పుల్వామా దాడి: మోదీ ముందున్న మార్గాలేమిటి...

ఫొటో సోర్స్, Reuters
గతవారం కశ్మీర్‌లో జరిగిన మానవబాంబు దాడిలో 40 మందికి పైగా సైనికులు చనిపోయారు. భారత సైనికుల మీద గత కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ ఇంతటి తీవ్రమైన దాడి జరగలేదు. తమ దేశంలోనే ఉన్న జైష్-ఏ-మొహమ్మద్ మిలిటెంట్ గ్రూప్ చేసిన ఈ దాడిలో తన ప్రమేయమేమీ లేదని పాకిస్తాన్ అంటోంది.
ఎన్నికల ముంగిట్లో ఉన్న భారతదేశంలో... ఇలాంటి దాడులకు తప్పనిసరిగా తీవ్ర పరిణామాలు ఉంటాయని చాటాలని, ఈ ఘటన మీద స్పందించాలంటూ ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తోంది. ఈ సందర్భంలో ఆర్థికంగా, దౌత్యపరంగా, సైనిక పరంగా భారతదేశం ముందున్న మార్గాలపై ధ్రువ జైశంకర్ విశ్లేషణ.
దౌత్యపరంగా ఉన్న మార్గాలేమిటి?
భారత్-పాకిస్తాన్‌ల మధ్య రాజకీయ సంబంధాలు దాదాపు మూడేళ్ళుగా స్తంభించిపోయాయి.
నరేంద్ర మోదీ 2014లో అధికారంలోకి వచ్చాక మొదటి రెండేళ్ళలో పాకిస్తాన్‌కు సానుకూల సంకేతాలు పంపించారు. తన పదవీ ప్రమాణ కార్యక్రమానికి ఆయన పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌ను ఆహ్వానించారు. రెండు దేశాల జాతీయ భద్రతా సలహాదారుల మధ్య చర్చలను పునరుద్ధరించారు. ముందస్తు ప్రణాళిక లేకుండానే మోదీ లాహోర్‌లో పర్యటించారు. తీవ్రవాద-వ్యతిరేక దర్యాప్తులను పరస్పర సహకారంతో చేపట్టాలనే ప్రతిపాదనను కూడా ఆమోదించారు.

ఫొటో సోర్స్, AFP
భారత్ ప్రయత్నాలకు పాకిస్తాన్... వాస్తవాధీన రేఖ వెంబడి కాల్పులు జరపడం, భారతదేశంలోని కశ్మీర్ వేర్పాటువాదులతో చర్చలు జరపాలని ఒత్తిడి తేవడం, గూఢచర్యం ఆరోపణలతో కుల్‌భూషణ్ జాధవ్‌కు ఉరిశిక్ష విధించడం వంటి చర్యలతో ప్రతిస్పందించింది.
ఇరు దేశాల మధ్య శాంతి నెలకొల్పడానికి లాహోర్‌లో మోదీ.. నవాజ్ షరీఫ్‌ను కలిసిన కొన్ని రోజులకే, పఠాన్‌కోట్‌లోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగింది. ఈ దాడిలో ఆరుగురు భారత జవాన్లు మరణించారు. పాకిస్తాన్ ఇంటెలిజెన్స్‌తో సన్నిహిత సంబంధాలున్న జైష్-ఎ-మొహమ్మద్ మిలిటెంట్లు ఈ దాడి చేశారని భారతీయ అధికారులు ఆరోపించారు.
2016 నాటికి భారత్ ఓపిక నశించింది. పాకిస్తాన్ పట్ల చాలా అంశాలలో కఠినంగా వ్యవహరించడం మొదలైంది.
ఇమ్రాన్ ఖాన్ ప్రధాని అయ్యాక, గతేడాది జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ సందర్భంగా, భారత్-పాక్ విదేశాంగ మంత్రుల సమావేశం రద్దయ్యింది. కానీ, సాధారణ దౌత్య సంబంధ వ్యవహారాలు కొనసాగాయి.
పుల్వామా దాడి అనంతరం పాక్‌కు వ్యతిరేకంగా భారతదేశం తన దౌత్య ప్రయత్నాలను పునరుద్ధరించింది. 'పాకిస్తాన్ ప్రేరేపింత ఉగ్రవాదం' అన్న తన వాదనను మళ్ళీ వినిపిస్తోంది. తన మిత్రదేశాలతో కలసి రాయబార ప్రకటనలు చేసేప్పుడు పాకిస్తాన్‌ను ఎన్నో సంవత్సరాలుగా నిందిస్తున్న భారత్ తన వాదనను ఇప్పుడు బలపర్చుకుంది.
మిత్రదేశాలను కలుపుకుని చేసే ఉమ్మడి ప్రకటనల్లో ఇప్పుడు.. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న జైష్-ఎ-మొహమ్మద్, లష్కర్-ఎ-తోయిబా, పరారీలో ఉన్న దావూద్ ఇబ్రహీంకు చెందిన డీ కంపెనీ గురించి ప్రధానంగా ప్రస్తావిస్తోంది.

ఫొటో సోర్స్, Reuters
చైనా-పాక్ దోస్తానా
తన భాగస్వామ్య దేశాలు ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్లతో పాకిస్తాన్‌ను పోల్చి చూపిస్తోంది భారత్. ఉదాహరణకు ఉత్తర కొరియా గురించి జపాన్ ఆందోళన చెందుతోంది.
పాకిస్తాన్ విషయంలో భారత్ ఆందోళనను ఇతరులు అర్థం చేసుకునేందుకు ఈ చర్యలు ఉపయోగపడ్డాయి. అలాగే, పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తోన్న టెర్రరిస్ట్ సంస్థల గురించి రహస్య సమాచారం పొందడానికి ఆయా దేశాల నుంచి సహకారం అందుతోంది.
భారత్ చేస్తున్న ప్రయత్నాల ద్వారా, ఒకవేళ భవిష్యత్తులో పాకిస్తాన్‌పై ఆర్థిక, సైనికపరమైన ఆంక్షలను విధించాలనుకుంటే అందుకు ఇతర దేశాల నుంచి మద్దతు పెరుగుతుంది.
పాకిస్తాన్ నుంచి భారత్ ఎదుర్కొంటున్న సమస్యల పట్ల సహానుభూతి ఉన్న దేశాలు, పాకిస్తాన్‌తో తమకున్న సంబంధాల గురించి పునరాలోచనలోపడే అవకాశం ఉంది.
పాకిస్తాన్ పట్ల అమెరికా చాల అసహనంగా ఉంది.. ''పొరుగు దేశాల్లో హింసకు పాల్పడుతున్న సంస్థలను పాకిస్తాన్ ప్రోత్సహిస్తోంది'' అని అమెరికా వ్యాఖ్యానించింది.
చైనా-పాకిస్తాన్ మధ్య దశాబ్దాల స్నేహం ఉంది. చైనా, పాకిస్తాన్‌కు న్యూక్లియర్, మిసైల్ టెక్నాలజీ, సంప్రదాయ ఆయధాలను ఇవ్వడంతోపాటుగా చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ద్వారా పాకిస్తాన్‌లో వందల కోట్ల వ్యూహాత్మక పెట్టుబడులు పెడుతోంది.
సౌదీ అరేబియా, అరబ్ ఎమిరేట్స్ దేశాలు కూడా పాకిస్తాన్‌తో ఆర్థిక, రక్షణ సంబంధాలు కొనసాగిస్తూనే, ఇటు భారత్‌తో సత్సంబంధాల కోసం కొన్నేళ్లుగా ప్రయత్నిస్తున్నాయి.
అమెరికా, యూరోపియన్ యూనియన్ దేశాలు పాకిస్తాన్‌కు కొన్ని వాణిజ్య వెసులుబాట్లు కల్పించాయి. దిగుమతులపై భారత్ కంటే తక్కువ సుంకాలు విధించాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయగలదా?
పుల్వామా దాడి జరిగిన మరునాడే భారత్, పాకిస్తాన్‌కు 'మోస్ట్ ఫేవర్డ్ నేషన్'(ఎం.ఎఫ్.ఎన్) హోదాను రద్దు చేసింది. కస్టమ్స్ సుంకాలను 200%పెంచింది. అంతర్జాతీయంగా పాకిస్తాన్‌ను ఏకాకిని చేస్తామని హెచ్చరించింది.
రెండు దేశాల మధ్య ప్రత్యక్ష వాణిజ్యం పెద్దగా లేకున్నా, పాకిస్తాన్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి ఇదో సంకేతం.
మరికొన్ని మార్గాల్లో కూడా పాకిస్తాన్ వైఖరిని భారత్ దండిస్తూనే ఉంది. 2007 నుంచి, రెండు దేశాలమధ్య జరిగాల్సిన టెస్ట్ సిరీస్‌లో భారత్ పాల్గొనలేదు. ఈరకంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు ఆర్థికంగా నష్టం కలిగినట్లే.
1960లో భారత్-పాక్‌ల మధ్య జరిగిన సింధు జల ఒప్పందం రద్దు కూడా భారత్ ప్రతిపాదనలో ఉంది.
కానీ, ఈ ఒప్పందాన్ని రద్దు చేసుకుంటే, పాక్‌తోపాటు నీటి వాటాలు ఉన్న చైనా, నేపాల్, బంగ్లాదేశ్‌లతో కూడా భారత్ సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది.

ఫొటో సోర్స్, Getty Images
బ్లాక్ లిస్ట్?
ఇరాన్, ఉత్తర కొరియా దేశాలను ఉంచిన బ్లాక్ లిస్ట్‌లో పాకిస్తాన్‌నూ చేర్చవచ్చు. ఈ జాబితాలోని దేశాలపై ఆర్థికపరమైన చర్యలు ఉంటాయి.
‘ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్’గా పిలిచే ఈ సంస్థ, హవాలా డబ్బును అడ్డుకుంటుంది. పాకిస్తాన్‌కు చెందిన ఆర్థిక లావాదేవీలపై నిఘా పెరుగుతుంది.
దీంతో, దేశంలోకి వచ్చే పాకిస్తాన్ కరెన్సీ, పాకిస్తాన్ బ్యాంకింగ్ రంగం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం పడుతుంది.
పాకిస్తాన్‌ను బ్లాక్ లిస్ట్‌లో చేర్చే ప్రతిపాదనను చైనా ఎలాగూ అడ్డుకుంటుంది. అయితే, 'ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్' సంస్థ ఉపాధ్యక్ష పదవికి చైనాను ఎన్నుకునే అంశంలో భారత్ మద్దతు తెలిపింది. అందుకు ప్రతిగా, గత ఏడాది పాకిస్తాన్‌ను 'గ్రే లిస్ట్'లో చేర్చడానికి చైనా అంగీకరించింది.

ఫొటో సోర్స్, AFP
సైనిక చర్యలు ఎలా ఉండొచ్చు?
పాకిస్తాన్ అణ్వాయుధ దేశం మాత్రమే కాదు, అణ్వాయుధాలను వేగంగా అభివృద్ధి చేసుకుంటున్న దేశాల్లో ఒకటి. శక్తిమంతమైన సైన్యం ఉన్న దేశం కూడా. ఇదే భారత్‌కు పెను సవాలుగా మారింది. ఈ విషయాన్ని పాలకులు మర్చిపోకూడదు.
కానీ, అణ్వాయుధాల వరకు పోకుండా, రెండు దేశాలూ ప్రత్యామ్నాయ మార్గాల వైపు చూస్తున్నాయి.

ఫొటో సోర్స్, AFP
‘పరిణామాలు ఊహించలేరు..’
1999లో వాస్తవాధీన రేఖ(ఎల్.ఒ.సి) దాటి భారత్‌పై పాకిస్తాన్ సైన్యం దాడి చేయడంతో కార్గిల్ యుద్ధం జరిగింది.
ఆ తర్వాత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న రెచ్చగొట్టే చర్యలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే వస్తోంది. అందుకు ఒక ఉదాహరణే 2016లో జరిగిన 'సర్జికల్ స్ట్రైక్స్'.
సరిహద్దు చొరబాట్ల నియంత్రణ కోసం భారత్.. మిత్రదేశాల నుంచి సరికొత్త రక్షణరంగ సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందింది. ముఖ్యంగా మానవరహిత విమానాలు, సాంకేతిక మేధా సహకారాన్ని వినియోగిస్తోంది.
పాకిస్తాన్ చర్యలకు స్పందించడానికి భారత్ ముందున్న ఎన్నో అవకాశాల్లో ఇవి కొన్ని మాత్రమే. కానీ, తాజా సంఘటన తీవ్రత ఆధారంగా స్పందించాలనుకుంటే మాత్రం, ఎవరూ ఊహించని పరిణామాలు జరగొచ్చు.
బ్రూకింగ్స్ దిల్లీ శాఖలో ధృవ జైశంకర్ విదేశాంగ విధానలపై అధ్యయనం చేస్తున్నారు. ఆస్ట్రేలియాలోని లోవీ ఇన్స్టిట్యూట్‌లో నాన్-రెసిడెంట్ ఫెలోగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








