#IAF: భారత విమానాలను పాకిస్తాన్ తరిమికొట్టింది - పాకిస్తాన్ మీడియా

భారత వైమానిక దళం విమానాలు జైషే మొహమ్మద్ శిబిరంపై చేపట్టినట్లు చెప్తున్న ‘ముందస్తు దాడి’కి సంబంధించి భారత్, పాకిస్తాన్‌లో ప్రధాన మీడియా.. ముఖ్యంగా పలు ఇంగ్లిష్ పత్రికలు తమ వెబ్‌సైట్లలో ప్రచురించిన కథనాలు ఏం చెప్తున్నాయంటే...
’’ఎల్‌ఓసీని ఉల్లంఘించిన భారత విమానం.. పీఏఎఫ్ తక్షణ స్పందనతో తిరుగుముఖం’’
డాన్: భారత సైనిక విమానాలు ముజఫరాబాద్ సెక్టార్ నుంచి చొరబడి లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ఓసీ)ని ఉల్లంఘించాయని డైరెక్టర్ జనరల్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ మేజర్ జనరల్ ఆసిఫ్ గఫూర్ అధికారిక ట్విటర్ అకౌంట్‌లో పేర్కొన్నట్లు డాన్ ప్రధాన కథనం.
పాకిస్తానీ బలగాలు సమర్థవంతంగా స్పందించాయని ఐఎస్‌పీఆర్ చెప్తోందని, బాలాకోట్‌లో (భారత సైనిక విమానాలు) పేలుడు పదార్థాలు విడిచాయని, ప్రాణనష్టమేమీ సంభవించలేదని ఆ కథనంలో పేర్కొంది.
పుల్వామాలో ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత సైనికులు మరణించటంతో పాకిస్తాన్, భారత్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారాయని.. ఆ దాడిలో పాక్ ప్రమేయం ఉందని భారత్ ఆరోపించగా, పాకిస్తాన్ నిర్ద్వంద్వంగా ఖండించిందని ఆ కథనం వివరించింది.
భారత ఆరోపణలకు పాక్ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ఖాన్ స్పందిస్తూ.. ''చర్యలు చేపట్టగల సాక్ష్యాలు'' అందిస్తే దర్యాప్తు చేపడతామని భారతదేశానికి హామీ ఇచ్చారని.. అయితే దాడి చేస్తే పాకిస్తాన్ ''తిప్పికొడుతుంద''ని కూడా హెచ్చరించారని పేర్కొంది.

‘‘ఎల్ఓసీ గగనతలాన్ని ఉల్లంఘించిన భారత విమానాలు.. తరిమివేసిన పాక్ వైమానిక దళం’’
ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్: నియంత్రణ రేఖ సమీపంలో పాకిస్తాన్ గగనతలాన్ని భారత వాయు సేన ఉల్లంఘించిందని.. పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ జెట్లు తరిమివేశాయని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పీఆర్) చెప్పినట్లు ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పత్రిక తన ప్రధాన కథనంలో పేర్కొంది.
కశ్మీర్‌లో పుల్వామాలో సైనిక కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడిలో దాదాపు నాలుగు డజన్ల మంది సైనికులు చనిపోయినప్పటి నుంచీ.. భారతదేశమంతటా యుద్ధోన్మాదం చెలరేగుతోందని ఆ పత్రిక వ్యాఖ్యానించింది.

‘‘పాక్ బలగాలు, పౌరులు అప్రమత్తంగా ఉన్నారు: ఖురేషి’’
ద నేషన్: పాకిస్తాన్ సాయుధ బలగాలు, పౌరులు అప్రమత్తంగా ఉన్నారని, దేశంలో అణువణువునూ రక్షించుకోగల సామర్థ్యం తమకు ఉందని విదేశాంగ మంత్రి షా మొహమ్మద్ ఖురేషి పేర్కొన్నట్లు ద నేషన్ తన ప్రధాన కథనంలో చెప్పింది.
నియంత్రణ రేఖను భారత సైనిక విమానాలు ఉల్లంఘించి, ముజఫరాబాద్ సెక్టార్ ద్వారా మూడు, నాలుగు కిలోమీటర్ల లోపలకు చొరబడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారని ఆ కథనంలో పేర్కొంది.
‘‘ఒక అతివాద వర్గం తన రాజకీయ ప్రయోజనాల కోసం ప్రాంతీయ శాంతిని ప్రమాదంలో పడేయటానికి సిద్ధపడుతోంది. భారత నాయకత్వం తన రాజకీయ ప్రయోజనాలను సాధించుకునే ప్రయత్నంలో అయోమయంలో పడింది’’ అని ఖురేషీ వ్యాఖ్యానించినట్లు ఉటంకించింది.

‘‘జైషే అది పెద్ద శిబిరం మీద భారత్ దాడి: విదేశాంగ కార్యదర్శి’’
ద హిందూ: బాలాకోట్‌లో జైషే మొహమ్మద్‌కు చెందిన అతి పెద్ద శిక్షణ శిబిరం లక్ష్యంగా భారతదేశం ఆపరేషన్ నిర్వహించినట్లు విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే విలేకరుల సమావేశంలో నిర్ధారించినట్లు ద హిందూ ప్రధాన కథనంలో పేర్కొంది.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందని.. భారత్ మీద మరిన్ని ఉగ్రదాడులు జరగకుండా నివారించటానికి ఈ దాడి అవసరమని ఆయన చెప్పినట్లు తెలిపింది.

‘‘జైషే మొహమ్మద్ ప్రధాన శిబిరాన్ని పేల్చివేసిన ఐఏఎఫ్ జెట్లు: ప్రభుత్వం’’
హిందుస్తాన్ టైమ్స్: దట్టమైన అడవులతో నిండిన ఒక పర్వత శిఖరం మీద భారత వైమానిక దళం 1,000 పౌండ్ల బాంబులు వేసి పెద్ద సంఖ్యలో ఉగ్రవాదులను నిర్మూలించిన అనంతరం.. జైషే మొమమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అతి పెద్ద శిబిరం మీద భారత బలగాలు దాడి చేశాయని విదేశాంగ కార్యదర్శి విజయ్ గోఖలే చెప్పినట్లు హిందుస్తాన్ టైమ్స్ తన ప్రధాన కథనంలో తెలిపింది.
ఈ సీమాంతర దాడిపై సమీక్షించటానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్నతస్థాయి భద్రతా సమావేశం నిర్వహించిన అనంతరం గోఖలే ఈ ప్రకటన చేసినట్లు పేర్కొంది.

‘‘మాపై ప్రమాద మేఘాలు కమ్ముకున్నాయి: పాకిస్తాన్’’
ద టైమ్స్ ఆఫ్ ఇండియా: నియంత్రణ రేఖ వెంట ఉగ్రవాద స్థావరాలపై భారత వైమానిక దళం పలు వైమానిక దాడులు చేసిన అనంతరం పాకిస్తాన్ విదేశాంగ మంత్రి ఆకస్మికంగా భద్రతా సమావేశాన్ని ఏర్పాటు చేశారని.. పాకిస్తాన్ మీద ప్రమాద మేఘాలు ఆవరించాయని, భారత్ నిర్వహించిన ఆపరేషన్ గురించి దేశం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారని ద టైమ్స్ ఆఫ్ ఇండియా తన ప్రధాన కథనంలో ప్రచురించింది.
‘‘ప్రజలను తప్పుదారి పట్టించాలని నేను కోరుకోవటం లేదని ఇప్పటికే చెప్పాను. మన మీద ప్రమాద మేఘాలు ఆవరించాయి.. మనం అప్రమత్తంగానే ఉండాల్సి ఉంటుంది’’ అని ఆయన చెప్పినట్లు సామా టీవీ పేర్కొందని ఆ కథనంలో ఉటంకించింది.
- భారత్ మిరాజ్ యుద్ధ విమానాలనే ఎందుకు ఉపయోగించింది... బాలాకోట్ ఎక్కడుంది...
- భారత్-పాకిస్తాన్ యుద్ధం తప్పదా? ఈ యుద్ధం ఎలా ఉంటుంది? ఏం జరుగుతుంది?
- పుల్వామా దాడి: మోదీ ముందున్న మార్గాలేమిటి...
- 'భారత్ దాడులు చేస్తే పాకిస్తాన్ వెంటనే సమాధానం చెబుతుంది' - ఇమ్రాన్ ఖాన్
- పుల్వామా దాడి: కశ్మీర్ ఎలా విడిపోయింది? వారికి ఏం కావాలి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








