దక్షిణాఫ్రికా: పాడుబడ్డ భవనం ‘హైజాక్’.. ప్రమాదకర పరిస్థితుల్లోనే ప్రజల నివాసం - ఫొటో ఫీచర్

దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్ నగరం అధిక స్థాయిలో నేరాలు, మాదక ద్రవ్యాలు, వ్యభిచార కూపాలతో బయటివ్యక్తులకు ప్రమాదకరంగా మారింది.
అక్కడి పాడుబడిన భవనాల్లో నివసించే కొందరి సహాయంతో, మా ఫొటో గ్రాఫర్ షిరాజ్ మొహమ్మద్, ఆ ప్రాంతంలోని పరిస్థితుల గురించి మరింత సమాచారాన్ని సేకరించారు.

హిల్‌బ్రోలోని సాన్ జోస్ భవనం మనుషులు నివసించడానికి అనువైనది కాదని అధికారులు ప్రకటించి 17 సంవత్సరాలు దాటింది.
ప్రస్తుతం ఆ బహుళ అంతస్థుల భవనం కిటికీలు, తలుపులు, ఫిట్టింగ్స్, ఫర్నీచర్ ఏదీ లేకుండా బోసిపోయింది.
చాలా ఏళ్ల క్రితమే ఆ భవనంలోని ఫర్నీచర్ అంతా స్క్రాప్ యార్డ్‌కు చేరుకుంది.
ఆ తర్వాత దీనిని కొందరు ‘హైజాక్’ చేశారు. దీన్నే తమ స్థావరంగా మార్చుకున్నారు. ఇంకొందరు దీన్ని తమ నివాసంగా చేసుకున్నారు.

ఇప్పుడు అందులో నివాసముంటున్న వారు వెచ్చదనం కోసం బ్లాంకెట్లు, ఫ్యాబ్రిక్ షీట్స్‌తో ఖాళీగా ఉన్న కిటికీలను మూసివేశారు.
చలికాలంలో ఉష్ణోగ్రతలు పడిపోయిన సమయంలో సాన్ జోస్‌లోని ఆ భవనంలో జీవనం మరింత దుర్భరంగా మారుతుంది. మధ్యాహ్న వేళల్లో మలమూత్రాల వాసన విపరీతంగా ఉంటుంది.

దక్షిణాఫ్రికాకు పొరుగున ఉన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంత ప్రజలతో పాటు ఆఫ్రికా నుంచి వలస వచ్చిన వారు ఆ భవనంలోనే నివసిస్తున్నారు.
ప్రస్తుతం ఆ భవనంలో నివసించే వారి సంఖ్య రెట్టింపై 200కు చేరింది. ఇందులో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. కరోనా వ్యాప్తి కట్టడి కోసం కర్ఫ్యూ అమలు చేయడంతో పాటు, లాక్‌డౌన్ వల్ల తలెత్తిన ఇబ్బందుల కారణంగా ఇక్కడ నివసించే వారి సంఖ్య పెరిగింది.

ఈ భవనం నివాసయోగ్యం కాదని తెలిసిన తర్వాత ఇక్కడి ప్రజలు కోర్టులో కేసు దాఖలు చేసి విజయం సాధించారు. ఫలితంగా వారిని అధికారులు 2008లో ప్రభుత్వం కేటాయించిన ఇళ్లకు తరలించారు.
హిల్ బ్రో ప్రాంతంతో పాటు పొరుగునే ఉన్న బెరీరా ప్రాంతాలను ఆధునీకరించడానికి సాన్ జోస్‌తో పాటు మరికొన్ని భవనాలను ఖాళీ చేయించారు. కానీ ఇంకా ఆ ప్రాంతాల్లో ఆధునీకరణ జరగలేదు. అక్కడి భవనాలను కూల్చివేయలేదు.

ఇలా మరుగున పడిపోయిన ఈ భవనాలు ఇప్పుడు నిర్వాసితులతో నిండిపోయాయి. ఇక్కడ ఉంటున్నందుకు వారు ఎలాంటి డబ్బు చెల్లించరు.
భవనంలోని బేస్‌మెంట్‌తో పాటు నిరుపయోగంగా మారిన ఎలివేటర్ షాప్ట్, దాని పరిసర ప్రాంతాలు వ్యర్థాలతో నిండిపోయాయి. అక్కడ విద్యుత్, టాయిలెట్లు, నీటి వసతులు ఉండవు. చీకటి ప్రదేశాల్లో, కొన్ని సార్లు పేమెంట్‌పైనే ప్రజలు తమ కనీస అవసరాలను తీర్చుకుంటారు.

''చలికాలంలో మరిన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది'' అని 37 ఏళ్ల సాబెలో మపేమ్‌పెని చెప్పారు.
గత నాలుగేళ్లుగా ఆయన అదే భవనంలో నివసిస్తున్నారు.
''చలికాలంలో ఉదయం నుంచి రాత్రి వరకు చలిమంట ఉంటేనే తాము బతకగలగమని, చలిమంట వేసుకునేందుకు 'ఎంబావులాస్' అనే లోహపాత్రను ఉపయోగిస్తామని'' ఆయన చెప్పారు.
చలికాచుకునేందుకు ఎంబావులాస్ ఉపయోగపడుతున్నప్పటికీ, దాని ద్వారా వెలువడే పొగ ఆరోగ్యానికి చేటు చేస్తోందని అన్నారు.

''ఇక్కడ జీవించడం భయానకంగా ఉంటుంది. ప్రజలు తొందరగా అనారోగ్యం బారిన పడి ఆస్పత్రుల పాలవుతారు'' అని సాబెలో అన్నారు.
జూలైలో చలి కారణంగా ఇక్కడ ఇద్దరు మరణించారు.
''మేం మంచి జీవితం కోసం కలలు కన్నాం. కానీ అది జరిగేలా లేదు. మేం రాతి మనుషుల్లా మారిపోయాం. పడుకోవడానికి పరుపు కాదు కదా కనీసం చాప కూడా లేదు'' లేదు సాబెలో చెప్పుకొచ్చారు.

భవనంలోని ఒక గదిలో డెరిక్ బ్రౌన్ (పైన చిత్రంలో కనిపిస్తోన్న వ్యక్తి) అగ్ని రాజేస్తూ కనిపించారు. ఆయన ఆ మంటపై తనకు, తన మిత్రుని కోసం కాఫీ తయారు చేయనున్నారు.
ఈ మంటనే ఆయనకు స్టౌ తరహాలో పనికి వస్తుంది. గదిని వెచ్చగా ఉండేలా చేస్తుంది.
ఐడెంటిటీ ఫ్రాడ్ నేరంలో జైలుకు వెళ్లిన బ్రౌన్ ఇటీవలే విడుదల అయ్యారు. ఆయనకు అక్కడ ఉండటం తప్ప మరో దారి లేదు.

అక్కడి ప్రజలకు జీవనం సాగించడమనేది చాలా కఠినమైన పోరాటం. కొందరు ఉదయం లేవగానే ఆహారం కోసం చెత్తకుండీల్లో వెదుకుతారు.
మరికొందరు బిక్షమెత్తుకుంటారు.

చర్చిలు, మతపరమైన సంస్థలు, చారిటీలు ఆహారాన్ని అందజేస్తూ వారి ప్రాణాలను కాపాడుతున్నాయి.
దక్షిణాఫ్రికాకు చెందిన ఒక ముస్లిం అసోసియేషన్ అందజేస్తోన్న బ్రెడ్, ఆహారం, బ్లాంకెట్ తీసుకోవడం కోసం క్యూ కట్టిన ప్రజల్ని మనం పైచిత్రంలో చూడొచ్చు.

సాన్ జోస్‌లో నివసిస్తోన్న చాలామంది తరహాలోనే తాను కూడా మాదకద్రవ్యాలకు బానిసగా మారినట్లు బ్రౌన్ చెప్పారు. ఆయన తన జీవితంలో ఎక్కువ భాగం జైలుకి వెళ్లి రావడానికే సరిపోయిందని అన్నారు.
పైన చిత్రంలో మాండ్రాక్స్ అనే మాదక ద్రవ్యాన్ని పీలుస్తోన్న వ్యక్తిని చూడవచ్చు. ఇందులో గంజాయి కూడా కలిసి ఉంటుంది. దీన్ని సిగరెట్ తరహాలో పీలుస్తారు.

'నేను వీధుల్లో నివసించిన తర్వాత సాన్ జోస్‌లోకి వచ్చాను. వీధుల్లో చలికి తట్టుకోలేక విలవిల్లాడుతుంటే నా స్నేహితుడొకరు నన్ను ఇక్కడకు తీసుకొచ్చారు' అని 23 ఏళ్ల మూసా సిఖేలే ( పైన చిత్రంలోని వ్యక్తి) చెప్పారు.
కొత్త వ్యక్తులు ఎవరైనా ఇక్కడికి వస్తే వారు దోపిడికి గురయ్యే అవకాశం ఉంది. ఈ భవనంలో ఎవరైనా తెలిసి వాళ్లుంటేనే ఇక్కడికి రాగలమని ఆయన అన్నారు.

ఇక్కడ నివసించేవారు వీలైనంత వరకు గదులను శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. భవన పరిస్థితి మరింత దిగజారకుండా చూసుకుంటారు.
ఈ భవనంలోకి నేరస్థులను రానీయకుండా వారు జాగ్రత్త పడతారు. ఎందుకంటే అలాంటివారితో తమ జీవితం మరింత గందరగోళంగా మారుతుంది.
సాన్ జోస్‌లోని ఈ మరుగుపడిన భవనంలో మూసా గత కొన్ని నెలలుగా ఉంటున్నారు. ఇక్కడ నివసించడం తనకు సంతోషంగా ఉందని ఆయన చెప్పారు.
చవకైన చైనీస్ వాచ్‌లు, బెల్ట్‌లు అమ్ముతూ జీవనోపాధి పొందడానికి మూసా ప్రయత్నిస్తున్నారు. అయినప్పటికీ దుస్తులు, ఆహారం కోసం ఆయన ఇతరులపై ఆధారపడుతుంటారు.
''ఇక్కడ జీవనం చాలా కఠినంగా ఉంటుంది. అందుకే నేను కష్టపడుతున్నాను. కానీ నేను అనుకున్నది సాధిస్తా'' అని మూసా చెప్పారు.
అన్ని ఫొటోలు కాపీరైట్‌కు లోబడి ఉంటాయి.
ఇవి కూడా చదవండి:
- కాకినాడ, చెన్నై మధ్య రోజూ వందల పడవలు తిరిగిన జలమార్గానికి ఇప్పుడేమైంది
- ‘పంజ్‌షీర్ పూర్తిగా గెలిచాం, అఫ్గానిస్తాన్‌లో యుద్ధం ముగిసినట్టే’: తాలిబాన్
- ‘రోజుకు 15 మందితో సెక్స్ చేయమని బలవంతం చేశారు’
- బిగ్‌బాస్ సీజన్ 5: హౌస్‌లోకి వెళ్లిన మొత్తం 19 మంది కంటెస్టెంట్లు వీరే
- పది వేళ్లతో 400 సంఖ్య వరకూ లెక్కించే అరుదైన భారతీయ పద్ధతి మీకు తెలుసా?
- టోక్యో పారాలింపిక్స్: 5 స్వర్ణ, 8 రజత, 6 కాంస్య పతకాలతో అదరగొట్టిన భారత్
- INDvsENG: 'రహానేను ఎందుకు తప్పించరు? హనుమ విహారికి ఛాన్స్ ఎందుకు ఇవ్వరు'
- ఆయుష్మాన్ భారత్ కంటే మోదీ ప్రతిష్టను పెంచే పథకాలపై ప్రచారాలకే కేంద్ర ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెట్టిందా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)








