‘క్యాన్సర్ చికిత్స వల్ల కలిగే సంతానోత్పత్తి సమస్యను అధిగమించాం..’ - అధ్యయనం

ఫొటో సోర్స్, OREGON HEALTH AND SCIENCE UNIVERSITY
చిన్నప్పుడే కేన్సర్ బారినపడ్డ అబ్బాయిల్లో, కీమో థెరపీ, రేడియో థెరపీ చికిత్సలు.. వారి సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ఈ సమస్యను అధిగమించడంలో చెప్పుకోదగ్గ పురోగతి సాధించామని శాస్త్రవేత్తలు అంటున్నారు.
చిన్నపిల్లల్లో ఇంకా పరిపక్వం చెందని వృషణాలు కేన్సర్ చికిత్స చేసినపుడు దెబ్బతింటాయని, మూడోవంతు పిల్లలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని కోల్పోతారని వైద్యులు చెబుతున్నారు.
యుక్తవయసుకురాని అమ్మాయిలు, మహిళల్లో.. అండం లేదా ఓవరీస్‌ను జాగ్రత్తగా భద్రపరచి, వాటిద్వారా.. కేన్సర్ చికిత్స అనంతరం పిల్లలను కనవచ్చు. మగవారిలోకూడా వీర్యాన్ని అలాగే భద్రపరచవచ్చు. కానీ యుక్తవయసుకురాని అబ్బాయిలకు ఈ అవకాశం లేదు.
'మరి.. గ్రేడీ ఎలా పుట్టింది?'
ఈ సమస్యను అధిగమించడానికి యూనివర్సిటీ ఆప్ పిట్స్‌బర్గ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్ శాస్త్రవేత్తలు 'రీస్సస్ మకాక్' జాతికి చెందిన అయిదు కోతులపై పరిశోధనలు చేశారు.
ఈ కోతులు ఇంకా యుక్తవయసుకు రాకముందే, వాటి వృషణాలను తొలగించారు. అప్పటికి వీర్యం ఉత్పత్తి చేసే సామర్థ్యం వాటి వృషణాలకు లేదు. తొలగించిన వృషణాలను చిన్నచిన్న ముక్కలుగా కోసి, వాటిని జాగ్రత్తగా భద్రపరిచారు.
6 నెలల తర్వాత, భద్రపరచిన వృషణ నమూనాలను తిరిగి వీటి చర్మంతో అంటుకట్టారు. ఈ కోతులు యుక్తవయసుకు వచ్చాక, వీటి వృషణ కణజాలం కూడా పరిపక్వం చెందడాన్ని శాస్త్రజ్ఞులు గుర్తించారు.
''ఈ మార్పును గమనించినపుడు, పరీక్షల్లో భాగంగా వీటిల్లో వీర్యం ఉత్పత్తి అవ్వడం గుర్తించాం'' అని పిట్స్‌బర్గ్ యూనివర్సిటీకి చెందిన ప్రొ.కైల్ ఆర్విగ్ అన్నారు.
ఇందులో ఓ కోతి వీర్యంతో మరో ఆడకోతి అండాన్ని ఫలదీకరణ చేశాం. ఫలితంగా గ్రేడీ అనే పిల్ల పుట్టిందని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, OREGON HEALTH AND SCIENCE UNIVERSITY
'ఈ విధానం ఎంతటి ప్రభావవంతమైనది?'
వృషణ కణజాల మార్పిడి జరిగిన కోతులకు యుక్తవయసు వచ్చాక, ప్రతి 10 వృషణ కణజాలాల్లో 8 కణజాలాలు వీర్యాన్ని ఉత్పత్తి చేశాయి.
అధ్యయనకారులు.. 'ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పెర్మ్ ఇంజెక్షన్'(ఐ.సి.ఎస్.ఐ) విధానం ద్వారా మొత్తం 138 అండాలను ఫలదీకరణ చేశారు. ఫలదీకరణ చేసిన ప్రతి పదింటిలో 8 అండాలు ప్రాథమిక పిండస్థ దశకు చేరాయి.
మొత్తం 11 పిండాలను ఆడ కోతుల గర్భాలలో ప్రవేశపెట్టగా, వీటిల్లో ఒక్క కోతి మాత్రమే గర్భం దాల్చి, ఆరోగ్యకరమైన కోతిపిల్లను ప్రసవించింది.
'మానవ వినియోగానికి ఈ విధానం సిద్ధంగా ఉందా?'
మానవుల్లో కూడా ఈ ప్రయోగానికి అత్యంత దగ్గరలో ఉన్నామని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
''ఈ ప్రయోగంలో భాగంగా ఆరోగ్యవంతమైన కోతిపిల్ల జన్మించడం ద్వారా, మనుషులపై ప్రయోగించడానికి ఈ విధానం సిద్ధంగా ఉందని మేం భావిస్తున్నాం'' అని ప్రొ.ఆర్విగ్ అన్నారు.
అయితే, ఈ విధానాన్ని మనుషులపై ప్రయోగించడానికి ముందు మరికొన్ని రుజువులు కావాలని కొందరు పరిశోధకులు చెబుతున్నారు.
భవిష్యత్తులో సైన్స్ అభివృద్ధి చెంది, తమకు సంతానోత్పత్తి భాగ్యం కలుగుతుందన్న ఆశతో ఇప్పటికే కొందరి పిల్లల వృషణ కణజాలాన్ని భద్రపరచారు.
ఈ విధానం సురక్షితమేనా?
ఈ విధానంలో.. అన్నిటికన్నా పెద్ద ప్రమాదం.. పుట్టబోయే పిల్లలకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉండటం!
పిల్లల వృషణాల్లో క్యాన్సర్ కణాలు దాగివుంటే, వీటిని భద్రపరిచినపుడు వృషణ కణజాలంతోపాటే క్యాన్సర్ కణాలు కూడా భద్రంగావుండి, ఈ కణజాలాన్ని మళ్లీ పిల్లాడి శరీరంలో ప్రవేశపెట్టినపుడు క్యాన్సర్ కణాలు కూడా పిల్లాడి శరీరంలోకి ప్రవేశిస్తాయి.
లుకేమియా, లింఫోమా లాంటి రక్తసంబంధమైన క్యాన్సర్లు, వృషణాలకు సంబంధించిన క్యాన్సర్ల వల్ల ప్రమాదం పొంచి ఉంది.
ఈ విధానం వలన వీర్యకణాల్లో నిక్షిప్తమైన జన్యు వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్త తీసుకోవాలని వైద్యులు భావిస్తున్నారు.
'నిపుణులు ఏమంటున్నారు?'
''గ్రేడీ.. ఆరోగ్యవంతంగా జన్మించడం, ప్రయోగం సానుకూల ఫలితాలనిస్తుందనడానికి నిదర్శనం.
కానీ ఇలాంటి రుజువులు మరికొన్ని చూడాలని అనుకుంటున్నా.
ఇప్పటికే తమ వృషణ కణజాలాన్ని భద్రపరిచిన అబ్బాయిల భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని భావిస్తున్నాను'' అని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ అండ్ హ్యూమన్ డెవలప్‌మెంట్‌కు చెందిన డా. సుశాన్ టేయ్‌మన్స్ అన్నారు.
''ఇది నిజంగా అద్భుతమైన పరిశోధన. గొప్ప పురోగతిని సాధించారు. ఈ విధానాన్ని మనుషుల్లో ఉపయోగించడానికి ముందు, మరింత లోతైన అధ్యయనం జరగాలి. ఈ విధానం సురక్షితమని, విజయవంతమైన ఈ అధ్యయనం లాగానే మనుషుల్లో కూడా సానుకూల ఫలితాలను ఇస్తుందని రుజువు చేయగలగాలి. అందుకు ఇంకా కొన్నేళ్ల సమయం పడుతుందని భావిస్తున్నా'' అని, యూనివర్సిటీ ఆఫ్ షెఫ్ఫీల్డ్‌కు చెందిన ప్రొ.అల్లెన్ పేసీ అన్నారు.
ఇవి కూడా చదవండి
- గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా...
- 15 రాత్రుల్లో 121 మంది మహిళలతో... ప్రాచీన చైనా చక్రవర్తుల జీవితాన్ని గణితశాస్త్రం ఎలా ప్రభావతం చేసింది?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై విమర్శలు
- ఒంగోలు గిత్తల కథ: ఇక్కడ అరుదై పోయాయి.. బ్రెజిల్లో వెలిగిపోతున్నాయి
- న్యూజీలాండ్ కాల్పులకు ప్రతీకారంగా పాకిస్తాన్లో చర్చిని తగులబెట్టారనే ప్రచారం నిజమేనా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








