కీరన్ పొలార్డ్: యువరాజ్ సింగ్, హెర్షలీ గిబ్స్ సరసన చేరిన వెస్టిండీస్ ఆల్‌రౌండర్.. ఒకే ఓవర్లో ఆరు సిక్స్‌లు

పొలార్డ్

ఫొటో సోర్స్, Getty Images

వెస్టిండీస్ కెప్టెన్ కీరన్ పొలార్డ్ ఒకే ఓవర్‌లో వరుసగా ఆరు బంతుల్లో ఆరు సిక్స్‌లు కొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో అలాంటి ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్ అయ్యాడు.

శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అఖిల ధనంజయ్ వేసిన ఓవర్‌లో పొలార్డ్ ఈ ఘనత సాధించాడు.

పొలార్డ్ దూకుడుతో వెస్టిండీస్ తమ ముందున్న 131 పరుగుల లక్ష్యాన్ని 13.1 ఓవర్లలో ఛేదించి మ్యాచ్ గెలుచుకుంది.

ధనంజయ్

ఫొటో సోర్స్, TWITTER/@OFFICIALSLC

హ్యాట్రిక్ తీసిన సంబరం లేకుండానే..

పొలార్డ్ తన బౌలింగ్‌లో ఆరు సిక్స్‌లు కొట్టడానికి ముందు ఓవర్‌లోనే ధనంజయ్ హ్యాట్రిక్ సాధించి వెస్టిండీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు.

అయితే, పొలార్డ్ దూకుడుతో ధనంజయ హ్యాట్రిక్ సంతోషం ఆవిరైపోయింది.

యువరాజ్, గిబ్స్ సరసన..

పొలార్డ్ కంటే ముందు భారత బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్, దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ హెర్షలె గిబ్స్‌లు అంతర్జాతీయ క్రికెట్‌లో ఇలాంటి ఫీట్ సాధించారు.

2007 వరల్డ్ కప్‌లో గిబ్స్ నెదర్లాండ్స్‌పై వన్ డే మ్యాచ్‌లో ఇలాంటి ఫీట్ సాధించగా యువరాజ్ సింగ్ అదే ఏడాది ట్వంటీ20లో ఇంగ్లండ్‌పై ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు బాదాడు.

యువరాజ్ ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 7 సిక్స్‌లు, 3 ఫోర్లతో 58 పరుగులు సాధించాడు.

వారిద్దరి తరువాత అంతర్జాతీయ క్రికెట్‌లో ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌గా నిలిచారు.

గ్యారీ సోబర్స్ బోణీ

క్రికెట్‌లో మొట్టమొదట ఒకే ఓవర్‌లో ఆరు సిక్స్‌లు కొట్టింది వెస్టిండీస్ ఆటగాడు సర్ గ్యారీ సోబర్స్ . 1968లో కౌంటీల్లో నాటింగ్‌హామ్‌షైర్ తరఫున ఆడుతూ ఆయన గ్లామోర్గాన్‌పై ఈ ఘనత సాధించారు.

పొలార్డ్

ఫొటో సోర్స్, TWITTER/WINDIES CRICKET

మూడో సిక్స్ తరువాత ఆరు సిక్స్‌లకు గురి పెట్టాను

''మూడు సిక్స్‌లు కొట్టిన తరువాత ఆరు సిక్స్‌లు కొట్టగలనని అనిపించింది. అయిదో సిక్స్ కొట్టిన తరువాత బౌలర్ రౌండ్ ద వికెట్ రావడంతో ఇక కష్టమనుకున్నాను. కానీ, ఎలాగైనా కొట్టాలనుకుని బౌండరీ అవతలికి గాల్లోంచి పంపించాను'' అని పొలార్డ్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)