ఈ మానవ సహిత అంతరిక్ష ప్రయోగం విఫలమైనా వ్యోమగాముల ప్రాణాలకు ప్రమాదం ఉండదు

ఫొటో సోర్స్, SPACEX
- రచయిత, పాల్ రింకన్
- హోదా, సైన్స్ ఎడిటర్, బీబీసీ న్యూస్
తొలిసారిగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ తమ స్పేస్ వెహికల్ "ద క్రూ డ్రాగన్"లో వ్యోమగాములను అంతరిక్షంలోకి పంపబోతోంది. ఈ మిషన్‌కు సంబంధించి నెటిజన్‌ల ప్రశ్నలకు సమాధానాలు ఇవి.
నాసా వ్యోమగాముల అంతరిక్ష యాత్రకు ప్రైవేటు సంస్థ ఎందుకు?
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వ్యోమగాముల్ని పంపే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని 2000 నుంచి నాసా ప్రణాళికలు రచిస్తోంది.
2003లో భూమికి తిరిగి వస్తుండగా కొలంబియా స్పేస్ షటిల్‌లో ప్రమాదం తలెత్తి ఏడుగురు వ్యోమగాములు మరణించారు.
అప్పటినుంచీ చంద్రుడిపైకి తీసుకెళ్లే మరో స్పేస్ షటిల్ అభివృద్ధి చేసేందుకు నాసా ప్రయత్నిస్తోంది.
ఈ మిషన్ చేపట్టాలంటే వ్యోమగాములు, ఇతర సామగ్రిని ఐఎస్ఎస్‌కు తరలించే బాధ్యతను ప్రైవేటు సంస్థలకు అప్పగించాలని నాసా భావించింది.
2014లో నాసా వ్యోమగాముల్ని అంతరిక్షంలోకి పంపే సేవల కాంట్రాక్టులను ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్, దిగ్గజ వైమానిక సంస్థ బోయింగ్ ఒడిసిపట్టాయి.
దీనిలో భాగంగానే తొలి వ్యోమనౌక క్రూ డ్రాగన్‌ను బుధవారం స్పేస్ఎక్స్ ప్రయోగించబోతోంది.
ఫ్లోరిడాలోని కెన్నడీ అంతరిక్ష కేంద్రం నుంచి జరగబోయే ఈ ప్రయోగంలో ఫాల్కన్-9 రాకెట్‌ను ఉపయోగిస్తారు.

ఫొటో సోర్స్, SPACEX
స్పేస్ఎక్స్ అంటే?
స్పేస్ఎక్స్ ఓ అమెరికా సంస్థ. ప్రభుత్వ, వాణిజ్య అవసరాల కోసం ఇది అంతరిక్ష ప్రయోగాలు నిర్వహిస్తుంటుంది. దీని కోసం ఫాల్కన్-9, ఫాల్కన్ హెవీ రాకెట్లు ఉపయోగిస్తుంటుంది.
అంతరిక్ష యాత్రల ఖర్చులు తగ్గించేందుకు, అంగారకుడిపై ఆవాసాల ఏర్పాటే లక్ష్యంగా ఎలాన్ మస్క్ 2002లో స్పేస్ఎక్స్‌ను స్థాపించారు.
ప్రయోగం అనంతరం రాకెట్లను మళ్లీ భూమిపైకి తీసుకురాగలిగే సామర్థ్యం సంపాదించిన తొలి ప్రైవేటు సంస్థ స్పేస్ఎక్స్.
ఇలా తీసుకొచ్చే రాకెట్లను మళ్లీ ప్రయోగాల్లో ఉపయోగించొచ్చు. ఇప్పటివరకు ఐఎస్ఎస్‌కు సామగ్రిని మాత్రమే ఈ సంస్థ తరలించింది. ఇప్పుడు తొలిసారి వ్యోమగాముల్ని పంపేందుకు సిద్ధమవుతోంది.
మనుషుల్ని పంపేందుకు స్టార్‌షిప్ పేరుతో మరో భారీ వ్యోమనౌకనూ స్పేస్ఎక్స్ సిద్ధంచేస్తుంది. అంగారకుడిపై ఆవాసాల నిర్మాణం కోసం దీన్ని ఉపయోగించే అవకాశముంది.

ఫొటో సోర్స్, Getty Images
ఎలాన్ మస్క్ ఎవరు?
ఎలాన్ మస్క్.. దక్షిణాఫ్రికాలో జన్మించారు. ఆన్‌లైన్ చెల్లింపు సేవల సంస్థ పేపాల్‌ను ఈ-బేకు విక్రయించడంతో ఆయన 160 మిలియన్ డాలర్లకుపైనే అర్జించారు. అంతరిక్షంలోకి మనుషుల్ని పంపడమే లక్ష్యంగా స్పేస్ఎక్స్‌ను ఆయన స్థాపించారు. ఎలక్ట్రిక్ కారుల తయారీ సంస్థ టెస్లాతోపాటు మరికొన్ని దిగ్గజ సంస్థలకు పునాది వేసిన వారిలో ఆయనా ఒకరు.
హైపర్‌లూప్ పేరుతో హైస్పీడ్ రవాణా వ్యవస్థనూ ఆయన తెరపైకి తీసుకొచ్చారు. దీనిలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గొట్టపు మార్గాల్లో పాడ్‌లు మెరుపు వేగంతో ప్రయాణిస్తుంటాయి. రాబర్ట్ డౌనీ జూనియర్ పోషించిన మార్వెల్ కామిక్స్ పాత్ర టోనీ స్టార్క్కు ఆధారం మస్కే. మరోవైపు వివాదాలకూ మస్క్ కేంద్ర బిందువుగా మారుతుంటారు. ఆయన ట్వీట్లు కొన్ని కోర్టు కేసులకూ దారితీశాయి. టెస్లా ఛైర్మన్ పదవి వదులుకోవడానికీ అవే కారణం. అయితే టెస్లాకు సీఈవో మాత్రం ఆయనే.

ఫొటో సోర్స్, NASA
ఈ ప్రయోగం ఎందుకంత ప్రత్యేకం?
2011లో తమ స్పేస్ షటిల్‌కు కాలం చెల్లడంతో.. తమ వ్యోమగాముల్ని నింగిలోకి పంపే సోయుజ్ వ్యోమనౌకల కోసం రష్యాకు నాసా కోట్ల డాలర్లు చెల్లిస్తూ వస్తోంది. తొమ్మిదేళ్ల తర్వాత అమెరికా గడ్డపై నుంచి తొలిసారిగా మళ్లీ ఇప్పుడు అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపిస్తున్నారు. దీంతో మానవ సహిత అంతరిక్ష యాత్రలో అమెరికా ప్రతిష్ఠను నిలబెట్టడంలో ఇది చాలా కీలకం. మరోవైపు ఓ ప్రైవేటు సంస్థ కక్ష్యలోకి వ్యోమగాముల్ని పంపడమూ ఇదే తొలిసారి.
క్రూ డ్రాగన్ అంటే ఏమిటి?
క్రూ డ్రాగన్ ఒక వ్యోమనౌక. ఇది ఐఎస్ఎస్‌కు బుధవారం వ్యోమగాముల్ని తీసుకెళ్లబోతోంది. కక్ష్యలోకి సామగ్రిని తీసుకెళ్లే డ్రాగన్ వ్యోమనౌకలో భారీ మార్పులు చేసి.. దీన్ని తయారుచేశారు. ఇది గరిష్ఠంగా ఏడుగురిని నింగిలోకి తీసుకెళ్లగలదు. అయితే నలుగురు వ్యోమగాముల్ని మాత్రమే నాసా అనుమతిస్తుంది. మిగతా ఖాళీ ప్రాంతంలో సామగ్రిని తరలిస్తారు.
మానవ సహిత అంతరిక్ష యాత్రలకు ఉపయోగించే ఇదివరకటి వ్యోమనౌకల కంటే ఇది చాలా భిన్నమైనది. దీనిలో క్రూ క్యాబిన్‌లో బటన్లకు బదులు టచ్ స్క్రీన్‌లు ఏర్పాటుచేశారు. అంతరిక్ష కేంద్రం వద్ద ఆగేందుకు, కేంద్రానికి అంటిపెట్టుకొని ఉండేందుకు దీనిలో ప్రత్యేక థ్రస్టర్లు ఉన్నాయి.

ఫొటో సోర్స్, Reuters
అంతరిక్షంలోకి వెళ్లేది ఎవరు?
బాబ్ బెంకెన్, డగ్ హర్లీ.. నాసా వ్యోమగాములు. స్పేస్ షటిల్‌లో రెండుసార్లు అంతరిక్షంలోకి వెళ్లేందుకు 2000లోనే వీరు ఎంపికయ్యారు. వీరు సుశిక్షుతులైన నాసా వ్యోమగాముల బృందంలో సభ్యులు. పైలట్లు కూడా. ఈ కొత్త వ్యోమనౌక వివిధ దశల్లో ముందుకు వెళ్లడంలో పైలట్ల పాత్ర కీలకం. హర్లీ.. ఇప్పటికే అంతరిక్షంలో 28 రోజుల 11 గంటలు గడిపారు. బెంకిన్ కూడా 29 రోజుల 12 గంటలు గడిపారు. ఆయన 37 గంటల స్పేస్‌వాక్ కూడా చేశారు. వీరిద్దరూ వ్యోమగాముల్నే పెళ్లి చేసుకోవడం విశేషం.
(Photo:4)
అక్కడ వ్యోమగాములు ఏం చేస్తారు?
వ్యోమగాముల్ని పంపించేందుకు సిద్ధంచేసిన ఈ వ్యోమనౌక సురక్షితమేనని నిర్ధరించేందుకు కొన్ని పరీక్షలు ఉంటాయి. ఈ ప్రక్రియలో తాజా ప్రయోగం చివరి దశ. ఇది కక్ష్యలోకి వెళ్లిన వెంటనే.. దీని పర్యావరణ నియంత్రణ వ్యవస్థలను బెంకిన్, హర్లీ పరీక్షిస్తారు. డిస్ప్లేతోపాటు థ్రస్టర్లు, ఇతర నియంత్రణ వ్యవస్థలనూ వారు ఎలా పనిచేస్తున్నాయో చూస్తారు.
అంతరిక్ష కేంద్రం దగ్గర ఈ వ్యోమనౌక స్వతంత్రంగా ఆగేలా ప్రత్యేక థ్రస్టర్లు ఏర్పాటుచేశారు. వీటిని కూడా బెంకిన్, హర్లీ పరీక్షిస్తారు. అంతరిక్ష కేంద్రంలో వారికి అప్పగించిన విధులనూ పూర్తిచేస్తారు. మళ్లీ భూమికి వచ్చే సమయంలో.. ఈ క్రూ డ్రాగన్.. అట్లాంటిక్ మహాసముద్రంలో దిగుతుంది. వ్యోమగాములతోపాటు వ్యోమనౌకనూ సురక్షితంగా వెనక్కి రప్పించేందుకు గో నేవిగేటర్ గా పిలిచే నౌకను సిద్ధంచేశారు.

ఏదైనా తేడా వస్తే...
క్రూ డ్రాగన్‌లో ప్రయోగాన్ని మధ్యలో ఆపేసే ఒక వ్యవస్థ ఉంది. అత్యవసర సమయాల్లో వ్యోమగాముల ప్రాణాలు కాపాడేందుకు ఇది ఉపయోగపడుతుంది. పైకి వెళ్లేటప్పుడే లోపం వస్తే.. క్రూ డ్రాగన్ ముందుకు వెళ్లేందుకు ఇంజిన్లు మండుతాయి. వెంటనే వ్యోమగాములతోపాటు క్రూ డ్రాగన్.. రాకెట్ నుంచి వేరుపడుతుంది. తర్వాత సురక్షితంగా భూమిని చేరుతుంది. 2020, జనవరి 19న ఇలా మధ్యలో ప్రయోగం ఆపేయడాన్ని విజయవంతంగా పరీక్షించారు.
స్పేస్ సూట్లు ఎలా తయారుచేశారు?
ఇదివరకు వ్యోమగాములు వేసుకున్న స్పేస్ సూట్ల కంటే ప్రస్తుత ప్రయోగంలో బెంకిన్, హర్లీ వేసుకోబోతున్న సూట్లు కొంచెం భిన్నమైనవి. స్పేస్ షటిల్ కాలంలో వ్యోమగాములు నారింజ రంగు సూట్లు, గుండ్రని హెల్మెట్లు వేసుకొనేవారు. ప్రస్తుతం మాత్రం పలుచగా ఉండే తెల్లని వస్త్రాలు సిద్ధంచేశారు. మరోవైపు వ్యోమగాముల కోసం ప్రత్యేకంగా 3డీ ముద్రణా హెల్మెట్లు తయారుచేశారు.
వీరు కొంచెం సైన్స్ ఫిక్షన్ సినిమాలో పాత్రల్లా కనిపిస్తూ ఉండొచ్చు. ఎందుకంటే వారి వస్త్రధారణను బ్యాట్‌మ్యాన్, ఎక్స్-మెన్ కోసం పనిచేసిన హాలీవుడ్ డిజైనర్ జోస్ ఫెర్నాండేజ్ డిజైన్ చేశారు. మరోవైపు వ్యోమనౌకలో గాలి శూన్యం అయినా.. వ్యోమగాముల ప్రాణాలకు ఎలాంటి ముప్పులూ రాకుండా వీటిని తయారు చేశారు.

ఫొటో సోర్స్, NASA
తర్వాత ఏం జరుగుతుంది?
క్రూ డ్రాగన్ డెమో-2 పరీక్ష విజయవంతమైతే... నాసాతో కుదుర్చుకున్న 2.6 బిలియన్ డాలర్ల ఒప్పందంలో భాగంగా ఐఎస్ఎస్‌కు ఆరు ప్రయోగాలు చేపట్టే దిశగా స్పేస్ఎక్స్ అడుగులు వేస్తుంది.
బోయింగ్ కూడా ఇలాంటి 4.2 బిలియన్ డాలర్ల విలువైన ఇలాంటి ఒప్పందమే కుదుర్చుకుంది.
అంతరిక్షంలోకి వ్యోమగాముల్ని పంపేందుకు సీఎస్‌టీ-100 స్టార్‌లైనర్ వ్యోమనౌకను బోయింగ్ ఉపయోగించనుంది.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ ఇంటర్వ్యూ: ‘బాబ్రీ వద్ద హిందువులను ఆలయాన్ని కట్టుకోనివ్వండి’
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్తో సహజీవనం: ఫుట్‌బాల్ ప్రీమియర్ లీగ్ ఎలా మొదలైంది.. మ్యాచ్‌లు ఎలా ఆడుతున్నారు
- కరోనావైరస్: మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడే రోగ నిరోధక వ్యవస్థ, మీ శరీరంపైనే దాడి చేస్తే..
- ఆమె రాసిన ‘వుహాన్ డైరీ’లో ఏముంది? ఆమెను చైనాలో ‘దేశద్రోహి’ అని ఎందుకు అంటున్నారు?
- కరోనావైరస్: అమెరికా వర్సెస్ చైనా... పోటాపోటీగా కుట్ర సిద్ధాంతాలు
- ఇండియా లాక్డౌన్: వలస కూలీల కోసం మోదీ ప్రభుత్వం ఏం చేస్తోందంటే... – అభిప్రాయం
- తుపాను: ఒకటో నంబరు, రెండో నంబరు, మూడో నంబరు.. ఈ హెచ్చరికలకు అర్థం ఏమిటి?
- ‘20 తుపాన్లు చూశా.. ఈ తుపాను సాధారణంగానే కనిపిస్తోంది’
- గ్లోబల్ వార్మింగ్: ఈ 5 పనులూ చేయండి.. భూ తాపాన్ని మీరే తగ్గించండి
- సూపర్ సైక్లోన్ ఆంఫన్: ప్రపంచంలో అత్యంత ఘోరమైన తుపానులన్నీ బంగాళాఖాతంలోనే ఎందుకు సంభవిస్తాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








