వైమానిక దాడుల్లో మా వాళ్లెవరూ చనిపోలేదు, పుల్వామా దాడి మా పని కాదు: జైషే మహమ్మద్

ఫొటో సోర్స్, AFP
నియంత్రణ రేఖను దాటి పాకిస్తాన్ భూభాగంలోని జైషే మహమ్మద్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేశామని భారత్ ప్రకటించింది. భారత యుద్ధ విమానాలు నియంత్రణ రేఖను దాటి తమ గగన తలంలోకి వచ్చాయని పాకిస్తాన్ కూడా ధ్రువీకరించింది.
ముజఫరాబాద్ సెక్టార్‌లో 3, 4 కిలోమీటర్ల మేరకు తమ గగన తలంలోకి భారత ఫైటర్ జెట్లు వచ్చాయని, కానీ తాము ప్రతిస్పందించడంతో అవి వెనుదిరిగాయని పాకిస్తాన్ సైన్యం ప్రతినిధి ఆసిఫ్ గఫూర్ ట్వీట్ చేశారు.
ఈ దాడుల్లో 300 మంది జైషే మహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారని భారత్ చెబుతోంది. జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజర్ బావ యూసఫ్ అజర్ కూడా చనిపోయినవారిలో ఉన్నారని భారత మీడియాలో కథనాలు వచ్చాయి.

ఫొటో సోర్స్, Reuters
జైషే మహమ్మద్‌కు నిజంగా నష్టం జరిగిందా?
అయితే, బాలాకోట్‌లో భారత మిరాజ్ యుద్ధవిమానాల దాడుల సమయంలో యూసఫ్ అజర్ అక్కడ లేరని జైషే వర్గాలు చెబుతున్నాయి.
బహవల్‌పూర్ ప్రాంతానికి చెందిన యూసఫ్ అజర్.. మసూద్ అజర్ సోదరిని వివాహం చేసుకున్నారు. జైషే సంస్థలో యూసఫ్ చాలా క్రియాశీల సభ్యుడు.
నిజానికి యూసఫ్ అజర్ అనేది ఓ కోడ్ పేరు. మసూద్ అజర్ పేరుకు దగ్గరగా ఉండటానికి ఇలా పెట్టుకున్నారు. ఆయన అసలైన పేరేంటో ఎవరికీ తెలియదు.
యూసఫ్ అజర్ సురక్షితంగా ఉన్నారని జైషే మహమ్మద్ వర్గాలు తెలిపాయి. ఈ దాడుల్లో జైషే మహమ్మద్ సభ్యులెవరూ మృతి చెందలేదని, అసలు ఆ ప్రాంతంలో ఎలాంటి శిక్షణ శిబిరాలూ నిర్వహించడం లేదని స్పష్టం చేశాయి.

ఫొటో సోర్స్, Getty Images
పుల్వామా దాడులతో మాకు సంబంధం లేదు
"మేము దాడులు నిర్వహిస్తే దానికి బాధ్యత తీసుకుంటాం. కానీ ఈసారీ పుల్వామాలో జరిగిన దాడికి మేం బాధ్యత తీసుకోలేదు" అని జైషే మహమ్మద్ వర్గాలు తెలిపాయి.
"పుల్వామా ఆత్మాహుతి దాడికి కారకుడైన అదిల్ అహ్మద్ దార్ తన వీడియో సందేశంలో తాను జైషే మహమ్మద్‌కు అనుబంధంగా పనిచేస్తున్నానని పేర్కొన్నాడు. కానీ మేం అతడిని ఎప్పుడూ చూడలేదు" అని జైషే వర్గాలు చెబుతున్నాయి.
వైమానిక దాడుల్లో జైషే శిక్షణ శిబిరాలు ధ్వంసమయ్యాయనేది కేవలం భారత్ చేస్తున్న ప్రచారమేనని, అసలు అక్కడ ఎలాంటి శిబిరాలూ లేవని వారంటున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
మా సర్‌ప్రైజ్ కోసం వేచి చూడండి, మేమూ స్పందిస్తాం: పాకిస్తాన్ సైన్యం
భారత విమానాలు జాబా ప్రాంతంలో పేలోడ్‌ను వదిలాయని ఐఎస్పీఆర్ డీజీ ధ్రువీకరించారు. అయితే, 350 మంది చనిపోయినట్లుగా భారత్ చెబుతోందని, నిజంగా ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని ఆయన అన్నారు.
"మేం కూడా భారత్‌కు సర్‌ప్రైజ్ ఇస్తాం, మా స్పందన కోసం ఎదురు చూడండి. మా నుంచి ప్రతిచర్య ఉంటుంది, అది విభిన్నంగా ఉంటుంది. అయితే మేం శాంతికి కట్టుబడి ఉన్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు.
"3 ప్రదేశాల్లో చొరబాట్లు జరిగాయి. వాటిని తిప్పికొట్టాం. మేమేమీ ఆశ్చర్యపోవడం లేదు. మిమ్మల్నే ఆశ్చర్యానికి గురిచేస్తాం. మా స్పందన వస్తుంది, ఎదురుచూడండి. మాది ప్రజాస్వామ్య దేశం, కానీ ఈ దాడుల ద్వారా మీది ఆ కోవకు చెందదు అని నిరూపించారు" అని డీజీ ఐఎస్పీఆర్ అన్నారు.
ఏం జరిగినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని ప్రధాని మాకు సూచించారు. ఇక ఇప్పుడు భారత్ వంతు. ఎప్పుడు ఎక్కడ ఎలా స్పందిస్తామో ఎదురు చూడండి. మా ప్రతి చర్య ఎలా ఉండాలనేదానిపై మేం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చాం అని కూడా ఆయన వెల్లడించారు.
నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పుల విరమణను ఉల్లంఘించిందని దూరదర్శన్ వెల్లడించింది. భారత సైన్యం వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోందని తెలిపింది.
ఇవి కూడా చదవండి.
- #Balakot: సరిహద్దు దాటి వచ్చిన భారత యుద్ధ విమానాలను పాకిస్తాన్ ఎందుకు కూల్చలేకపోయింది
- భారత వైమానిక దాడులపై పాకిస్తాన్లో ప్రత్యక్ష సాక్షి ఏం చెబుతున్నారంటే..
- టీవీ చానెళ్లు పాక్‌పై వైమానిక దాడి అంటూ మీకు చూపెట్టిన వీడియో.. వాస్తవానికి ఓ వీడియో గేమ్‌లోనిది
- ‘యుద్ధం వస్తుందన్న అనుమానంతో సరుకులు నిల్వ చేసుకుంటున్నారు’
- ఇక అన్నింటికీ సిద్ధంగా ఉండండి.. పాక్ ప్రజలకు, సైన్యానికి ఇమ్రాన్ ఖాన్ పిలుపు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








