You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: కోవిడ్-19 కేసుల నమోదు విషయంలో చైనాను దాటేసిన ప్రపంచ దేశాలు
చైనాలో నమోదైన కరోనావైరస్ కేసులతో పోల్చితే ప్రపంచ వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్యే అధికంగా ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సుమారు 87వేల కేసులు నమోదయ్యాయి. చైనా ఆరోగ్యశాఖ అందించిన సమాచారం ప్రకారం ఆ దేశంలో ఇప్పటి వరకు 80,860 కేసులు నమోదయ్యాయి. చైనాకు ఆవల కరోనావైరస్ కారణంగా ఇప్పటి వరకు 3,241 మరణాలు సంభవించగా..చైనాలో 3,208 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇటలీకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ విటొరియో గ్రెగొట్టి కరోనావైరస్ బారిన పడి మరణించారు. 92 విటొరియో 1992 బార్సిలోనా ఒలంపిక్ స్టేడియం పునర్నిర్మాణంలో సహాయపడ్డారు. మిలాన్‌లోని ఓ ఆస్పత్రిలో ఆయన మరణించారు. కోవిడ్-19 సోకిన తర్వాత న్యూమోనియా బారిన పడటంతో ఆయన చనిపోయారని స్థానిక మీడియా వెల్లడించింది.
సరిహద్దుల్ని మూసివేసిన దేశాల జాబితాలో తాజాగా జర్మనీ కూడా చేరింది. కరోనావైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో భాగంగా ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విజర్‌లాండ్ దేశాల సరిహద్దుల్ని మూసివేసింది. కేవలం వాణిజ్యవసరాల నిమిత్తం మాత్రమే వాహనాలకు అనుమతిస్తున్నట్లు పేర్కొంది.
బ్రిటన్లో మరో ఎంపీ కరోనావైరస్ బారిన పడ్డారు. లేబర్ పార్టీకి చెందిన కేట్ అస్బౌర్న్ కోవిడ్-19 సోకినట్టు వైద్య పరీక్షల్లో తేలింది. దీంతో వ్యాధి తగ్గేంత వరకు ఐసోలేషన్లో కొనసాగనున్నట్టు ఆమె ప్రకటించారు.
ఇటలీలో ఐసోలేషన్‌లో ఉన్న జనం ఒకరికొకరు సంఘీభావంగా వారి ఇళ్లల్లోని బాల్కానీల నుంచి పాటలు పాడుకుంటున్న వీడియో వైరల్‌కాగా ఇప్పుడు ఇరాన్ ప్రజలు కూడా వారినే అనుసరిస్తున్నారు. చైనా, ఇటలీ తర్వాత అత్యధిక కేసులు ఇరాన్‌లోనే నమోదయ్యాయి.
అమెరికా ప్రభుత్వం నిత్యావసర వస్తువుల విషయంలో భయపడాల్సిన లేదని పదే పదే చెబుతున్నప్పటికీ జనం మాత్రం వినే పరిస్థితుల్లో లేరు. కాలిఫోర్నియాలో ఇప్పటికే కిరాణా దుకాణాల ముందు భారీ క్యూలు కనిపిస్తున్నాయి.
స్విట్జర్లాండ్‌లో 841 కరోనావైరస్ కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 2200కు చేరింది. ఇప్పటి వరకూ 14మంది మరణించారు.
వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇప్పటికే దేశంలోని స్కూళ్లను మూసేశారు. వైద్య సిబ్బంది ఈ సమస్యను సమర్థంగా ఎదుర్కోవడానికి సైన్యం నుంచి హాస్పిటల్ బెటాలియన్‌ను రంగంలోకి దింపుతున్నారని స్థానిక మీడియా తెలిపింది.
కరోనావైరస్ మహమ్మారి కారణంగా ఫ్రాన్స్‌లో ప్రజాజీవనానికి అనువైన పరిస్థితులు రోజురోజుకీ వేగంగా దిగజారుతున్నాయని దేశ ఆర్థికసేవల ముఖ్య అధికారి ఒకరు తెలిపారు.
ప్రతి మూడు రోజులకూ నమోదవుతున్న కేసుల సంఖ్య రెట్టింపవుతోందని జెరేమీ సాల్మోన్ తెలిపారని ఏఎఫ్‌పీ వార్తాసంస్థ పేర్కొంది.
తీవ్రంగా జబ్బుపడినవారు, ప్రత్యేక పర్యవేక్షణ అవసరమైనవారి సంఖ్య వందల్లో ఉంటోందని ఆయన తెలిపారు.
ఇప్పటివరకూ ఫ్రాన్స్‌లో 5000కు పైగా కరోనావైరస్ కేసులు నమోదు కాగా, 127 మంది మరణించారు.
చైనా ఆర్థిక వ్యవస్థకు దెబ్బ
కరోనావైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. వేలకోట్ల సంపద ఆవిరైపోతోంది. చైనాలో మొదలైన ఈ వైరస్ దాదాపు 140కి పైగా దేశాలకు వ్యాపించింది.
చైనా పారిశ్రామిక ఉత్పత్తి కొత్త సంవత్సరంలోని మొదటి రెండు నెలల్లో వేగంగా తగ్గిందని సోమవారం విడుదల చేసిన అధికారిక గణాంకాలు చెబుతున్నాయి.
కరోనావైరస్‌ను కట్టడి చేసేందుకు కఠిన చర్యలు చేపట్టడంతో ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థికవ్యవస్థపై ప్రభావం పడింది.
చైనాలో కొత్తగా నమోదయ్యే కరోనావైరస్ కేసులు తగ్గుతుండడంతో, ఆర్థికవ్యవస్థ తిరిగి కోలుకోడానికి కొన్ని నెలలు పట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు.
వైరస్ ప్రపంచమంతా వ్యాపిస్తుండడంతో తమ వస్తువులకు డిమాండ్ తగ్గుతుందని చైనాలో ఆందోళన వ్యక్తం అవుతోంది.
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్‌కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్ సోకితే మనిషి శరీరానికి ఏమవుతుంది?
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్‌లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- చికెన్, గుడ్లు తింటే కరోనావైరస్ వస్తుందా... మీ సందేహాలకు సమాధానాలు
50 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలకు హెచ్చరికలు
అమెరికాలో 50 లేదా అంతకంటే ఎక్కువమంది హాజరయ్యే కార్యక్రమాలను రద్దు చేసుకోవాలని ఆరోగ్య శాఖ అధికారులు ప్రజలకు సూచించారు.
ఎక్కువమంది హాజరయ్యే కార్యక్రమాలను మరో 8 వారాలపాటు రద్దు చేసుకోవాలని, లేదా వాయిదా వేసుకోవాలని అమెరికా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ కోరింది.
అమెరికాలో దాదాపు 3 వేల కరోనాకేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 65 మంది మృతిచెందారు.
సరిహద్దుల మూసివేత
కరోనావైరస్ కేసులు పెరగడంతో దక్షిణ, మధ్య అమెరికా సరిహద్దులను మూసివేశారు.
పెరూ తన సరిహద్దులను మూసివేసింది. వాయు, సముద్ర రవాణాను నిలిపివేసింది.
బయట నుంచి వచ్చేవారికి సరిహద్దులను అర్జెంటీనా 15 రోజులపాటు మూసివేసింది. పబ్లిక్ ప్రైవేట్ స్కూళ్లలో క్లాసులు రద్దు చేసింది.
గ్వాటెమాలాలో మొదటి కరోనా మృతి నమోదైంది. పనామా కూడా విదేశీయులను అనుమతించడం లేదు. దేశంలో సూపర్ మార్కెట్లు, మెడికల్ షాపులు, ఆస్పత్రులు మినహా అన్నీ మూసివేయాలని ఆదేశించింది.
బయటి నుంచి వచ్చిన 12 మందికి వైరస్ పాజిటివ్ రావడంతో బీజింగ్‌లోని క్వారంటైన్ ప్రమాణాలను కఠినతరం చేశారు.
బయటి నుంచి చైనా వచ్చే వారందరూ క్వారంటైన్‌లో తప్పనిసరిగా 14 రోజులు గడపాలని, వారు అక్కడ బసచేసినప్పుడు డబ్బు చెల్లించాలని నిబంధనలు విధించింది.
ఇంతకు ముందు బయటి నుంచి వచ్చిన వారిని ఇళ్లలోనే ఒంటరిగా ఉంచేవారు.
మూడు రోజులుగా చైనాలో బయటి నుంచి వస్తున్న కరోనా వైరస్ కేసుల సంఖ్య పెరిగింది. సోమవారం వుహాన్‌లో కొత్తగా 4 కేసులు నమోదయ్యాయి.
అందరూ ఇళ్లలోనే ఉండాలి: చెక్ రిపబ్లిక్
దేశ ప్రజలు ఇతరులను కలవకుండా తమంతట తాము ఇళ్లలోనే ఉండాలని చెక్ రిపబ్లిక్ కోరింది.
కుటుంబ సభ్యులను చూడడానికి, పనికి, సరుకుల షాపింగ్, డాక్టరు దగ్గరకు, పెట్రోల్ కోసం వెళ్లడానికి మాత్రం అనుమతిస్తోంది.
ఇద్దరు వ్యక్తుల మధ్య దూరం రెండు మీటర్లు ఉండాలని, నగదుకు బదులు కార్డు ద్వారా చెల్లింపులు జరపాలని సూచించింది.
ప్రభుత్వ ఉద్యోగులు వీలైనంత వరకూ ఇళ్ల నుంచే సేవలు అందించడానికి ప్రయత్నించాలని కోరింది.
దేశంలో దుకాణాలు, రెస్టారెంట్లు, పబ్బులు, స్కూళ్లు ఇప్పటికే మూసివేశారు. 30 మందికి పైగా హాజరయ్యే కార్యక్రమాలను నిషేధించారు.
చెక్ రిపబ్లిక్ గతవారం సరిహద్దులను మూసివేసింది. విదేశీయులు దేశంలోకి రావడాన్ని నిషేధించింది.
బిడెన్, శాండర్స్ 'ఎల్బో బంప్'
అమెరికాలో డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థులు జో బిడెన్, బెర్నీ శాండర్స్ ఒక చర్చకు ముందు షేక్‌హాండ్ చేసుకోకుండా మోచేతులు తాకించుకోవడం (ఎల్బో బంప్) హాట్ టాపిక్ అయ్యింది.
కరోనావైరస్ గురించి సీఎన్ఎన్ నిర్వహించిన ఒక చర్చా కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు.
న్యూయార్కులో బార్లు, రెస్టారెంట్లు మూసివేత
మంగళవారం నుంచి న్యూయార్క్‌లోని అన్ని బార్లు, రెస్టారెంట్లు, ఇతర మాల్స్ మూసివేయాలని న్యూయార్క్ సిటీ మేయర్ బిల్ డీ బ్లేసియో ఆదేశించారు.
నగర ప్రజల జీవితాలను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మేం ఇదివరకు ఎప్పుడూ అమలుచేయని వరుస చర్యలు చేపడుతున్నామని ఆయన చెప్పారు.
"వైరస్ వ్యాపించే అవకాశం ఉండడంతో నగరంలోని రెస్టారెంట్లు, బార్లు, జనం దగ్గరగా కూర్చునే అవకాశం ఉన్న మిగతా ప్రాంతాలను మూసివేయాలని కఠిన నిర్ణయం తీసుకున్నాను. రేపు ఈ ఆదేశాలపై సంతకాలు చేస్తాను" అన్నారు.
సరిహద్దులు మూసేసిన జర్మనీ
ఫ్రాన్స్, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, లక్సెంబర్గ్, డెన్మార్క్‌లతో ఉన్న సరిహద్దులను జర్మనీ మూసివేసింది.
దేశ ప్రజలు ప్రయాణాలు చేయడానికి తగిన కారణం చూపించాలని సూచించింది. కరోనావైరస్‌కు గురైనట్లు తేలితే వారిని సరిహద్దులు దాటేందుకు అనుమతించమని చెప్పింది.
సరుకులు రవాణా చేసేవారు ఇప్పటికీ సరిహద్దులు దాటవచ్చు. జర్మనీ పౌరులు, నివాస అనుమతులు ఉన్న వారిని దేశంలోకి అనుమతిస్తున్నారు.
జర్మనీలో 4838 కరోనా కేసులు నమోదయ్యాయి, ఇప్పటివరకూ 12 మంది మృతిచెందారు.
అందరం ఇళ్లలోనే ఉందాం: ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గెర్
అందరూ ఇళ్లలోనే ఉండాలని హాలీవుడ్ నటుడు, రాజకీయ నాయకుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్ తన ఇంటి నుంచి జాగ్రత్తలు చెప్పారు.
"వృద్ధులు (అవును నాకు ఇప్పుడు 72 ఏళ్లు) ఇళ్లలోనే ఉండాలి" అని కాలిఫోర్నియాలో ఉన్న ఆర్నాల్డ్ అన్నారు.
"అందరూ కలిసి జరుపుకునే కార్యక్రమాలు మర్చిపొండి, రెస్టారెంట్లకు వెళ్లకండి, జిమ్స్ అన్నిటికీ దూరంగా ఉండండి. మనం ఇళ్లలోనే ఉందాం" అని ఒక వీడియోను ట్వీట్ చేశారు.
ఈ వీడియోలో ఆర్నాల్డ్ ఒంటరిగా లేరు. ఆయనతోపాటు విస్కీ, లూలూ అనే గాడిద, గుర్రం కూడా ఉన్నాయి. వాటికి కారట్ తినిపిస్తూ ఆయన ఈ వీడియో సందేశం ఇచ్చారు.
థాయ్‌లాండ్ ఆర్మీ వెల్ఫేర్ చీఫ్‌కు కరోనావైరస్
థాయ్‌లాండ్ సైనిక సంక్షేమ శాఖ అధ్యక్షుడికి చేసిన పరీక్షల్లో కరోనా పాజిటివ్ వచ్చిందని బ్యాంకాక్ పోస్ట్ ప్రచురించింది.
ఆయనకు దగ్గరగా మెలిగిన మరో 60 మందిలో ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. ఇప్పుడు వారందరూ తమకు తాముగా మిగతావారికి దూరంగా ఉంటున్నారు.
ఆస్ట్రేలియా రాష్ట్రాల అత్యవసర ప్రకటన
ఆస్ట్రేలియాలోని విక్టోరియా, పశ్చిమ ఆస్ట్రేలియా రాష్ట్రాలు కూడా అత్యవసర స్థితిని ప్రకటించాయి.
ఆస్ట్రేలియాకు వచ్చే అందరూ 14 రోజులపాటు తమకు తాముగా అందరికీ దూరంగా విడిగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది.
విక్టోరియాలో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 14 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం 300 కేసులు బయటపడ్డాయి.
చేతులు కడుక్కోండి-ట్రంప్ వినతి
చేతులు తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలంటూ అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ ఒక ట్వీట్ చేశారు.
వేలాది యాత్రికులను క్వారంటైన్ చేసిన టర్కీ
సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన 10 వేల మంది యాత్రికులను టర్కీలో ఒక వారానికి పైగా వేరుగా ఉంచారు. ఇక్కడ ఇప్పటివరకూ ఆరు కరోనా కేసులు నమోదయ్యాయి.
యాత్రికులు అందరినీ రాజధాని అంకారాలో వేరు వేరు గదుల్లో ఉంచినట్లు టర్కీ ఆరోగ్య శాఖ మంత్రి చెప్పారు.
గతవారం సౌదీ అరేబియా నుంచి తిరిగి వచ్చిన ఒక యాత్రికుడికి కరోనా పాజిటివ్ వచ్చింది.
సౌదీ అరేబియా కూడా మక్కా, మదీనా సందర్శన కోసం విదేశీ యాత్రికులు రావడంపై గత నెల నిషేధం విధించింది.
అమెరికాకు మాస్కులు పంపిన అలీబాబా అధినేత
చైనా వ్యాపారవేత్త, అలీబాబా గ్రూప్ కో ఫౌండర్ జాక్ మా అమెరికాకు మాస్కులు, కరోనావైరస్ టెస్ట్ కిట్స్ ఉన్న భారీ పార్శిళ్లను పంపించారు.
షాంఘై నుంచి పంపిన ఆ మాస్కులను అమెరికాలో ఉన్న మిత్రులకు అందిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
ఎయిర్ న్యూజీలాండ్ విమాన సేవల్లో కోత
ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో న్యూజీలాండ్ ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ న్యూజీలాండ్ విమాన సేవల్లో కోత పెట్టింది.
న్యూజీలాండ్ నుంచి విదేశీ విమాన సేవలను 85 శాతం, దేశీయ సేవలను 30 శాతం తగ్గిస్తున్నట్లు సంస్థ సోమవారం ప్రకటించింది.
న్యూజీలాండ్ ప్రజలు స్వదేశానికి రావడానికి పరిమితంగా విమాన సేవలు ఉపయోగించబోతున్నట్లు చెప్పింది.
దేశంలో ఇప్పటివరకూ 8 కరోనా కేసులు బయటపడ్డాయి.
దక్షిణ కొరియాలో తగ్గిన కరోనా కేసులు
ఆదివారం దక్షిణ కొరియాలో 74 కరోనా కేసులు నమోదయ్యాయి. గత మూడు వారాలుగా రోజూ నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఇదే తక్కువ.
దేశంలో ఇప్పటివరకూ 8236 కరోనా కేసులు బయటపడ్డాయి. 75 మంది మృతి చెందారు.
కరోనావైరస్ హెల్ప్‌లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: తెలంగాణలో పకడ్బందీ చర్యలు.. మార్చి 31 వరకే వివాహాలకు అనుమతి.. ఆ తరువాత తేదీలకు ఫంక్షన్ హాల్స్ బుకింగ్స్‌పై నిషేధం
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: తిరుమలకి భక్తుల రాకపోకలపై ప్రభావం ఎలా ఉంది? టీటీడీ అధికారులు తీసుకుంటున్న చర్యలేంటి
- కరోనావైరస్: ట్రంప్ చెప్పిన ఆరు గొప్పలు.. అందులో నిజానిజాలు
- ‘నేను చనిపోయినా ఫరవాలేదు.. ఈ వ్యాధిని ఆఫ్రికాకు మోసుకెళ్లకూడదని చైనాలోనే ఉండిపోయాను’
- పాకిస్తాన్‌లోని అతిపెద్ద మీడియా సంస్థ అధిపతిని ఎందుకు అరెస్ట్ చేశారు
- కరోనావైరస్: వర్క్ ఫ్రమ్ హోమ్ బాటలో కంపెనీలు.. ఇంటి నుంచి ఒంటరిగా పనిచేయటం ఎలా?
- కరోనావైరస్: ‘నాకూ కోవిడ్-19 పరీక్ష జరగొచ్చు’ - డోనల్డ్ ట్రంప్.. అమెరికాలో నేషనల్ ఎమర్జెన్సీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)