ప్రెస్ రివ్యూ: అడ్డదారులు తొక్కుతున్న క్యాబ్ సంస్థలు

ఫొటో సోర్స్, Gettyimages
అడ్డదారులు తొక్కుతున్న క్యాబ్ సంస్థలు
హైదరాబాద్‌లో ఏటా కోట్ల రూపాయలు టర్నోవర్ చేసే క్యాబ్ సంస్థలు పన్ను ఎగ్గొట్టేందుకు అడ్డదారులు తొక్కుతున్నాయి.
రెండు మూడేళ్లకోసారి సంస్థ రిజిస్ట్రేషన్లను రద్దు చేసుకుని, మళ్లీ కొత్త రిజిస్ట్రేషన్ చేసుకుంటూ కోట్ల రూపాయాల పన్ను ఎగవేతకు పాల్పడుతున్నాయని సాక్షి పత్రిక కథనంలో వివరించింది.
ముడుపులు అందుకుంటున్న పన్నుల శాఖ అధికారుల సహకారంతోనే క్యాబ్ సంస్థలు ప్రభుత్వ ఖజానాకు తూట్లు పొడుస్తున్నాయని పేర్కొంది.

ఫొటో సోర్స్, wikimedia
'కొట్లాట'కు హైకోర్టు అనుమతి
'కొలువులకై కొట్లాట' పేరుతో తెలంగాణ జేఏసీ సభ నిర్వహించుకునేందుకు హైదరాబాద్ ఎల్బీనగర్ పోలీసులకు దరఖాస్తు చేసుకునే వెసులుబాటును హైకోర్టు కల్పించింది.
సభకు పోలీసులు అనుమతి ఇవ్వడం లేదంటూ జేఏసీ నేతలు వేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి ఎస్.వి.భట్ తన నిర్ణయాన్ని వెల్లడించారు.
జేఏసీ దరఖాస్తు చేసుకున్న మూడు రోజుల్లోగా అనుమతిపై తగిన నిర్ణయాన్ని తెలియజేయాలని ఎల్బీ నగర్ డీసీపీని న్యాయమూర్తి ఆదేశించారని నవతెలంగాణ పత్రిక తెలిపింది.
సభను ఎక్కడ జరుపుతారు? ఎంతమంది వస్తారు? ఎన్ని వాహనాలు వస్తాయి? ఎన్ని గంటలకు సభ జరుగుతుంది? అన్న వివరాలను పోలీసులకు పిటిషనర్లు అందజేయాలని న్యాయమూర్తి సూచించారు.
బయటపడ్డ మరో అవినీతి పుట్ట
ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మేడెపల్లి విజయరాజు అక్రమాస్తుల బాగోతం బట్టబయలైంది.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే అభియోగంపై ఏపీ, తెలంగాణలోని ఆరు ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు.
మొత్తం రూ.100కోట్ల(మార్కెట్) విలువైన అక్రమాస్తులను గుర్తించారని ఈనాడు దినపత్రిక కథనంలో వెల్లడించింది.
హైదరాబాద్, విజయవాడల్లోని విజయరాజు నివాసాల్లో 537 ఖరీదైన చీరలను అధికారులు గుర్తించారు. వాటి విలువ దాదాపు రూ. 30 లక్షల దాకా ఉంటుందని అంచనా.

ఫొటో సోర్స్, Scott Olson/GettyImages
శిశు గృహంలో మరణ మృదంగం
చిన్నారులను కాపాడాల్సిన శిశుగృహాలు వారి పాలిట నరక ద్వారాలుగా మారుతున్నాయి. తల్లిదండ్రుల్లా కంటికి రెప్పలా చూసుకోవాల్సిన అధికారుల నిర్లక్ష్యంతో పసి పిల్లల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి.
నల్లగొండలోని శిశు గృహంలో 3 నెలల్లోనే 9 మంది చిన్నారులు మరణించారు. మరో 11 మంది చిన్నారులు నల్లగొండ ప్రభుత్వాసుపత్రి, హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 24 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య 116 శిశు మరణాలు నమోదయ్యాయని ఆంధ్రజ్యోతి కథనంలో వెల్లడించింది.
మా ఇతర కథనాలు:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








