భారత్ - పాకిస్తాన్: సానుకూల సమాచారం అందింది: ట్రంప్, మోదీ మాతో చర్చకు సిద్ధమా: పాక్

ఫొటో సోర్స్, Getty Images
కశ్మీర్ అంశంలో భారత్, పాకిస్తాన్ మధ్య సంఘర్షణకు తెరపడుతుందని ఆశిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ గురువారం చెప్పారు.
ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్‌తో వియత్నాంలో జరిగిన రెండో శిఖరాగ్ర సదస్సుకు హాజరైన ట్రంప్ తర్వాత మీడియాతో మాట్లాడారు. భారత్, పాకిస్తాన్ నుంచి తమకు కొంత 'మంచి సమాచారం' వచ్చిందని చెప్పారు. అదేంటో ఆయన వివరించలేదు.
"భారత్, పాకిస్తాన్ నుంచి మాకు ఒక 'ఆకర్షణీయమైన వార్త' వచ్చిందని నేను అనుకుంటున్నాను. మాకు కొంత 'మంచి సమాచారం' కూడా వచ్చింది. అది రెండు దేశాల మధ్య ఘర్షణకు తెరదించుతుందనే ఆశిస్తున్నా.
ఈ ఉద్రిక్తతలు వారి మధ్య సుదీర్ఘకాలంగా దశాబ్దాల నుంచీ ఉన్నాయి. దురదృష్టవశాత్తూ వాటి మధ్య చాలా విముఖత కూడా ఉంది. అందుకే రెండు దేశాల మధ్య మేం వారికి సాయం చేయడానికి ప్రయత్నిస్తున్నాం.
మేం శాంతిని తీసుకురావడంలో విజయవంతం కాగలమనే అనుకుంటున్నాను" అని ట్రంప్ తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
స్పందించిన పాకిస్తాన్
అటు పాకిస్తాన్ కూడా అమెరికా అధ్యక్షుడి ప్రకటనను స్వాగతించింది.
పాక్ న్యూస్ చానల్ జియో న్యూస్‌తో మాట్లాడిన పాక్ విదేశాంగ మంత్రి మహమూద్ కురేషీ భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలకు తెరపడాలన్న డోనల్డ్ ట్రంప్ ఆకాంక్షలను స్వాగతించారు.
భారత పైలట్‌ను అదుపులోకి తీసుకోవడం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలకు భంగం కలిగేలా ఉంటే అతడిని తిరిగి అప్పగించే విషయం పాకిస్తాన్ పరిశీలిస్తుందని కురేషీ తెలిపారు.
"ఇప్పుడే భారత్ నుంచి వివరణ పత్రాలు అందాయి. నాకు వాటిని పరిశీలించే అవకాశం కూడా దొరకలేదు. మేం రాత్రి పార్లమెంటరీ నేతలకు దీని గురించి చెప్పాం. దీనిపై క్యాబినెట్ సమావేశం జరిగింది. మేం ఆ పత్రాలను సహృదయంతో పరిశీలిస్తామని నేను ఇప్పటికీ చెబుతున్నా.
వారు(భారత్) ఈ వివరాలు ముందే పంపించుంటే బాగుండేది. వారు మొదట దాడి చేసి, ఇప్పుడీ పత్రాలు పంపించారు. వారు మొదటే వీటిని పంపించి, పాకిస్తాన్ సమాధానం కోరుంటే, దాడి చేయాల్సిన అవసరం ఉండేది కాదు అన్నారు.
పైలెట్‌ను తిరిగి అప్పగించడం వల్ల పరిస్థితుల్లో మార్పు వస్తుందని అనిపిస్తే పాకిస్తాన్ ఆ విషయాన్ని పరిశీలిస్తుంది.
మేం అన్ని రకాల సానుకూల ప్రయత్నాలకు సిద్ధంగా ఉన్నాం. అన్నారు.

ఫొటో సోర్స్, PAKISTAN INFORMATION MINISTRY (ISPR)
మేం సిద్ధం, మీరు సిద్ధమా
"ప్రధాని ఇమ్రాన్ ఖాన్ భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. శాంతి చర్చలు కొనసాగేలా ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. మోదీ సిద్ధంగా ఉన్నారా? అని కురేషీ ప్రశ్నించినట్లు జియో న్యూస్ తెలిపింది.
భారత్ తీవ్రవాదం గురించి చర్చలు జరపాలని భావిస్తుంటే దానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు.
"మీరు(భారత్) రాజకీయాల కోసం ప్రాంతీయ స్థిరత్వాన్నే ప్రమాదంలో పెట్టాలని చూస్తున్నారు. రాజకీయాల్లో అది అవసరం కావచ్చు, కానీ చరిత్ర మిమ్మల్ని క్షమించదు" అన్నారు.
మా మొదటి ప్రాధాన్యం శాంతి, స్థిరత్వమే అన్నారు.
యుద్ధం రాకూడదనే కోరుకుందాం. యుద్ధం వస్తే పాకిస్తాన్ ప్రభావితమవుతుంది, కానీ భారత ఆర్థిక వ్యవస్థపై ఆ ప్రభావం పడదా అని ప్రశ్నించారు.
జైషే మహమ్మద్ ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన తర్వాత ఈ వారం పాక్ వైమానిక దాడులతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగడంతో రెండు దేశాలు నిగ్రహం పాటించాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్ మీదుగా విమానాలు బంద్
- జహంగీర్: సొంత కొడుకు కళ్లు పొడిపించిన మొఘల్ చక్రవర్తి
- సైస్స్ ఆఫ్ లవ్: ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








