ఆంధ్రప్రదేశ్: వాకపల్లి అత్యాచారం కేసు బాధితుల తరఫున పోరాడే వారిని పోలీసులు వేధిస్తున్నారా?

అత్యాచారం కేసు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

13 ఏళ్ల కిందట విశాఖ జిల్లాలో సంచలనం సృష్టించిన వాకపల్లి అత్యాచారం ఘటనపై పోలీసుల వ్యవహరిస్తున్న తీరుపై పౌర, మానవ హక్కుల, ప్రజాసంఘాల నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

బాధితుల తరఫున మాట్లాడేవారిని కేసులతో వేధిస్తున్నారని హక్కుల సంఘాల నాయకులు ఆరోపిస్తుండగా, మావోయిస్టులతో సంబంధాలపై ఆధారాలు ఉన్నందునే కేసులు నమోదు చేశామని పోలీసులు చెబుతున్నారు.

విశాఖ, గుంటూరు జిల్లాలకు చెందిన పలువురు ప్రజాసంఘాల నాయకులపై ఈ నెల 23, 24 తేదీలలో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. వీరిలో ఎక్కువమంది వాకపల్లి అత్యాచారం కేసులో బాధితుల పక్షాన మాట్లాడుతున్నవారే ఉన్నారు.

అత్యాచారం కేసు

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

ఎవరెవరి మీద కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు?

మావోయిస్టులకు కరపత్రాలు, ఎలక్ట్రానిక్‌ పరికరాలు సరఫరా అవుతున్నాయన్న సమాచారంతో విశాఖ జిల్లా ముంచంగి పుట్టు పోలీసులు ఈ నెల 23న వాహనాలను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా పాంగి నాగన్న అనే వ్యక్తి పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారు అతన్ని పట్టుకుని అతని దగ్గరి నుంచి మావోయిస్టుల విప్లవ సాహిత్యాన్ని, ఎలక్ట్రానిక్‌ పరికరాలు, బ్యాటరీలు, బ్యానర్లను స్వాధీనం చేసుకున్నామని, తమ అదుపులో ఉన్న నాగన్న ఓ టీవీ చానెల్ విలేకరిగా పనిచేస్తూ, మావోయిస్టులకు సమాచారంతోపాటు అవసరమైన సామాగ్రిని అందిస్తున్నాడని పోలీసులు వెల్లడించారు.

ఈ సందర్భంగానే మావోయిస్టులతో సంబంధాలున్న పలువురు ప్రజాసంఘాల పేర్లను కూడా చెప్పినట్లు తెలిపారు పోలీసులు. ఎవరెవరు, ఏ మావోయిస్టు నేతతో సమావేశమయ్యారో తమకు వివరించారని పోలీసులు చెబుతున్నారు.

నాగన్న ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రజా, పౌర సంఘాలు, మానవ హక్కుల వేదికల నాయకులైన 64 మందిపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం యూఏపీఏ సహా, ఐపీసీ సెక్షన్లు 120-బి, 121, 121-ఎ, 124-ఎ, 143, 144, 149 సెక్షన్ల కింద కేసులు పెట్టినట్టె ముంచంగి పుట్టు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.

గుంటూరు జిల్లా పిడుగురాళ్ల టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 24న ఐపీసీ సెక్షన్‌ 120-బి, 121, 121-ఎ, 124-ఎ, 143, 144, 149 సెక్షన్ల కింద 27మందిపై కేసులు పెట్టారు.

జలకల్లు గ్రామంలో పిడుగురాళ్ల పోలీసులు తనఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో పీపుల్స్‌వార్ మావోయిస్టు గ్రూప్‌కు చెందిన కంభంపాటి చైతన్యతోపాటు మరో 26మందిని అదుపులోకి తీసుకున్నామని, వీరి వద్ద నుంచి విప్లవ సాహిత్యాన్ని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు.

పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కేసులు నమోదైన వారిలో వాకపల్లి బాధితుల పక్షాన ఆందోళన చేసిన మానవ హక్కుల వేదిక నేత వి.ఎస్.కృష్ణతోపాటు మరి కొందరు ప్రజా, పౌర హక్కుల సంఘాల నాయకులు ఉన్నారు.

మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలపై వి.ఎస్.కృష్ణపై విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి

ఫొటో సోర్స్, VS Krishna/ facebook

ఫొటో క్యాప్షన్, మావోయిస్టులతో సంబంధాల ఆరోపణలతో వి.ఎస్.కృష్ణపై విశాఖ, గుంటూరు జిల్లాల్లో కేసులు నమోదయ్యాయి

హక్కుల సంఘాల వాదనేంటి ?

పోలీసులు ఒక పద్దతి ప్రకారం వాకపల్లి బాధితుల తరఫున పని చేస్తున్నవారిని, పోరాడుతున్న వారిని కేసులు పెట్టి వేధించేందుకు ప్రయత్నిస్తున్నారని ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాల నాయకులు అంటున్నారు.

“ కనీసం విచారణ కూడా జరపకుండా వాకపల్లిలో అత్యాచారమే జరగలేదని వాదించిన పోలీసులు ఇప్పుడు అదే కేసును అడ్డం పెట్టుకుని మమ్మల్ని వేధించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు’’ అని మానవ హక్కుల వేదిక నేత వి.ఎస్.కృష్ణ ప్రశ్నించారు.

“ప్రజాస్వామ్య వ్యతిరేకమైన యూఏపీఏలాంటి చట్టాలను కూడా ఎందుకు ప్రయోగిస్తున్నారు? మహిళలకు న్యాయం జరగాలని ఉద్యమించిన వారిపై నిర్బంధం విధించేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు? ’’ అని ఆయన అన్నారు.

ముంచంగి పుట్టుతోపాటు, పిడుగురాళ్ల పోలీస్‌ స్టేషన్‌లో కూడా వి.ఎస్.కృష్ణపై ఎఫ్‌ఐఆర్‌ దాఖలైంది.

“నేను 10 నెలల కిందట మావోయిస్టు అగ్రనేత ఆర్కేను కలుసుకున్నట్లు నాగన్న వెల్లడించారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వాకపల్లి బాధితులను పోలీసులకు వ్యతిరేకంగా రెచ్చగొట్టమని ఆర్కే నాకు చెప్పినట్లు అందులో రాశారు. నా దగ్గర విప్లవ సాహిత్యం దొరికిందని పిడుగురాళ్ల కేసులో చెప్పారు. వాకపల్లి బాధితులకు న్యాయం జరగాలని మేం 2007 నుంచి పోరాడుతున్నాం. న్యాయం జరగక పోగా ఇలా వేధిస్తున్నారు’’ అని కృష్ణ అన్నారు.

“ ఎన్ని నిర్బంధాలు పెట్టినా మా పోరాటాలు ఆగవు’’ అని ఆయన స్పష్టం చేశారు.

రేప్ కేసు

ఆధారాలతోనే కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు

వాకపల్లి అత్యాచార బాధితుల తరఫున పోరాడుతున్న నేతల మీద కేసులు పెట్టిన విషయంపై పోలీసుల వివరణ తీసుకునేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే దీనిపై స్పందించడానికి విశాఖ జిల్లా ఎస్పీ కృష్ణారావు నిరాకరించారు.

మావోయిస్టులకు సమాచారం అందిస్తున్న వ్యక్తి ఇచ్చిన ఆధారాల ప్రకారమే కేసులు నమోదు చేశామని కృష్ణారావు బీబీసీతో అన్నారు. దీనిపై ఇంతకన్నా చెప్పాల్సిందేమీ లేదని ఆయన అన్నారు.

వాకపల్లిలో ఏం జరిగింది..?

మావోయిస్టులు ఉన్నారన్న సమాచారం రావడంతో 2007 ఆగస్టు 20న పోలీసులు, గ్రేహౌండ్స్‌ దళాల సభ్యలు విశాఖ ఏజెన్సీలోని వాకపల్లి గిరిజన గూడేన్ని చుట్టుముట్టారు. మగవాళ్లు ఇంట్లో లేరని చెప్పినా, ఇళ్లలోకి వెళ్లి సోదాలు చేశారని స్థానికులు ఆరోపించారు. ఈ సందర్భంగా మహిళలకు, పోలీసులు మధ్య ఘర్షణ జరిగిందని, కొందరు మహిళలపై పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి.

దీనిపై మహిళలకు, పోలీసుల మధ్య తీవ్ర ఘర్షణ చోటుచేసుకొంది. సోదాలు చేసే క్రమంలో పోలీసులు తమపై అత్యాచారం జరిపారని 13 మంది ఆదివాసీ మహిళలు ఆరోపించారు.

దీనిపై ఆందోళన ఉధృతం కావడంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న 22 మంది పోలీసులపై కేసులు పెట్టి విచారణ జరపాలని అప్పటి విశాఖ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు.

ఐపీసీ సెక్షన్‌ 37(2), 3(2), ఎస్‌.సి/ఎస్‌.టి అత్యాచార నిరోధక చట్టం కింద కేసులు నమోదయ్యాయి. అయితే ఇందులో విధుల్లో లేని 9 మందిని విచారణ నుంచి మినహాయించి మిగిలిన వారిపై కేసులు కొనసాగించాలని కోర్టు తేల్చి చెప్పింది.

కేసు విచారణ ఏ దశలో ఉంది?

వాకపల్లి గిరిజన మహిళలపై ఏపీ గ్రేహౌండ్స్‌ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారనే కేసులో విశాఖపట్నంలోని ఎస్‌.సి/ ఎస్‌.టి. స్పెషల్‌ కోర్టులో విచారణ జరుగుతోంది.

ఈ నెలలో జరిగిన విచారణలో ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ ఇన్‌స్పెక్టర్‌ డ్యూటీ రోస్టర్, జనరల్ డైరీని పోలీసులు కోర్టుకు అందించలేదు. దీంతో అన్ని రికార్డులను తమ ముందు ఉంచాలని ఆదేశించిన న్యాయస్థానం 2021 ఫిబ్రవరి 4కి వాయిదా వేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)