ఇజ్రాయెల్ - గాజా సరిహద్దులో పేలుడు, నలుగురు ఇజ్రాయెలీ సైనికులకు గాయాలు

ఫొటో సోర్స్, Reuters
ఇజ్రాయెల్ - గాజా సరిహద్దుల్లో జరిగిన పేలుడులో నలుగురు ఇజ్రాయెల్ సైనికులు గాయపడ్డారు, వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉంది.
పాలస్తీనా జెండా ఎగరడం చూసిన తాము ఆ ప్రాంతంలోకి వెళ్లగానే పేలుడు సంభవించిందని సైన్యం తెలిపింది. దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజా ప్రాంతంలో వైమానిక దాడులు చేసింది. అయితే ప్రాణనష్టం జరిగినట్లు ఎలాంటి సమాచారం లేదు.
"2014లో ఇజ్రాయెల్ - హమాస్ మధ్య యుద్ధం తరువాత మళ్లీ ఇప్పుడు ఈ దాడి చోటుచేసుకోవడం ఓ దురదృష్టకర ఘటన" అని ఇజ్రాయెల్ మీడియా వ్యాఖ్యానించింది.
ఈ పేలుడు ఎవరు చేశారనేదానిపై ఇంతవరకూ ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటలకు ఈ పేలుడు జరిగింది.
"శుక్రవారం జరిగిన ఓ ప్రదర్శన సమయంలో కొందరు ఆ ప్రాంతంలో పేలుడు పదార్థాలను ఉంచి, దానికి ఓ జెండాను తగిలించారు" అని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇజ్రాయెల్ సైనికులు ఆ ప్రాంతం సమీపంలోకి వెళ్లగానే ఒక్కసారిగా పేలుడు సంభవించింది.
"దీన్ని మేము చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాం. అవసరమైన చర్యలు తీసుకుంటాం" అని జర్మనీ పర్యటనలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తెలిపారు.

జైటున్ సమీపంలో ఇజ్రాయెల్ వైపుగా తీవ్రవాదులు తవ్విన ఓ సొరంగం, డైర్ అల్-బలా, ఖాన్ యూనిస్‌లతో పాటుగా 6 హమాస్ స్థావరాలపై వైమానిక దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది.
మూడు హమాస్ శిక్షణ స్థావరాలతో పాటు మరో శిబిరంపై ఇజ్రాయెల్ దాడులు జరిపిందని, కానీ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదని పాలస్తీనా అధికారులు వెల్లడించారు.
గాజా వైపు నుంచి దూసుకొచ్చిన ఓ రాకెట్ దక్షిణ ఇజ్రాయెల్‌లోని ఓ ఇంటికి సమీపంలో పడిందని, దీనివల్ల ఎవరికీ ఎలాంటి నష్టం జరగలేదని ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులన్నింటికీ హమాస్‌దే బాధ్యత అని ఇజ్రాయెల్ ఆరోపించింది. 2008 నుంచి ఇప్పటి వరకూ హమాస్‌తో మూడుసార్లు యుద్ధాలు జరిగాయి.

ఫొటో సోర్స్, EPA
కొన్ని సంవత్సరాలుగా సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి ఘటనలూ జరగలేదని, కానీ జెరూసలేంను ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని డిసెంబర్‌లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటన తర్వాత ఈ ప్రాంతంలో హింస పెరిగిందని సైనిక ప్రతినిధులు తెలిపారు.
రాజధాని జెరూసలేం తమ భూభాగం నుంచి విడదీయలేని ప్రాంతమని ఇజ్రాయెల్ భావిస్తుండగా, 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయెల్ ఆక్రమించుకున్న తూర్పు ప్రాంతం తమకే చెందాలని పాలస్తీనా కోరుకుంటోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








