#గమ్యం: ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ ఇలా అవ్వచ్చు

ఫొటో సోర్స్, TSAviationAcademy
- రచయిత, అనిల్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
బీబీసీ న్యూస్ తెలుగు 'గమ్యం'కు స్వాగతం.
మూడు వారాలుగా విమానయాన రంగంలో ఉద్యోగావకాశాల గురించి గమ్యంలో చర్చిస్తున్నాం. ఆ సిరీస్‌లో భాగంగా... ఈ వారం ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ (ఏఎంఈ) ఉద్యోగాల గురించి వివరిస్తున్నారు Careers360.comడైరెక్టర్ రామలక్ష్మి పేరి. మీ అభిప్రాయాలు, సందేహాలు బీబీసీ న్యూస్ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో కామెంట్ పోస్ట్ చేయండి.
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ అనే ఉద్యోగాల గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఎందుకంటే చాలామంది గ్రామీణ విద్యార్థులకు ఏవియేషన్ అంటే ఓ సుదూర స్వప్నం. ఎవరైనా కొద్దిమందికి పైలట్లు, ఎయిర్ హోస్టెస్ వంటి ఉద్యోగాలపై కొంత అవగాహన ఉంటే ఉండొచ్చు. కానీ ఏఎంఈల గురించి ఎక్కువ మందికి తెలియదు. ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఇప్పుడే కాదు... రాబోయే సంవత్సరాల్లో కూడా డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. దీనికి ఎన్నో కారణాలున్నాయి.
ఒక్క ఎయిర్‌క్రాఫ్ట్ గాలిలోకి ఎగరాలంటే దానికి సుమారు 33 మంది ఇంజినీర్లు ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. వీళ్లనే ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ అంటారు.
ఈ ఉద్యోగంలో చేరాలంటే ఏ కోర్సు పూర్తి చేయాలి, ఆ కోర్సుకు కావాల్సిన అర్హతలేమిటి, ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి.. ఈ వివరాలన్నీ ఈ వారం 'గమ్యం'లో.
డీజీసీఏ (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) ఆమోదించిన ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ శిక్షణ సంస్థలు దేశవ్యాప్తంగా 51 ఉన్నాయి. తెలంగాణలో కూడా 3 ఉన్నాయి.
ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్ - అర్హతలేమిటి?
ఏఎంఈ కోర్సులో చేరడానికి కనీస అర్హత మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలతో ఇంటర్మీడియట్ లేదా ప్లస్ 2. బీఎస్సీలో ఎంపీసీ గ్రూపుతో చదువుతున్నవారు లేదా చదివినవారు కూడా ఈ కోర్సులో చేరవచ్చు. అలాగే డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ చేసినవారూ ఈ శిక్షణ పొందడానికి అర్హులే. వీరంతా ఏఎంఈలో చేరాలంటే కనీసం 50 శాతం మార్కులతో ప్లస్ 2 లేదా డిప్లొమా ఉత్తీర్ణులు కావాలి.

ఫొటో సోర్స్, Getty Images
శిక్షణ - లైసెన్స్
డీజీసీఏ గుర్తింపు పొందిన 51 సంస్థల్లో ఎక్కడైనా చేరవచ్చు. వీటిలో కొన్ని సంస్థలు ప్రత్యేకంగా ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. మరికొన్ని మాత్రం నేరుగా ప్రవేశాలు కల్పిస్తున్నాయి.
శిక్షణ కాలం మూడు సంవత్సరాలు. ఈ మూడేళ్లలో ఎయిర్‌క్రాఫ్ట్‌కు సంబంధించిన అన్ని విభాగాలపైనా చాలా కఠోరమైన శిక్షణనిస్తారు. ఎలక్ట్రికల్ సిస్టమ్స్, రకరకాల ఇంజిన్లు, నేవిగేషన్ వ్యవస్థ... ఇలా అన్ని అంశాలనూ ఇందులో భాగంగా నేర్పిస్తారు.
ఈ శిక్షణ పూర్తయ్యాక లైసెన్స్ కోసం డీజీసీఏకు దరఖాస్తు చేసుకోవాలి. ఈ లైసెన్స్ పరీక్ష సంవత్సరానికి మూడుసార్లు నిర్వహిస్తారు.
బీఏఎంఈసీ (బేసిక్ మెయింటెనెన్స్ ఇంజినీర్స్ సర్టిఫికెట్) - దీనిలో అర్హత సాధిస్తే మీరు ఉద్యోగానికి అర్హులే. ఆ తర్వాత ఉద్యోగం చేస్తూ తదనంతర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ శిక్షణ తర్వాత ఏఎంఈ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఏఎంఈ లైసెన్స్ - దీనికోసం మూడు పరీక్షలు, ఓ ఇంటర్వ్యూలో అర్హత సాధించాల్సి ఉంటుంది. వీటికి సంబంధించిన సిలబస్ వివరాలన్నీ డీజీసీఏ వెబ్‌సైట్లో ఉంటాయి. సాధారణంగా శిక్షణలో నేర్చుకున్న అంశాల ఆధారంగానే ఈ పరీక్షలు ఉంటాయి.
లాగ్ బుక్ - ఇది చాలా కీలకమైన అంశం. మీరు శిక్షణలో నేర్చుకునే సమయంలోనే మీరు నేర్చుకున్నదానికి, మీరు చేసే ప్రతి పనికీ లాగ్ బుక్ మెయింటెయిన్ చేయాలి.

ఫొటో సోర్స్, Getty Images
ప్రైవేటు శిక్షణ సంస్థలున్నాయా?
ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లను నేరుగా ఈ కోర్సులో చేర్చుకుని శిక్షణనిచ్చేందుకు డీజీసీఏ కొన్ని విమానయాన సంస్థలకు వెసులుబాటు కల్పించింది. ఆ సంస్థల ద్వారా కూడా ఏఎంఈ శిక్షణ పొందవచ్చు. కానీ లైసెన్స్ పొందడానికి చివర్లో మూడు పరీక్షలు, ఇంటర్వ్యూలో ఉత్తీర్ణులు కావడం మాత్రం ఎవరికైనా తప్పనిసరి.
మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఇవ్వడం మరో తప్పనిసరి అంశం. శిక్షణ పొందడానికి ఇది అవసరం లేదు కానీ లైసెన్స్ పొందే ముందు అవసరమవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
అవకాశాలు ఎలా ఉంటాయి?
ప్రతి నెలా సుమారు 5 కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌లను భారత్ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తోంది. అలాగే ఎన్నో కొత్త విమానయాన సంస్థలు మార్కెట్లోకి వస్తున్నాయి. ఒక్క విమానం గాల్లోకి ఎగరాలంటే సుమారు 33 మంది ఇంజినీర్లు దాన్ని పరీక్షించి అనుమతివ్వాల్సి ఉంటుంది. దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు... ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజినీర్లకు ఎంత డిమాండ్ ఉండబోతోందో. కొత్త ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం కొత్త ఇంజినీర్లు అవసరమవుతూనే ఉంటారు. ప్రతి ఎయిర్‌లైన్స్ సంస్థా చాలా ఎక్కువ సంఖ్యలో క్రమం తప్పకుండా ఏఎంఈల నియమాకాలు చేపడుతూనే ఉంటుంది.
అందువల్ల మారుతున్న కాలానికి తగిన ఆధునిక కోర్సు కాబట్టి.. ఉద్యోగం పొందడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









