ఇటలీలో పీటముడి: మళ్లీ ఎన్నికలు?

ఫొటో సోర్స్, EPA
ఇటలీలో ప్రభుత్వ ఏర్పాటు దిశగా వివిధ పక్షాల మధ్య జరిగిన మూడో దఫా చర్చలు విఫలమయ్యాయి. దీంతో మళ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది, లేదా ఈ ఏడాది చివరి వరకు తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం పాలనా వ్యవహారాలు చూడనుంది.
మార్చి 4 నాటి ఎన్నికల్లో ఏ పార్టీకీ లేదా కూటమికీ స్పష్టమైన ఆధిక్యం దక్కలేదు. 31 ఏళ్ల లూగీ డి మాయివో నాయకత్వంలోని ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ అతిపెద్ద పార్టీగా అవతరించింది.
ఫోర్జా ఇటాలియా, ద లీగ్‌లతో కూడిన మితవాద కూటమితోగాని, మధ్యేవాద వామపక్షమైన డెమొక్రటిక్ పార్టీతోగాని కలిసేందుకు తాజా చర్చల్లోనూ ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్ అంగీకరించలేదు.
ఫోర్జా ఇటాలియాకు దేశ మాజీ ప్రధాని సిల్వియో బెర్లుస్కోని, ద లీగ్‌కు మాటియో సాల్విని, డెమొక్రటిక్ పార్టీకి మాటియో రెంజి సారథులు.

ఫొటో సోర్స్, AFP
జులైలో ఎన్నికలు?
ప్రతిష్టంభన కొనసాగడంపై ఇటలీ అధ్యక్షుడు సెర్జియో మాటరెల్లా స్పందిస్తూ- ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు కనిపించడం లేదని, తనను నడిపించే నాయకత్వం కోసం ఇటలీ ఇక ఎదురుచూడలేదని సోమవారం వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది చివరి వరకు తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగాలని, ఇందుకు పార్టీలు మద్దతు ఇవ్వాలని ఆయన ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన ప్రకారమైతే ఆపద్ధర్మ ప్రభుత్వం డిసెంబరులో రద్దవుతుందని, 2019 ప్రారంభంలో ఎన్నికలు జరుగుతాయని చెప్పారు.
ఈ ప్రతిపాదన పార్టీలకు అంగీకారయోగ్యంగా లేకపోతే జులై లేదా ఆ తర్వాత ఎన్నికలు జరుగుతాయని అధ్యక్షుడు ప్రకటించారు. ఫైవ్ స్టార్ మూవ్‌మెంట్‌గాని ద లీగ్‌గాని దీనిపై ఆసక్తి చూపలేదు. జులైలో ఎన్నికలకే ఈ రెండు పార్టీలు మొగ్గు చూపాయి. తుది నిర్ణయం అధ్యక్షుడే తీసుకుంటారు.
ఇటలీ ప్రధానిగా ప్రస్తుతం పావోలో గెంటిలోని ఉన్నారు. 2016 డిసెంబరులో ప్రధాని పదవికి మాటియో రెంజి రాజీనామా చేసినప్పటి నుంచి తటస్థ ఆపద్ధర్మ ప్రభుత్వం కొనసాగుతోంది.
'బ్రెగ్జిట్' ప్రక్రియ పూర్తయ్యాక యూరోపియన్ యూనియన్(ఈయూ)లో ఇటలీది మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవుతుంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








