మోదీ తొలి విదేశీ పర్యటనకు మాల్దీవులనే ఎందుకు ఎంచుకున్నారు

ఫొటో సోర్స్, presidencymv/facebook
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి, మాల్దీవుల నుంచి
చీకటి పడుతోంది, ఆకుపచ్చగా ఉన్న సముద్రంలో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.
మేం మాల్దీవుల రాజధాని మాలేలోని బోడుథాకురుఫాను మాగు బీచ్ ఫ్రంట్ దగ్గర ఉన్న ఒక భారతీయుడి కోసం వేచిచూస్తున్నాం.
పక్కనే జెట్టీ దగ్గర కనిపిస్తున్న స్టీమర్లు సముద్రంలోని ఒక ద్వీపం నుంచి జనాలను తీసుకురావడం, వెళ్లడం చేస్తున్నాయి.
దానికి అవతలివైపు ఒక మాల్దీవుల వైమానిక స్థావరం ఉంది. అక్కడ గత రెండు రోజులుగా భారత వైమానిక దళం సరకు రవాణా విమానాల రాకపోకలు పెరిగాయి.
అప్పుడే 'మీరు భారత దేశం నుంచి వచ్చారా' అని ఒక గొంతు వినిపించింది.

ఆయన పేరు ఖుష్బూ అలీ. భారత్‌లోని మురాదాబాద్ నగరానికి చెందినవారు. అక్కడి నుంచి దిల్లీలోని లక్ష్మీనగర్ ప్రాంతంలో స్థిరపడ్డారు. పని కోసం వెతుక్కుంటూ ఆయన మాల్దీవుల వరకూ వచ్చారు.
"నేనొక మెకానిక్‌ను అక్కడ వైమానిక స్థావరం దగ్గర కొన్ని ఫాల్టులు రిపేర్ చేయడానికెళ్లాను" అన్నాడు.
భౌగోళికంగా, జనాభా పరంగా మాల్దీవులు ఆసియాలో అతిచిన్న దేశం
అయితే దేశం మొత్తం జనాబా సుమారు ఐదు లక్షలు ఉంటుంది. కానీ ఆ దేశానికి ప్రధాన ఆదాయ మార్గం పర్యాటకరంగమే. ఎందుకంటే ప్రతిఏటా ఇక్కడకు పది లక్షల మందికి పైగా పర్యాటకులు వస్తుంటారు.
మాల్దీవుల్లో భారత సంతతి వారు 30 వేల మంది వరకూ ఉంటారు. కానీ వ్యూహాత్మకంగా చూస్తే భారత్‌కు మాల్దీవులు చాలా కీలకమైనది.

ఖుష్బూ అలీ నాతో "ఇక్కడ అందరూ ఇండియన్స్ మాల్దీవులకు మొదటి నుంచీ చాలా హెల్ప్ చేశారని, ఇప్పుడు కూడా చాలా చేస్తున్నారని చెప్పారు. కానీ పని మాత్రం కాస్త ఎక్కువే ఉంటుంది. ఇక్కడ రోజుకు 12 గంటల డ్యూటీ చేయాలి. అదేం బాగోలేదు, కాస్త తగ్గించాలి. ఇండియా టెక్నీషియన్లకు, కార్మికులకు శాలరీ కూడా కాస్త తక్కువే. అది కాస్త ఎక్కువుండాలి" అన్నాడు.
నేను అతడితో "శనివారం ప్రధాన మంత్రి మోదీ వస్తున్నారు, తెలుసా" అన్నాను.
దానికి అతడు "ఎందుకు తెలీదు, ఇప్పుడు ఈ పర్యటనతో ఏమవుతుందో చూడండి" అన్నాడు.

మాల్దీవులే ఎందుకు
వరసగా రెండోసారి సాధారణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన మొదటి అధికారిక విదేశీ పర్యటనకు మాల్దీవులను ఎందుకు ఎంచుకున్నారు?
నరేంద్ర మోదీ తన రెండో ప్రమాణ స్వీకార వేడుకకు ఇంతకు ముందులా సార్క్ నేతలకు బదులు బ్రిమ్స్‌టెక్ దేశాల నేతలను ఆహ్వానించారు. వీటిలో థాయ్‌లాండ్, మయన్మార్ లాంటి దేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇందులో మాల్దీవులు లేదు.
భారత విదేశాంగ విధానం గురించి తెలిసిన వారెవరికైనా మనసులో ఈ చర్య మాల్దీవులను పక్కన పెట్టేలా ఉండకూడదనే ఉంటుంది.
దక్షిణాసియా, అరేబియా సముద్రంలో మాల్దీవులు ఒక స్ట్రాటజిక్(వ్యూహాత్మక)లొకేషన్. భారత దేశానికి ఇప్పుడు ఇది ఇంతకు ముందుకంటే చాలా కీలకం.
మాల్దీవుల్లో భారత రాయబారి సంజయ్ సుధీర్ ఈ విషయాన్ని యాదృచ్చికం అంటారు.

బీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన "మాల్దీవులు మన 'నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ'లో పెద్ద భాగం. మనకు మధ్యప్రాచ్యం నుంచి ఎంత చమురు, గ్యాస్ ఎక్స్‌పోర్ట్ అవుతుందో, అందులో ఒక పెద్ద భాగం 'ఎ' డిగ్రీ చానల్, అంటే మాల్దీవుల పక్క నుంచే వస్తుంది. దానితోపాటు ఇండియా మాల్దీవుల్లో ఒక నమ్మకమైన డెవలప్‌మెంట్ పార్ట్‌నర్ పాత్ర పోషిస్తోంది.
భారత విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే కూడా అదే విషయం స్పష్టం చేశారు. ప్రధాన మంత్రి పర్యటనలో రెండు దేశాల మధ్య అభివృద్ధి, రక్షణకు సంబంధించి కీలక ఒప్పందాలు జరుగుతాయని అన్నారు.
ప్రధాన మంత్రి తన మొదటి విదేశీ పర్యటనకు మాల్దీవులను ఎంచుకోవడం వెనుక చైనా కూడా ఒక పెద్ద కారణంగా చెబుతున్నారు.
చైనా గత పదేళ్ల నుంచి హిందూ మహా సముద్రంలో తన ఆధిపత్యం పెంచుకునే ప్రయత్నాలను తీవ్రం చేసింది. ఈ లింకులో మొదటి భాగం శ్రీలంకే అని, చైనా దృష్టి తర్వాత మాల్దీవులపైనే ఉందని చెబుతారు.
వాణిజ్యం, ఆర్థిక సాయం, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ ద్వారా చైనా ఈ దేశాల్లో వేగంగా అడుగు మోపడంలో ఒక విధంగా విజయవంతమైంది.

అయితే భౌగోళికంగా, సాంస్కృతికపరంగా, చిన్న వ్యాపారాల విషయంలో ఈ రెండు దేశాలకు చైనా కంటే భారత్‌తోనే ఎక్కువ సాన్నిహిత్యం ఉంది.
కానీ మాల్దీవులపై భారత్ ప్రభావం కొన్నేళ్లపాటు కాస్త మందగించింది.
2013 నుంచి 2018 వరకూ అక్కడి అబ్దుల్లా యామీన్ ప్రభుత్వం భారత్‌కు రుచించని ఎన్నో చర్యలు చేపట్టింది. వీటిలో ముఖ్యమైనది అది చైనాకు దగ్గరగా మెలగాలనుకోవడం.
మాల్దీవుల్లో భారత మాజీ రాయబారి గుర్జీత్ సింగ్ కూడా అదే విషయం చెబుతారు.
"ఒకవేళ సార్క్ దేశాల విషయానికే వస్తే పాకిస్తాన్ తర్వాత భారత్ సంబంధాలు చాలా ఘోరంగా ఉన్న వేరే దేశం ఏదైనా ఉందంటే, అది మాల్దీవులే. అందుకే ఈ పర్యటన సరైన సమయంలో జరుగుతోంది" అన్నారు.

మార్పు ప్రభావం
మాల్దీవుల్లో 2018 ఎన్నికల్లో అధికారం మారింది. భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త అధ్యక్షుడు ఇబ్రహీమ్ మొహమ్మద్ సోలిహ్ ప్రమాణ స్వీకారానికి వెళ్లి ఒక దౌత్య సందేశం ఇచ్చారు.
దానికి బదులు అధ్యక్షుడు సోలిహ్ గత ఏడాది డిసెంబర్‌లో భారత దేశంలో అధికారిక పర్యటన చేశారు. ఈ సందర్భంగా భారీ వాణిజ్య ఒప్పందాలు కూడా జరిగాయి.
ఈ పర్యటన పూర్తి కాకముందే భారతదేశానికి ఉపశమనం కలిగిందని ఆరోజు ప్రధాని మోదీ మాటలే చెబుతాయి. మోదీ సోలిహ్‌తో "మీ ఈ పర్యటనలో మీ నమ్మకం, మీ స్నేహం ప్రతిబింబిస్తోంది. భారత-మాల్దీవుల సంబంధాలు వాటిపైనే ఆధారపడ్డాయి" అన్నారు.

స్వాగత ఏర్పాట్లు
అయితే, గత కొన్ని రోజులుగా మాల్దీవుల రాజధాని మాలేను అలంకరించే పనులు కొనసాగుతున్నాయి.
రోడ్లను శుభ్రం చేయడం, భవనాలకు మెరుగులద్దడం చేస్తున్నారు.
గత 8 ఏళ్లలో ఒక భారత ప్రధాన మంత్రి అధికారిక పర్యటనకు వస్తుండడంతోనే ఇదంతా జరుగుతోంది.
రెండు దేశాల జెండాలు దారుల్లో అటూఇటూ కట్టారు. రహదారులపై సెక్యూరిటీ కూడా పెరిగింది.
మాలేలో ఒక ప్రముఖ హోటల్లో కోల్‌కతా నుంచి వచ్చి ఉద్యోగం చేస్తున్న అమిత్ కుమార్ మండల్ ప్రధాని మోదీ పర్యటన గురించి చాలా ఉత్సాహంగా ఉన్నారు.
ఆయన "రెండో సారి గెలిచిన తర్వాత పరిస్థితి చాలా బాగుంది. నరేంద్ర మోదీ కూడా వస్తున్నారు. మాకు బాగుంటుంది. మొదట మేం ఇక్కడ ఇలా ఉంటుందనుకోలేదు. కానీ ఇప్పుడు ముందుకంటే బాగానే ఉన్నాం" అన్నారు.
ఇవి కూడా చదవండి:
- నాసా: అంతరిక్ష కేంద్రం సందర్శించేందుకు పర్యాటకులను అనుమతి
- డోనల్డ్ ట్రంప్ సుంకాలతో భారతదేశంలో ఉద్యోగాలు పోవడం ఖాయమేనా
- మోదీ చెప్పిన కెమిస్ట్రీ మేధావులకు ఎందుకు అర్థం కాలేదు..
- అస్సాం: 40 లక్షల మంది ప్రజలు భారతీయులు కాదు
- చైనాలో ఇస్లాం వ్యాప్తి చేస్తున్న పాకిస్తాన్ మదరసా విద్యార్థులు
- పెళ్లి పేరుతో పాక్ అమ్మాయిలను వ్యభిచారంలో దించుతున్న చైనా అబ్బాయిలు
- ఈ మహిళలు చైనాలో లైవ్ సెక్స్‌క్యామ్ రాకెట్ కోరల నుంచి ఎలా తప్పించుకున్నారంటే..
- నా కార్టూన్లే నా ప్రాణాలు కాపాడాయి.. కొత్త జీవితాన్ని ఇచ్చాయి.. ఇదీ నా కథ
- ‘పీరియడ్ పేదరికం’: బహిష్టు సమయంలో పాత గుడ్డలకు ఈ కప్పులే సమాధానమా?
- స్వదేశంలో కంటే విదేశాలకు అప్పులు ఇవ్వడానికే చైనా బ్యాంకుల మొగ్గు
- భారత ప్రభుత్వం మాల్దీవులకు వేల కోట్ల అప్పు ఎందుకిస్తోంది?
- మాల్దీవులలో ‘మహా భారతం’, భారత్ ధర్మసంకటం
- చైనా ఆట కట్టించాలంటే భారత్ ఏం చేయాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










