‘ప్రొద్దుటూరులో టీడీపీ నాయకుడి హత్య.. కళ్లలో కారంకొట్టి వేటకొడవళ్లతో నరికారు’ - ప్రెస్‌రివ్యూ

నందం సుబ్బయ్య

ఫొటో సోర్స్, Facebook/Nandam Subbu

ఫొటో క్యాప్షన్, నందం సుబ్బయ్య

తెలుగుదేశం పార్టీ కడప జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య దారుణ హత్యకు గురయ్యారని ఈనాడు దినపత్రిక తెలిపింది.

మంగళవారం ఉదయం నుంచి ఆయన ఇంటివద్ద రెక్కీ చేసిన దుండగులు.. ప్రణాళిక ప్రకారం బయటకు రప్పించి కిరాతకంగా హత్య చేశారని పేర్కొంది.

‘‘పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్యను చుట్టుముట్టి, కళ్లలో కారం కొట్టి.. వేటకొడవళ్లతో తల నరికేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

ప్రొద్దుటూరు వైకాపా ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, ఆయన బావమరిది బంగార్రెడ్డిలే ఈ హత్య చేయించారని సుబ్బయ్య భార్య, తల్లి ఆరోపించారు.

నందం సుబ్బయ్య (41) జిల్లా టీడీపీ అధికార ప్రతినిధి. మంగళవారం ఉదయం 8.45 గంటలకు ఓ యువకుడు ఇంటి వద్దకు వచ్చి ఆయన్ను బయటకు పిలిచి, తన ద్విచక్రవాహనంపై తీసుకెళ్లాడు.

గంట తర్వాత సోములవారిపల్లె పంచాయతీ పరిధిలో పేదలకు పంపిణీ కోసం సిద్ధం చేసిన ఇళ్ల స్థలాలున్న ప్రదేశం వద్ద సుబ్బయ్య ప్రత్యక్షమయ్యారు. అక్కడ ఓ స్వీయచిత్రం తీసుకుని.. ‘కడప వార్తలు’ అనే వాట్సప్‌ గ్రూపులో ఉదయం 9.40కి పోస్టుచేసి కింద జై తెదేపా, జైజై తెదేపా అనే వ్యాఖ్య జోడించారు. అదే అతని ఆఖరి చిత్రం.

అయితే ఎమ్మెల్యేకు ఈ కేసుతో సంబంధం ఉన్నట్లు నిర్ధరణ కాలేదని కడప ఎస్పీ అన్బురాజన్‌ తెలిపారు.

ఈ హత్య కేసులో నలుగురు నిందితులు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం చాపాడు పోలీసుస్టేషనులో నిందితులను ఉంచినట్లు తెలుస్తోంది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

జలవనరుల శాఖకు కొత్త రూపం

ఫొటో సోర్స్, FB/Telangana CMO

ఎల్‌ఆర్‌ఎస్‌ లేకున్నా ఓకే

వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుందని నమస్తే తెలంగాణ తెలిపింది.

ల్యాండ్‌ రెగ్యులేషన్‌ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్‌), బిల్డింగ్‌ రెగ్యులేషన్‌ స్కీం (బీఆర్‌ఎస్‌) నిబంధనల్లో సడలింపు ఇచ్చిందని పేర్కొంది.

‘‘క్రమబద్ధీకరణలేని పాత లేఅవుట్లలో ఒకసారి లేదా అంతకంటే ఎక్కువసార్లు రిజిస్ట్రేషన్లు జరిగిన ప్లాట్లకు ఎల్‌ఆర్‌ఎస్‌ తప్పనిసరి అనే నిబంధనను ప్రభుత్వం పూర్తిగా తొలిగించింది.

భవనాల రిజిస్ట్రేషన్లకు కూడా ఇవే నిబంధనలను వర్తించనున్నాయి. దీంతో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లలో ఎదురవుతున్న సాంకేతిక ఇబ్బందులకు లైన్‌క్లియర్‌ అయింది.

అక్రమ లే అవుట్లలో ప్లాట్లను కొనుగోలు చేసిన దిగువ, మధ్యతరగతి ప్రజల ఇబ్బందులను సూక్ష్మస్థాయిలో పరిశీలించిన ప్రభుత్వం తాజా నిర్ణయాన్ని వెల్లడించింది.

కొత్త నిబంధనలు బుధవారం నుంచే అమల్లోకి వస్తాయని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ సీఐజీ శేషాద్రి మంగళవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

హైదరాబాద్‌ శివార్లతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పుట్టగొడుగుల్లా వెలుస్తున్న అక్రమ లే అవుట్లకు కళ్లెం వేయడం, వ్యవసాయేతర స్థలాలను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌ స్కీమ్‌ను ప్రకటించింది.

గ్రామపంచాయతీలు, అనధికార లే అవుట్లలో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌కు ఎల్‌ఆర్‌ఎస్‌ను తప్పనిసరి చేసింది. అయితే, ఇలాంటి లేఅవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేసినవారిలో దిగువ, మధ్య తరగతి ప్రజలే ఎక్కువగా ఉన్నారని, వారికే ఎక్కువ ఇబ్బందులు ఎదురవుతున్నాయనే విషయం ప్రభుత్వం దృష్టికి వచ్చింది.

భూముల లావాదేవీలు ఆగిపోయి ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని, ఎల్‌ఆర్‌ఎస్‌ నిబంధనను సడించాలని ప్రభుత్వానికి అభ్యర్థనలు వచ్చాయి. దీంతో ప్రభుత్వం ఎల్‌ఆర్‌ఎస్‌, బీఆర్‌ఎస్‌ నిబంధనలను సడలిస్తూ నిర్ణయం తీసుకుంద’’ని ఆ కథనంలో వివరించారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Facebook/Election Commission of India

ఓటర్‌ ఐడీతో ఆధార్‌ లింక్‌!

కీలక సంస్కరణలకు ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టిందని ఆంధ్రజ్యోతి దినపత్రిక తెలిపింది. త్వరలో ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌ కార్డును లింక్‌ చేయనుందని వెల్లడించింది.

‘‘18 ఏళ్లు వయస్సు నిండిన వెంటనే ఓటరుగా నమోదు చేసుకోడానికి అవకాశం కల్పించడంతో పాటు సర్వీస్‌ ఓటర్ల జీవిత భాగస్వాములకూ అదే ప్రదేశంలో ఓటరుగా నమోదు చేసుకునే చాన్స్‌ ఇవ్వనుంది.

అలాగే, ఈ-ఓటర్‌ కార్డు వ్యవస్థను ప్రవేశపెట్టనుంది. ఈ నాలుగు సంస్కరణలను 2021 మొదట్లో పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తుంది. అందులో మూడింటికి ప్రజా ప్రాతినిధ్య చట్టం-1951ను సవరించాల్సి ఉంటుంది.

బోగస్‌ ఓట్లు, డూప్లికేషన్‌ ఓట్లను ఏరివేయడానికి ఓటర్‌ కార్డుతో ఆధార్‌ లింకేజీ ఉపయోగపడుతుందని ఎన్నికల సంఘం వర్గాలు తెలిపాయి. భవిష్యత్తులో ఎలకా్ట్రనిక్‌ లేదా ఇంటర్నెట్‌ ఆధారిత ఓటింగ్‌ ప్రవేశ పెట్టడానికి ఈ రెండు కార్డులు లింక్‌ చేయడం కీలకమని ఈసీ భావిస్తోంది.

లింకేజీకి సంబంధించి గతేడాది డిసెంబరులో జరిగిన చర్చల్లో ఓటర్ల ఆధార్‌ వివరాల గోప్యత, భద్రత వంటివి పరిరక్షించడానికి పటిష్ట చర్యలు తీసుకుంటామని ఎన్నికల సంఘం ప్రకటించింద’’ని ఆ కథనంలో వివరించారు.

కరోనా

ఫొటో సోర్స్, Getty Images

కరోనా మృతుల్లో 70% మగవాళ్లే

దేశంలో కరోనా వల్ల మహిళల కంటే పురుషులే తీవ్రంగా ప్రభావితమయ్యారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపినట్లు వెలుగు దినపత్రిక పేర్కొంది.

‘‘వైరస్ పాజిటివ్స్‌‌లో పురుషుల శాతం 63గా ఉందని, 37 శాతం మహిళలకు కరోనా సోకిందని కేంద్ర హెల్త్ సెక్రెటరీ రాజేశ్ భూషణ్ చెప్పారు.

‘దేశంలో నమోదైన కరోనా కేసుల్లో 8 శాతం కేసులు 17 ఏళ్ల లోపు వారికి వచ్చాయి. 18-25 ఏళ్ల వయస్సు గ్రూప్ వారిలో 13 శాతం మంది వైరస్‌ ఇన్ఫెక్షన్‌‌కు గురయ్యారు. 26 నుంచి 44 సంవత్సరాల ఏజ్ గ్రూప్‌‌లో 39 శాతం మంది, 15-60 ఏళ్ల వయస్సు ఉన్న వారిలో 26 శాతం మందికి కరోనా వచ్చింది. కరోనా మృతుల్లో 70 శాతం మరణాలు పురుషులవే. 45 శాతం మరణాలు 60 ఏళ్ల వయస్సు వారిలో సంభవించాయి’ అని భూషణ్ పేర్కొన్నారు.

దేశంలో కరోనా వ్యాప్తి ప్రారంభమైన ఆరు నెలల తర్వాత 2.7 లక్షల యాక్టివ్ కేసులు నమోదయ్యాయని తెలిపారు.

యూకే, సౌతాఫ్రికాల్లో విజృంభిస్తున్న కొత్త రకం కరోనా మ్యూటెంట్‌‌ను అంతం చేయగల శక్తి ఇప్పటికే తయారు చేసిన వ్యాక్సిన్స్‌‌కు ఉందన్నార’’ని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)