మూతపడిన ప్రపంచ అతిపెద్ద చేపల మార్కెట్

టోక్యో చేపల మార్కెట్
ఫొటో క్యాప్షన్, ప్రపంచంలోనే అతిపెద్ద చేపల మార్కెట్ మూతపడింది.

జపాన్ రాజధాని టోక్యోలో ఉన్న త్సుకిజీ చేపల మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్. అయితే, ఎనిమిది దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ మార్కెట్, శనివారంనాడు ఆఖరి వేలంపాటతో శాశ్వతంగా మూతబడింది.

టోక్యో నగరంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన త్సుకిజీ చేపల మార్కెట్ 83 ఏళ్లుగా నిర్విరామంగా నడుస్తోంది. అంతే కాదు, ఇది ప్రపంచంలోనే అతి పెద్ద మార్కెట్ కూడా.

ఈ మార్కెట్‌ను 1935లో ప్రారంభించారు. అతి కొద్ది కాలంలోనే ఇది అభివృద్ధి చెంది ప్రధాన మార్కెట్‌గా మారింది. 'ది కిచెన్ ఆఫ్ జపాన్' అన్న పేరు కూడా సంపాదించుకుంది.

వీడియో క్యాప్షన్, వీడియో: మూతపడిన ప్రపంచ అతిపెద్ద చేపల మార్కెట్

ఇక్కడ రోజుకు దాదాపు 60 వేల మంది దాకా లావాదేవీలు జరుపుతుండేవారు.

అయితే ఇప్పుడు వందలాది మంది చేపల వ్యాపారులు తమ దుకాణాలను సర్దుకొని కొత్త మార్కెట్‌కు వెళ్లిపోయే పనిలో ఉన్నారు. 2020లో జరగబోయే ఒలింపిక్స్‌లో భాగంగా జపాన్ ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయనుంది. అందుకోసం మరోచోట కొత్త మార్కెట్‌ను నిర్మించింది.

ఈ మార్కెట్‌లో శనివారం జరిగిన ఆఖరి చేపల వేలంపాటలో పాల్గొనేందుకు అనేక మంది తరలివచ్చారు.

జపాన్ రాజధాని టోక్యోకు వచ్చే పర్యాటకులంతా ఈ వేలాన్ని చూసేందుకు తెగ ఉత్సాహం చూపించారు.

టోక్యో చేపల మార్కెట్

వ్యాపారుల అభ్యంతరం

ఈ మార్కెట్‌ను ఇక్కడి నుంచి మార్చడం చాలా మంది వ్యాపారస్తులకు ఇష్టం లేదు.

దీన్ని మరో చోటుకు తరలించడంపై జరిపిన సర్వేలో ఏకంగా 83 శాతం మంది వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.

"ప్రస్తుతం త్సుకిజీ అంటే ఓ బ్రాండ్. ఇది త్సుకిజీ కావడం వల్లే ఇక్కడ జనం చేపల్ని కొంటున్నారు. ఇంకొక ప్రాంతానికి మారిస్తే, దీనికి ఈ స్థాయిలో గుర్తింపు ఉండదన్నది చాలా మంది ఆందోళన. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని ఇక్కడ నుంచి తరలించకూడదని వ్యాపారులు కోరుకుంటున్నారు. 23 ఏళ్ల నుంచి నేను ఇక్కడే పని చేస్తున్నా. ఈ మార్కెట్‌ను మార్చడం నాక్కూడా ఇష్టం లేదు" అని చేపల వ్యాపారి అత్సుమి నకముర అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)