గ్వాటెమలాలో అగ్నిపర్వతం బద్దలై 25 మంది మృతి

ఫొటో సోర్స్, GUATEMALA GOVERNMENT
సెంట్రల్ అమెరికా దేశమైన గ్వాటెమలాలో భారీ అగ్నిపర్వతం పేలింది. ఈ ఘటనలో 25 మంది ప్రాణాలు కోల్పోయారు, వందల మంది గాయపడ్డారు.
దేశ రాజధాని గ్వాటెమలా నగరానికి నైరుతి వైపున 40 కిలోమీటర్ల దూరంలో ఈ అగ్నిపర్వతం ఉంది.
"అగ్నిపర్వతం నుంచి వెలువడిన లావా ఒక్కసారిగా ఓ గ్రామం పైకి దూసుకురావడంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. లావాలో చిక్కుకుని పలువురు సజీవ దహనమయ్యారు" అని దేశ విపత్తు నిర్వహణ విభాగం అధికారులు వెల్లడించారు.
సహాయక దళాలను రంగంలోకి దించినట్టు గ్వాటెమాలా అధ్యక్షుడు జిమ్మీ మొరాలెస్ తెలిపారు.
సమీప ప్రాంతాల్లోని గ్రామాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు,
భారీగా పొగ, దుమ్ము కమ్ముకోవడంతో దేశ రాజధానిలోని విమానాశ్రయాన్ని మూసివేశారు.
1974 తర్వాత సంభవించిన అతిపెద్ద అగ్నిపర్వత పేలుడు ఇదేనని స్థానిక నిపుణులు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
14 నిమిషాల పాటు కనిపించకుండా పోయిన కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్ విమానం
దక్షిణాఫ్రికాలో జరగనున్న బ్రిక్స్ దేశాల సదస్సుకు వెళ్లిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
ఆమె ప్రయాణిస్తున్న విమానానికి 14 నిమిషాల పాటు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ఏటీసీ) నుంచి సంబంధాలు తెగిపోయాయి.
సుష్మ తిరువనంతపురం నుంచి మారిషస్‌కు ఐఎఫ్‌సీ-31 విమానంలో వెళ్తుండగా మార్గంమధ్యలో విమాన సమాచారాన్ని అందుకోవడంలో సమస్య తలెత్తింది.
ఆమె ప్రయాణిస్తున్న విమాన గమనాన్ని గుర్తించలేకపోవడంతో మారిషస్ ఏటీసీ ప్రమాద హెచ్చరికను జారీ చేసింది.
అనంతరం సాయంత్రం 4 గంటల 58 నిమిషాలకు విమాన జాడను తెలుసుకున్న మారిషస్ ఏటీసీ ల్యాండ్ అయ్యేందుకు ఏర్పాట్లు చేసింది.

ఫొటో సోర్స్, Getty Images
బోటు మునిగి 48 మంది మృతి
ట్యునీషియా తూర్పు తీరంలో బోటు మునిగిన ప్రమాదంలో 48 మంది వలసదారులు ప్రాణాలు కోల్పోయారు.
మరో 67 మందిని కోస్టుగార్డు సిబ్బంది రక్షించినట్టు ట్యునీషియా ప్రభుత్వం తెలిపింది.
ప్రమాద సమయంలో బోటులో సుమారు 180 మంది ఉన్నారని, అందులో 100మంది వరకు ట్యునీషియా దేశస్థులని ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ వెల్లడించింది.
అయితే, ఆ బోటుకు 90 మందిని తీసుకెళ్లగల సామర్థ్యం మాత్రమే ఉందని, అంతకు రెట్టింపు మంది అందులో వెళ్తుండటం వల్లనే ప్రమాదానికి కారణమై ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు.
గత ఏడాది కాలంగా యూరప్ దేశాలకు వలస వెళ్లే వారికి ఈ మార్గం కీలకంగా మారింది.

ఫొటో సోర్స్, DD NEWS
మధ్యప్రదేశ్‌లో 60 లక్షల నకిలీ ఓటర్లు: కాంగ్రెస్
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 60 లక్షల నకిలీ ఓటర్లు ఉన్నారని ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది.
ఒకే వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు ఉన్నాయని, తాజాగా ఎన్నికల సంఘం విడుదల చేసిన జాబితాలో ఆ విషయం బయటపడిందని కాంగ్రెస్ ఆరోపించింది.
బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం అవకతవకలకు పాల్పడిందని కాంగ్రెస్ ఆరోపించింది.
గత ఐదేళ్లలో రాష్ట్రంలో జనాభా 24 శాతం పెరిగితే, ఓటర్ల శాతం 40 శాతం పెరిగిందని కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ అధ్యక్షులు కమల్ నాథ్ తెలిపారు.

ఫొటో సోర్స్, AFP
" భారత ఆర్థిక వ్యవస్థ 3 టైర్లు పంక్చర్ అయిన కారులా తయారైంది"
మూడు టైర్లు పంక్చర్ అయిన కారులాగా ప్రస్తుత భారత ఆర్థిక వ్యవస్థ తయారైందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి పి. చిదంబరం వ్యాఖ్యానించారు.
నరేంద్రమోదీ ప్రభుత్వం ఇంధన ధరలను అడ్డగోలుగా పెంచేస్తోందని ఆరోపించారు.
"ప్రైవేటు పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం, ఎగుమతులు, ప్రభుత్వ వ్యయాలు అనేవి ఆర్థిక వ్యవస్థకు కారుకు టైర్ల లాంటివి. కానీ, ఇప్పుడు మూడు టైర్లు పంక్చర్ అయ్యాయి" అని చిదంబరం విమర్శించారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








