తెలంగాణ: లాయర్ దంపతుల హత్యకు దారితీసిన పరిస్థితులేంటి... పోలీసులు ఏమంటున్నారు?

హైకోర్టు లాయర్ దంపతులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హైకోర్టు లాయర్ దంపతులు గట్టు వామన్‌రావు, నాగమణి
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి
మీ అభిమాన భారతీయ క్రీడాకారిణికి ఓటు వేసేందుకు CLICK HERE

ఫిబ్రవరి 17వ తేదీ మధ్యాహ్నం మంథని కోర్టులో పని ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణం అయ్యారు లాయర్ వామన రావు, నాగమణి. వారిని చంపాలని నిర్ణయం తీసుకుని అప్పటికే ప్లాన్ తో సిద్ధంగా ఉన్నారు కుంట శ్రీను. కుమార్ అనే వ్యక్తికి వామన రావును ఫాలో అవ్వాలనీ, వారు ఎటు వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వాలని తన కారు ఇచ్చి పంపారు కుంట శ్రీను. కుమార్ వామన రావును ఫాలో అవుతూ వాళ్లు పెద్ద పల్లి వైపు వెళ్తున్నారనే సమాచారం ఇచ్చాడు.

ఈలోపు తన కోసం మరో కారు సిద్ధం చేసుకున్నాడు శ్రీను. ఆ కారు తెచ్చి ఇచ్చిన వ్యక్తి పేరు బిట్టు శ్రీను. సదరు బిట్టు శ్రీను కారుతో పాటూ, రెండు కత్తులు కూడా తెచ్చి ఇచ్చాడు. బిట్టు శ్రీను తెచ్చి ఇచ్చిన కారు, కత్తులు తీసుకుని వామన రావు వెళ్లినవైపు బయల్దేరాడు కుంట శ్రీను. తనతో పాటూ చిరంజీవి అని వ్యక్తిని తీసుకుని వెళ్లాడు. కుంట శ్రీను, చిరంజీవిలకు ఆయుధాలు, కారు అప్పగించిన బిట్టు శ్రీను అక్కడ నుంచి సీన్ లో లేడు.

పెద్దపల్లి నుంచి హైదరాబాద్ రోడ్డు మీద కారు ఎక్కడ స్లో అవ్వాల్సి వస్తుందో ముందుగానే ప్రణాళిక వేశారు. రామగిరి శివార్ల వరకూ వామన రావు కారు రాగానే, తన కారుతో ఆ కారును గుద్దేశారు. వామన రావు కారు ఆగగానే, చెరొక కత్తీ తీసుకుని తమ కారులో నుంచి కిందకు దిగారు కుంట శ్రీను, చిరంజీవి. ముందుగా కుంట శ్రీను వామన రావు కారు ముందు అద్దాన్ని కత్తితో పగలగొట్టాడు. దీంతో భయపడిపోయిన డ్రైవర్ సతీశ్ కారు వదలి పారిపోయాడు.

వామన రావు వెంటనే ముందు సీట్లోకి వచ్చి బండి తీయడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే అతనిపై కత్తితో దాడి చేసాడు కుంట శ్రీను. తరువాత కారులో నుంచి కిందకు లాగి మళ్లీ కత్తితో దాడి చేశాడు. ఈలోపు చిరంజీవి కారు అటువైపు వెళ్లి నాగమణిపై కత్తితో దాడి చేశాడు. ఆవిడ సీట్లోనే కుప్పకూలిపోయింది. ఆ తరువాత చిరంజీవి కూడా కారుకు ఇటువైపుకు వచ్చి, కింద పడిన వామన రావుపై దాడికి దిగారు. ఇద్దరూ కలసి కత్తితో వామన రావుపై దాడి చేశారు. అదే వీడియో బయటకు వచ్చింది.

కారు

ఫొటో సోర్స్, UGC

ఆ తరువాత వాళ్లిద్దరూ తిరిగి అదే కారులో వెళ్లిపోయారు. కాస్త దూరం వెళ్లాక బట్టలు మార్చుకున్నారు. తాము హత్యకు వాడిన కత్తులను సుందిళ్ళ బారేజీలో పారేశారు. అటు నుంచి మహారాష్ట్ర వైపు కారులో వెళ్లిపోయారు.

మరోవైపు రోడ్డుపై ఆ హత్య చూసిన ఒక వ్యక్తి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. డ్రైవర్ వామన రావు తండ్రికి ఫోన్ చేసి విషయం చెప్పాడు.

''సమాచారం వచ్చిన వెంటనే స్థానిక ఎస్సై అక్కడకు వెళ్లి వారిని అంబులెన్సులో ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స అందించడానికి ప్రయత్నించినా వారి శరీరం స్పందించలేదు. అప్పటికే పల్స్ పడిపోతూ ఉంది. తరువాత వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలంలో క్రైమ్ సీన్ ను ప్రొటెక్ట్ చేశాం (సాక్ష్యాలు పోకుండా)'' అని మీడియాకు చెప్పారు ఐజి నాగిరెడ్డి.

అటు మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో వాంకిడి దగ్గర నిందితులు ఇద్దర్నీ 18వ తేదీ ఉదయం 11 గంటల ప్రాంతంలో పట్టుకున్నట్టు పోలీసులు చెప్పారు. కుమార్ అనే మూడవ నిందితుణ్ణి, తన ఊరిలోనే పట్టుకున్నారు. ఇక బిట్టు శ్రీనును ఇంకా పట్టుకోవాల్సి ఉంది.

"కుంటా శ్రీను, చిరంజీవిని గురువారం అదుపులోకి తీసుకున్నాం. వారిని కోర్టులో హాజరు పరుస్తాం. మరికొందరి కోసం కూడా ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి" అని ఐజీ నాగిరెడ్డి చెప్పారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఈ కేసులో ఎవరి ప్రమేయం ఉన్నా, ఎంతటి వారినైన వదిలిపెట్టమని ఆయన అన్నారు.

పోలీసులు

కారణం ఏంటి?

గుంజపడుగు గ్రామం వామన రావు సొంత ఊరు. ఆ ఊరిలో కుంట శ్రీను ఒక వర్గంగా ఉంటే, వామన రావు మరో వర్గంగా ఉన్నారు. దాదాపు ఐదేళ్లుగా వీరిద్దరికీ పడడం లేదని పోలీసులు చెబుతున్నారు. ఇక తక్షణ కారణంగా గ్రామంలో గుడికి సంబంధించిన వివాదం ఉంది.

ఆ ఊరిలోని రామ, గోపాల దేవాలయాల కమిటీల విషయంలో, ఒక ఇంటి నిర్మాణం విషయంలో, గ్రామ దేవత పెద్దమ్మ గుడి నిర్మాణం విషయంలో వామన రావు వర్గానికీ కుంట శ్రీను వర్గానికీ విభేధాలు ఉన్నాయి. ఈ విషయాల్లో వామన రావు కోర్టులకు వెళ్లి తమకు అడ్డుపడుతున్నాడని కుంట శ్రీను వర్గం అనుకుంటోంది. హత్యకు ముందు కూడా అదే విషయంలో కేసు వేయడానికి తన తండ్రి, తన తమ్ముడి సంతకాలు కూడా తీసుకున్నారు వామన రావు. దీంతో వామన రావును ఎలా అయినా తప్పించాలనీ, దానికి చంపడమే పరిష్కారమనీ వారు నిర్ణయించారు.

మంథని ప్రాంతంలో పలు అంశాలపై వామన రావు చట్ట పరమైన పరిష్కారాల కోసం కోర్టులు, మానవ హక్కుల కమిషన్లకు వస్తుంటారు. దీంతో ఆయనకు స్థానికంగా చాలా మందితో విభేధాలు ఉన్నాయి అని తెలుస్తోంది. గతంలో మంథని పోలీస్ స్టేషన్లో లాకప్ డెత్ అయిన శీలం రంగయ్య అనే దళిత యువకుడి కేసుపై హైకోర్టుకు వెళ్లారు వామన రావు. ఈ విషయంలో ఆయనకు స్థానిక పోలీసులతో వాగ్వివాదం అయింది. తనకు బెదిరింపులు వస్తున్నాయనీ, తనకు ప్రాణ హాని ఉందనీ స్వయంగా వామన రావు పలుసార్లు ప్రకటించారు. ఫిర్యాదు చేశారు.

తాజా హత్యకు పాత కారణాలు ఏమున్నా, తక్షణ కారణాలు గ్రామంలోని విభేదాలే అని పోలీసులు చెబుతున్నారు.

హత్యకు గురైన న్యాయవాదులు

ఫొటో సోర్స్, UGC

ఫొటో క్యాప్షన్, హత్యకు గురైన హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు, నాగమణి

రాజకీయ కోణం...

కొంత కాలంగా స్థానిక నాయకులకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు కాబట్టి ఈ హత్య వెనుక అధికార పక్షం టిఆర్ఎస్ నేతల హస్తం ఉందని ప్రతిపక్షాలు, ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తూ వచ్చాయి. తమ ప్రభుత్వాన్ని విమర్శించే వారిని అధికార పక్షం వారు బెదిరిస్తున్నారనీ, ఆ క్రమంలోనే జరిగిన ఈ హత్యకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి నైతిక బాధ్యత వహించాలంటూ సోషల్ మీడియాలో పోస్టులూ పెడుతున్నారు.

మరోవైపు టిఆర్ఎస్ పార్టీ కుంట శ్రీనును తమ పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. కాంగ్రెస్ నుంచి రేవంత్, బీజేపీ నుంచి సంజయ్ లు ఈ అంశంపై ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

పలు న్యాయవాద సంఘాలు ఆందోళన చేశాయి. హైకోర్టు ఈ కేసును సుమోటోగా తీసుకుని, తొందరగా విచారించాలని పోలీసులను ఆదేశించింది. మార్చి 1కి కేసు విచారణ వాయిదా వేసింది.

వీడియో క్యాప్షన్, తెలంగాణలో లాయర్ల జంట హత్య వెనుక ఉన్నది ఎవరు?

తెలంగాణ పోలీసులకు వ్యతిరేకంగా వాదిస్తోన్న న్యాయవాది హత్యకు గురయ్యారు కాబట్టి, ఈ కేసులో స్థానిక పోలీసులు పక్షపాతం లేకుండా విచారణ చేస్తారన్న నమ్మకం లేదని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధ్యక్షులు తెలంగాణ హైకోర్టుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

వామన రావు సోదరి ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేశారు.

కుంట శ్రీను సికాస నేపథ్యం

ప్రస్తుతానికి ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న కుంట శ్రీను గతంలో సికాస (సింగరేణి కార్మిక సంఘం)లో పనిచేశారు. 1997లో బస్సు తగలబెట్టిన కేసులో ఉన్నారు. ఆయనపై వరకట్నం కేసు, దోపిడీ కేసు కూడా ఉందని పోలీసులు చెప్పారు.

BBC Iswoty

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)