

కొంతమేర ఆదాయం పెంచుతాం: కేసీఆర్

తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్, మద్యం మరింత ప్రియం కానున్నట్లు ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది.

''తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ భూముల విలువ ఒక్క రూపాయి కూడా పెంచలేదు. ఈసారి ఆశల బడ్జెట్‌ పెట్టుకున్నాం. అందుకే కొంత మేర ఆదాయం పెంచుతాం'' అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు అని కథనంలో రాశారు.

భూముల విలువలను పెంచడం ద్వారా ఈ శాఖ ఆదాయాన్ని పెంచుకోనున్నట్లు ఆయన పరోక్షంగా వెల్లడించారు.

సమాజం, ప్రజలు నష్టపోకుండా రాష్ట్ర ప్రగతి కోసం పనిచేస్తామని, రాష్ట్రానికి నష్టం రానివ్వకుండా చూస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.

ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో చర్చ అనంతరం సీఎం కేసీఆర్‌ సమాధానమిచ్చారు. కష్టపడి సాధించిన తెలంగాణను అభివృద్ధిలో నడిపేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన చెప్పారు.

కరోనా, ఆర్థికమాంద్యం ఉన్నా వనరులు సమకూర్చుకుంటామని వెల్లడించారు. గనుల శాఖ నుంచి ఆదాయాన్ని పెంచుకుంటామన్నారు. గతంలో ఇసుక ఆదాయం కేవలం రూ.40 కోట్లుగా ఉందేదని, ఈసారి ఆరేడు వేల కోట్లకు ఆదాయాన్ని పెంచుతామని చెప్పారు.

తాగినవాడే తాళ్లపన్ను కట్టాలని, వీలైతే మద్యం ధరలు మళ్లీ పెంచుతామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారని పత్రిక రాసింది.

కొన్నింట్లో ఆదాయం పెంచుకోవాలని, కొన్నింటిలో లీకేజీలు తగ్గించుకోవాలని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. అన్నిమార్గాల ద్వారా రూ.1.63 లక్షల కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంటామని, సవరణ బడ్జెట్‌తో మరో 20 వేల కోట్లు సాధిస్తామని ఆయన వెల్లడించారని కథనంలో వివరించారు.

ఏపీ విద్యుత్ ఉద్యోగులూ.. గో బ్యాక్

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ఉద్యోగులు తెలంగాణలో చేరే ప్రయత్నాలకు వ్యతిరేకంగా స్థానిక విద్యుత్ ఉద్యోగులు ఆందోళనలు చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.

ఏపీ విద్యుత్‌ సంస్థల నుంచి రిలీవ్‌ అయిన ఆంధ్రా ఉద్యోగులు తెలంగాణలో చేరేందుకు ప్రయత్నించడంపై స్థానిక విద్యుత్‌ ఉద్యోగులు భగ్గుమన్నారు.

సుమారు 50 మంది రిలీవ్‌ ఆర్డర్లను తీసుకొని తెలంగాణ విద్యుత్‌ సంస్థల్లో చేరేందుకు రావడాన్ని వ్యతిరేకిస్తూ పెద్దఎత్తున ఆందోళనకు దిగారు.

దీంతో ఖైరతాబాద్‌లోని విద్యుత్‌సౌధ, మింట్‌ కాంపౌండ్‌లోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

ధర్మాధికారి ఉత్తర్వులకు విరుద్ధంగా.. ఆప్షన్లు ఇవ్వని 584 మందిని ఏపీ సర్కార్‌ రిలీవ్‌చేసిన విషయం తెలిసిందే.

వారిలో కొంతమంది సోమవారం తెలంగాణ సంస్థల్లో చేరేందుకు వచ్చారు. దీంతోవారిని విద్యుత్‌ సంస్థల్లో అడుగుపెట్టనియ్యకుండా అడ్డుకున్న తెలంగాణ ఉద్యోగులు.. 'ఆంధ్రా విద్యుత్‌ సంస్థలు డౌన్‌ డౌన్‌', 'ఏపీ ఉద్యోగులు గోబ్యాక్‌' అంటూ నినాదాలు చేశారు.

నల్లబ్యాడ్జీలు ధరించి, విద్యుత్‌సౌధ, టీఎస్‌ఎస్పీడీసీఎల్‌ కార్యాలయాల గేట్ల ముందు బైఠాయించారు. దీంతో కొందరు ఏపీ ఉద్యోగులు వెనుదిరిగిపోగా, మరికొంత మంది ఖైరతాబాద్‌ ఆస్కీ వైపు గుమిగూడటంతో పోలీసులు వారిని ఆదుపులోకి తీసుకొని గోషామహల్‌ స్టేడియానికి తరలించారు.

ఈ నెల 31 వరకు తెలంగాణవ్యాప్తంగా ఉద్యమాలు కొనసాగిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.

ఏ ఒక్క ఆంధ్రా ఉద్యోగిని విధుల్లో చేర్చుకోనివ్వబోమని టీఎస్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ జేఏసీ నేతలు, తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్‌ అసొసియేషన్‌ (టీఈఈఏ) అధ్యక్షుడు స్పష్టం చేసినట్లు నమస్తే తెలంగాణ రాసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)