భారత గూఢచారిగా పాక్ ఆరోపిస్తున్న కుల్‌భూషణ్ యాదవ్ ఎవరు?

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, మానిటరింగ్
- హోదా, బీబీసీ
గూఢచర్యం కేసులో పాకిస్తాన్ అరెస్టు చేసిన భారతీయుడు కుల్‌భూషణ్ జాధవ్.. రెండు దేశాల న్యాయపోరాటంలో చిక్కుకున్నారు. ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి 19 నుంచి నాలుగు రోజులపాటు ఇరు దేశాల న్యాయవాదులు అంతర్జాతీయ న్యాయస్థానంలో తమ వాదనలు వినిపించనున్నారు.
గూఢచర్యం, విద్రోహ చర్య కేసులో కుల్‌భూషణ్ జాధవ్‌ను గత ఏడాది బెలూచిస్తాన్‌లో అరెస్టు చేశారు. పాకిస్తాన్ మిలిటరీ కోర్టు ఏప్రిల్ 10న కుల్‌భూషణ్‌కు మరణశిక్ష విధిస్తూ.. ఆదేశాలు జారీ చేసింది. అయితే, కుల్‌భూషణ్ తమ గూఢచారి కాదని, ఆయన రిటైర్ అయిన నేవీ ఆఫీసర్ అని భారత్ చెబుతోంది.
కుల్‌భూషణ్ కేసులో భారత్ చేసిన 16 అభ్యర్థనలను అతిక్రమిస్తూ, పాకిస్తాన్.. స్వతంత్ర దేశాల మధ్య ఉండే 'వియెన్నా కన్వెన్షన్' ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, ఎటువంటి ఆధారాలు లేనప్పటికీ, కుల్‌భూషణ్‌ను దోషిగా నిర్ధరించిందని మే 8న భారత్.. అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
రెండు దేశాలు అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్లడం ఇది రెండోసారి. 18 ఏళ్ల క్రితం, పాకిస్తాన్ నేవీకు చెందిన ఎయిర్‌క్రాఫ్ట్‌ను భారత్ కాల్చివేసిందని ఆరోపిస్తూ పాక్ అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
ఇరు దేశాలు తమ వాదనలు వినిపించాక మే 18న అంతర్జాతీయ న్యాయస్థానం స్టే ఇచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
కుల్‌భూషణ్ ఏమన్నారంటే
పాకిస్తాన్ మీడియా ప్రకారం కుల్‌భూషణ్ వాంగ్మూలం ఇలా ఉంది..
''2013 చివర్లో ఆర్.ఎ.డబ్ల్యూ (రా) అధికారులు నన్ను నియమించారు. అప్పటినుంచి బెలూచిస్తాన్, కరాచిలో పలురకాల కార్యక్రమాలు చేయాలంటూ నాకు రా అధికారులు దిశానిర్దేశం చేశారు. కరాచిలో శాంతిభద్రతలకు భంగం కలిగించాలని చెప్పారు'' అని పాకిస్తాన్ మీడియాలో కథనాలు వచ్చాయి.
''బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులతో సమావేశాలు నిర్వహించి, వారి సహకారంతో... ప్రజలను చంపడం, లేదా తీవ్రంగా గాయపరచడం నా లక్ష్యాలు'' అన్నది కుల్‌భూషణ్ వాంగ్మూలానికి కొనసాగింపు.

ఫొటో సోర్స్, @ForeignOfficePk
ఎవరీ కుల్‌భూషణ్?
కుల్‌భూషణ్ 1970 ఏప్రిల్ 16న మహరాష్ట్రలో జన్మించారు. ఆయన తండ్రి సుధీర్ జాధవ్ రిటైర్డ్ సీనియర్ పోలీస్ ఆఫీసర్.
కుల్‌భూషణ్ 1987లో నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ప్రవేశించి, తర్వాత భారత నేవీలో చేరారు.
పాకిస్తాన్ విడుదల చేసిన కుల్‌భూషణ్ వాంగ్మూలం ప్రకారం, ‘భారత నేవీ ఇంజినీరింగ్ విభాగంలో కుల్‌భూషణ్ పని చేసేవాడు. హుస్సేన్ ముబారిక్ పటేల్ అనే మారుపేరుతో భారత్‌కు రహస్య సమాచారం చేరవేస్తున్నారు’ అని ఉంది.

ఫొటో సోర్స్, Twitter
14 ఏళ్లపాటు ఉద్యోగం చేశాక, కమాండర్ హోదాలో స్వచ్ఛంద పదవీ విరమణ చేశాక, కుల్‌భూషణ్.. ఇరాన్‌లో వ్యాపారం ప్రారంభించారు.
అయితే, 2010-2012 మధ్యలో తాను ఫ్రీలాన్సర్‌గా పనిచేస్తానంటూ కుల్‌భూషణ్ పలుమార్లు 'రా'ను సంప్రదించినట్లు సమాచారం ఉందని, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ దినపత్రిక పేర్కొంది.
కానీ జాధవ్ ప్రతిపాదనలను రా అధికారులు తిరస్కరించారని, జాధవ్ వల్ల తమ సంస్థకు ప్రమాదం అని అధికారులు భావించినట్లు ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలిపింది.
2016 మార్చి నెలలో పాకిస్తాన్ అధికారులు బెలూచిస్తాన్‌లో కుల్‌భూషణ్‌ను అరెస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి
- హైదరాబాద్ పేరెత్తకుంటే.. కశ్మీర్‌ను పాకిస్తాన్‌కు వదిలేస్తామని పటేల్ చెప్పింది నిజమేనా?
- పుల్వామా దాడి: ‘అదే జరిగితే యుద్ధం రావొచ్చు’ - అభిప్రాయం
- ఎడతెగని వివాదం: కశ్మీర్ విలీనం
- వీరు కవలలు, కానీ తండ్రులు వేరు, ఎలా సాధ్యం?
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్‌కు కారణం ఇదే
- గూగుల్: ‘టాయిలెట్ పేపర్’ అని వెదికితే పాక్ జెండా ప్రత్యక్షం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








