చైనా పొరుగుదేశాలను బెదిరిస్తోంది: అమెరికా

ఫొటో సోర్స్, Reuters
వివాదాస్పద దక్షిణ చైనా సముద్రంలో క్షిపణులను మోహరించి చైనా తన పొరుగుదేశాలను బెదిరిస్తోందని అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ ఆరోపించారు.
సింగపూర్‌లో జరుగుతున్న భద్రతా సదస్సులో ఆయన ప్రసంగించారు. దక్షిణ చైనా సముద్రంలో వివాదాస్పద భూభాగంలో ఓడలను ధ్వంసం చేసే క్షిపణులు, భూమి నుంచి గగనతల లక్ష్యాలను ఛేదించే క్షిపణులు, ఎలక్ట్రానిక్ జామర్ల లాంటి మిలిటరీ సామగ్రిని చైనా మోహరించిందని మాటిస్ తెలిపారు.
అలా మిలిటరీ వినియోగించే ఆయుధ సామగ్రిని దించడం అంటే పొరుగు దేశాలపై జులుం ప్రదర్శించి, బెదింపులకు పాల్పడటమే అవుతుందని వ్యాఖ్యానించారు.
"చైనాతో నిర్మాణాత్మక సంబంధాలను ట్రంప్ పాలకవర్గం కోరుకుంటోందని, అదే సమయంలో అవసరమైతే గట్టిగా బదులిచ్చేందుకూ సిద్ధమే" అని మాటిస్ అన్నారు.

ఫొటో సోర్స్, GOOGLE/DIGITAL GLOBE
ఏమిటీ వివాదం?
అంతర్జాతీయ జల రవాణాకు కీలక మార్గంగా ఉన్న దక్షిణ చైనా సముద్రంపై తమకే హక్కులు ఉన్నాయంటూ ఆరు దేశాలు వాదిస్తున్నాయి.
ఇక్కడ మత్స్య సంపద అపారంగా ఉంది. పెద్ద మొత్తంలో చమురు, సహజయవాయువు నిక్షేపాలు ఉన్నాయని కూడా భావిస్తున్నారు. ఈ ప్రాంతం మీద సార్వభౌమాధికారం కోసం చైనా, వియత్నాం, ఫిలిప్పీన్స్, తైవాన్, మలేషియా, బ్రూనై దేశాల మధ్య వివాదం నడుస్తోంది.

ఫొటో సోర్స్, VCG
ఈ సముద్ర జలాల్లో చైనా కొన్నాళ్లుగా చిన్నచిన్న దీవులను, మిలిటరీ స్థావరాలను ఏర్పాటు చేస్తోంది.
ఇటీవల ఇక్కడి వివాదాస్పద భూభాగం పారాసెల్ ద్వీపంలో తొలిసారిగా ఆ దేశ వైమానికదళం బాంబు దాడులకు ఉపయోగించే యుద్ధవిమానాలను దించింది.
దీవులు, రీఫ్‌లలో ఆ యుద్ధవిమానాలతో విన్యాసాలు నిర్వహించింది. వాటిలో ఎక్కువ దూరంలోని లక్ష్యాలను ఛేదించగల హెచ్-6కే బాంబర్ కూడా ఉంది.
చైనా తీరుపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. చైనా తన చర్యలతో దక్షిణ చైనా సముద్రంతో ముడిపడిన ప్రాంతాన్ని అస్థిరపరుస్తోందని ఆరోపించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








