నాసా వ్యోమగామి అవకాశాన్ని దక్కించుకున్న హైదరాబాదీ :ప్రెస్ రివ్యూ

రాజా చారి

ఫొటో సోర్స్, NASA

ఫొటో క్యాప్షన్, రాజా చారి

రోదసిలోకి రాజాచారి

హైదరాబాద్‌ మూలాలున్న భారత సంతతి వ్యక్తి రాజా జాన్‌ వర్పుతూర్‌ చారి నాసాలో వ్యోమగామిగా ఎంపికయ్యారని 'నమస్తే తెలంగాణ' కథనం తెలిపింది.

''భవిష్యత్తులో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, చంద్రుడు, అంగారకుడిపైకి నాసా చేపట్టనున్న మానవ సహిత అంతరిక్ష యాత్ర ల్లో రాజాచారి(41) భాగస్వామి కానున్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసాచారి స్వస్థలం హైదరాబాద్‌. శ్రీనివాసాచారి కొన్ని దశాబ్దాల కిందటే ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లి స్థిరపడ్డారు. రాజాచారి అమెరికాలోనే పుట్టి పెరిగారు. రాజాచారి అమెరికా వైమానిక దళంలో కల్నల్‌గా పనిచేస్తూ నాసాకు దరఖాస్తు చేసుకున్నారు.

నాసా 2017లో వ్యోమగామి శిక్షణ కోసం దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 18వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో రాజాచారి సహా 11 మందిని ఎంపిక చేసింది. వారికి 2017 ఆగస్టులో శిక్షణ ప్రారంభమై.. దాదాపు రెండున్నరేండ్లపాటు సాగింది. శుక్రవారం హ్యూస్టన్‌లోని జాన్సన్‌ స్పేస్‌ సెంటర్‌లో శిక్షణ ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యోమగామి శిక్షణ పూర్తి చేసుకున్న 11 మందికి వెండి మెడల్‌ను బహూకరించారు. ఈ సిల్వర్ పిన్ అందుకున్న వారు రోదసి యాత్రలో పాల్గొంటారు.

రాజాచారి అమెరికాలోని అయోవా రాష్ట్రం వాటర్‌లూ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. అమెరికా వైమానిక దళంలో కర్నల్‌గా పనిచేస్తున్నారు. ఆయన యూఎస్‌ ఎయిర్‌ఫోర్స్‌ అకాడమీలో 'ఆస్ట్రోనాటికల్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ సైన్స్‌'లో డిగ్రీ పూర్తిచేశారు. మసాచూసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో పీజీ చేశారు. ఆ తర్వాత కాలిఫోర్నియా ఎయిర్‌బేస్‌లోని 461-ఫ్లైట్‌ టెస్ట్‌ స్కాడ్రన్‌లో కమాండర్‌గా చేరారు. రాజాచారి భార్య పేరు హోలీ. వారికి ముగ్గురు సంతానం. తన తండ్రి ఇచ్చిన స్ఫూర్తితోనే శ్రమించానని, ఉన్నత చదువులు చదివానని రాజాచారి చెప్తుంటార''ని ఆ కథనంలో వివరించారు.

కేటీఆర్

ఫొటో సోర్స్, facebook/KTR

'మున్సిపల్ ఎన్నికలు నా పనితీరుకు తీర్పు' -కేటీఆర్

తెలంగాణలో జరిగే పురపాలక, నగర పాలక ఎన్నికలను తన పనితీరుకు పరీక్షగా భావిస్తున్నానని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) చెప్పారని 'ఈనాడు' తెలిపింది.

ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేటీఆర్ మాట్లాడుతూ.. పురపాలక ఎన్నికల్లో బ్రహ్మాండమైన విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 'తెరాస హయాంలో పురపాలక సంఘాలకు కేటాయించిన నిధులు శ్వేతపత్రం విడుదల చేస్తాం. అందులో మీరు 10 శాతమైనా ఇచ్చారా' అని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేశారు. టీఆర్ఎస్‌ను ఒంటరిగా ఎదుర్కొనలేక కాంగ్రెస్, బీజేపీలు కుమ్మక్కయ్యాయని ఆరోపించారు. మజ్లిస్‌తో పొత్తు పెట్టుకునే ఆలోచన లేదని, మొత్తం 3,148 వార్డుల్లో పోటీ చేస్తామని చెప్పారు. విపక్షాలు తమను ఒంటరిగా ఎదుర్కోలేక నిజామాబాద్, జగిత్యాల రాయికల్, వేములవాడ, గద్వాల, నారాయణ పేట తదితర స్థానాల్లో కాంగ్రెస్, బీజేపీలు పరస్పర అవగాహనతో పోటీ చేస్తున్నాయన్నారు.

కాగా తెలంగాణలోని 120 పురపాలక సంఘాల్లో 2,727 వార్డులు, పది నగరపాలక సంస్థల్లోని 385 డివిజన్లకు ఎన్నికలు జరుగుతుండగా మొత్తం 30,800కి పైగా నామినేషన్లు దాఖలయ్యాయని మరో కథనంలో ఈనాడు తెలిపింది.

మావోయిస్టులు

ఫొటో సోర్స్, Getty Images

మళ్లీ మావోయిస్టుల కదలికలు

మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులో మళ్లీ మావోయిస్టుల కదలికలు ఉన్నాయని పోలీసువర్గాల సమాచారమంటూ 'సాక్షి' కథనం తెలిపింది.

''జులై, ఆగస్టు నెలల్లో గోదావరి పరీవాహక ప్రాంతంలో పలు ఘటనలకు పాల్పడిన మావోలు 4 నెలలుగా స్తబ్దతగా ఉన్నారు. వచ్చే ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర జరగనున్న నేపథ్యంలో మళ్లీ ఛత్తీస్‌గఢ్‌ నుంచి మావోయిస్టులు పూర్వ వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోకి చేరినట్లు సమాచారం అందుకున్న పోలీసులు అప్రమత్తమయ్యారు.

2013 మే 25న సుకుమా జిల్లాలో సల్వాజుడుం అధినేత మహేంద్రకర్మతో పాటు పలువురిని చంపిన కేసులో 'మోస్ట్‌ వాంటెడ్‌'గా మావోల జాబితాను విడుదల చేశారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లకు చెందిన మావోల ఫొటోలు, పేర్లు, రివార్డులతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 3 రాష్ట్రాల సరిహద్దుల్లో వాల్‌పోస్టర్లు వేసింది. తెలంగాణ ఇంటెలిజెన్స్‌ వర్గాలు కూడా గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను అప్రమత్తం చేశాయి. దీంతో 3 రాష్ట్రాల పోలీసు ఉన్నతాధికారులు 3 రోజుల కిందట సమావేశమైనట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్, లాల్‌గఢ్‌ ప్రాంతాలలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన మావో యిస్టు పార్టీ నాయకులు, కేడర్‌తో పాటు.. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 100 మంది వరకు సాయుధ నక్సల్స్‌ 3 గ్రూపులుగా తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించి నట్లు ఇంటెలిజెన్స్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే విషయమై వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గోదావరి పరీవాహక ప్రాంతాల పోలీసులను నిఘా వర్గాలు అప్రమత్తం చేసినట్లు తెలిసింది. మూడు రోజుల కిందట మావోల అణచివేత కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించిన ఓ సీనియర్‌ పోలీసు అధికారి ఈ ప్రాంతంలో పర్యటించి పలువురు పోలీసులతో మాట్లాడినట్లు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణలోకి ప్రవేశించిన మావోల్లో అత్యధికంగా ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రానికి చెందిన వారే ఉన్నట్లు వెల్లడించినట్లు తెలిసింది. అందులో 22 మంది వరకు తెలంగాణ ప్రాంతం కరీంనగర్, వరంగల్, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన వారు ఉన్నట్లు చెబుతున్నారు. 2016లో జిల్లాల పునర్‌ విభజన తర్వాత కేకేడబ్ల్యూ(ఖమ్మం - కరీంనగర్‌ - వరంగల్‌) కమిటీని ఎత్తివేసి దాని స్థానంలో మూడు డివిజన్‌ కమిటీలు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా యాప నారాయణ అలియాస్‌ లక్మా అలియాస్‌ హరిభూషణ్‌ వ్యవహరిస్తుండగా, బండి ప్రకాశ్‌ అలియాస్‌ క్రాంతి, బడే దామోదర్, మైలారపు భాస్కర్‌ సభ్యులుగా ఉన్నారు. మొత్తం సాయుధ బలగాలకు వీరే సారథ్యం వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆయా నాయకుల సూచనల మేరకు దాడులు, కార్యక్రమాలకు పాల్పడుతారని గుర్తించిన ఇంటెలిజెన్స్‌ వర్గాలు... పోలీసులను అప్రమత్తం చేయడం చర్చనీయాంశమైంద''ని ఆ కథనంలో తెలిపారు.

కన్నా

ఫొటో సోర్స్, facebook/Kanna Lakshmi Narayana

అమరావతి బరిలోకి బీజేపీ

రాజధాని విషయంలో బీజేపీ స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించిందని, అమరావతి రైతులకు అండగా నిలబడాలని తీర్మానించిందని 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''మూడు రాజధానులు తమకు సమ్మతం కాదని తేల్చి చెప్పింది. సంక్రాంతి తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకూ సిద్ధం కావాలని నిర్ణయించుకుంది. బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో గుంటూరులో శనివారం ఆ పార్టీ ముఖ్య నేతలు (కోర్‌ కమిటీ సభ్యులు) సమావేశమయ్యారు. ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేశ్‌, జీవీఎల్‌ నరసింహారావు, రాష్ట్ర పార్టీ ఇన్‌చార్జి సునీల్‌ దేవధర్‌, మహిళా మోర్చా జాతీయ నాయకురాలు పురందేశ్వరి తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.

రాజ్‌భవన్‌, సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం, అసెంబ్లీ, సీడ్‌ క్యాపిటల్‌ ఇలా ఏపీకి ముఖ్య పాలనా కేంద్రంగా అమరావతే ఉండాలని సమావేశంలో తీర్మానించారు. అమరావతిపై పార్టీ నేతలు తలోరకంగా మాట్లాడకూడదనే అంశంపైనా చర్చించారు. రాజధాని అమరావతిలోనే ఉండాలంటూ కన్నా చేస్తున్న ప్రకటనే పార్టీ విధానంగా ఉండాలని సుజనా సూచించారు. దీనికి సీఎం రమేశ్‌, పురందేశ్వరి తదితరులు మద్దతు పలికారు. రాజధాని విషయంలో కేంద్రం పాత్ర ఏమీ ఉండదని, తటస్థంగా ఉంటే సరిపోతుందని జీవీఎల్‌ అన్నట్లు తెలిసింద''ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)