ఇరాన్‌తో అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నాం: ట్రంప్

ఫొటో సోర్స్, Getty Images
ఇరాన్‌తో 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందం నుంచి వైదొలగుతున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఈ డీల్ లోపభూయిష్టమైనదని, కాలం చెల్లినదని వ్యాఖ్యానించారు. అమెరికా పౌరుడిగా ఈ ఒప్పందం తనకు నగుబాటు అని చెప్పారు.
ఇరాన్ ఒప్పందం నుంచి తప్పుకోవద్దన్న యూరప్‌లోని అమెరికా మిత్రదేశాల సలహాను పక్కనబెడుతూ ట్రంప్ ఈ నిర్ణయం తీసుకొన్నారు. అణు ఒప్పందం కుదిరినప్పుడు ఇరాన్‌పై ఎత్తివేసిన ఆర్థిక ఆంక్షలను తిరిగి విధిస్తానని ఆయన చెప్పారు.
ట్రంప్ నిర్ణయంపై ఇరాన్ వెంటనే స్పందించింది.
ఒప్పందం రూపంలో అమెరికా తమకు మాట ఇచ్చిందని, తాజా నిర్ణయంతో ఈ మాటను అమెరికా తప్పుతోందని ఇరాన్ వ్యాఖ్యానించింది.
అవసరమైతే యురేనియం శుద్ధి కార్యక్రమాన్ని తిరిగి మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నామని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహానీ ప్రకటించారు.
అణు ఇంధనంతోపాటు అణ్వాయుధాల తయారీకి యురేనియం శుద్ధి కీలకం.
అణు ఒప్పందంలో భాగస్వాములైన తమ మిత్రదేశాలు, ఇతర దేశాలతో చర్చిస్తామని, వాటి సహకారంతో ఒప్పందం లక్ష్యాలు నెరవేరే పక్షంలో ఒప్పందంలో కొనసాగుతామని రౌహానీ చెప్పారు. కొన్ని వారాల్లో ఈ చర్చలు జరుపుతామని, ఆ తర్వాత ఒప్పందంపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
'జాయింట్ కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్(జేసీపీవోఏ)'గా వ్యవహరించే ఈ ఒప్పందం అమెరికా అధ్యక్షుడిగా బరాక్ ఒబామా ఉన్నప్పుడు కుదిరింది.

ఫొటో సోర్స్, EPA
ట్రంప్ చెప్పిన కారణం ఏంటి?
జేసీపీవోఏ నుంచి వైదొలుగుతున్నట్టు ట్రంప్ టీవీలో చేసిన ప్రసంగంలో ప్రకటన చేశారు. ఈ ఒప్పందాన్ని ఆయన "భయంకరమైంది, గతంలో ఎన్నడూ చూడనంత ఏకపక్ష ఒప్పందం" అని అభివర్ణించారు.
అమెరికాను, దాని మిత్రదేశాలను కాపాడడానికి బదులుగా, "ఇరాన్ అణు కార్యక్రమంపై ఈ ఒప్పందం చాలా బలహీనమైన పరిమితులనే విధించింది. సిరియా, యెమెన్, తదితర ప్రాంతాల్లో ఇరాన్ దుష్ట కార్యలాపాలపై ఎలాంటి పరిమితులూ విధించలేదు" అని ఆయన ఆక్షేపించారు.
ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు అభివృద్ధి చేసుకోవడం విషయంలో ఈ ఒప్పందం చేసిందేమీ లేదని ట్రంప్ అన్నారు. ఒప్పందంలోని పర్యవేక్షణ వ్యవస్థలు తగినంత బలంగా లేవని ఆయన చెప్పారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








