పంజాబ్: 'కాంగ్రెస్‌లో ఉండను, బీజేపీలో చేరడం లేదు'- కెప్టెన్ అమరీందర్ సింగ్ - Newsreel

అమరీందర్ సింగ్

ఫొటో సోర్స్, facebook/captainamarindersingh

"బీజేపీలో చేరను, కానీ కాంగ్రెస్‌లో కూడా ఉండను" అని పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ అన్నారు.

"ఇప్పటివరకూ నేను కాంగ్రెస్‌లో ఉన్నా, కానీ నేను ఇక కాంగ్రెస్‌లో ఉండను. నేను బీజేపీలోకి కూడా వెళ్లడం లేదు" అని న్యూస్ చానల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో కెప్టెన్ అమరీందర్ సింగ్ చెప్పారు.

పంజాబ్‌లో కాంగ్రెస్ దిగజారుతోందని, సిద్ధూ లాంటి వ్యక్తికి పార్టీలో సీరియస్ పనులు అప్పగించిందని ఆయన అన్నారు.

"నేను 52 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. కానీ, ఆయన నాతో ఎలా ప్రవర్తించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు నాతో పదిన్నర గంటలకు మీరు రాజీనామా చేయండి అని చెప్పారు. నేను ఎలాంటి ప్రశ్నలూ అడగలేదు. నాలుగు గంటలకు గవర్నర్ దగ్గరికి వెళ్లి రాజీనామా ఇచ్చాను. 50 ఏళ్ల తర్వాత కూడా మీరు నన్ను సందేహిస్తుంటే, నా విశ్వసనీయతే ప్రమాదంలో పడినప్పుడు, ఎలాంటి నమ్మకం లేనప్పుడు పార్టీలో ఉండడంలో అర్థం లేదు" అన్నారు అమరీందర్ సింగ్.

amarinder singh

ఫొటో సోర్స్, Getty Images

అమిత్ షా, అజిత్ డోభాల్‌తో సమావేశం

అమరీందర్ సింగ్ ప్రస్తుతం దిల్లీలో ఉన్నారు. బుధవారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. గురువారం ఉదయం అమరీందర్ సింగ్ జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోబాల్‌తో సమావేశం అయ్యారు.

సెప్టెంబర్ 18న అమరీందర్ సింగ్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి పంజాబ్ కాంగ్రెస్‌ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి.

వచ్చే ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.

కొద్ది రోజుల కిందట అమరీందర్ రాజీనామా చేయడం, ఆయన స్థానంలో చరణ్‌జీత్ సింగ్ ఛన్నీ సీఎం కావడం తెలిసిందే.

అనంతరం ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్ధూ మంగళవారం తన పదవికి రాజీనామా చేయగా ఇప్పుడు అమరీందర్ బీజేపీ అధ్యక్షుడితో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

ఫుమియో కిషిడా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఫుమియో కిషిడా

ఫుమియో కిషిడా: జపాన్ కాబోయే ప్రధాని రేసులో విజేత

జపాన్‌‌లోని పాలక లిబరల్ డెమొక్రటిక్ పార్టీ(ఎల్డీపీ) నాయకత్వ రేసులో విజయం సాధించిన ఫుమియో కిషిడా ఆ దేశానికి ప్రధాని కానున్నారు.

ప్రస్తుత ప్రధాని యోషిహిదే సుగా నుంచి కిషిడా అక్టోబరు 4న ఆ బాధ్యతలు స్వీకరిస్తారు. కిషిడా జపాన్‌కు 100వ ప్రధాన మంత్రి కానున్నారు.

ప్రస్తుతం ప్రధాని పదవిలో ఉన్న సుగా ఏడాది కిందటే బాధ్యతలు చేపట్టారు. అయితే, ఆయన బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడంతో ఆయన స్థానంలో కిషిడాను పార్టీ ఎన్నుకుంది.

ప్రధానిగా వచ్చే సాధారణ ఎన్నికల్లో ఎల్డీపీని విజయం వైపు తీసుకెళ్లడమే కిషిడా ప్రధాన లక్ష్యం కానుంది.

కరోనా మహమ్మారి సమయంలో టోక్యో ఒలింపిక్స్‌ నిర్వహించడంపై జపాన్‌లో ప్రజావ్యతిరేకత వెల్లువెత్తింది. ఫలితంగా పాలక ఎల్డీపీ ప్రజాదరణ కోల్పోయింది.

సుగా స్థానంలో టారో కోనో ప్రధాని అవుతారని ఎక్కువ మంది భావించారు కానీ విదేశీ వ్యవహారాల మంత్రిగా పనిచేసిన కిషిడా ఆయన్ను వెనక్కు నెట్టి రేసులో విజేతగా నిలిచారు.

పార్లమెంటులో ఎల్డీపీకి ఆధిక్యం ఉండడంతో కిషిడా జపాన్ తర్వాత ప్రధాన మంత్రి కావడం ఖాయమైంది.

64 ఏళ్ల కిషిడా సుదీర్ఘ కాలంగా ఈ పదవి కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో సుగా ఆయనపై గెలిచారు.

జపాన్ కొత్త ప్రధానిగా కిషిడా ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. కోవిడ్ మహమ్మారిని అదుపు చేయడం, ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడం, ఉత్తర కొరియా బెదిరింపులకు ఎదురునిలవడం వంటివి ఆయన ముందున్న సవాళ్లు.

మహమ్మారిని ఎదుర్కోడానికి 'ఆరోగ్య సంక్షోభ నిర్వహణ సంస్థ'ను ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వీగర్ మైనారిటీల పట్ల చైనా తీరును ఖండిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించాలనే ఆలోచనకు మద్దతిచ్చారు.

"ప్రజలు మాటను వినడమే నా నైపుణ్యం. ఎల్డీపీ, జపాన్‌ ఉజ్వల భవిష్యత్తు కోసం అందరితో కలిసి కృషి చేయాలని నిర్ణయించుకున్నాను" అని ప్రధాని రేసులో విజయం సాధించిన తర్వాత కిషిడా అన్నారు.

చైనా విధానాలను తీవ్రంగా వ్యతిరేకించే నేతగా కిషిడోకు పేరుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)