ఆస్ట్రేలియా: టర్న్‌బుల్ రాజీనామా, ప్రధాని పీఠమెక్కనున్న స్కాట్ మారిసన్

మాల్కమ్ టర్న్‌బుల్, స్కాట్ మారిసన్

ఫొటో సోర్స్, AFP

స్కాట్ మారిసన్ త్వరలో ఆస్ట్రేలియా ప్రధానమంత్రి పదవిని చేపట్టనున్నారు. నాయకత్వ పోరులో భాగంగా పార్టీలోని ప్రత్యర్థుల చేతిలో చిత్తయిన మాల్కమ్ టర్న్‌బుల్ ప్రధాని పదవికి రాజీనామా చేశారని అధికారవర్గాలు ధ్రువీకరించాయి.

అరకొర మెజారిటీతో గద్దెనెక్కిన టర్న్‌బుల్‌ కొద్దికాలంగా పార్టీలో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. పార్టీలోని కన్సర్వేటివ్ ఎంపీలు ఆయన మీద తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.

ప్రస్తుతం ట్రెజరర్‌గా ఉన్న మారిసన్ అంతర్గత బ్యాలట్‌లో 45-40 ఓట్లతో హోం మంత్రి పీటర్ డట్టన్‌పై విజయం సాధించారని లిబరల్ పార్టీ విప్ నోలా మారినో తెలిపారు.

ఈ నాయకత్వ పోటీలో టర్న్‌బుల్ పాల్గొనలేదు.

గత దశాబ్దకాలంలో ఆస్ట్రేలియాలో జరిగిన పార్టీ అంతర్గత తిరుగుబాట్లతో పదవి కోల్పోయిన నాలుగో ప్రధాని టర్న్‌బుల్.

"ఈ గొప్ప దేశానికి నాయకత్వం వహించే అవకాశం రావడం నా అదృష్టం. నేను ఆస్ట్రేలియాను ప్రేమిస్తాను. ఆస్ట్రేలియా దేశ ప్రజలను ప్రేమిస్తాను" అని టర్న్‌బుల్ అన్నారు.

రాజీనామా చేయాలంటూ పార్టీ తిరుగుబాటుదారుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆయన కొత్త నేత ఎన్నికకు బ్యాలట్ నిర్వహించేందుకు అంగీకరించారు.

స్కాట్ మారిసన్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, స్కాట్ మారిసన్

కొత్త ప్రధానిగా ఎన్నికైన స్కాట్ మారిసన్ గతంలో 'టూరిజం ఆస్ట్రేలియా' ఎండీగా పనిచేశారు. ఆ తరువాత ఇమ్మిగ్రేషన్, సోషల్ సర్వీసెస్ వంటి శాఖలకు మంత్రిగానూ పనిచేశారు.

విదేశాంగ మంత్రిగా పనిచేసిన జూలీ బిషప్ కూడా నాయకత్వ రేసులో నిలిచినా ఆయన తుది అంకం వరకు రాలేకపోయారు.

అంతర్గత బ్యాలట్‌లో విజయం సాధించిన మారిసన్‌కు డట్టన్ అభినందనలు తెలిపారు.

తాజా పరిణామాలపై ఇంతవరకు టర్న్‌బుల్ స్పందించలేదు.

కాగా గత దశాబ్ద కాలంలో ఆస్ట్రేలియా రాజకీయాల్లో నాయకత్వ తిరుగుబాట్లు జరిగాయి. ఇంతకుముందు ముగ్గురు ప్రధానులు పార్టీలోని ప్రత్యర్థుల కారణంగా పదవులు పోగొట్టుకున్నారు.

ఇటీవల కాలంలో ఆస్ట్రేలియాలో మూడేళ్ల పూర్తికాలం పదవిలో ఉన్న ప్రధానమంత్రి ఒక్కరు కూడా లేరు.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)