పుదుచ్చేరి ఎన్నికలు: ఇక్కడ కాంగ్రెస్ మళ్లీ గెలుస్తుందా... లేక బీజేపీ జెండా ఎగరేస్తుందా?

పుదుచ్చేరి ఎన్నికలు

ఫొటో సోర్స్, ARUN SANKAR/AFP via Getty Images

నాలుగు రాష్ట్రాలతో కేంద్ర పాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి.

పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతమైనప్పటికీ ఇక్కడ అసెంబ్లీ ఉంటుంది. ఎన్నికైన ముఖ్యమంత్రితో కలిసి నామినేట్ అయిన లెఫ్టినెంట్ గవర్నర్ ఇక్కడ పరిపాలన కొనసాగిస్తారు.

గత ఫిబ్రవరి 22న అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్షలో విఫలం కావడంతో ముఖ్యమంత్రి పదవికి వీ నారాయణ స్వామి రాజీనామా చేయాల్సి వచ్చింది.

అదే సమయంలో లెఫ్టినెంట్ గవర్నర్ పదవి నుంచి బీజేపీ నాయకురాలు కిరణ్ బేదీని తొలగించారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సుందరరాజన్‌కు పుదుచ్చేరి బాధ్యతలను అదనంగా అప్పగించారు.

ఎన్నికలు ఎప్పుడు?

ఒకే దశలో ఏప్రిల్ 6న పుదుచ్చేరిలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. కోవిడ్-19 వ్యాప్తి నడుమ ఇక్కడ పోలింగ్‌ను ఒక గంట సేపు ఎక్కువగా నిర్వహించాలని నిర్ణయించారు.

పుదుచ్చేరి ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఫలితాలు ఎప్పుడు వస్తాయి?

నాలుగు రాష్ట్రాలతో కలిపి పుదుచ్చేరి ఫలితాలు కూడా మే 2న ప్రకటిస్తారు.

ఎన్ని స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు?

పుదుచ్చేరి అసెంబ్లీలో 33 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో మూడు స్థానాలకు ప్రముఖులను నామినేట్ చేస్తారు. మిగతా 30 స్థానాలకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో 5 రిజర్వుడు నియోజకవర్గాలు కూడా ఉన్నాయి.

ఏ పార్టీలు బరిలో ఉన్నాయి?

పుదుచ్చేరిలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తోంది. డీఎంకేతో కలిసి ఇక్కడ కాంగ్రెస్ బరిలోకి దిగింది. కొన్ని చిన్న పార్టీలు, వామపక్షాలు కూడా వీరి కూటమిలో ఉన్నాయి.

మరోవైపు ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నా డీఎంకే, మరికొన్ని చిన్న పార్టీలతో కలిసి బీజేపీ బరిలోకి దిగుతోంది.

సినీనటుడు కమల్ హాసన్ రాజకీయ పార్టీ మక్కల్ నీధి మయ్యమ్ (ఎంఎన్ఎం) కూడా ఈ సారి తమ అదృష్టం పరీక్షించుకోబోతోంది.

తమిళ జాతీయవాద పార్టీ నామ్ తమిలర్ కచ్చి కూడా బరిలోకి దిగుతోంది.

పుదుచ్చేరి ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ఓటర్లు ఎంత మంది?

ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం పుదుచ్చేరిలోని 30 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 10,03,681 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 4,72,736 మంది పురుషులు. 5,30,828 మంది మహిళలు. 117 మంది థర్డ్ జెండర్ ఓటర్లు కూడా ఉన్నారు. ఇక్కడ పురుషుల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ మంది ఉన్నారు.

ఎన్ని దశల్లో ఎన్నికలు జరుగుతాయి?

ఒకే దశలో ఏప్రిల్ 6, 2021న పుదుచ్చేరిలో ఎన్నికలు జరుగుతాయి.

ఫలితాలు ఎలా ప్రకటిస్తారు?

ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే సగం కంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ 16.

పుదుచ్చేరి ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

ప్రధాన అభ్యర్థులు వీరే..

ఆల్ ఇండియా ఎన్ ఆర్ కాంగ్రెస్, బీజేపీ, అన్నాడీఎంకే

  • ఎన్ రంగస్వామి (ఎన్ఆర్ కాంగ్రెస్) - తట్టన్‌చావడీ, యానాం
  • వీ స్వామినాథన్ (బీజేపీ)-లాస్‌పేట్
  • ఏ నమ:శివాయ (బీజేపీ) - మన్నాడిపేట్
  • ఏ జాన్ కుమార్ (బీజేపీ)- కామరాజ్ నగర్

కాంగ్రెస్, డీఎంకే

  • ఏవీ సుబ్రమణియమ్ (కాంగ్రెస్)- కరైకాల్

ఎన్నికల్లో ప్రధాన అంశాలు ఏమిటి?

ఇదివరకటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో కాస్త వ్యతిరేకత ఉంది. అదే సమయంలో మాజీ సీఎం వీ నారాయణ స్వామి, మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేదీల మధ్య విభేదాలు ఇక్కడ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశముంది.

పుదుచ్చేరి ఎన్నికలు

ఫొటో సోర్స్, Getty Images

గత ఎన్నికల్లో ఏం జరిగింది?

2016 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లో విజయం సాధించింది. అదే సమయంలో ఎన్ఆర్ కాంగ్రెస్ ఎనిమిది చోట్ల, అన్నా డీఎంకే నాలుగు చోట్ల, డీఎంకే రెండు చోట్ల విజయం సాధించింది. బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కలేదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)