కుల్‌భూషణ్ జాదవ్ కోసం వకీలును నియమించాలని ఆదేశించిన ఇస్లామాబాద్ హైకోర్టు

పాకిస్తాన్‌లో మరణశిక్ష ఎదుర్కొంటున్న భారత పౌరుడు కుల్‌భూషణ్ జాధవ్‌కు మూడోసారి కాన్సులర్ యాక్సెస్ అందించాలని, ఆయన కోసం ఒక న్యాయవాదిని కూడా నియమించాలని ఇస్లామాబాద్ హైకోర్ట్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జైల్లో ఉన్న కుల్‌భూషణ్ జాధవ్ భారత్ గూఢచారి అని పాకిస్తాన్ ప్రభుత్వం చెబుతోంది. భారత్ మాత్రం ఆయన ఒక మాజీ నేవీ అధికారి, వ్యాపారవేత్త అంటోంది.
దీనిపై భారత అధికారులను సంప్రదించాలని ఇస్లామాబాద్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అతహర్ మినల్లాహ్ సోమవారం విచారణలు జరిగిన సమయంలో పాక్ ప్రభుత్వాన్ని ఆదేశించారు.
“కుల్‌భూషణ్ జాధవ్ తరఫున న్యాయవాదిని నియమించడానికి భారత్‌కు మరో అవకాశం ఇవ్వాలి, వారి విదేశాంగ కార్యాలయం ద్వారా అధికారులను సంప్రదించాల”ని కోర్టు సూచించింది.
దీనిపై హైకోర్టులో విచారణలు జరుగుతున్నాయని, కమాండర్ కుల్‌భూషణ్ జాదవ్‌కు సమాచారం కూడా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
కుల్‌భూషణ్ జాధవ్‌కు మూడోసారి కాన్సులర్ యాక్సెస్ ఇవ్వాలని హైకోర్టు పాకిస్తాన్ అటార్నీ జనరల్ ఖాలిద్ జావేద్‌కు హైకోర్టు చెప్పింది.
కమాండర్ జాధవ్‌కు ఈ కేసులో న్యాయమైన విచారణ జరిగే అవకాశం లభించాలని హైకోర్ట్ చీఫ్ జస్టిస్ అన్నారు. దీనిపై ఎవరూ, ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదన్న కోర్టు, వాటిపై నిషేధం విధించింది.
“భారత్ కుల్‌భూషణ్ జాధవ్ కోసం న్యాయవాదిని నియమిస్తే మాకు సంతోషమే” అని ఈ సందర్భంగా అటార్నీ జనరల్ కోర్టుకు చెప్పారు.
హైకోర్టు ఈ కేసులో తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది.

ఫొటో సోర్స్, PAKISTAN FOREIGN OFFICE
అసలు ఈ కేసులో గతంలో ఏం జరిగింది?
భారత నౌకాదళ మాజీ అధికారి కులభూషణ్ జాధవ్‌ను పాకిస్తాన్‌లోని ఒక సైనిక కోర్టు భారత నిఘా ఏజెన్సీ కోసం గూఢచర్యం, తీవ్రవాదం కేసులో దోషిగా చెప్పింది. అతడికి మరణశిక్ష విధించింది.
భారత్ పాకిస్తాన్ వాదనను కొట్టిపారేస్తోంది. జాధవ్‌ను 2016 మార్చి 3న బలూచిస్తాన్ ప్రాంతంలో అరెస్టు చేశారు. జాధవ్‌ను ఇరాన్ నుంచి కిడ్నాప్ చేశారని భారత్ చెబుతోంది. అక్కడ అతడికి ప్రైవేటు వ్యాపారం ఉందంటోంది.
జాధవ్‌ను 'కాన్సులర్ యాక్సెస్' అంటే భారత రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడే హక్కును ఇవ్వకుండా పాకిస్తాన్ వియన్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిందని భారత్ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్‌లో వాదించింది.
అయితే, పాకిస్తాన్ మాత్రం గూఢచర్యం కేసుల దోషులైనవారికి 'కాన్సులర్ యాక్సెస్' ఇవ్వడం ఉండదని చెబుతోంది.
జాధవ్ మరణశిక్షను రద్దు చేయాలని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలని భారత్ అంతర్జాతీయ కోర్టులో అపీల్ చేసింది. జాధవ్ విచారణలో నిర్ధారిత ప్రక్రియలో కనీస ప్రమాణాలు కూడా పాటించలేదని ఆరోపించింది.
గత ఏడాది జూలైలో అంతర్జాతీయ న్యాయస్థానం ఈ కేసులో తన తీర్పును ప్రకటిస్తూ పాకిస్తాన్ లేవనెత్తిన అభ్యంతరాలన్నింటినీ తోసిపుచ్చింది. అంతేకాదు, పాకిస్తాన్ వియన్నా ఒప్పందంలోని ఆర్టికల్ 36ను ఉల్లంఘించిందని కూడా ఆక్షేపించింది. ఆ శిక్ష మీద పునర్విచారణ జరిపించాలని, జాధవ్‌కు భారత దౌత్య సిబ్బందిని కలిసే అవకాశం ఇవ్వాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఎవరీ కుల్‌భూషణ్ జాధవ్?
కుల్‌భూషణ్ 1970 ఏప్రిల్ 16న మహరాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి సుధీర్ జాధవ్ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్.
కుల్‌భూషణ్ 1987లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించి, తర్వాత భారత నేవీలో చేరారు.
పాకిస్తాన్ విడుదల చేసిన కుల్‌భూషణ్ వాంగ్మూలం ప్రకారం.. ''భారత నేవీ ఇంజినీరింగ్ విభాగంలో కుల్‌భూషణ్ పని చేసేవాడు. హుస్సేన్ ముబారిక్ పటేల్ అనే మారుపేరుతో భారత్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారు'' అని ఉంది.
కుల్‌భూషణ్.. 14 ఏళ్లపాటు ఉద్యోగం చేశాక, కమాండర్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. అనంతరం ఇరాన్‌లో వ్యాపారం ప్రారంభించారు.
అయితే.. 2010-2012 మధ్యలో తాను ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తానంటూ కుల్‌భూషణ్ పలుమార్లు 'రా'ను సంప్రదించినట్లు సమాచారం ఉందని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక పేర్కొంది.
కానీ జాధవ్ ప్రతిపాదనలను రా అధికారులు తిరస్కరించారని, జాధవ్ వల్ల తమ సంస్థకు ప్రమాదం అని అధికారులు భావించారని ఆ పత్రిక కథనం.
2016 మార్చి నెలలో పాకిస్తాన్ అధికారులు బెలూచిస్తాన్‌లో కుల్‌భూషణ్‌ను అరెస్ట్ చేశారు.
''2013 చివర్లో ఆర్.ఎ.డబ్ల్యూ (రా) అధికారులు నన్ను నియమించారు. అప్పటినుంచి బెలూచిస్తాన్, కరాచిలో పలురకాల కార్యక్రమాలు చేయాలంటూ నాకు రా అధికారులు దిశానిర్దేశం చేశారు. కరాచిలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చెప్పారు'' అని కుల్‌భూషణ్ వాంగ్మూలం ఇచ్చినట్లు పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్: కోవిడ్-19తో మరణించిన ముస్లిం శవాన్ని దహనం చేయడంపై శ్రీలంకలో వివాదం
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
- కరోనావైరస్: యూరప్‌లోని వృద్ధాశ్రమాల్లో మృత్యు ఘోష, వందలాది మంది వృద్ధులు మృతి
- కరోనా వైరస్: ఒక డాక్టర్ భార్యగా నేను తీసుకునే జాగ్రత్తలు ఏంటంటే..
- కరోనావైరస్: తీవ్ర సంక్షోభం దిశగా పాకిస్తాన్.. ఈ కల్లోలాన్ని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం తట్టుకోగలదా?
- ఆరోగ్య సేతు: ప్రభుత్వాలు అందిస్తున్న యాప్‌లు సురక్షితమేనా, రాబోయే రోజుల్లో వాటితో ప్రమాదం ఉందా?
- కరోనావైరస్ మహమ్మారిని తెచ్చింది పేదలు కాదు... సంపన్నులే - అభిప్రాయం
- కరోనావైరస్: డాక్టర్ల మీద దాడులు... ఉమ్మి వేస్తూ అవమానాలు
- కరోనావైరస్: ఒకరిని ఒకరు తాకలేకపోతున్నామనే ఈ బాధ తీరేదెలా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








