జమాల్ ఖషోగి అదృశ్యం: 'శిక్షలు' విధిస్తే తీవ్రంగా ప్రతిస్పందిస్తామన్న సౌదీ అరేబియా

ఫొటో సోర్స్, Getty Images
జర్నలిస్ట్ జమాల్ ఖషోగీ అదృశ్యం కావడానికి సంబంధించి వినిపిస్తున్న రాజకీయ, ఆర్థిక 'బెదరింపు'లను సౌదీ అరేబియా తోసిపుచ్చిందని అక్కడి వార్తా సంస్థ ఎస్.పి.ఏ తెలిపింది. అంతేకాకుండా, దీనికి సంబంధించి తమ మీద తీసుకునే ఎలాంటి చర్యలకైనా "తీవ్రంగా స్పందిస్తామని" కూడా పేరు చెప్పని ఒక సీనియర్ అధికారి అన్నారు.
సౌదీ ప్రభుత్వం మీద విమర్శనాత్మక కథనాలు రాసే జర్నలిస్ట్ ఖషోగీ అక్టోబర్ 2న ఇస్తాంబుల్‌లోని సౌదీ కాన్సులేట్ కార్యాలయంలోకి వెళ్ళిన తరువాత కనిపించకుండా పోయారు.
ఆయన హత్యకు సౌదీ అరేబియా ప్రభుత్వమే కారణమని తేలితే ఆ దేశాన్ని తాము 'శిక్షిస్తామని' అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ అన్నారు.
ఖషోగీ అదృశ్యం కావడానికి బాధ్యులెవరో తేల్చేందుకు వెంటనే విశ్వసనీయమైన దర్యాప్తు చేపట్టాలని బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ దేశాల విదేశాంగ మంత్రులు ఆదివారం నాడు ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు. "ఈ విషయంలో సౌదీ-టర్కీ దేశాల ఉమ్మడి ప్రయత్నాలకు మేం మద్దతు తెలుపుతున్నాం. సౌదీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సవివరంగా స్పందించాలని కోరుతున్నాం" అని జెరెమీ హంట్, జాన్-యెవెస్ లీ డ్రియన్, హీకో మాస్ ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే, ఈ నెలలో సౌదీ అరేబియాలో జరుగనున్న ఒక కీలకమైన అంతర్జాతీయ సదస్సును బహిష్కరించే విషయమై ఆలోచిస్తున్నామని బ్రిటన్, అమెరికా దేశాలు వెల్లడించాయి.
అయితే, సౌదీ కాన్సులేట్ కార్యాలయంలో జమాల్ హత్యకు గురయ్యారని నిరూపించటానికి తమ వద్ద ఆడియో, వీడియో సాక్ష్యాలు ఉన్నాయని టర్కీ భద్రతా వర్గాలు అంటున్నాయి.
సౌదీ ప్రభుత్వం మాత్రం టర్కీ చెబుతున్నదంతా 'అవాస్తవం' అని కొట్టిపారేసింది.
సౌదీ స్పందన ఏమిటి?
ఎస్పీఏ వార్తాసంస్థ వెల్లడి చేసిన సమాచారం ప్రకారం, "మా రాజ్యం మీద ఆర్థికంగా లేదా రాజకీయంగా ఒత్తిళ్ళు తీసుకువచ్చే ప్రయత్నాలను మేం పూర్తిగా తిరస్కరిస్తాం. ఎలాంటి బెదరింపులకు పాల్పడే ప్రయత్నాలను కూడా మేం ఏమాత్రం సహించం" అని సౌదీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు.
ఖషోగీ అదృశ్యం తరువాత సౌదీ అరేబియా మీద అంతర్జాతీయంగా ఒత్తిడి బాగా పెరిగింది.
ఈ నెలలో రియాద్ నగరంలో సౌదీ అరేబియా ప్రభుత్వం ఒక కీలకమైన అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తోంది.
అయితే, ఖషోగి అదృశ్యం ఘటనకు నిరసనగా ఆ సదస్సును బహిష్కరించాలని ఇప్పటికే పలు స్పాన్సర్ సంస్థలు, మీడియా గ్రూపులు నిర్ణయించాయి.
అలాగే, అమెరికా ఆర్థిక శాఖ మంత్రి స్టీవ్ నుచిన్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల సెక్రటరీ లియామ్ ఫాక్స్ ఈ సదస్సుకు హాజరుకాకపోవచ్చు అని బీబీసీ ప్రతినిధి జేమ్స్ లాండేల్‌కు దౌత్య వర్గాలు తెలిపాయి.
ఆ సదస్సుకు వెళ్లే విషయంపై లియామ్ ఫాక్స్ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య వ్యవహారాల విభాగం అధికార ప్రతినిధి తెలిపారు.
అంతకుముందు, జమాల్ విషయంలో ఏం జరిగిందనే దానిపై ''స్పష్టమైన సమాధానం'' వచ్చిన తర్వాతే ఆ సదస్సుకు హాజరయ్యే విషయమై ఇతర దేశాలు తగిన విధంగా స్పందించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ వ్యాఖ్యానించారు.
సౌదీ ప్రభుత్వ ఏజెంట్లే ఖషోగిని హత్య చేసినట్లు తేలితే, ఆ ఘటనను ఖండిస్తూ సంయుక్త ప్రకటన విడుదల చేసే విషయంపై కూడా అమెరికా, యూరప్ దౌత్యవేత్తలు చర్చిస్తున్నారు.
అయితే, ’’జమాల్ హత్యకు గురైనట్లైతే కేవలం ఖండనలు మాత్రమే చాలవని’’ ఆయన పెళ్లి చేసుకోవాలనుకున్న టర్కీ మహిళ హటీస్ చెంగిజ్ అన్నారు.
చట్టపరంగా దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె కోరారు.
ఈ శనివారమే జమాల్ పుట్టిన రోజు అని ఆమె గుర్తుచేసుకున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
టర్కీ రికార్డింగ్స్ ఏం చెప్తున్నాయి?
టర్కీలోని సౌదీ అరేబియా దౌత్యకార్యాలయంలో దాడి జరిగిందని, ఘర్షణ చోటు చేసుకుందని కొన్ని వార్తా కథనాలు సూచిస్తున్నాయి.
ఇందుకు సంబంధించి ఒక ఆడియో, వీడియో రికార్డులు ఉన్నాయని టర్కీ భద్రతా వర్గానికి చెందిన అధికారి ఒకరు బీబీసీ అరబిక్‌కు నిర్ధారించారు. అయితే, టర్కీ అధికారులు కాకుండా వేరెవరైనా వాటిని చూడటం కానీ వినటం కానీ జరిగిందా అన్నది ఇంకా తెలియలేదు.
జమాల్‌ను కొడుతున్నట్లు వినవచ్చునని.. ఆయనను చంపేసి ముక్కలు చేసినట్లు ఈ రికార్డులు చెప్తున్నాయని ఒక సోర్స్ చెప్తున్నట్లు వాషింగ్టన్ పోస్ట్ ఒక కథనంలో తెలిపింది.
''అరబిక్‌లో మాట్లాడుతున్న ఆయన స్వరం, ఇతర పురుషుల గొంతులు వినొచ్చు. ఆయనను ఎలా ఇంటరాగేట్ చేశారో, ఎలా హింసించారో, ఎలా చంపారో వినొచ్చు'' అని మరొక వ్యక్తి కూడా వాషింగ్టన్ పోస్ట్‌తో చెప్పారు.
ఇస్తాంబుల్‌లోని కాన్సులేట్ కార్యాలయంలోకి జమాల్ ఖషోగి ప్రవేశిస్తున్నప్పటి సీసీటీవీ దృశ్యాలను టర్కీ టీవీ ఒకటి ఇప్పటికే ప్రసారం చేసింది.
జమాల్ త్వరలో టర్కీ మహిళ హటీస్ చెంగిజ్‌ను వివాహం చేసుకోనున్న నేపథ్యంలో, అందుకు అవసరమైన పత్రాలను తీసుకోవటం కోసం ఈ కాన్సులేట్‌కి వచ్చారు.

ఫొటో సోర్స్, Reuters
జమాల్ అదృశ్యం వెనుక నిజం తెలియాలి: ఐరాస సెక్రటరీ జనరల్
మరోవైపు, జమాల్ అదృశ్యం వెనుక 'నిజం' వెల్లడించాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ డిమాండ్ చేశారు.
ఇటువంటి అదృశ్యాలు ఇంకా తరచుగా జరుగుతాయని.. అలా జరగటం మామూలు విషయంగా మారిపోతుందని తాను భయపడుతున్నట్లు బీబీసీతో చెప్పారు.
అధికారిక సౌదీ ప్రెస్ ఏజెన్సీ శుక్రవారం ప్రచురించిన ఒక కథనం ప్రకారం.. జమాల్ అదృశ్యం వెనుక 'పూర్తి వాస్తవాలు' వెలికి తీయాలని తామూ కోరుకుంటున్నామని.. అయితే, ఆయనను చంపాలని తాము ఆదేశాలు జారీ చేసినట్లు చేస్తున్న ఆరోపణలు 'నిరాధార'మని అంతర్గత వ్యవహారాల మంత్రి ప్రిన్స్ అబ్దులజీజ్ బిన్ సౌద్ బిన్ నాయిఫ్ బిన్ అబ్దులజీజ్ పేర్కొన్నారు.
ఆంటోనియో గుటెరెస్ బాలిలో జరుగుతున్న ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ సమావేశంలో మాట్లాడుతూ, ''వాస్తవాలు స్పష్టమవ్వాలంటే మనం బలంగా అడగాల్సిన అవసరముంది'' అని చెప్పారు.
''అసలు ఏం జరిగింది? కచ్చితంగా ఎవరు బాధ్యులు అనేది మనం తెలుసుకోవాలి. ఇలాంటి సంఘటనలు దీనికి జవాబుదారీతనాన్ని డిమాండ్ చేయాలి'' అని పేర్కొన్నారు.
సౌదీ అరేబియా ఈ నెలలో రియాద్‌లో ఒక కీలకమైన పెట్టుబడి సదస్సు నిర్వహిస్తోంది.
జమాల్ విషయంలో ఏం జరిగిందనే దానిపై ''స్పష్టమైన జవాబు'' వచ్చిన తర్వాత ప్రభుత్వాలు ఆ సదస్సుకు హాజరయ్యే విషయమై తగిన విధంగా స్పందించాలని గుటెరెస్ వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









