ఆంధ్రప్రదేశ్: మధుమేహం లేని, స్టెరాయిడ్లు వాడని వారికీ బ్లాక్ ఫంగస్ - ప్రెస్ రివ్యూ

బ్లాక్ ఫంగస్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బ్లాక్ ఫంగస్‌కి సంబంధించి పరీక్షలు చేస్తున్న వైద్యురాలు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటివరకు 1,179 బ్లాక్‌ఫంగస్‌ కేసులు నమోదైనట్లు వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ సోమవారం వెల్లడించారని ఈనాడు ఒక కథనంలో పేర్కొంది.

‘‘ముక్కు, నోట్లో తలెత్తే మ్యూకర్‌మైకోసిస్‌ (బ్లాక్‌ ఫంగస్‌) మధుమేహులకు మాత్రమే పరిమితం కావడం లేదు. ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులను, రోగనిరోధశ శక్తి తక్కువగా ఉన్నవారినీ కబళిస్తోంది.

బ్లాక్ ఫంగస్ సోకిన వారిలో పురుషులు 780 మంది కాగా, మహిళలు 399 మంది. బాధితుల్లో 743 (63.01%) మంది మధుమేహం ఉన్నవారు. 251 (21.28%) మంది రోగ నిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, 130 (11.02%) మంది ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు’’ అని ఈనాడు రాసింది.

‘‘కరోనా ఇన్‌ఫెక్షన్‌, మధుమేహం ఉండటం, స్టెరాయిడ్‌ల వినియోగం బ్లాక్‌ఫంగస్‌ రావడానికి ప్రధాన కారణాలవుతున్నాయి.

ఈ వ్యాధితో ఆసుపత్రుల్లో చేరిన వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు సేకరించినప్పుడు దాదాపు 80 శాతం మంది కొవిడ్‌ బారినపడి 3 వారాలపాటు ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్లు, ఎక్కువ రోజులు ఆక్సిజన్‌పై ఉన్నట్లు తేలింది.

అయితే రాష్ట్రంలో బ్లాక్‌ఫంగస్‌ బారినపడిన వారిలో ఆక్సిజన్‌ సాయంతో చికిత్స పొందినవారి కంటే పొందనివారే ఎక్కువ మంది కావడం గమనార్హం. అలాగే స్టెరాయిడ్లు వాడినవారి కంటే వాడని వారికే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుండటం కొత్త కోణం’’ ఆ అని పత్రిక చెప్పింది.

‘‘విజయవాడలోని ఓ ఆసుపత్రిలో కరోనా చికిత్స పొందిన 35 ఏళ్ల యువకుడు బ్లాక్‌ఫంగస్‌ బారినపడ్డాడు. అతనికి రక్తపోటు, మధుమేహం కూడా లేవు.

వైరస్‌లో కొత్త స్ట్రెయిన్లు రావడం వల్ల శరీరంలోకి వైరస్‌ చేరిన వెంటనే పలువురిలో క్లోమం (పాంక్రియాస్‌)పై ప్రభావం చూపుతోంది. దీనివల్ల ఇన్సులిన్‌ ఉత్పత్తి ఎక్కువై రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగిపోతున్నాయి.

అలాగే కొందరిలో ఐరన్‌ స్థాయి పెరగడం కూడా కొత్త సమస్యలను తెచ్చిపెడుతోంది. ఆక్సిజన్‌ అందించే పైపులు, మాస్కుల్లో ఫంగస్‌ చేరడం వల్ల కూడా పలువురు కొవిడ్‌ బాధితులు బ్లాక్‌ఫంగస్‌ బారినపడినట్లు భావిస్తున్నార’’ని ఈ కథనంలో ఈనాడు వివరించింది.

తెలంగాణ అవతరణ వేడుకలు

ఫొటో సోర్స్, @TRSPARTY

తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకల్లో పదిమందికే అనుమతి

తెలంగాణ రాష్ట్రావతరణ సందర్భంగా జూన్‌ 2న రాజధాని సహా 32 జిల్లాల్లో ఉత్సవాలు నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిందని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.

జిల్లాల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించే బాధ్యతను ప్రజాప్రతినిధులకు అప్పగించింది.

కరోనా నేపథ్యంలో 10 మందికి మించకుండా కార్యక్రమాన్ని నిర్వహించాలని కలెక్టర్లను ఆదేశించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ సోమవారం జారీ చేశారని పత్రిక రాసింది.

రాష్ట్ర స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరుగుతుందని, అక్కడ సీఎం కేసీఆర్‌ జెండా ఎగురవేస్తారని తెలిపారు. జిల్లాల్లో జెండా ఆవిష్కరించే ప్రజాప్రతినిధులు తెలంగాణ అమర వీరులకు శ్రద్ధాంజలి ఘటించాలని ఆదేశించారు.

ఉదయం 9 గంటలకు జిల్లాల్లో జెండాలు ఎగురవేయాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు ఏర్పాట్లు చేయించాలని ఆదేశించారు.

గౌరవ వందనానికి 12 మందితో పోలీసుల బృందాలను ఏర్పాటు చేయాలని నగర పోలీసు కమిషనర్లకు, జిల్లా పోలీసు సూపరింటెండెంట్లకు సూచించారు.

ఫ్లాగ్‌ కోడ్‌-2002 అమలయ్యేలా చూడాలని, మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, శానిటైజర్ల వాడకం, శానిటైజేషన్‌ వంటి కోవిడ్‌ నిబంధనలు పాటించేలా చూడాలని కలెక్టర్లను ఆదేశించినట్లు ఆంధ్రజ్యోతి వివరించింది.

నూతన విద్యా విధానం

ఆంధ్ర ప్రదేశ్‌లో నూతన విద్యావిధానానికి శ్రీకారం

ఆంధ్ర ప్రదేశ్‌లో నూతన విద్యావిధానాన్ని అమలు చేసేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసిందని సాక్షి ఒక కథనాన్ని ప్రచురించింది.

ప్రస్తుతమున్న 10+2 విధానం స్థానంలో 5+3+3+4 విధానం అమల్లోకి రానుంది. జాతీయ నూతన విద్యా విధానాన్ని అనుసరించి రాష్ట్ర పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుడుతోంది.

ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు విడుదల చేశారు.

రాష్ట్రంలోని అన్ని స్థాయిల కార్యనిర్వాహక అధికారులు ప్రస్తుతమున్న విధానం నుంచి నూతన విద్యావిధానంలోకి ప్రస్తుతం ఉన్న పాఠశాలలను ఎలా మ్యాపింగ్‌ చేయాలనే దానిపై కసరత్తు చేసి జూన్‌ 2వ తేదీలోగా నివేదికలను ఆన్‌లైన్‌లో సమర్పించాలని అన్ని జిల్లాల డీఈవోలకు ఆదేశాలు ఇచ్చారు.

నూతన విధానంపై మార్గదర్శకాలను కూడా పొందుపరిచారు.

నూతన విధానంలో ఇలా..

  • ఈ విధానంలో మూడు రకాల విద్యాసంస్థలు ఉంటాయి. ప్రాథమిక పాఠశాలల్లో ఇకనుంచి ప్రీ ప్రైమరీ–1, ప్రీ ప్రైమరీ–2, ప్రిపరేటరీ ఫస్ట్‌క్లాస్, 1వ తరగతి, 2వ తరగతితో ఉంటాయి. వీటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పిలుస్తారు.
  • ఆ తరువాత ప్రిలిమినరీ స్కూళ్లు (3, 4, 5 తరగతులు) ఉంటాయి. అనంతరం మిడిల్‌ స్కూళ్లు (6–8 తరగతులు), ఆపై సెకండరీ స్కూళ్లు (9నుంచి 12 తరగతులు) ఉంటాయి. అన్ని అంగన్‌వాడీ కేంద్రాలు ఇకపై వైఎస్సార్‌ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి.
  • సాధ్యమైనంత వరకు అంగన్‌వాడీ కేంద్రాలను స్కూళ్లలో అనుసంధానమయ్యేలా చేయాలి. అలా ఒకే ప్రాంగణం లేదా ఒకే భవనంలో ఇవి ఉండేలా చేసి.. వాటిని ఫౌండేషన్‌ స్కూళ్లుగా పరిగణించాలి.
  • ప్రతి ఫౌండేషన్‌ స్కూల్‌లో ఒక ఎస్జీటీ టీచర్‌ ఉంటారు. 1, 2 తరగతులకు బోధన చేస్తారు. ప్రిపరేటరీ–1 క్లాస్‌కు బోధనా సిబ్బందిని వేరేగా ఏర్పాటు చేస్తారు.
  • ప్రస్తుత ప్రాథమిక స్కూళ్లలో ఉండే 3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీపంలోని యూపీ స్కూల్‌ లేదా హైస్కూళ్లకు తరలిస్తారు. 3 కిలోమీటర్ల పరిధిలోపు ఉన్న ప్రాథమిక పాఠశాలల విద్యార్థులనే ఇలా తరలింపు చేయాలి.
  • ఈ విద్యార్థులను తరలించేప్పుడు ఆ యూపీ, హైస్కూళ్లలో తరగతి గదులు లేకుంటే అదనపు తరగతి గదులు ఎన్ని నిర్మించాల్సి ఉంటుందో కసరత్తు చేసి వాటిని నాడు–నేడు కింద నిర్మింపచేస్తారు.
  • ఇలా 3–5 విద్యార్థులు అదనంగా చేరినప్పుడు యూపీ స్కూలులో 150 మందికి మించి విద్యార్థుల సంఖ్య పెరిగితే దాన్ని హైస్కూల్‌గా అప్‌గ్రేడ్‌ చేస్తారు.
  • 5 కిలోమీటర్ల సమీపంలోని సెకండరీ స్కూళ్లలో ఆయా మాధ్యమాల విద్యార్థుల సంఖ్యను అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌ మీడియం స్కూళ్లుగా కొనసాగిస్తారు.
  • విద్యార్థుల సంఖ్య, మౌలిక వసతులను అనుసరించి సెకండరీ స్కూళ్లలో ఇంటర్మీడియెట్‌ తరగతులను ఏర్పాటు చేస్తారు. అక్కడ 12వ తరగతి వరకు ఉంటుంది. ఇలాంటి స్కూళ్లను గుర్తించాలి. ఇటువంటివి మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున ఏర్పాటవుతాయి.
  • సెకండరీ స్కూళ్లకు సంబంధించి మండలానికి 2 చొప్పున 9నుంచి 12వ తరగతి ఉండేలా ప్రణాళిక రూపొందించి అదనపు తరగతి గదుల నిర్మాణం ఏ మేరకు అవసరమో నిర్ణయించాలి.
  • ఈ కసరత్తు పూర్తిచేసి జూన్‌ 2వ తేదీకల్లా వివరాలను గూగుల్‌ లింక్, ఆన్‌లైన్‌ ద్వారా సమర్పించాలి.
తెలంగాణ ఇంటర్ బోర్డ్

ఇంటర్ విద్యార్థులు నేరుగా ఆన్‌లైన్లోనే నచ్చిన కోర్సుల్లో చేరవచ్చు

ప్రభుత్వ కాలేజీల్లో విద్యార్థులే నేరుగా ప్రవేశాలు పొందే అవకాశాన్ని ఇంటర్‌బోర్డు కల్పించిందని, ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులే తమకు నచ్చిన కోర్సులో, నచ్చిన కాలేజీలో చేరే అవకాశం ఇచ్చిందని నమస్తే తెలంగాణ ఒక కథనంలో తెలిపింది.

ఇప్పటివరకు దరఖాస్తులు స్వీకరించి, మెరిట్‌, రిజర్వేషన్ల ఆధారంగా సీట్లు కేటాయించిన ఇంటర్‌బోర్డు ఈ ఏడాది నుంచి విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడం, వీటి ఆధారంగా ప్రవేశాలు పొందేందుకు వీలుగా తమ వెబ్‌సైట్‌లో సెల్ఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఆప్షన్‌ను ఇచ్చింది.

మంగళవారం నుంచి www.tsbie.cgg.gov.inలో ఈ సెల్ఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ ఆప్షన్‌ అందుబాటులో ఉంటుందని ఇంటర్‌బోర్డు కార్యదర్శి సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ వెల్లడించారని పత్రిక రాసింది.

ఇంటర్‌ మొదటి విడత ప్రవేశాలు మే 25 నుంచి ప్రారంభం కాగా, జూలై 5 వరకు గడువు విధించిన విషయం తెలిసిందే.

ఇది వరకు ప్రిన్సిపాల్‌ లాగిన్‌ ఐడీ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్‌ ప్రవేశాలు కల్పించగా, ఈ ఏడాది నుంచి విద్యార్థులే ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా ప్రవేశాలు పొందే అవకాశం ఇచ్చారు.

దీంతో ప్రవేశాల కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు కాలేజీలకు వెళ్లాల్సిన అవసరంలేదని జలీల్‌ స్పష్టంచేశారు.

సెల్ఫ్‌ ఎన్‌రోల్‌మెంట్‌ పేజీలో ఎస్సెస్సీ హాల్‌టికెట్‌ నంబర్‌ను ఎంటర్‌చేసి, తాము చేరదల్చుకున్న ప్రభుత్వ కాలేజీ పేరు ఎంపికచేసుకొని ప్రవేశాలు పొందవచ్చని వివరించారు.

కరోనా, లాక్‌డౌన్‌ నేపథ్యంలో కాలేజీల రీ ఓపెన్‌ను ఇంటర్‌బోర్డు వాయిదావేసింది.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం 2021- 22 విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌ క్లాసులు మంగళవారం నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా, తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణను వాయిదావేస్తున్నట్టు సయ్యద్‌ ఒమర్‌ జలీల్‌ సోమవారం జారీచేసిన ఉత్తర్వుల్లో తెలిపారు.

ఆన్‌లైన్‌ ప్రవేశాలు షెడ్యూల్‌ ప్రకారమే జరుగుతాయని, ప్రిన్సిపాళ్లు తమ కాలేజీల్లోని బోధన, బోధనేతర సిబ్బందిని వినియోగించి ప్రవేశాలను కొసాగించవచ్చని వెల్లడించారని నమస్తే తెలంగాణ వివరించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)