భారత వింగ్ కమాండర్ అభినందన్‌‌ను నేడు విడుదల చేయనున్న పాకిస్తాన్

పాక్ ఆర్మీ

ఫొటో సోర్స్, DGISPR

తాము పట్టుకున్న భారత పైలట్ అభినందన్‌ను మార్చి 1వ తేదీ శుక్రవారం విడుదల చేస్తామని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.

పాకిస్తాన్ శాంతికి కట్టుబడి ఉందనేదానికి సూచిగా ఈ చర్య తీసుకుంటున్నట్లు ఆయన గురువారం సాయంత్రం కిందట ఆ దేశ పార్లమెంట్‌లో వెల్లడించారు. రెండు దేశాలు శాంతిగా ఉండడానికే ఈ నిర్ణయం తీసుకున్నానని ఇమ్రాన్ అన్నారు.

నేనీ రోజు ఈ వేదికగా భారత్‌కు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ‘‘ఉద్రిక్తతలను ఇంతకంటే పెంచుకోకూడదు. మీరేం చేసినా పాకిస్తాన్ దానికి బదులివ్వక తప్పదు’’ అని పాక్ ప్రధాని చెప్పారు.

అభినందన్

ఫొటో సోర్స్, Social media

రాత్రి మిసైల్ దాడి జరగొచ్చని అనుకున్నామని అయితే తర్వాత దాన్ని విరమించుకున్నారని అన్నారు. పాకిస్తాన్ సైన్యం కూడా అన్నింటికి సిద్దపడే ఉందని చెప్పారు. బాధ్యతాయుతమైన దేశం మరే దేశానికి అణగిఉండడానికి ఇష్టపడదన్న విషయం గుర్తించాలని అన్నారు.

యుద్ధంతో సాధించేదేమీ ఉండదని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు. రెండు దేశాల దగ్గర అణ్యాయుధాలు ఉన్నాయన్న విషయం గుర్తుంచుకోవాలని యుద్ధం ఎవరికీ మంచిది కాదని అన్నారు. ప్రస్తుత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకుండా అంతర్జాతీయ సమాజం కూడా తనవంతు పాత్ర పోషిస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు.

శాంతి చర్చలకు ఎన్నిసార్లు ప్రతిపాదించినా మోదీ ప్రభుత్వం సిద్ధపడలేదని చెప్పారు.

ఉదయమే ట్రంప్ సానుకూల సందేశం

అంతకు ముందే అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ సానుకూల సంకేతాలు ఇచ్చారు.

కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణకు తెరపడుతుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.

"భారత్, పాకిస్తాన్ నుంచి మాకు ఒక 'సానుకూల వార్త' వచ్చిందని నేను అనుకుంటున్నాను. కొంత 'మంచి సమాచారం' వచ్చింది. అది రెండు దేశాల మధ్య ఘర్షణకు తెరదించుతుందనే ఆశిస్తున్నా.’’ అని ట్రంప్ వెల్లడించారు.

అలా ట్రంప్ ప్రకటన చేసిన కాసేపటికే అభినందన్‌ను రేపు విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు.

అభినందన్

ఫొటో సోర్స్, dgispr

ఆ తర్వాత పాక్ విడుదల చేసిన మరో వీడియోలో.. పాక్ సైన్యం తనను బాగా చూసుకుంటోందని అభినందన్ చెప్పారు.

"నేను ఈ మాటలను అధికారికంగానే చెబుతున్నా. ఒకవేళ నేను తిరిగి నా దేశానికి వెళ్లినా నా మాటల్లో మార్పు ఉండదు. పాకిస్తాన్ సైనిక అధికారులు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు. వారు చాలా హుందాగా ప్రవర్తించారు. నాపై ఓ మూక దాడిచేయబోతే సైన్యం నన్ను రక్షించింది. నాకు పెళ్లైంది. నేను దక్షిణ ప్రాంతానికి చెందినవాడిని.

ఇంతకు మించి నేను ఏమీ చెప్పలేను." అని వివరించారు.

ఈ వీడియోను పాకిస్తాన్ ఆర్మీ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ ట్విటర్లో విడుదల చేశారు.

ఆయనను మిలిటరీ నియమ నిబంధనల ప్రకారం చూసుకుంటున్నామని ట్విటర్లో వెల్లడించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)